Wednesday, April 24, 2024

న‌వ్య యాదాద్రిని జాతికి పున‌రంకితం చేసిన సిఎం కేసీఆర్

న‌వ్య యాదాద్రిని జాతికి పున‌రంకితం చేశారు సిఎం కేసీఆర్ . జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య ప్ర‌ధాన ఆల‌య ప్ర‌వేశం జ‌రిగింది. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ క్ర‌తువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ దంప‌తుల‌ను వేద పండితులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. శోభాయాత్ర‌, విమాన గోపురాల‌కు ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం, ఆల‌య ప్ర‌వేశం జ‌రిగిన స‌మ‌యంలో ‘న‌మో నార‌సింహ’ మంత్రం ప్ర‌తిధ్వ‌నించింది.

వేదమంత్రోచ్ఛాటన, పల్లకి మోసిన కేసీఆర్

సొమావారం  ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌భుత్వ అధికారులు, అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు. శోభాయాత్ర‌లో భాగంగా బంగారు మూర్తులు, ఉత్స‌వ విగ్ర‌హాలు, అళ్వార్లు ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. వేద మంత్రోచ్ఛాటన, మేళ‌తాళాల మ‌ధ్య శోభాయాత్ర వైభ‌వంగా కొన‌సాగింది. ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు . ప్రధానాలయ పంచతల రాజగోపుర‌రం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేశారు. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహించారు. వేదమంత్రోచ్ఛాటన నడుమ ప్రధానాలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచనారసింహుడికి ఆరాధనలు చేశారు.

స్వయంభువుల దర్శనానికి అనుమతి

ఆర్కియాలజిస్టు శివనాగిరెడ్డిని సన్మానిస్తున్న కేసీఆర్, మంత్రి శ్రీనివాసగౌడ్, హరీష్ రావు, కవిత

అనంతరం స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇచ్చారు. దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసి పండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. ఏడు గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏక‌కాలంలో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. రాజ గోపురాల‌పై స్వ‌ర్ణ క‌ల‌శాల‌కు 92 మంది రుత్వికుల‌తో సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. విమాన గోపురాల శిఖ‌రాల‌పై క‌ల‌శ సంప్రోక్ష‌ణ కైంక‌ర్యాలు నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప‌లువురు ప్రముఖులు, ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు. ఆల‌య పున‌ర్నిర్మాణంలో పాలు పంచుకున్న ఆల‌య ఈవో ఎన్ గీత‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్ సాయి, స్థ‌ప‌తి సుంద‌ర్ రాజ‌న్,  వైటీడీఏ వైస్ చైర్మ‌న్ కిష‌న్ రావును సీఎం కేసీఆర్ శాలువాల‌తో స‌త్క‌రించి, స‌న్మానించారు. ఆర్కిటెక్చ‌ర్ మ‌ధుసూద‌న్, ఈఎన్సీ ర‌వీంద‌ర్ రావు, గ‌ణ‌ప‌తిరెడ్డి, శంక‌ర‌య్య‌ల‌ను మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, జీ వ‌సంత్ నాయ‌క్‌, వై లింగారెడ్డి, వెంక‌టేశ్వ‌ర్ రెడ్డిల‌ను మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, రామారావు, సుధాక‌ర్ తేజ‌ల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శాలువాల‌తో స‌త్క‌రించి స‌న్మానించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఆల‌య ఈవో గీత‌, వైటీడీఏ వైస్ చైర్మ‌న్ శాలువాతో స‌త్క‌రించి, నార‌సింహ స్వామి ఫోటోను బ‌హుక‌రించారు.

శాస్త్రోక్తంగా ఆలయ పున: ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా యాదాద్రిలో పలు  అర్చనలు హోమాలు జరిగాయి. ఆగమ శాస్త్రం ప్రకారం వాటి ప్రాధాన్యతలు ఈ విధంగా వున్నాయి.

చతుస్థానార్చనలు ప్రత్యేకత

పంచకుండాత్మక మహాయజ్ఞంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అధిష్టాన స్వరూపములైన దేవతను ప్రతిరోజు ఉదయము, సాయంత్రము షోడచోపచారములతో ఆరాధిస్తారు. ఫల నైవేద్యములను సమర్పిస్తారు.  ఉత్సవాంతమున చతుసానార్చనలు పరిసమాప్తి పొంది భగవదనుగ్రహము కలిగించుననే విశ్వాసంతో ఈ వేడుక నిర్వహించారు.

పరివార శాంతి ప్రాయశ్రిత్త హోమం

ఉత్సవంలో పరివార గణముగా ప్రతిరోజు ఆరాధింపబడిన ఆయాదేవతా గణములను పరివారహోమము ద్వారా ఆరాధించడమనేది ఆగమశాస్త్ర విధానము.  ఆయా మంత్రాల లోని సర్వవిధ దోషములు వొక వేళ తెలిసి,  తెలియక జరిగినా అటవంటి దోషాలను తొలగించేందుకు  పరివారశాంతి ప్రాయశ్చిత హోమము నిర్వహించారు.

బలిహరణము ప్రత్యేకత

భూతశాంతి, లోకశాంతి కలుగుతుందనే విశ్వాసం..తో ఆలయాన్ని ఆశ్రయించి ఉన్న దిక్పాలకులైన ఆయాదేవతలను బలిహరణ వేడుక ద్వారా ప్రసాదం సమర్పించి విశేషరీతిలో బలి హరణ వేడుక నిర్వహిస్తారు.

మహా పూర్ణాహుతి ప్రత్యేకత

పంచకుండాత్మక మహాయాగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వైదిక ప్రక్రియ మహాపూర్ణాహుతి.. ఘట్టం.   పూర్ణం అనగా భగవానుడు ” అని మనము ఆచరించే సర్వవిధ కర్మలు, యజ్ఞ యాగాది క్రియలు, మంత్ర జపములు, వేదమంత్ర పఠనములు, పురాణ, ఇతిహాస, దివ్య ప్రబంధ పారాయణాది ఫలాలను అన్నిటినీ సమర్పించుటయే పూర్ణాహుతి.

ఇవన్నీ భగవానుడికి సమర్పించుట వలన ఇన్ని రోజులు సప్తాహ్మకంగా నిర్వహింపబడిన ఈ ఉత్సవములు భగవానుని తృప్తిని పొందించి విశ్వజనీనమైన శాంతి యోగ, క్షేమములను కలిగిస్తాయనే విశ్వాసం. సర్వవిధ దోష నివారకము,  సర్వసంపద్ సమృద్ధము, సర్వాభీష్ట ఫలప్రదము ఈ మహాపూర్ణాహుతి ఫలము లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles