Tuesday, September 17, 2024

బహుభాషా పండితులను ఆదరించిన శ్రీక్రిష్ణదేవరాయలు

శ్రీకృష్ణదేవరాయలు

— మైనాస్వామి

దేశ భాషలందు తెలుగులెస్స అని తెలుగు భాషను సమున్నత స్థాయిలో నిలిపిన సాహితీ పిపాసి శ్రీక్రిష్ణదేవరాయలు. ‘ఆముక్త మాల్యద’ కావ్యంలో తాను తెలుగు వల్లభుడని ప్రకటించాడు. సాక్షాత్తు శ్రీమహా విష్ణువు కలలో కనిపించి తెలుగులో కావ్యం రాయమని కోరినందున తాను ఆముక్త మాల్యదను రాశానని చెప్పుకొన్నాడు.  క్రీ.శ. 1000 సం. నుంచి క్రీ.శ. 1500 వరకు వచ్చిన తెలుగు సాహిత్యం ఒక ఎత్తయితే  శ్రీక్రిష్ణదేవరాయల కాలం (1509-29) లో వెలువడిన తెలుగు సాహిత్యం మరో ఎత్తు. దాదాపు వెయ్యి సంవత్సరాల కాలంలో ఒకే రాజు హయాంలో తెలుగు సాహిత్యం అంతగా సుసంపన్నమైనట్టు దాఖలా లేదు. తెలుగులో పంచ మహా కావ్యాలుగా ఐదు గ్రంథాలు ప్రసిద్ధి పొందితే, వాటిలో నాలుగు కావ్యాలు క్రిష్ణరాయల హయాంలోనే వెలువడ్డాయి. మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్త మాల్యద, పాండురంగ మహత్యం, శృంగార నైషధం లు పంచ మహాకావ్యాలు గా ప్రసిద్ధి పొందాయి. శ్రీక్రిష్ణదేవరాయలు సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళ కవులను పోషించాడు. తెలుగు కవులకు-వారి సాహిత్యానికి పెద్దపీట వేశాడు. ఆంధ్ర భోజునిగా కీర్తి గడించాడు.

‘తెలుగదేలయన్న దేశంబు దెలుఁ, గేను

దెలుఁగు, వల్లభుండఁ దెలుఁగొకండ

యెల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి.

దేశభాషలందు తెలుఁగులెస్స’              ——-ఆముక్త మాల్యద 

శ్రీక్రిష్ణదేవరాయలు తాను స్వయంగా కవి. కవిపోషకుడు. కళాపిపాసి, ఎన్నోరకాల కళలను ఆదరించి శాశ్వతీకరించాడు. ‘సాహితీ సమరాంగణ చక్రవర్తి’ అని ఆముక్తమాల్యదలో తన కీర్తి ప్రతాపాలను వర్ణించే సందర్భంగా ఈ పద్యాన్ని రాశాడు.      

‘ప్రబల రాజాధిరాజ వీరప్రతాప… రాజ పరమేశ్వరా..దుర్గానటేశసాహితీ సమరాంగణ సార్వభౌమ…కృష్ణరాయేంద్రకృతి వినిర్మింపుమనిరి’. కీర్తి ప్రతాపాలకు సంబంధించిన పద్యాలు అల్లసాని పెద్దన రాసిన మను చరిత్ర లోనూ, శ్రీక్రిష్ణ దేవరాయలు రాసిన ఆముక్తమాల్యద లోనూ వున్నాయి. తెలుగులో వచ్చిన కావ్యాల వల్ల తెలుగుజాతి ప్రతిష్ఠ ప్రాచీన కాలంలోనే ఖండాంత రాలకు వ్యాపించింది. ఆ కావ్యాల వల్ల తెలుగుజాతి గౌవరం ఎంతో పెరిగిందని మనుచరిత్రకు పీఠిక రాసిన శ్రీవిశ్వనాధ సత్యనారాయణ పేర్కొన్నారు.

బహుభాషాపండితుల నిలయం

శ్రీకృష్ణదేవరాయలు

శ్రీక్రిష్ణదేవరాయల ఆస్థానంలో బహుభాషా పండితులున్నారు. వారిలోఅష్టదిగ్గజాలుగా ఖ్యాతి గాంచిన ఎనిమిది మంది తెలుగు కవులు మహాకావ్యాలకు ప్రాణం పోశారు. అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన అగ్రతాంబూలం అందుకొన్నారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామక్రిష్ణుడు, రామరాజభూషణుడు, ధూర్జటి, మాదయగారి మల్లన, పింగళి సూరన, అయ్యలరాజు రామభద్రుడు. అష్టదిగ్గజ కవులు సృష్టించిన ప్రబంధాల వల్ల, తెలుగు సాహిత్య లోకంలో ఒక స్వర్ణయుగం ఆవిష్కృతమయ్యింది. సాహితీ గోష్ఠుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మందిరం – భువన విజయంలో శ్రీక్రిష్ణదేవరాయలు ఎన్నో సాహితీ సమ్మేళనాలను నిర్వహించాడు. శ్రీక్రిష్ణదేవరాయల సభ అద్భుతమని, కవులకు తనతోపాటు సమానంగా రాయలు గౌరవ మర్యాదలు కల్పించాడని పోర్చుగీసు గుర్రాల వ్యాపారి డొమింగో పేస్ తన రచన ‘క్రానికల్స్ దస్ రైజ్ డి బిసనగ’లో పేర్కొన్నాడు. కవులను రాయలు ఆ విధంగా ఆదరించబట్టే తెలుగులో మహాకావ్యాలు వచ్చాయి.అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర తెలుగు భాషకు ఎంతో కీర్తి తెచ్చింది. పంచ మహాకావ్యాల్లో మొదటిదైన మనుచరిత్ర స్వారోచిష మనువుకు సంబంధించిన విషయం. హిమాలయాల వర్ణన అక్కడి ప్రకృతి సౌందర్యం, రత్నాలు మేడ, అప్సరసలు, గంధర్వులు, విహారాలు, విరహవేదనలు, అడవి జంతువులు…వంటి విషయాలను అల్లసాని పెద్దన అలవోకగా వివరించాడు. మను చరిత్రలో నాయికా నాయకులైన వరూధిని-ప్రవరాఖ్యుల ప్రణయ గాథను అత్యద్భుతంగా వర్ణించాడు. వరూధిని-రత్నాల మేడ వున్న ప్రదేశంలో ద్రాక్ష తోటలున్నాయని పెద్దన పేర్కొన్నాడు. అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడుగా ప్రఖ్యాతిగాంచాడు. రామరాజ భూషణుడు రచించిన వసుచరిత్రము ఎంతో పేరుగాంచింది. వైష్ణవ భక్తితత్వానికి వారి సామాజిక స్థితిగతులకు ప్రతీకగా నిల్చిన ఆముక్తమాల్యద గురించి ఎంత రాసినా తక్కువే అవుతుంది. తెనాలి రామక్రిష్ణుడు రాసిన పాండురంగ మహాత్యం మహాభక్తికి ప్రబల తార్కాణం, ‘రాయల కంటే సుమారు 45 సంవత్సరాల ముందు మహాకవి శ్రీనాధునిచే రచింపబడిన శృంగార నైషధం పంచ మహాకావ్యాల్లో చివరిది. శృంగార నైషధం తెలుగుభాష ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసింది. భట్టుమూర్తిగా పేరుగాంచిన రామరాజ భూషణుడు వసుచరిత్రముతో బాటు కావ్యాలంకార సంగ్రహం, హరిశ్చంద్రనలోపాఖ్యానం రాశాడు. తెనాలి రామక్రిష్ణుడు పాండురంగ మహాత్యం, ఉద్బటరాధ్య చరిత్రము, ఘటికాచల మహాత్యం రాశాడు. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, మాదయగారి రాజశేఖర చరిత్ర, అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం, పింగళి సూరన రాఘవ పాండవీయం తదితర రచనలు చేశారు.

అష్ట దిగ్గజాలతోపాటు మరెందరో తెలుగు కవులు

కాగా శ్రీక్రిష్ణదేవరాయల కొలువులో అష్టదిగ్గజ కవులతో పాటు మరికొందరు తెలుగు కవులున్నారు. వారిలో కందుకూరి రామభద్రుడు ముఖ్యుడు. సుగ్రీవ విజయం, హరిశతకం, నిరంకుశోపాఖ్యానం తదితర రచనలు కందుకూరి రామభద్రుడు రాశాడు. నాదెండ్ల గోపయ్య క్రిష్ణార్జున సంవాదం కావ్యాన్ని రచించాడు. చింతలపాటి ఎల్లన్న కవి ‘రాధామాధవం’ను రాశాడు. తెలుగులో రామాయణాన్ని విరచించి కవయిత్రిగా కుమ్మరి మొల్ల ఖ్యాతిగాంచిoది. శ్రీ వేంకటేశ్వర స్వామిపై వేల సంకీర్తనలు రాసి పరమభక్తుడుగా పేరుగాంచిన తాళ్ళపాక అన్నమాచార్యుని కొడుకు తాళ్ళపాక పెద తిరుమలయ్య ద్విపదలో హరివంశంను రచించాడు. భగవద్గీతపై తెలుగులో వ్యాఖ్యానాన్ని రాశాడు. తండ్రి బాటలో పయనించిన పెద తిరుమలయ్య శ్రీ వేంకటేశ్వరోద్ధరణ, నీతి పద్యశతకం, శృంగార శతకం తదితర రచనలు చేశాడు.

నంది తిమ్మన పారిజాతాపహరణం

శ్రీ క్రిష్ణదేవరాయలు పట్టమహిషి తిరుమలదేవితో పాటు శ్రీరంగపట్నం నుంచి అరణంగా వచ్చిన నంది తిమ్మన ద్విభాషా పండితుడు. తెలుగులో ఆయన రాసిన ‘పారిజాతాపహరణం’ ఎంతో ప్రసిద్ధి పొందింది. ఆయనకు ముక్కు తిమ్మన అనే పేరు కూడా వుంది. అసంపూర్ణంగా వున్న కన్నడ మహాభారతాన్ని పూర్తి చేశాడు.

రాయల ఆస్థాన సంగీత విద్వాంసుడైన బండారు లక్ష్మీనారాయణ ‘సంగీత సూర్యోదయం’ ను రాశాడు. జైన కవి విద్యాధరుడు ‘కావ్యసార’ను కన్నడంలో రచించాడు. భావచింతారత్న, వీర శైవామృతంలను గుబ్బియ మల్లనార్య రాశాడు. వాల్మీకి రామాయణం, విఠలనాథుని భగవద్గీతను కన్నడంలోకి తర్జుమా చేశాడు కుమార వాల్మీకి, కుమార సరస్వతి-తమిళ కవి రాయల ఆస్థానకవిగా గౌరవం అందుకొన్నాడు. హరిహరదాసు అనే తమిళకవి ‘ఇరసమాయా విళక్కరి’ కావ్యాన్ని రాశాడు. తెలుగు, కన్నడ, తమిళ కవులతో పాటు సంస్కృత పండితు లెందరినో రాయలు ఆదరించాడు. రఘోత్తమ తీర్థులు, శ్రీపాదరాయలు, వ్యాసతీర్థులు, లొల్ల లక్ష్మీధరుడు మొదలైన ఉద్దండ సంస్కృత పండితులు ఎన్నోకావ్యాలను, వ్యాఖ్యానాలను రాశారు. ఆ విధంగా బహుభాషా పండితులను, కవులను విశేషంగా పోషించాడు రాయలు. మదాలస చరిత్ర, జాంబవతీ కళ్యాణం కావ్యాలను సంస్కృతంలో రాసి, రాజభాషపై తన పట్టును ప్రదర్శించాడు సాహితీ సమరాంగణుడు. కేవలం 20 సంవత్సరాల్లో అత్యంత అరుదైన, అద్భుత సాహితీ సృష్టికి మూల కారకుడయ్యాడు శ్రీక్రిష్ణదేవరాయలు.  

Also read: బుక్కరాయలనాటి శాసనాలు : ఆ తెలుగు అద్భుతం                                                                                    

(ఫిబ్రవరి16 న  శ్రీక్రిష్ణదేవరాయలజయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

(రచయిత పరిశోధకుడు)

సెల్: 9502659119

email : [email protected]

Mynaa Swamy
Mynaa Swamy
Myna Swamy's full name is Mylaram Narayana Swamy. A senior journalist who was a correspondent for Andhra Prabha, Indian Express, Andhra Jyothy, Ujwala and Subrabhatam. He is also a short story writer and novelist. Lepakshi is his latest book which received acclaim. It is being translated into English, French, Hindi, and other languages. His Forte is history. Mobile No: 9502659119

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles