Friday, March 29, 2024

పాక్ పై విజయం: కొహ్లీ, హార్థిక్ పాండ్యా అత్యద్భుతమైన చారిత్రక ప్రదర్శన

  •  ‘నోబాల్’ వివాదంతో నిమిత్తం లేకుండా ఆస్వాదించవలసిన విజయం
  • ‘నోబాల్ ’ నిర్ణయం తప్పని వాదిస్తూనే కొహ్లీని తప్పుపట్టని పాకిస్తాన్ దిగ్గజాలు
  • కొహ్లీ, హార్థిక్, అర్షదీప్ సింగ్, అశ్విన్ లు సాధించిన చారిత్రక విజయం

వివాదాల మాట ఎట్లా ఉన్నప్పటికీ క్రికెట్ పండితులందరూ అంగీకరించే విషయం ఏమంటే ఆదివారంనాడు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాయాదుల పోరు ప్రపంచ టీ-20 క్రికెట్ లో ‘నభూతో నభవిష్యతి’ అని. భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ చిరస్మరణీయమైన 82 పరుగులతో నాటౌట్ గా మిగిలి నిలిచి వెలిగిన సంగతితో పాటు అతనితో పాటు వంద పరుగుల భాగస్వామ్యం పంచుకొని నలభై పరుగులు తీసిన హార్థిక్ పాండ్యానూ, చివరి బంతి కొట్టడానికి రంగంలో దిగి పాకిస్తాన్ బౌలర్ విసిరిన వైడ్ బాల్ ను ఆడకుండా తెలివిగా వదిలేసి చివరి బంతిలో అవసరమైన ఒక పరుగు తీసి భారత్ కు విజేతగా నిలపడం ద్వారా తన మనోధైర్యాన్నీ, ఆవేశరహితమైన మనస్థిమితాన్నీ, ఆలోచనాత్మకమైన విధానాన్ని చాటుకున్న అశ్విన్ నూ  ఈ సందర్భంగా క్రికెట్ ప్రియులంతా అభినందించి తీరాలి. ఒక దశలో నాలుగు వికెట్లకు 31 పరుగులు చేసిన ఇండియా గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. చివరి బంతి వరకూ ఫలితం అనూహ్యంగానే ఉంది. అదే క్రికెట్ ఆటలోని మాధుర్యం. ఎప్పుడైనా, ఏదైనా మలుపు తిరగవచ్చు. ఓడుతుందనుకున్న జట్టు గెలివవచ్చు. గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు. అందుకే ‘‘క్రికెట్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ అన్ సర్టెనిటీస్’’ అని అంటారు.

భారత్ కు మూడు బంతుల్లో 13 పరుగులు చేయవలసిన పరిస్థితి ఉండగా పాకిస్తాన్ బౌలర్ మొహమ్మద్ నవాజ్ విసిరిన బంతిని సిక్స్ కొట్టి దాన్ని నోబాల్ గా ప్రకటించాలని కోహ్లీ అడగడం, దాన్ని అంపైర్ మంజూరు చేయడంతో ఆట తిరుగులేని మలుపు తిరిగింది. ఇది బౌలర్ గీతదాటి బంతిని విసరడం వల్ల ‘నోబాల్’ గా ప్రకటించిన పరిస్థితి కాదు. బంతిని ఫుల్ టాస్ వేసి బ్యాటర్ నడుము కంటే పైభాగంలో పంపిన వైనం కారణంగా ఇచ్చిన నోబాల్ నిర్ణయం. బంతి నడుముకు పైగా వెళ్ళిందా లేక నడుము దగ్గరికి వెళ్ళిందా లేక నడుముకు కిందే వెళ్ళిందా అన్నది వివాదాస్పదమైంది. ఎవరి అభిప్రాయాలు వారు వెలిబుచ్చారు. వఖార్ యూనస్, షోయబ్ మాలిక్ వంటి పాకిస్తాన్ మాజీ క్రీడాకారులు ‘అది నోబాల్ కాదు’ అని స్పష్టంగా చెప్పకుండా చెపుతూనే అంపైర్ నిర్ణయం ప్రకటించే ముందు లెగ్ అంపైర్ నూ, థర్డ్ అంపైర్ నూ సంప్రతించకపోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఈ విమర్శలో సహేతుకత ఉన్నది. థర్డ్ అంపైర్ ని పెట్టుకున్నదే ఇటువంటి కీలకమైన నిర్ణయాలు చేసేందుకు. ‘నోబాల్’ నిర్ణయం అత్యంత కీలకమైనది. అటువంటి నిర్ణయాన్ని ఒకే ఒక అంపైర్ ఇవ్వడం కంటే ఇద్దరు అంపైర్లూ సంప్రదించుకొని ఖరారు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ కి వదిలివేసి ఉంటే సరిపోయేది. అది ‘నోబాల్’ కాకుండా ఉండే భారత్ ఓడిపోయేదని కానీ పాకిస్తాన్ గెలిచేదని కానీ చెప్పడం చాలా కష్టం. కానీ ఆ బంతిని ‘నోబాల్’ అని ప్రకటించడం వల్ల భారత్ పని సులువయింది. అది చివరి ఓవర్ లో నాలుగో బంతి అని గుర్తించినప్పుడు ఆటను ‘నోబాల్’ నిర్ణయం గొప్ప మలుపు తిప్పిందని గ్రహించడం కష్టం కాదు.

ఈ వివాదం వల్ల ఆదివారం జరిగిన అద్భుతమైన ఆట వైశిష్ట్యాన్ని తక్కువ చేసి చూడలేం. ఇది క్రికెట్ చరిత్రలో జరిగిన మహాద్భుతం. 53 బంతులలో 82 పరుగులు చేసి అజేయుడుగా నిలిచిన విరాట్ కోహ్లీ ప్రతాపాన్ని, లాఘవాన్నీ, అద్భుతమైన క్రీడాకౌశల్యాన్నీ తక్కువ చేయకుండా ఈ వివాదంపైన చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్నవారంతా విరాట్ ‘నోబాల్’ అడగడంలో తప్పులేదనీ, క్రీజ్ లో ఉన్న బ్యాటర్ గా ‘నోబాల్ అవునా, కాదా’ అని అంపైర్ ని ప్రశ్నించడం విరాట్ కోహ్లీ విధి అని, అందులో అతని పొరబాటు ఏమీ లేదనీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వివాదం సాగుతుండగానే న్యూజిలాండ్ ఆల్ రౌండర్ నీషమ్ సరదాగా ఒక ట్వీట్ పెట్టాడు. ఆట ప్రారంభం కావడానికి ముందు ప్రతి ఆటగాడి నడుము ఎంత ఎత్తున ఉన్నదో కొలవాలన్నది అతని సరదా సూచన. అప్పుడు బౌలర్ విసిరిన ఫుల్ టాస్ బ్యాటర్ నడుము ఎత్తును దాటిందో లేదో చెప్పడం తేలిక అవుతుందన్నది అతని భావన. ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన  ఆటలో చివరి బంతితో కానీ ఫలితం నిర్ణయం కాలేదంటే  ఆట ఎంత పోటాపోటీగా సాగిందో క్రికెట్ క్రీడాభిమానులు ఊహించుకోవచ్చు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు అర్ష్ దీప్ సింగ్, హార్థిక్ పటేల్ లు చెరి మూడు వికెట్లు తీసుకొని పాకిస్తాన్ ను ఎనిమిది వికెట్లకు 159 పరుగుల స్కోరుకు కట్టడి చేయడంలో పూర్తిగా సహకరించారు. హార్థిక్ మూడు వికెట్లు పడగొట్టడమే కాకుండా విరాట్ కొహ్లీతో శతకభాగస్వామ్యంలో నిలిచి నలభై పరుగులు చేయడం ద్వారా విజయంలో ముఖ్యభాగస్వామి అయ్యాడు. షమీ, భువనేశ్ కుమార్ కూడా బాగా బౌల్ చేశారు.

ఆట సాగిన తీరును ఆస్ట్రేలియా అల్ రౌండర్ మిచెల్ మార్ష్ ప్రశంసించాడు. సోమవారం జరిగిన విలేఖరుల గోష్ఠిలోమాట్లాడుతూ మార్ష్, ఆదివారంనాడు మెల్బోర్న్ స్టేడియంలో చూసిన ఆటను మించిన ప్రదర్శన మరో సారి చూడడం సాధ్యం కాదని వ్యాఖ్యానించాడు. ‘‘ఇంతకంటే మించిన ప్రమాణాలు ప్రపంచ కప్ పోటీలలో కనిపిస్తే మనం అద్భుతమైన మూడు వారాలూ గడపబోతున్నామన్న మాట’’ అని అన్నారు. ‘‘నిజానికి ప్రపంచ కప్ పోటీలను ఇక్కడితో నిలిపివేయాలి. ఇండియా, పాకిస్తాన్ మధ్య పోరాటం ఎప్పుడైనా చూడదగిన ముచ్చటే. ప్రేక్షకులలో ఉండి మ్యాచ్ చూసినట్లయితే నేను ఎంత ఆవేశపడిపోయేవాడినో ఊహించుకోవచ్చు’’ అని అన్నాడు. ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ అయిన తర్వాత జరిగిన గోష్ఠిలో మార్ష్ ఆదివారంనాటి ఆటను ప్రస్తావించి విరాట్ కొహ్లీ పైన ప్రశంసల వర్షం కురిపించారు.  ‘‘అవును. విరాట్ కొహ్లీ పన్నెండు మాసాలపాటు కష్టాలలో ఉన్నాడు. అటువంటి కొహ్లీ ప్రపంచ కప్ పోటీలపైన తన ముద్ర వేయగలగడం విశేషం. అనూహ్యమైన క్రీడా ప్రదర్శన చేశాడు. అటువంటి ప్రదర్శన మరొకటి ఉండకపోవచ్చు’’ అని కూడా మార్ష్ వ్యాఖ్యానించాడు.

ఆట ముగియగానే జట్టు నాయకుడు రోహిత్ శర్మ విరాట్ ను ఎత్తుకొని అబినందించాడు. సునీల్ గావస్కర్ ప్రేక్షకుల గ్యాలరీలో సంతోషంతో గంతులు వేస్తూ కనిపించాడు. అతడి పక్కనే చిందులు వేస్తూ శ్రీకాంత్ కనిపించాడు. ‘‘ఆటలో ఇండియా ఎప్పుడు గెలిచినా సంతోషంగానే ఉంటుంది. పాకిస్తాన్ పైన గెలుపొందితే ఇంకా ఎక్కువ ఉత్పాహంగా ఉంటుంది. నిరుడు పాకిస్తాన్ చేతుల్లో దారుణంగా ఓడిపోయాం’’ అంటూ గావస్కర్ ‘స్టార్ స్పోర్ట్స్ చానెల్’ తో అన్నారు. 2021 ప్రపంచ టీ-20 కప్ పోటీలలో పాకిస్తాన్ ఇండియాను పది వికెట్ల తేడాతో మట్టి కరిపించిన విషయం విదితమే. ఎనిమిది బంతుల్లో 28 పరుగులు చేయడం ఇండియా లక్ష్యంగా ఉన్నప్పుడు హారిస్ రావుత్ వేసిన బంతులలో రెండింటిని రెండు వరుస సిక్స్ లకు పంపడం విరాట్ కొహ్లీ ప్రత్యేక ప్రావీణ్య విశేషమని గావస్కర్ అన్నాడు. పందొమ్మిదో ఓవర్ లోని చివరి రెండు బంతుల్లో ఆ రెండు సిక్స్ లూ కొట్టడం వల్లనే ఆట మలుపు తిరిగిందని గావస్కర్ అన్నాడు.  

కొహ్లీని అభినందించిన మాజీ క్రికెటర్లలో ఇర్ఫాన్ పఠాన్ ఒకరు. ఇర్ఫాన్ కూడా కోహ్లీని ఎత్తుకొని ఆలించడం చేసుకొని  అభినందించాడు. ‘‘పటాకే తో కల్ హీ ఇస్ బందేనే ఫోడ్ దియే థే, దివాలీ ఆజ్ ముబారక్ హో సభీకో. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్’’ అంటూ కోహ్లీ ని అభినందిస్తూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను ఇర్ఫాన్ పటేల్ తెలియజేశాడు.

‘‘అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు. నాకు మాటలు రావడం లేదు. కడవరకూ మనగలిగితే మనం విజయం సాధించగలమనే విశ్వాసాన్ని హార్థికపాండ్యా ఇచ్చాడు. ఇది నా జీవితంలో అత్యద్భుతమైన ప్రదర్శన’’ అని కొహ్లీ ఆట ముగిసిన అనంతరం వ్యాఖ్యానించాడు. తాను మొహాలీలో2016 ప్రపంచ టీ-20 కప్ పోటీలలో ఆస్ట్రేలియాపైన ఆడిన ఇన్నింగ్స్ కంటే కూడా ఇది విలువైనదని కొహ్లీనే వ్యాఖ్యానించాడు. ‘‘నేటి వరకూ మొహాలీ ఇన్నింగ్సే గొప్పదనే అభిప్రాయంలో ఉండేవాడిని. ఇప్పుడు ఇది అంతకంటే ఉన్నతమైన ఇన్నింగ్స్. హార్థిక్ ప్రోత్సహిస్తూ వచ్చాడు. అభిమానులు అదే పనిగా జయజయధ్వానాలు చేస్తూ నాకు అండగా నిలబడ్డారు. వారి మద్దతుకు కృతజ్ఞతలు’’ అని కొహ్లీ అన్నాడు. సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, తదితర సీనియర్ క్రికెటర్లు కొహ్లీని అభినందనలతో ముంచెత్తారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles