Wednesday, December 6, 2023

నాటి ‘కలలరాణి’ కాంచనమాల

తెలుగు సినిమాలపైన, ప్రధానంగా కథానాయికల గురించి రాసేవారు అందంలో కాంచనమాలనూ, నటనలో  సావిత్రినీ ప్రస్తావించకుండా ఉండలేరు. ఈ తరం వారికి  ఆమె పేరు అంతగా తెలియకపోవచ్చు కానీ తొలి `సూపర్ హీరోయన్`గా గుర్తింపు పొందారు. అందం, అభినయం, మధురస్వరం ఆమెను అనతికాలంలోనే అందలం ఎక్కించాయి. క్యాలెండర్ కు ఎక్కి అభిమానుల ఆరాధనలు అందుకున్న తొలి కథానాయిక ఆమె.  `క్వీన్ ఆఫ్ బ్యూటీ` అని పిలిచేవారు. ఆమెతోనే`స్టార్ డమ్` ప్రారంభమైందని చెబుతారు. `రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల`అని శ్రీశ్రీ కవిత అల్లారు. `స్ర్కీన్ గాడెస్ ` అనిపించుకున్న హాలీవుడ్ స్టార్ నార్మా షేరర్ తో ఆమెను పోల్చారు. ఆమెది సహజ సౌందర్యం. మేకప్ తో అంతగా అవసరం పడేది  కాదని చెబుతారు.

కాంచనమాల తొమ్మిదేళ్ల కాలంలో నటించిన చిత్రాలు డజనుకు ఒకటి తక్కువే అయినా శతాధిక చిత్రాలకు సరిపడ పేరు, ప్రజాదరణను  సంపాదించుకున్నారు. ఆమె నటిగా ఎంతటి `గ్లామర్` సొంతం చేసుకున్నారంటే….`మా  ఇంటి  మీదుగా వెళ్లే ఆమెను చూడాలని ఎంతో ఉవ్విళ్లూరేదాన్ని`అని అగ్రనటి  భానుమతి తమ ఆత్మకథలో పేర్కొన్నారు.

రంగస్థల నటిగా

ప్రఖ్యాత నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం  తమ `సారంగధర` నాటకంలో స్త్రీ పాత్రలను స్త్రీలతోనే ధరింపజేయాలని నిర్ణయించి ప్రకటించిన  నేపథ్యంలో కాంచనమాల తండ్రి నారాయణదాసు చిలకమర్తి వారిని కలవగా, `చిత్రాంగి` వేషం ఇచ్చారు. అప్పటి  వరకు పురుషులే స్త్రీ పాత్రలను పోషిస్తుండగా,`స్త్రీ పాత్రలను స్త్రీలే పోషిస్తున్న తొలి నాటకం‘ అన్న ప్రచారంతో ఆ ప్రదర్శనను చూసేందుకు ప్రేక్షకులు వరుస కట్టారు. అలా నటజీవితాన్ని ప్రారంభించిన కాంచనమాల `విప్రనారాయణ`, `సక్కుబాయి` తదితర నాటకాల్లో నటించారు. అనంతర కాలంలో ఆమె సినిమాల నుంచి బయటపడిన తరువాత నాటకమే  ఆమెకు కొంతవరకు బతుకుతెరువైంది.

కాదన్న వారితోనే ఔననిపించి

ప్రతిష్ఠాత్మక చిత్రాలు తీసిన గూడవల్లి రామబ్రహ్మం  ప్రొడక్షన్ మేనేజర్ గా  ఉన్న కాలంలో కాంచనమాలను చూసి `ఈమెది ఫొటోకు తగిన మొహం కాదు. సినిమాకు పనికిరాదు` అని వ్యాఖ్యానించారట. ధర్శకుడిగా మారిన తర్వాత అభిప్రాయం మార్చుకొని తాను తీస్తున్న `మాలపిల్ల` చిత్రానికి ఆమెనే నాయికగా ఎంచుకోవడం విశేషం. ఆమె ఆయనతో అదే విషయాన్ని  ప్రస్తావిస్తే, `తొందరపడి అన్నాను`అనీ తప్పించుకున్నారట. `కెమెరాకు నప్పదు` అనిపించుకున్న ఆమె   ఈ చిత్రంతో  ఎందరికో `కలల రాణి‘ అయ్యింది. పెద్దకళ్లు, పొట్టి చేతుల జాకెట్, భుజంపై వాలుజడ, చెవులకు రింగులు, చేతిలో టీకప్, సాసర్ తో మనోహరంగా  ముద్రితమైన క్యాలెండర్లు విపరీతంగా అమ్ముడు పోయాయట. సంవత్సరం మారినా  ఆ క్యాలెండర్ ను అలాగే  ఉంచుకోవడాన్ని బట్టి ఆమె సౌందర్యం వెల్లడవుతుంది.

రెంటికీ చెడిన

తన అందంతో ఉత్తరాది వారినీ కట్టిపడేసిన కాంచనమాలకు  బొంబాయి చిత్ర పరిశ్రమ  నుంచి అనేక అవకాశాలువ వచ్చాయి. హిందీ చిత్రపరిశ్రమ ప్రముఖులు  మెహబూబ్ ఖాన్, మోతీలాల్, సురేంద్ర బొంబయ్ లో జరుగుతున్న `వీరాభిమన్యు` చిత్రం చిత్రీకరణలో కాంచనమాల అభినయాన్ని చూసి అవకాశాలు ఇవ్వడానికి  ముందుకు వచ్చారు. నర్గీస్ తల్లి జద్దన్ బాయి మరో అడుగు ముందుకు వేసి ఆమెకు హిందీ నేర్పించి మరీ నటింపచేసుకుంటామని చెప్పారట. కానీ తెలుగుకే పరిమితం కావాలని  నిర్ణయించుకున్నారు. ఒకవేళ  బొంబాయి రంగానికి వెళ్లి ఉంటే ఎలా ఉండేదో ఏమో కానీ ఆమె నిర్ణయం  `రెంటికి చెడిన…` సామెతలా ఉందని ఆమె అభిమానులు బాధపడ్డారట. మనిషి ఒకటి తలిస్తే పైవాడు మరొకటి చేస్తాడన్నట్లు  మాతృభాషా చిత్రాలలోనే నటించాలనుకున్నా ఇక్కడా   నిలదొక్కుకోలేక పోయారు. అందుకు కారణం అవకాశాలు సన్నగిల్లడం కంటే ఆమె అహంభావ ధోరణే ప్రధాన కారణంగా చెబుతారు.

లెక్కలేనితనం?

కాంచనమాలకు ఇతరత్రా దురలవాట్లు లేకపోయినా `లెక్కలేనితనం` ఆమె సినిమా భవిష్యత్తును దెబ్బతీసిందని చెబుతారు. నిర్మాతల నుంచి సాటి కళాకారుల వరకు అదేతీరు. అనంతర కాలంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడుగా ఎదిగిన సాలూరి రాజేశ్వరరావు అనుభవమే ఒక  ఉదాహరణ. ఇరవై ఏళ్లు కూడా నిండని ఆయన `ఇల్లాలు` సినిమాకు సంగీత దర్శకత్వం వహించగా, `ఆ కుర్రాడు పాట నేర్పిస్తే నేను పాడలా? కుదరదు. వెంటనే ఆయన్ని మార్చేయండి`అని  పట్టుబట్టగా గూడవల్లి నచ్చచెప్పారట. ఆ తర్వాత తొలి  జానపద చిత్రంగా చెప్పే `బాలనాగమ్మ`చిత్రానికి సంగీత దర్శకుడు సాలూరి అందులో ఆమె కుమారుడు (బాలవర్ధి)గా వేయవలసి వచ్చింది. `అంత పెద్ద కుర్రాడు నా కుమారుడిగా వేయడం ఏమిటి?` అని అభ్యంతరం పెట్టడంతో ఆయనను తప్పించి విశ్వం అనే కుర్రవాడిని తీసుకున్నారు. ఇలా పలు సందర్భాలలో తన మాట, తన ఇష్టమే  చెల్లాలనే పట్టుదల వికటించింది. ఈ చిత్రంతోనే  ఆమె నటజీవితానికి తెరపడింది. చిత్రనిర్మాత వాసన్ తో గొడవ పడడం, ఇద్దరూ పంతాలకు పోవడంతో  ఆమె వెండితెర జీవితానికి ముగింపు పలికి నట్లయింది. ఆమె నటించిన `పెంకిపెళ్లాం` విడుదలకు నోచలేదు. ప్రముఖ  రచయిత త్రిపురనేని గోపీచంద్ ఆమె ప్రధాన పాత్రధారిగా  ప్రకటించిన `అనాథ బాల` చిత్రం కార్యరూపం దాల్చలేదు. ఆమె మిత్రురాలు,నిర్మాత లక్ష్మీరాజ్యం తమ చిత్రం `నర్తనశాల`లో వేషం వేయించారు. `అప్పటికే  కాంచనమాల ఏదో లోకంలో ఉన్నట్లుండేది. ఏదైనా అడిగితే అస్పష్ట సమాధానమే వచ్చేది. మేము కలసి నటించిన రోజులను గుర్తు చేసినా స్పందన ఉండేది కాదు` అని లక్ష్మీరాజ్యం,  ఆ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు పత్రికలు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు. `మంచి స్థాయిలో ఉన్పప్పుడు తోటి నటీనటులతో మాట్లాడేది కాదు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేది. ఇప్పుడు సహజంగానే మాట్లాడలేకపొతోంది` అని లక్షీరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారట. వాస్తవానికి `ఇల్లాలు` చిత్రంలో నాయిక పాత్రధారణ, నటన విషయంలో  కాంచనమాల, లక్ష్మీరాజ్యం మధ్య అభిప్రాయభేదాలు వచ్చినా తరువాత ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ కారణంగానే కష్టాల్లో ఉన్న మిత్రురాలిని ఆదు కునేందుకు ప్రయత్నించారు లక్షీరాజ్యం.

నిర్వేదంలో

`బాలనాగమ్మ`తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బయటి  చిత్రాలలో నటించే అవకాశం లేకపోవడంతో ఆమె కళాహృదయం క్షోభిల్లింది. అప్పటి వరకు ఆమె వ్యవహార శైలి ఎలా ఉన్నా, తప్పొప్పులు ఎటు వైపు నుంచి ఉన్నా, ఈ చిత్రం దర్శక నిర్మాతలతో ఏర్పడిన వివాదం దిద్దుకోలేనిదిగా మారింది. `అక్కడ ఎవరో పన్నిన `సినిమా రాజకీయ వల`లో చిక్కుకుపోయి ఆ సంస్థలో కూడా  నటించడానికి లేకుండా పోయింది. కళాతృష్ణ, ఆశ, తపనలను బలవంతాన అణచడంతో  ఆ బేల హృదయం తల్లడిల్లింది. ఆమె మతి గతి తప్పి ఉన్మత్తురాలై పోయింది. భర్తమరణం, నా అన్నవారు లేకపోవడం నిరాశ నిస్పృహల  మధ్య కొట్లాడి శుష్కించిపోయింది `అని దివంగత రచయిత, నటుడు రావి కొండలరావు ఒక సందర్భంలో వ్యాఖ్యా నించారు.

విశాలనేత్రాలు

`ఆంధ్రా ప్యారిస్` తెనాలిలో 1917 మార్చి 5న పుట్టి కళా రంగంలో తక్కువ సమయంలో ఎక్కువ గ్లామర్ సంపాదించి, నాటి ప్రేక్షకులకు `కలల రాణి`గా నిలిచి, వేలాది మంది అభిమానులను వివశులను చేసిన కళ్లలో పిచ్చి చూపులే మిగిలాయి. వసివాడిన ఆ `విశాలనేత్రాలు` 1981 జనవరి 24న  శాశ్వతంగా మూతపడ్డాయి. 

( జనవరి 24న కాంచనమాల వర్థంతి)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                

Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles