Thursday, March 28, 2024

ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ విద్యార్థుల కోసం వైద్య విద్యా సీట్లు పెంచాలని అభ్యర్థన

ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారి వైద్య విద్య కొనసాగాలని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కళాశాలల్లో ఉక్రెయిన్‌ విద్యార్థుల కోసం అదనంగా సీట్లు పెంచాలన్నారు. ఉక్రెయిన్ నుంచి 700 మంది వైద్య విద్యార్థులు తెలంగాణకు వచ్చారన్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం భరిస్తుందని సీఎం పేర్కొన్నారు. మానవతాదృక్పథంతో త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చిన విద్యార్థుల గురించి లేఖలో ప్రస్తావించారు.

మోదీకి కేసీఆర్ రాసిన లేఖ పూర్తిపాఠం ఇది:

29 మార్చి, 2022

ప్రియమైన శ్రీ నరేంద్ర మోడీ గారికి,

1. ఉక్రెయిన్‌లో అకస్మాత్తుగా యుద్ధం సంభవించడంతో అక్కడ వివిధ వైద్య కళాశాలల్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల చదువుకు పలు దశల్లో అంతరాయం కలగడంతో, తీవ్ర ఇబ్బందులతో వారు భారతదేశానికి తిరిగి రావలసి వచ్చింది.

2. ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించడానికి ఎంతో సమయాన్ని కేటాయించి, పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసిన భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధ సంక్షోభం నేపథ్యంలో వారి చదువులు ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయే ప్రమాదముంది.

3. నివేదికల ప్రకారం, యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి 20,000 మంది భారతీయ విద్యార్థులు భారతదేశానికి తిరుగుముఖం పట్టారు. వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. తమ పిల్లలను వైద్యులుగా చూడకుండానే జీవితకాలం చేసిన పొదుపు నిరర్థకమైందనే భావనకు వారు గురయ్యే పరిస్థితి నెలకొంది. వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించేందుకు సాధ్యమయ్యే ప్రతీ అవకాశాన్ని మీరు పరిశీలించి, అంగీకరించాలి.

4. విద్యార్థులెదుర్కొంటున్న ఈ అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, దీన్ని స్పెషల్ కేస్ గా పరిగణించి, వారు వైద్య విద్యను పూర్తి చేయడానికి విధిగా సహాయపడాలని నేను కోరుతున్నాను. నిబంధనలను సడలిస్తూ, వారు దేశంలోని వైద్య కళాశాలల్లో తత్సమాన సెమస్టర్లలో చేరేందుకు వీలు కల్పించాలని నివేదిస్తున్నాను. తదనుగుణంగా వైద్య కళాశాలల్లో వివిధ సెమిస్టర్‌లలోని సీట్లను ‘వన్ టైమ్’ ప్రాతిపదికన పెంచి, వైద్య విద్యార్థులకు కేటాయించాలని కోరుతున్నాను. 

5. వైద్య విద్యను పూర్తిచేయకుండానే ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చివనవారిలో 700 మంది దాకా తెలంగాణ వైద్య విద్యార్థులు ఉన్నారు. సంబంధిత విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి మెడికల్ కాలేజీ ఫీజును భరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

6. నా విన్నపాన్ని దయచేసి సానుభూతితో పరిశీలించి, ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

భవదీయుడు

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles