వ్యంగ్యరచన
‘‘నా పరిపాలనలో దేశమంతా పచ్చగా ఉండాలి. అలాగని ఎక్కడపడితే అక్కడ పచ్చజెండా ఎగురవేయడానికి వీళ్ళేదు. అలాగనక చేస్తే రాష్ట్రంలో సుపరిపాలనా, స్వపరిపాలనా పోయి పరాయిపాలన వచ్చిందనుకుంటారు. అందువల్ల మన జండానే ఎగరెయ్యండి. కానైతే ఇంటింటికీ పచ్చరంగెయ్యండి. ప్రభుత్వ కార్యాలయాలకి కూడా పచ్చరంగే వెయ్యాలి. ఖాళీస్థలం కనిపిస్తే చాలు పచ్చగడ్డితో నింపెయ్యండి. మొక్కలు నాటండి. ప్రతి మొక్కలోనూ దేవుణ్ణి చూడండి. మీరు మాడినా ఫరవాలేదు. మొక్కలు మాడకుండా చూసుకోండి. మీరు నీళ్ళు పోసి, ఎరువేసి మొక్కల్ని పెంచకపోతే, సరిగ్గా మెయిన్ టైన్ చెయ్యనందుగ్గానూ మీమీద ఖూనీకి యత్నించారని కేసు పెట్టాల్సివస్తుంది. అందుక్కావాలంటే చట్టాల్ని సవరించడానికి ప్రభుతవం వెనకాడదు. ‘మొక్కల్ని నాటండి, మొక్కల్ని సాకండి’ అన్నది నినాదం కావాలి.
‘‘నాకందరి కళ్ళలోనూ పచ్చదనం కనిపించాలి. అలా కనిపించలేదనుకోండీ, దేశంలో పచ్చదనం లేనట్టే. మీ కళ్ళెర్రబడ్డాయంటే, మా సుపరిపాలనని ఓర్వలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు! అంటే మీరు నక్సలైట్లన్న మాట. మీ చావు మిమ్మల్ని చావనివ్వను. ఎన్ కౌంటర్లో చంపించేస్తాను. అలాక్కూడా వార్ ఎగనెస్ట్ టెర్రర్ లో నేనే హీరోని. ఇప్పటికైనా మీకు బోధపడిందా ఇంకా నేను నక్సలైట్లె ఎందుకుండనిస్తున్నానో…? మీకు నేను కనిపించినంత మంచివాణ్ణి కాదని తెలవడానికి ఎవర్నైనా ఎలాంటి విచారన లేకుండా, దయాదాక్షిణ్యాలు లేకుండా చంపించగలను అని తెలవాలంటే, నేను కొదర్నైనా పెంచి. పోషించి, నమ్మించి చంపెయ్యాలి. అప్పుడే బుసకొట్టకపోయినా పాము విఫపుపురుగేనని గ్రహించి భయంతో నాకు పాలాభిషేకం చేసి దండం పెడతారు…ఆ మాటకొస్తే మీరు నమ్మిన దేముడు నా అంత మంచివాడు కాదు. మీరు నమ్మికొలిచినా, కొనియాడినా, మీకు నరకాన్నే ప్రసాదిస్తాడు.
దేశం పచ్చగా ఉంటే మీ బతుకులు చల్లగా ఉంటాయి…’’అని గొంతెండి పోవడంతో మధ్యలో మంచినీళ్ళు తాగడానికి కొంత గ్యాప్ ఇచ్చినప్పుడు పక్కనే ఉన్న గన్ మన్ మంచినీళ్ళందిస్తూ ‘‘మీరు చెప్పనట్లు చేస్తే దేశంలో అందరికీ కామెర్లొచ్చినట్లుగా ఉంటుంది సార్’’ అన్నాడు. ‘‘మా సెక్యూరిటీవాళ్ళని మాత్రం పచ్చడ్రస్ వేసుకోమనకండి. సివిల్ సోలీసులకీ, మిటటరీవాళ్లకీ తేడా తెలవకుండా పోతుంది,’’ అంటూ బతిమాలుకున్నాడు.
సెక్యూరిటీని కాదంటే బతకడడం కష్టం అని తెల్సిన మన ముఖ్యమంత్రి ‘‘చూద్దాం’’ అని అప్పటికా విషయం దాటేసి, తిరిగి జనాంతికంగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు.
‘‘ఇహనుంచీ ప్రభుత్వం కూడా కనిపించిన ఖాళీ జాగాల్లో మొక్కల్ని నాటుతుంది. అందుకెంత ఖర్చయినా వెనుకాడదు. అవసరమైతే తలలు తాకట్టుపెట్టైనా మొక్కల్ని నాటి, పెంచి పోషిద్దాం. ఇది ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదు. మీ భాగస్వామ్యం లేకుండా నేనేమీ చెయ్యలేను. ఒక్క ఖాళీ జాగాల్లోనే కాదు, ఇళ్ళమీదా, గోడలమీదా కూడా మొక్కల్ని పెంచవచ్చనీ, యీ మధ్యన పేదలకోసం ప్రభుత్వం కట్టించిన ఇళ్ళమీద, గోడలమీద చెట్లు పెరగడంతో రుజువైంది. కావాలంటే ఇప్పుడు మీరుంటున్న పాత కొంపల్ని కూల్చేసుకొని ఆ స్థానంలో ప్రభుత్వం చేత కొత్తిళ్ళు కట్టించుకుంటే చాలు. ఏ శ్రమాలేకుండా పచ్చదనానికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళౌతారు.’’
ఇది విన్న జనం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘‘ఇంటికంటే చెట్టుపదిలం’’ అని బోధపడింది వాళ్ళకి.
‘‘చెట్లకి ఇంటినెంబరలిస్తారా?’’ అని సందేహించారు.
‘‘మునిసిపల్ టాక్స్ కూడా కట్టాలేమో’’ నని భయపడ్డారు అంతా.
‘‘ పచ్చగా కనిపించడానికి పచ్చరంగు వేస్తే సరిపోతుంది. కానైతే కావల్సినంత పచ్చరంగు దొరక్కపోవచ్చు’’నని ప్రభుత్వ అధికారులు సందేహం వెలిబుచ్చారు.
‘‘అందుకే నేను అంతటా మొక్కలు నాటమంటున్నది. ఇది నా హయానికే కాదు. నా అధికార తాపాన్నే కాదు, భూతాపాన్ని కూడా చల్లారుస్తుంది‘‘ అని చెప్పారు ముఖ్యమంత్రి.
ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్ లా మారిపోయినాయి. అందుచేత ఇక్కడ మొక్కలు పెరగడం సంగతలాగుంచి మనుషుల మనుగడే కష్టం. ఇప్పటికిప్పుడు ఊళ్ళూ, నగరాలూ కొట్టేసి అడవులు పెంచితే రాజ్యం చెయ్యడానికి తనకి రాజ్యం మిగలదు. అందుచేత అడవుల్లోనే మొక్కలు నాటితే వాట్ని పెంచి పోషించాల్సిన అవసరం ఉండదు. వాటి మానాన అవి పెరుగుతాయి. అలా పెరిగిన మొక్కల్ని అలవీ సంపదల్లో కలిపేసుకోవడానికి బదులు హరితహారంలో చేర్పిస్తే పచ్చదనం పరిశుభ్రత జాబితాలోతమ ప్రభుత్వం పేరు శాశ్వతంగా నిల్చిపోతుంది. పైగా దేశమంతా పచ్చగా ఉండాలంటే, మొక్కలు నాటాల్సిన అవసరం లేదు.
Also read సమాధిలోని హిట్లర్ మేల్కొన్నాడు!
అంతటా రంగులెయ్యాల్సిన అవసరం లేదు. దేశంలో ఉన్న జనమంతా పచ్చకళ్ళజోడు పెట్టుకోవాలని ఆదేశిస్తే పోతుంది. పెట్టుకోనివాళ్ళకి దేశం పచ్చగా కనిపించదు. కనుక వాళ్ళంతా అలజుడులు లేపడానికి కుట్రపన్నుతున్నారని అర్థం అవుతుంది. అందుచేత వాళ్ళమీద ఒక కన్నేసి ఉంచితే పోతుంది. అప్పుడు శాంతిభద్రతలకెలాంటి ముప్పూ ఉండదు. కనుక తమ గుండెలమీద చెయ్యివేసుకొని పడుకోవచ్చు అనుకొన్నాడు.
ముఖ్యమంత్రిగారి అంతరంగాన్ని గ్రహించిన అధికార్లు అడవుల మీద పడ్డారు.
అడవుల్లో ఏముంటాయి? చెట్లంటాయి, పుట్టలుంటాయి. కొడలుంటాయి, కోనలుంటాయి జంతువులుంటాయి, పక్షులుంటాయి.
పోడు భూముల్ని దున్నుకొని అడవుల్లో పండేపళ్ళూ, ఫలాలూ, ఆకులూ అలాలూ తిని బ్రతికే అడవి బిడ్డలుంటారు. ఆ అడవి బిడ్డల్కి ఆ అడవే తల్లీదండ్రీ అయి, ఒంటిమీద గుడ్డల్లా, నెత్తిమీద చూరులా కాపాడుతుంది. ఏ దేశంలో పుట్టినవాళ్లైనా ఆ దేశపు బిడ్డలే అవుతారు. కాబట్టి వాళ్ళాదేశపౌరులేనని ప్రపంచమంతా కోడై కూస్తోంది. అయినా అడవిలో పుట్టిపెరిగినవాళ్ళు అడవిని కొల్లకొడుతున్నారని వాదించింది ప్రభుత్వం.
అడవిలో పుట్టిపెరిగే చెట్లూ, చేమలూ, జంతువులూ, పక్షులూ, క్రిమికీటకాలూ అడవిని కబ్జా చేస్తాయా? అవన్నీ లేకపోతే అడవుల్లేనట్లే – అలాగే తామూ లేకపోతే అడవుల్లేవు అనుకున్నారు అమాయకంగా గిరిజనులు విషయం తెలవక.
పచ్చకామెర్లవాడికీ, పచ్చకళ్ళజోడు పెట్టుకొన్నవాడికి దేశమంతా అడవే. ఆ అడవికి వాడే మృగరాజు.
Also read: హెడ్డు ఎప్పుడు మారతాడు?