Wednesday, September 18, 2024

పాపం ఈసారి ఎవరి ‘కాపులు’?

వోలేటి దివాకర్

పాపం కాపులు …… సంఖ్యాపరంగా నిర్ణాయక శక్తిగా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కాపులకు అధికారం అందని ద్రాక్షగానే మిగిలింది. కాంగ్రెస్ , తెలుగుదేశం , ప్రస్తుతం వై ఎస్సార్సీపీ లలో ఆయా సామాజిక వర్గాల అధికార పల్లకీలు మోయడమే తప్ప అత్యున్నత పీఠాన్ని అధిరోహించలేకపోయామన్న ఆవేదన వారిలో గూడుకట్టుకుని ఉంది.  అయితే కాపు సామాజిక వర్గీయుల్లో ఉన్న అనైక్యత కూడా ఈపరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. సినీ నటులుగా చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే వీరాభిమానం చూపించే కాపులు రాజకీయాలకు వచ్చే సరికి ఓట్లు వేయకపోవడం వల్లే చిరంజీవి, పవన్ కల్యాణ్  తాము పోటీ చేసిన పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో కాపులకు ఆధిక్యం ఉన్నప్పటికీ ఓటమిపాలయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాస్త సహనంతో ఇప్పటి దాకా కొనసాగించి ఉంటే వారు అధికారానికి దగ్గరయ్యే అవకాశాలు మెరుగయ్యేవి. ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి చేతులు దులుపుకోవడంతో కాపు సామాజిక వర్గానికి ఆ అవకాశం లేకుండాపోయింది.

Also read: పాదయాత్ర కలిపింది ఆ ఇద్దరినీ!

సాగని దాసరి ప్రయోగం

కాపుల బలాన్ని ఉపయోగించుకొని రాజకీయాలలో రాణించాలని ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు సైతం ప్రయత్నించారు. ఆయన రాజకీయ పార్టీని నెలకొల్పాలని ప్రయత్నించారు. చివరిక్షణంలో వాయిదా వేశారు. ఆ తర్వాత ఆయనను రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియాగాంధీ నియమించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రిమండలిలో బొగ్గుగనుల శాఖ సహాయమంత్రిగా కూడా పని చేశారు. చిరంజీవి ఒక అడుగు ముందుకు వేసి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పి 2009 ఎన్నికలలో పోటీ చేసి 18 అసెంబ్లీ స్థానాలూ, 18 శాతం ఓట్లూ సంపాదించారు. ఓడిపోయిన కొన్ని మాసాలకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యంత్వంతోనూ, మంత్రిమండలిలో పర్యాటక శాఖ సహాయ మంత్రి పదవితోనూ సరిపెట్టుకున్నారు. ఆయన రాజకీయాలలో కొనసాగి తన పార్టీని నిలబెట్టుకొని ఉన్నట్లయితే 2014లో టీడీపీకి బదులు ప్రజారాజ్యానికి అవకావం దక్కేదేమో. టీడీపీ, వైఎస్ఆర్ సీపీలలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అనుభవం ఉన్నదనీ, జగన్ మోహన్ రెడ్డి యువకుడనే కారణంగా టీడీపీకి పట్టం కట్టారని చెప్పుకున్నారు. అప్పుడు చిరంజీవి రంగంలో ఉన్నట్లయితే బహుశా ఆయనకి కొత్త రాష్ట్రం ప్రజలు బాధ్యత అప్పగించేవారేమో. ఈ ఉద్దేశంతో పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని సమర్థించలేదు. గత ఎనిమిదేళ్ళలో చాలా సందర్బాలలో పవన్ కల్యాణ్ తన సోదరుడు చేసిన పనిని విమర్శించారు. 2014, 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ ఫలితాలు అనుకూలంగా రాకపోయినప్పటికీ, 2019లో తాను స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోయినప్పటికీ, తన పార్టీ గుర్తుపైన ఒకే ఒక ఎంఎల్ ఏ గెలిచినప్పటికీ ఏ మాత్రం పొగరు, విగరు తగ్గకుండా రాజకీయాలలో కొనసాగుతున్నారు. పనవ్ కల్యాణ్ లో ఉన్న ప్లస్ పాయంట్లలో అదే ప్రధానమైనది. ఓటమితో గుండె జారడం లేదు. పలాయనవాదం లేదు. రంగంలో కొనసాగుతూ బీజేపీ, టీడీపీతో పొత్తులాట ఆడుకుంటూ, సినిమాలలో నటన కొనసాగిస్తూ, వారంతాలలో హడావిడి చేసి వెడుతూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు.

Also read: త్వరలో విజయసాయిరెడ్డి సొంత మీడియా!

పవన్ ఒంటరిగా పోటీ చేస్తే…

తాను బీజేపీతో కానీ, టీడీపీతో కానీ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన పవన్ కల్యాణ్ చేసినట్టు లేదు. తాను ఒంటరిగానే పోటీ చేస్తాననీ, మొత్తం 175 స్థానాలకూ జనసేన అభ్యర్థులను నిలబెడతాననీ, ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నాననీ, ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలకు తనదైన రీతిలో సేవ చేయాలని అనుకుంటున్నాననీ ప్రకటించి ఉంటే ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు మరో విధంగా ఉండేవి. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడికి మంచిపేరు ఎంత ఉన్నదో చెడ్డపేరు కూడా అంతే ఉన్నది. ఇప్పుడు కూడా జగన్ మెహన్ రెడ్డి కాదనుకుంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు కానీ పవన్ కల్యాణ్ అనుకోవడం లేదు. దీనికి కారణం ఏమిటి? మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నలభై స్థానాలు జనసేనకు వదిలిపెడతానంటూ చంద్రబాబునాయుడు సంకేతాలు పంపిస్తున్నాడు. నలభై స్థానాలకు పోటీ చేసి పది స్థానాలు గెలుచుకుంటే టీడీపీకి తోకలాగానే ఉండాల్సివస్తుంది కానీ జనసేన అధికార పార్టీ కాజాలదు. బీజేపీ కూడా కూటమిలో కలిస్తే జనసేన స్థానాలు మరీ తగ్గుతాయి. చంద్రబాబు నాయుడుకు ఉన్న చెడ్డపేరు పవన్ కల్యాణ్ అభ్యర్థులపైన కూడా ప్రభావం చూపుతుంది. చంద్రబాబునాయుడుకు ఉన్న చెడ్డపేరు పవన్ కల్యాణ్ కు లేదు. ఎందుకంటే ఇంతవరకూ అధికారంలో లేరు.  చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మూడేళ్ళుగా చూస్తున్నారు. ఈ సారి పవన్ కల్యాణ్ కి అవకాశం ఇద్దామని ప్రజలు 2024 ఎన్నికలలో భావించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఒక కాపుకులానికే పరిమితం కాదు. అతనికి అభిమానులు అన్ని కులాలలోనూ ఉన్నారు. ఇప్పడు జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం కొంత మంది కాపులకు ఇష్టం ఉండదు. తెలుగుదేశం పార్టీ అంటే గిట్టనివారు  ఈ కూటమివైపు చూడను కూడా చూడరు. అదే పవన్ కల్యాణ్ సింగిల్ గా వస్తే మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయని కొందరు రాజకీయ పరిశీలకులు అధ్యయనం జరిపి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కి చెప్పినప్పటికీ నాదెండ్ల పవన్ కల్యాణ్ తో ఈ విషయం చెప్పినట్టు కానీ, చర్చించినట్టు కానీ లేదు. కారణం ఏమంటే నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి అసెంబ్లీకి గెలుపొందాలంటే టీడీపీతో పొత్తు కావాలి. అందుకే ఆయనకు పవన్ కల్యాణ్ ఒక్కడు పోటీ చేయడం ఇష్టం లేదని అనుకోవాలి. అందుకే ఈ దిశగా పవన్ కల్యాణ్ ను నాదెండ్ల ప్రోత్సహించలేదో, చెప్పినా పవన్ కు అంత గుండెధైర్య లేక ముందడుగు వేయలేదో తెలియదు. మొత్తంమీద ఒంటరి పోరుకు సిద్ధంగా లేరు. మళ్ళీ టీడీపీ పల్లకి మోయాలని జనసేనాని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

Also read: అనపర్తిలో అసైన్డ్ భూములపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రుణాలు: అనపర్తి ఎంఎల్ఏ ఆరోపణ

కాపుల రాజకీయ ప్రాధాన్యత

కాపుల రాజకీయ ప్రాధాన్యతను గుర్తించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, వైసిపి అధినేత జగన్ తమ ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సంతృప్తి పరిచారు. రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాపుల మనోభావాలను పరోక్షంగా వ్యక్త పరిచారు. కాపులు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తే సంతోషిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ సిఎం పదవికి పోటీ చేస్తే మద్దతిస్తామన్న భావాన్ని వ్యక్త పరుస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు పవన్ సిఎం పదవికి సిద్ధమన్న స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష తనకు బలంగా ఉన్నట్టు పవన్ కల్యాణ్ ఎన్నడూ మాటవరుసకైనా బహిరంగంగా అనలేదు. టిడిపి, వైసిపిల్లో ఆ అవకాశాలు ఎలాగూ ఉండవన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాపులు వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఆసక్తికర అంశం.

Also read: కరవు కాటకాలకు ఆనకట్ట…కాటన్ బ్యారేజీకీ అంతర్జాతీయ గౌరవం!

అధికార పార్టీ అప్రమత్తం …

విశాఖపట్నంలో జరిగిన పరిణామాల తరువాత అధికార పార్టీతో అమీతుమీకి సిద్ధమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో పాటు జన సేనాని తన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం వైపు అడుగులు వేయడాన్ని గమనించిన అధికార వై ఎస్సార్ సిపి అప్రమత్తమైంది. టిడిపి, పవన్ తోపాటు కాపులు కూడా వారి వెంట వెళితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని అధికార పార్టీ గ్రహించింది. దీంతో వ్యూహాత్మకంగా సంఖ్యాపరంగా కాపులు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజమహేంద్రవరంలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది, ఈ సమావేశానికి అధికార పార్టీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు,  ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. దీంతో  ఈ సమావేశం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సమావేశంలో పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సుమారు ఐదుగంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. అయితే, ఈ విషయాలేవీ విలేఖర్లకు వెల్లడించలేదు. పవన్ కల్యాణ్ వ్యవహార శైలిని ఖండిస్తూనే కాపులకు వైసిపి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కాపు సామాజిక వర్గం దూరం కాకుండా రాజమహేంద్రవరం సమావేశంలో ఒక కార్యాచరణను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా కాపు సామాజికవర్గీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కాపు ప్రజాప్రతినిధులు, వివిధ పదవుల్లో ఉన్న నేతలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఇదే అంశంపై విజయవాడలో మరోసారి సమావేశం కావాలని తీర్మానించారు.

Also read: అమరావతా? అధికార వికేంద్రీకరణా? ఏది రైటు?

 పీకే సలహాతోనేనా ?

కాపు మంత్రుల సమావేశంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన హడావుడి చూస్తే పీకే సలహాతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు భావించాల్సి వస్తోంది. సమావేశంలో భాగంగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, మరో మంత్రి ప్రైవేటు సంభాషణలు సాగించేందుకు పక్కగదిలోకి వెళ్లగా పీకే బృందం సభ్యులు కూడా వారి వెంట గదిలోకి దూరిపోయారు. దీంతో పీకే టీమ్ ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తోందని చిరాకుపడ్డారట. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా పీకే బృందం నిశితంగా పరిశీలించి, ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి సమాచారాన్ని చేరవేస్తోంది. నియోజకవర్గాల్లో సర్వేలు జరిపి ఎవరు గెలుపు గుర్రాలో తేల్చేపనిలో ఉంది. పీకే బృందం సిఫార్సుల మేరకే వచ్చే ఎన్నికల్లో వైసిపి టిక్కెట్లు ఖరారవుతాయన్నది స్పష్టం. అయితే, పీకే బృందం జగన్ మోహన్ రెడ్డితో ఉన్నది కానీ పీకే లేనట్టు కనిపిస్తోంది. తాను కాంగ్రెస్ బలోపేతం కావడానికి సాయం చేయవలసింది పోయి జగన్ వ్యక్తిగత ఆకాంక్ష తీర్చుకోవడానికి దోహదం చేశాననీ, తాను చేసిన పొరపాట్లలో ఇది ఒకటనీ బిహార్ లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇటీవల విలేఖరులతో అన్నారు.

Also read: అధికార పార్టీలో మళ్లీ అంతర్గత పోరు?! వారు పార్టీలో చేరడం ఆయనకు ఇష్టం లేదా?

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles