Thursday, April 25, 2024

కుంభకర్ణుడిని నిద్ర లేపేందుకు సన్నాహాలు

రామాయణమ్ 191

లక్ష్మణుడు అతి త్వరగా శక్తి ఆయుధపు పట్టునుండి తప్పించుకొనినాడు. అది మరల రావణుని చేరెను. రావణుడు కూడా హనుమ కొట్టిన దెబ్బనుండి తేరుకొని మరల సంజ్ఞపొందెను.

మరల ధనుస్సు చేతబూని వానర సైన్యముపై పుంఖానుపుంఖాలుగా బాణములు వదిలినాడు. అవి వానర సైన్యమును చీకాకు పరచుట గమనించిన  రాఘవుడు స్వయముగా రావణుని ఎదుర్కొనవలెనని సంకల్పించి ఆతని వైపు పాదచారియై కదలగా అది గమనించిన హనుమంతుడు వేగమే వచ్చి రాముని తన భుజములపై ఎక్కించుకొని రావణుని ఎదుర్కొనుటకు సిద్ధముగా నిలచెను.

Also read: లక్ష్మణుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రావణుడు

రాముడు నారిసారించి తీవ్రమైన టంకారధ్వని చేసెను. అది వజ్రమును భేదించినపుడు వెలువడు మహా శబ్దము వలె నుండెను.

‘‘ఓయీ రావణా నిలు. నాకు అపకారము చేసి తప్పించుకొని పోలేవు. నిన్ను కాపాడగలవాడు ముల్లోకములలోనూ లేడు. రా, నిన్ను నీవుకాచుకో’’ అని హెచ్చరించెను.

అందుకు ప్రతిగా రావణుడు మారుమాటాడక ఒక క్రూరనారాచము సంధించి  రాముని మోయుచున్న హనుమ పైకి వదలెను.

అది సూటిగా వచ్చి ఆంజనేయుని తాకి గాయపరెచెను. ఆ దెబ్బకు ఆంజనేయునిలో ఉత్సాహము హెచ్చి తేజస్సు అధికమయ్యెను.

Also read: రావణ వీరవిహారం, వానరవీరులపై శరపరంపర

రాముడు అందులకు తీవ్రముగా కోపించి ఒకదానివెంట మరొకటి ఎడతెరపిలేకుండా బాణములు సంధించి రావణుని రధచక్రములు, గుర్రములు, ఛత్రములు, సారధిని అన్నింటినీ నేలకూల్చినాడు.

 రాక్షసరాజును నేలపై నిలబెట్టి ఏ మాత్రమూ అవకాశమీయక పిడుగులు ఏకధాటిగా వచ్చి తాకినట్లుగా తన వాడిబాణములతో రావణుని  చేతివేలికొసలపై కొట్టెను. ఆ తాకిడికి వాని ధనుస్సు జారి నేలపైబడెను.

వెంటవెంటనే వచ్చు రామధనుర్విముక్త శరముల ధాటికి రావణుడు స్థైర్యము కోల్పోయి స్థాణువై నిలుచుండిపోయెను. కన్నుమూసి తెరచునంతలో ఒకబాణము వచ్చివచ్చి వాని కిరీటమును ఎగురగొట్టెను. అప్పుడు రావణుడు కోరలుపీకిన పామువలె శక్తిహీనుడై డస్సిపోయి ఏమిచేయుటకును పాలుపోక నిస్సహాయముగా నేలపై నిలుచుండెను.

అంత దయాంతరంగుడగు రాముడు అవకాశము వచ్చినప్పటికీ శత్రువును వధించక జాలి తలచి, “రావణా బాగా అలసిపోయినావు. యుద్ధము చేయుశక్తి నీలో అడుగంటినది. కావున నేడుపోయి రేపురమ్ము”అని పలికెను.

Also read: హనుమ, అంగద ప్రతాపం, రాక్షస యోధుల మరణం

ఇంతకు మునుపెప్పుడూ అటువంటి దెబ్బతినలేదు రావణుడు. తల దిమ్మెక్కిపోయింది. ఆయుధములేని వాడిని రాముడు కొట్టడు కాబట్టి ఆ రోజుకు బ్రతికి పోయాడు.

అతని ధనుస్సు విరిగింది. గర్వం గతించిపోయింది. ఆనందం ఆవిరైపోయింది.

తన లంకకు తాను వెళ్ళడానికి శత్రువు అనుమతి కావలసి వచ్చింది.

కల చెదిరింది. దర్పము తొలగింది. మనస్సు కుదురుగా లేదు. అదురుపాటు ఎక్కువ అవుతున్నది … వేదవతి శాపము… నందీశ్వరుడి శాపము ఉమాదేవి శాపము, నలకూబరుని శాపము. అన్ని శాపాలు ఒక్కసారిగా స్మృతి పథంలో నిలచి రావణునికి నిలకడలేకుండా చేసినవి.

ఇక లాభములేదు ఏదో ఒకటి చేయవలె. వాడిని యుద్ధానికి పంపవలె. అవును వాడినే. గాఢనిద్రాపరవశుడై ఉన్న కుంభకర్ణునే లేపి రణరంగానికి పంపవలె.

Also read: గరుత్మంతుడి ఆగమనం, రామలక్ష్మణులకు నాగబంధవిముక్తి

అనుకున్నదే తడవుగా ఆజ్ఞలు ఇచ్చాడు రావణుడు. ఎలాగైనా కుంభకర్ణుని నిద్రలేపండి, యుద్ధానికి పంపండి.

కుంభకర్ణ భవనమునకు భటులు బయలుదేరినారు. రాజాజ్ఞననుసరించి రక్తమాంసములతో కూడిన రుచికరమైన ఆహారపదార్ధాలు, పుష్పమాలికలు, పరిమళద్రవ్యాలు అన్నీ వెంట తీసుకుని కుంభకర్ణుడు నిదురించు ప్రదేశమునకు చేరుకొన్నారు.

అతికష్టంమీద లోనికి వెళ్ళగలుగుతున్నారు. కుంభకర్ణుడి ఉచ్ఛ్వాశనిశ్వాసములు హోరుగాలిని తలపింపచేస్తున్నది. ఆ గాలి వారిని అవతలకు నెట్టివేయుచున్నది. నెమ్మదిగా గోడలు పట్టుకొని గాలికి కొట్టుకొనిపోకుండా లోనికి ప్రవేశించారు వారంతా.

ఒక భయంకరమైన నాగుపాము బుసలుకొడుతున్నట్లగా ఊపిరి విడుస్తున్న పర్వతాకారుడైన కుంభకర్ణుని సమీపించుటకు కూడా వారికి ధైర్యము చాలలేదు. కానీ రాజాజ్ఞ లేపవలెనని!

Also read: ఇంద్రజిత్తు నాగాస్త్రం వల్ల మూర్ఛిల్లిన రామలక్ష్మణులు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles