Monday, June 24, 2024

కశ్మీర్ లో ఘోరకలి

అమిత్ షా, అజిత్ డోభాల్

  • నెల రోజుల్లో ఎనిమిది మంది హత్య
  • కశ్మీర్ నుంచి నిష్క్రమించాలని పండిట్ల యత్నం
  • ఉగ్రవాద సంస్థలన్నీ ఏకమై భారత్ పై ముప్పేట దాడికి సన్నాహాలు

జమ్మూ-కశ్మీర్ లో జరుగుతున్న ఉగ్రవాదుల వరుస దాడులు, హత్యలు భయప్రకంపనలను సృష్టిస్తున్నాయి. మే 1 వ తేదీ నుంచి జూన్ 2 వ తేదీ వరకూ ఎనిమిది మంది ప్రాణాలను కోల్పోయారు. వారిలో ముగ్గురు పోలీసులు, మిగిలిన ఐదుగురు సామాన్య పౌరులు ఉన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు, గత కొన్ని నెలలుగా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రమూక చెలరేగిపోతోంది. తాజాగా గురువారం ఉదయం కుల్గామ్ జిల్లాలోని ఎల్లాఖీ తేహతి బ్యాంక్ మేనేజర్ విజయకుమార్ ను కాల్చి చంపేశారు. బ్యాంక్ లోకి జొరబడి  గందరగోళం సృష్టించి, అందరినీ భయకంపితులను చేశారు. మొన్న మంగళవారం నాడు కుల్గాం జిల్లాలో దళిత ఉపాధ్యాయురాలు రజనీ బాలను బలిగొన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూ పర్యటనకు సరిగ్గా రెండు రోజుల ముందు జమ్మూలో సీఐఎస్ఎఫ్ వాహనంపై పెద్దదాడి చేశారు. ఇది కేవలం తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం కాదు. తమ సత్తాను చూపిస్తూ భారత ప్రభుత్వ బలహీనతను బట్టబయలు చేసే వ్యూహం. జమ్మూ-కశ్మీర్ వాసుల్లో భయాన్ని కలుగజేసే యత్నం, దేశ వ్యతిరేకతను పెంచే కుట్ర.

Also read: అఖండంగా అవధాన పరంపర

అమిత్ షా సమాలోచనలు

కశ్మీరాన జరుగుతున్న కల్లోలం నేపథ్యంలో గురువారం నాడు హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సంబంధిత ఉన్నత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రవాదులపై మన సైనికులు ప్రతిదాడి చేసి అణచివేస్తున్నప్పటికీ, ఆ ముష్కరుల నుంచి సామాన్య పౌరులకు ముప్పు కలగకుండా చూడలేక పోతున్నాం. భారత్ లక్ష్యంగా ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అన్ని ఉగ్రవాద సంస్థలు నూతన నియామకాలను చేపట్టినట్లు తెలుస్తోంది. జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలోని స్థానికులను ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయనే కథనాలు వెల్లువెత్తుతున్నాయి. నిరాయుధులైన పోలీసులను, స్థానిక సంస్థల నాయకులను, మైనారిటీ వర్గాలను ఊచకోత కోయడమే లక్ష్యంగా ఉగ్రవాదం ఎగసిపడుతోంది. తాలిబాన్ చేతుల్లోకి అఫ్ఘనిస్థాన్ వచ్చినప్పటి నుంచీ, భారత్ పై ఉగ్రవాదుల వ్యూహాలకు మరింతగా రెక్కలు విచ్చుకుంటున్నాయి. అఫ్ఘాన్ ప్రధాన కేంద్రంగా సాగుతున్న ఈ కార్యకలాపాల వల్ల భవిష్యత్తులో అనేక దేశాలు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా చేష్టలుడిగి చేతులెత్తేసినందుకు సమీప భవిష్యత్తులో మళ్ళీ భారీ దాడులను ఎదుర్కోక తప్పదని అంతర్జాతీయ రక్షణ వ్యవహారాల నిపుణులు జోస్యం చెబుతున్నారు. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, అల్ ఖైదా వంటి అన్ని ఉగ్రవాద సంస్థలు ఏకమై ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఉగ్రరూపంగా మార్చే ప్రయత్నాలు పెద్దఎత్తున జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియా కోడై కోస్తోంది.

Also read: సివిల్స్ పరీక్షల్లో నిలిచి వెలిగిన తెలుగువారు

నిద్ర నుంచి మేలుకోవలసిన అమెరికా

అమెరికా వంటి దేశాలు మొద్దునిద్దుర ఒదుల్చుకోవాలి. ఉగ్రవాదాన్ని విధ్వంస్వం చేయడంలో దేశాలన్నీ కలిసి సాగాలి. ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తుంటే భవిష్యత్తు భయంకరంగా ఉంటుందని ఊహించవచ్చు. మాకు రక్షణ కల్పించండి, రక్షిత ప్రాంతాలకు తరలించండని కశ్మీర్ పండితులు, మైనారిటీ వర్గాలు ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి. ఇప్పటికే ఎందరో కశ్మీర్ పండితులు తలోదిక్కుకు పారిపోయారు.మళ్ళీ ఆ వలసలు మొదలై, పెరగకుండా చూసుకోవడం కేంద్రం బాధ్యత. పాలక పెద్దలు చెప్పిన స్థాయిలో అక్కడ అభివృద్ధి జరగడం లేదన్నది వాస్తవం. ఉద్యోగఉపాధులు ఊపందుకున్న జాడలు కూడా ఎక్కడా అగుపించడం లేదు. ఇక శాంతి మంత్రం ఆచరణలో ఆమడదూరంలో ఉంది. బిజెపి పాలనలో తమకు రక్షణ, ప్రగతి ఎంతో ఉంటాయనే విశ్వాసంలో కశ్మీర్ పండితులు ఉన్నారు.ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బిజెపి పాలకులకు ఉంది. స్వయంప్రతిపత్తి, ప్రత్యేక హోదా, ప్రజాస్వామ్యయుత వాతావరణం,అభివృద్ధి,శాంతి, వైభవం దక్కినప్పుడే కశ్మీరం చల్లగా ఉంటుంది. కశ్మీర్ సమస్య ‘రావణాసురుడి కాష్టం’గా మిగలరాదు.

Also read: హిమయమసీమలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles