Wednesday, February 1, 2023

దిల్లీలో కేజ్రీవాల్ హవా

  • బీజేపీపై నేరుగా ప్రథమ విజయం
  • దిల్లీ రాష్ట్ర పాలనలో సంస్కరణలు ఆప్ కు కలిసొచ్చాయి

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయదుందుభి మోగించింది. 250 వార్డుల్లో 134 స్థానాల్లో గెలిచి 15ఏళ్ళ బిజెపి పాలనకు అంతం పలికింది.104 వార్డుల్లో గెలిచి గౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు బలమైన ప్రతిపక్షంగా బిజెపి అవతరించింది. ఇలా బిజెపి తన ప్రతిష్ఠను కాపాడుకున్నా, ఎన్నికల్లో ఓడిపోవడం మంచి సంకేతం కాదు. తొమ్మిది స్థానాలకే పరిమితమై కాంగ్రెస్ దారుణంగా పడిపోయింది. నేడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అక్కడ ఫలితాలు ఎట్లా ఉన్నపటికీ, దిల్లీ కార్పొరేషన్ ఎన్నికల గెలుపుతో కేజ్రీవాల్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు గెలిచి అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల దిల్లీ ప్రజల విశ్వాసం ద్విగుణీకృతమైనట్లు ఈ ఫలితాలు బలమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. చిన్న పార్టీలు కదా అని చిన్న చూపు చూస్తే పెద్ద దెబ్బ తినాల్సి వస్తుందని పెద్దపార్టీలు ఈ ఫలితాల నుంచి మరోమారు తెలుసుకోవాలి. స్వయంకృత అపరాధంతో కాంగ్రెస్, అతి విశ్వాసంతో బిజెపి మొన్నటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూశాయి. ఇదిగో ఇప్పుడు దిల్లీ స్థానిక ఎన్నికల రూపంలో మరోసారి ఖంగుతిన్నాయి. ప్రతి రాష్ట్రంలో విస్తరించాలని ఆప్ ఊరుకులు పరుగులు మీదుంది. సరే! ఎవరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.”బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి” అనే సామెత ఊరకే పుట్టలేదు.

Also read: చెలరేగుతున్న సరిహద్దు వివాదం

ఎవరూహించారు?

కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారిపోతుందని, బిజెపి అంతగా ఎదుగుతుందని, ఆమ్ ఆద్మీ పార్టీల్లాంటివి పుట్టుకొచ్చి పెద్దపెద్ద పార్టీలతో మంచినీళ్లు తాగిస్తాయని ఎవ్వరూ అనుకోలేదు. గుర్రం ఎగురావచ్చు… అన్న చందాన పరిణామాలు ఉంటూఉంటాయి. దిల్లీ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ప్రతి పార్టీకి పాఠాల వంటివి. ఈ గెలుపు చూసి మిడిసిపడితే రేపు ఆప్ ను కూడా ప్రజలు ఆమడదూరంలో కూర్చోబెడతారని తెలుసుకోవాలి. బిజెపి 15 ఏళ్ళు పాలనలో ఉంది కాబట్టి ప్రజలకు మొహం మొత్తి ఉండవచ్చు. 2017 కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ పట్ల ప్రజలకు పెద్దగా విశ్వాసం కుదరలేదు. ఈ ఇదేళ్ల పాలన చూసిన తర్వాత స్థానిక ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ పార్టీని ప్రజలు గెలుపుగుర్రం ఎక్కించారు. ఆప్ విజయాన్ని విశ్లేషించుకుంటే అభివృద్ధి ప్రధాన మంత్రంగా, ప్రథమ సూత్రంగా పనిచేశాయి. విద్య, వైద్యం, విద్యుత్ మొదలైన అంశాల్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నడిపిన పాలన, సంస్కరణలు దిల్లీ ప్రజలను అమితంగా ఆకర్షించాయి. 1958 లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ (ఎంసీడీ ) ఏర్పడింది. 2012లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మూడు కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. ఇటీవలే అవన్నీ విలీనమయ్యాయి. సరికొత్త వ్యూహంతో ముందుకు సాగిన ఆప్ చేతిలో మిగిలిన పార్టీలు దెబ్బతినక తప్పలేదు.

Also read: వర్థిల్లుతున్న జర్ననీ – భారత్ సంబంధాలు

కాంగ్రెస్ ను హరిస్తున్న ఆప్

2017 ఎన్నికల్లో 181 స్థానాలను గెలుచుకున్న బిజెపి ఈసారి 104వార్డులకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 27 చోట్ల గెలిచిన కాంగ్రెస్ నేడు 9కి దిగజారిపోయింది. 48 సీట్ల నుంచి 134 సీట్లకు ఆమ్ ఆద్మీ అనూహ్యంగా ఎగబాకి తన తడాఖా చూపించింది. వివిధ ఎన్నికల సరళిని గమనిస్తే ఆప్ వల్ల కాంగ్రెస్ కు ఎక్కువ నష్టం జరుగుతోంది. పంజాబ్ లో కాంగ్రెస్ ఏకంగా అధికారాన్నే కోల్పోయింది. గుజరాత్ లో ఓట్ల చీలిక జరిగింది. దిల్లీ స్థానిక ఎన్నికల్లో చావుదెబ్బ తింది. స్థానిక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన బిజెపిని అన్నిచోట్లా ఎదిరించేంత శక్తి ఆప్ కు ఇంకా రాలేదు. సర్వశక్తులు, యుక్తులు వాడినా దిల్లీ కార్పొరేషన్ పీఠాన్ని బిజెపి నిలుపుకోలేక పోయింది. ఇప్పుడు రాష్ట్రంతో పాటు స్థానిక పాలన కూడా కేజ్రీవాల్ చేతిలోకి వచ్చేసింది. పోలీసింగ్ మాత్రం బిజెపి చేతుల్లోనే ఉంది. కేంద్ర పాలన కూడా తన చెప్పుచేతల్లోనే ఉంది. కార్పొరేషన్ లో బలమైన ప్రతిపక్షంగా రేపు ఆప్ ను ముప్పుతిప్పలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా, కేజ్రీవాల్ విజయం రాజకీయ యవనికలో కొత్త పోకళ్లను సృష్టిస్తోంది.

Also read: భారత సారథ్యంలో జీ-20 ప్రయాణం

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles