Saturday, May 18, 2024

ఖమ్మం రాజకీయం: సీటెవ్వరికి? వేటెవ్వరికి?

  • కేటీఆర్ వ్యాఖ్యలతో కార్పోరేటర్లలో గుబులు?
  • బుజ్జగింపులతో దారికొస్తారా !
  • కార్పొరేటర్ల పనితీరును మెచ్చని జనం

ఆవుల శ్రీలత

ఖమ్మం : ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. కార్పోరేటర్ల పని తీరుపై పార్టీ జరిపిన అంతర్గత సర్వేలో 12 మంది మాత్రమే పాస్ మార్కులు సంపాదించారనే వార్తలు నగరంలో హల్ చల్ చేస్తున్నాయి. టిఆర్ఎస్ నుండి గెలిచిన 22 మంది పని తీరుపై ప్రజలు పెదవి విరిచారనే సమాచారం బయటకు పొక్కడంతో కార్పొరేటర్లలో అలజడి మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాత కాపులకు టిక్కట్లు ఇవ్వడం వల్లే మేజార్టీ స్థానాల్లో విజయం వరించలేదని పురపాలక శాఖ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ వ్యాఖ్యానించడంతో ఖమ్మం కార్పోరేటర్లలో అంతర్మదనం ప్రారంబమైంది. వచ్చే ఎన్నికల్లో సీటు కాపాడుకోవడానికి ప్రయత్నాలు ప్రారంబించారు. నాయకులకు గొడుగు పడుతు వినయ విధేయతలు ప్రకటిస్తున్నారు. ఖమ్మం కార్పోరేషన్లో నాలుగు గ్రూపులుగా విడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు. మాజిఎంపి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుత ఎంపి నామా నాగేశ్వరావు. మంత్రి అజయ్ కుమార్ ఆశీస్సులకోసం పడిగాపులు పడుతున్నారు..

కార్పోరేటర్ల పనితీరు పై పెదవి విరిచిన జనం

ఖమ్మం కార్పోరేషన్ పాత కాపుల పని తీరుపై టిఆర్ఎస్ జరిపిన అంతర్గత సర్వేలో 12 మందికి మాత్రమే పనితీరుతో ప్రజలను మెప్పించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో 12 మంది కార్పోరేటర్ల పని తీరు అధ్వానంగా ఉందనే రిపోర్ట్ బయటకు రావడంతో కార్పోరేటర్లలో అలజడి మొదలైంది.. భూకబ్జాలు ఏ పని చేసిన మాకేంటి అనే ఆరోపణలు చూపి తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరనే భయంతో అగ్రనాయకులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. గత ఎన్నికల్లో 34 స్థానాల్లో పాగా వేసిన టిఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఏక పక్షంగా విజయం సాధించాలంటే పాత కాపులలో పని తీరు ప్రదర్శించని వారిని పక్కన పెట్టాలనే డిమాండ్ తెరపైకి రావడంతో అసలు కథ ప్రారంభమైంది. గత ఐదేళ్ల క్రితం ఉన్న సానుకూలత లేకపోవడం దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దెబ్బతినడం కారణంగా టిఆర్ఎస్  ప్రాభవం మసక బారింది. అగ్రనాయకులు పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడంతో ఏం జరగనుంది అన్న అనుమానాలు గులాబి శ్రేణుల్లో గుబులు రేపుతోంది. అసలు అంతర్గత సర్వే ఆధారంగా సీట్లు వేట్లు పడితే టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే మాట వినిపిస్తుంది. మంత్రి గా బాద్యతలు చేపట్టిన తరువాత పువ్వాడ అజయ్ కుమార్ తన హవాకు ఎదురు లేకుండా చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తన ముద్ర ప్రదర్శిస్తారనే మాట బాహాటంగానే వినిపిస్తోంది. మరో వైపు కమలనాధులు విసురుతున్న సవాల్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న గులాబి శ్రేణులు పాత కాపులే పార్టీని పుట్టిముంచే అవకాశాలుండటం గుబులు పుట్టిస్తుంది.

Also Read:అత్యధికులకు ధరావతు గల్లంతు

అనునయింపులు, అల్పాహారాలతో అసంతృప్తి కట్టడి అయ్యేనా?

ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా సమయం చూసి పేలడానికి సిద్దం అవుతుంది.. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమితో ప్రారంభమైన అనునయింపుల పర్వం  అల్పాహర విందులతో ముగుస్తుందా అన్న చర్చ నగరంలో విస్తృతంగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనట్టుగా ఉంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను అనునయించడానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తుమ్మల నివాసానికి వెళ్లి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కోరడం పార్టీలో అంతర్గత విబేదాలున్నట్లు స్పష్టం చేసింది. వాటి సర్దుబాటు అంకురార్పణకు అధినేత అదేశాలే కారణమనే వార్త గుప్పుమంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చతికిల పడిన టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తివాదులను బుజ్జగించే పనిలో తీవ్రంగా కృషి చేస్తోంది.

శ్రీనివాసరెడ్డి నివాసంలో కేటీఆర్

కొంగరకలాన్ సభ సక్సెస్ కు కారణమైన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి గత ఎన్నికల్లో ఖమ్మం ఎంపి టికెట్ నిరాకరించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనను బుజ్జగించడానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్వయంగా మందీ మార్బలంతో అల్సాహార విందు పేరుతో శ్రీనివాస రెడ్డి ఇంటికి రావడం ఖమ్మం జిల్లాలో  విస్తృతంగా చర్చ నడుస్తుంది. దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో దూకుడు మీదున్న కమలనాదుల కన్ను శ్రీనివాసరెడ్డిమీద పడటమే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అనునయింపులు, అల్పాహార విందులు పార్టీలో అధిపత్య పోరును కట్టడి చేస్తాయా అన్నది తేలాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Also Read: జీహెచ్ ఎంసీ ఎన్నికలు : విజేతలూ, పరాజితులూ నేర్చుకోవలసిన గుణపాఠాలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles