Monday, May 27, 2024

శాస్త్రీయ అవగాహన పెంచిన కొడవటిగంటి వ్యాసాలు

కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు. 1909-1980) ఆధునిక యుగరచయిత. బహుముఖ ప్రజ్ఙావంతుడు. నవలలు, నవలికలు, కథలు,రేడియో నాటికలు, వ్యాసాలు, గల్పికలు ఎన్నో రాశారు. పుంఖానుపుంఖంగా రాసిన వ్యాసాల్లో సాహిత్యం, కళలు, సైన్సు, చరిత్ర, సినిమా, రాజకీయం, తాత్త్వికతల గురించి ఉన్నాయి. ఏది రాసినా లోతైన అవగాహన, స్పష్టత, విశ్లేషణ ఆయన ప్రత్యేకత! పాత్రికేయుడుగా, ఫాక్టరీ ఫోర్ మెన్ గా, కాపీరైటర్ గా పని చేసి చివరకు ‘చందమామ’ పిల్లల పత్రిక సంపాదకుడిగా బాలసాహిత్యనికి ఎనలేని సేవచేశారు. ఇదంతా ఎలాచేయగలిగారూ అంటే కొ.కు. విజ్ఞానశాస్త్రం చదువుకున్న విద్యార్థి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో యంఎస్సీ చదువుతూ మధ్యలో ఆపి తిరిగొచ్చారు. ఒక ధ్యేయం ఏర్పరచుకోవడం, ఒక పథకం ప్రకారం క్రమశిక్షణతో నిర్విరామంగా కృషి చేయడం సహజంగా సైన్సు విద్యార్థులకు అబ్బే లక్షణం. అది కొ.కు. లోచాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వ్యక్తిత్వంలో విరుద్ధాంశాలు లేవు. తను నమ్మింది చేయడం, తను చేసిందే ఇతరులకు చెప్పడం చేస్తూ వచ్చారు.

Also read: ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!

శాస్త్రీయ జ్ఞానానికీ, శాస్త్రీయ దృక్పథానికీ తేడా గుర్తించిన కొ.కు.

దేశంలో ఒక వైపు జాతీయోద్యమం, మరోవైపు సాంస్కృతిక పునరుజ్జీవనం ఉధృతంగా కొనసాగుతున్న దశలో ఆయన ఈ సైన్సు వ్యాసాలు రాశారు. శాస్త్రీయ జ్ఞానానికి, శాస్త్రీయ దృక్పథానికి ఉన్న తేడాని కొ.కు స్పష్టంగా గుర్తించారు. శాస్త్రీయ జ్ఞానమన్నది అపారమైంది. దానికి అంతంటూ ఉండదు. ప్రతి సామాన్య మానవుడు దాన్ని సంపాదించుకోవడం సాధ్యం కాదు. ఆ మాటకొస్తే, వారు కృషి చేసిన రంగంలో తప్ప శాస్త్రవేత్తలకు కూడా సాధ్యం కాదు. కాని కొంత ప్రయత్నిస్తే శాస్త్రీయ దృక్పథం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవచ్చు. సామాన్యుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికే కొ.కు. పత్రికల్లో విరివిగా సైన్సు వ్యాసాలు రాశారు. విభిన్నమైన విషయాలమీద రాశారు. అందులో ఖగోళశాస్త్రం, భూగర్భశాస్త్రం, బౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, వైద్యశాస్త్రం, శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, ప్రశ్నలు-జవాబులు, స్కెచ్ లు, లేఖలు, పీఠికలు వంటివి ఎన్నో ఉన్నాయి. ఆయన విరివిగా రాసిన రచయిత. అయినా, రాసిలో, వాసిలో సమతుల్యం పాటించారు. రాసినవన్నీ పుస్తకాలుగా కూడా వచ్చాయి.

కొడవటిగంటి కుటుంబరావు

విజ్ఞానశాస్త్రం అందించే లాభాల్ని అందరూ అందుకుంటూ ఉంటారు. కాని దాని గూర్చి తెలుసుకోవాలంటే చాలామందికి భయం, బెరుకు, విముఖత కనిపిస్తూ ఉంటాయి. అందుకే ప్రత్యేకించి సైన్సు రచయితలు పుట్టుకొచ్చారు. అటు శాస్త్రజ్ఞుడికి, ఇటు సామాన్యుడికి మధ్య వారధిలా నిలిచారు. శాస్త్రజ్ఞుడిచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరళమైన భాషలోకి అనువదించి, చిన్నచిన్న పదాలతో కమ్మగా కబుర్లు చెప్పినట్టు చెప్పడం అందరికీ చేతకాదు. ఆ ప్రజ్ఞ ఏ కొందరిలోనో ఉంటుంది. ఉదాహరణకు తెలుగులో కొ.కుకుండేది . ఆయన ఎంతటి సాహిత్యకారుడో, అంతటి వైజ్ఞానికద్రష్ట. ‘‘మనకీనాడు సినిమాలకన్నా, కల్పన సాహిత్యంకన్నా కూడా విజ్ఞానం-ప్రకృతిశక్తులను గురించీ, ప్రకృతిని గురించీ జ్ఞానం- చాలా అవసరం’’- అని ఆయన 1960లలోనే చెప్పారు.

Also read: దళితుల రక్షణకోసం అవార్డు వాపసీ

శాస్త్రవిజ్ఞానం మారుతూ ఉంటుంది

మంచి సృజనాత్మక సాహిత్యమైతే కాలానికి ఎదురీది నిలబడగలుగుతుంది. అదే శాస్త్ర విజ్ఞానమైతే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొ.కు. 1945-70 మధ్య రాసిన వ్యాసాలు, వాటిలోని సమాచారం అర్ధశతాబ్దం తర్వాత ఈ తరంవారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనేది ఆలోచించాలి! కాలం మారింది. తరం మారింది. అవగాహనాస్థాయి మారింది. చరిత్ర, కళలు వంటి విషయాల మీద రాసిన వ్యాసాల ఆయువుకంటే – మారుతున్న ఆధునిక యుగంలో సైన్స్ వ్యాసాల ఆయువు చాలా చిన్నది. ఉదాహరణకు కొన్ని విషయాలు చూద్దాం. కొ.కు. 1962లో రాసిన ఒక వ్యాసంలో ‘‘ఏ జీవకణం గాని, ఏ విధంగా తన సంతతిని సృష్టించుకుంటుంది అనేది మనకు తెలియదు’’- అని రాశారు. 1962-97 మధ్య జీవరసాయన శాస్త్రంలో, జన్యుశాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. 1976లో కృత్రిమ జన్వువును ప్రయోగశాలలో తయారు చేసిన డాక్టర్ హర్ గోవింద్ ఖురానా కృషి గురించి చర్చించడం ఇక్కడ అవసరం లేదు కానీ, కృత్రిమ పద్ధతుల్లో ఎలుకల్నీ, క్లోనింగ్ ద్వారా గొర్రెల్ని – తయారు చేసిన యుగం ఇది అని గుర్తుంచుకోవాలి! ‘‘రేడియో క్షణంలో ప్రపంచం అన్ని మూలలనుంచీ మనకు వార్తలు అందజేస్తుంది’’ అని రాశారు కొ.కు. నిజమే. 1956లో ఆయన ఆ వ్యాసం రాసేనాటికి అదొక అద్భుతమైన విషయమే! ఈ రోజు ప్రతి ఇంటా వందల టెలివిజన్ ఛానల్స్ చూస్తున్న ప్రేక్షకులకు ఇందులోఅద్భుతమేమీ కనిపించదు. ‘‘భార్యాభర్తల అన్యోన్యతకోసం ఒకరి రక్తం ఒకరికి ఇవ్వొచ్చునని ఆ నాటి వైద్యులు సూచించారు. అలా చేయడం వల్ల ఇద్దరూ చచ్చే అవకాశం ఉందని ఇప్పుడు ఏ వైద్యుడైనా చెపుతాడు’’ అని కొ.కు 1956లో రాశారు. అంటే మనం ఏ దశలోంచి ఏదశలోకి వచ్చామన్నది అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది గాని, ఈ రోజు ఈ విషయం చెప్పడానికి వైద్యడుకూడా అక్కరలేదు. బ్లడ్ గ్రూప్ ల గురించి తెలుసుకున్న ఏ స్కూలు విద్యార్థి అయినా చెప్పగలడు.

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

కంప్యూటర్ గురించి అప్పట్లో రాసే అవకాశం లేదు

ఈ రోజు అల్లోపతిక్ వైద్య విధానంతో విసుగెత్తి ఇటీవల కాలంలోచాలామంది హోమియో వైద్య విధానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. కాని, హోమియో గృహవైద్యం గురించి కొ.కు. 1949లోనే తెలియజెప్పారు. ఎందుకంటే అప్పటికి ఆ వైద్య విధానం ఉంది. కాని విశ్వమంతా ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నకంప్యూటర్ గురించి రాయలేదు. ఆ రోజుల్లో రాయడానికి వీలేలేదు. అయితే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ‘‘శాస్త్రజ్ఞానం’’, శాస్త్రజ్ఞానావశ్యకత’’, ‘‘శాస్త్రప్రయోజనం’’ వంటి వ్యాసాలు ఎప్పటికీ అవసరమే! శాస్త్రీయ దృక్పథం గలవారు ఎవరు రాసినా, ఎప్పుడు రాసినా అవి సమాజానికి అవసరమౌతూనే ఉంటాయి. అన్ని తరాలకూ అవి కావాలి! అలాంటివి ఎన్ని పునర్ముద్రణలు పొందినా ఆహ్వానించాల్సిందే!! కొడవటిగంటి జీవితాంతం తన బాధ్యత నెరిగి రచనలు సాగించారు. ఆయన ఒక గొప్ప దార్శనికుడు. మహారచయిత. ‘‘మానవుడు శాస్త్రజ్ఞానాన్ని తప్ప మరే జ్ఞానాన్ని కోరనవసరం లేని పరిస్థితి ఏర్పడుతుందని మనం ఊహించుకోవచ్చు’’ అని 1950లలోనే చెప్పారు.

ప్రస్తుతం మనం ఆ దిశలో ప్రయాణిస్తున్నాం –

ఇంతకూ విజ్ఞానశాస్త్రం ఏం చేసింది? అనే ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే….

అది జీవితాన్ని పొడిగించింది.

బాధను తుడిపేసి, రోగాన్ని రూపు మాపింది.

భూమి సారాన్ని పెంచింది

యోధుడికి కొత్త ఆయుధాన్నిచ్చింది

మన తండ్రితాతలకు తెలియని

కొత్త ప్రదేశాల్ని మనకు ప్రేమగా చూపించింది

నదుల్ని వంతెనలతో దాటించింది

సముద్రగర్భంలో ప్రయాణించడం నేర్పింది

చీకటిని పగలుగా మార్చింది

మనిషికి విహంగయానాన్నే కాదు,

గ్రహాంతరయానాన్నీ ప్రసాదించింది

కొత్త రుచుల్ని చూపించింది

కొత్త దిశల్ని తెరిచింది

కూర్చున్న చోట ప్రపంచాన్ని కళ్ళముందు తిప్పింది

గతాన్ని భద్రపరిచింది – భవిష్యత్తును ఊహించింది

వర్తమానాన్ని తన గతిలో నడిపించింది

సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగింది

ఇంతా చేస్తే, అది పరిపూర్ణమేం కాదు.

అదొక పురోగమన సూత్రం!

ఇంతా చేస్తే అది స్థిరమైందేమీ కాదు

నిరంతరం సాగే ప్రవాహం!!

మార్పు – దాని సహజలక్షణం.

Also read: ‘విశ్వాసవ్యవస్థ’లోంచి-ఆత్మవిశ్వాసంలోకి….

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles