Friday, March 29, 2024

‘‘మేం చదువుకోవాలి’’ అంటూ నినదించిన కమలా భాసిన్

ప్రముఖ స్త్రీవాద కవయిత్రి, రచయిత్రి, కళాకారిణి, కార్యకర్త కమలా భాసిన్ (24 ఏప్రిల్ 1946 – 25 సెప్టెంబర్ 2021) తన జీవిత కాలమంతా లింగ సమానత్వం కోసం పోరాడారు. ‘‘అండర్ స్టాండింగ్ జండర్’’. ‘‘విమెన్ అండ్ మీడియా’’, ‘‘బ్రేకింగ్ బారియర్స్’’, టువర్డ్స్ ఎంపవర్ మెంట్’’ వంటి 35 గ్రంథాలు ప్రకటించారు. అందులో పిల్లల కోసం రాసినవి 12 ఉన్నాయి. రాజస్థాన్ యూనివర్శిటీలో, జర్మనీలోని మ్యూనెస్టర్ యూనివర్శిటీలోనూ విద్యాభ్యాసం చేశారు. 1976-2001 మధ్య కాలంలో ఫుడ్ అండ్  అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ (ఎఫ్ఏవో)లో పదవీ బాధ్యతలు నిర్వహించారు.

కమలా భాసిన్, ఆమె రాసిన హిందీ పుస్తకం ‘‘మై లిఖ్ నా సీఖ్ రహీహూ తాకీ అప్నీ కిస్మత్ ఖుద్ లిఖ్ సకే

లింగ సమానత్వంకోసం, మహిళల హక్కుల కోసం సంఘర్షించిన కమలా భాసిన్ దక్షిణ ఆసియా దేశాలన్నింటినీ ప్రభావితం చేశారు. ‘‘మేం చదువుకోవాలి’’ అనే ఈ కింది కవిత కమలా భాసిన్ పిల్లల కోసం రాశారు. కానీ పెద్దలక్కూడా విపరీతంగా నచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందింది. శనివారం తెల్లవారుఝామున (25 సెప్టెంబర్) దిల్లీలోని ఒక ఆసుపత్రిలో కేన్సర్ తో కన్నుమూసిన ఆ హక్కుల నేతకు నివాళులర్పిస్తూ – తెలుగు పాఠకుల కోసం ఆమె కవితను అందిస్తున్నాను.

మేం చదువుకోవాలి!

అమ్మాయిలం కాబట్టే  చదువుకోవాలి!

చదువుకోవాలి!

మాలో బుద్ధి కుశలత వికసించాలి గనక,

చదువుకోవాలి!

స్వప్నాలు మా వయసు ముంగిట ఆడుతున్నాయి గనక,

ఛదువుకోవాలి!

ఊదో సాధించాలన్న పట్టుదల వచ్చింది గనక,

చదువుకోవాలి!

మేం అమ్మాయిలం కాబట్టే – చదువుకోవాలి!

ఏ ఆధారమూ లేక ఈ ఇల్లూ ఆ ఇల్లూ తిరగదల్చుకోలేదు గనక,

చదువుకోవాలి!

మా కాళ్ళమీద మేం నడవాలనుకుంటున్నాం గనక,

చదువుకోవాలి!

మేం మా బిడియాలతో,  భయాలతో పోరాడాలి గనక,

చదువుకోవాలి!

మేం అమ్మాయిలం కాబట్టే చదువుకోవాలి!

హింసల నుండి పరాభవాల నుండి

మమ్మల్ని మేం రక్షించుకోవాలి గనక, చదువుకోవాలి!

చట్టాన్ని, న్యాయాన్ని విజ్ఞతతో అర్థం చేసుకోవాలి గనక, చదువుకోవాలి!

కొత్త ఆలోచనలు, కొత్త విధివిధానాలు రూపొందించుకోవాలి గనక,

చదువుకోవాలి!

కుళ్ళిపోయి ఉన్న ఈ వ్యవస్థను మార్చుకోవాలి గనక,

చదువుకోవాలి! మేం అమ్మాయిలం కాబట్టే చదువుకోవాలి!

బుద్ధిజీవులతో చర్చించాల్సి ఉంది గనక,

అంధభక్తులు పాడిన భజనల సారాంశం తెలుసుకోవాలి గనుక,

వాటి శ్రుతులూ, రాగాలూ, భావాలూ, అర్థాలూ

అన్నీ – మార్చుకోవాల్సి ఉంది గనుకే….చదువుకోవాలి!

ఇది నిరక్షరాస్యుల కాలం కాదు గనకే చదువుకోవాలి!

మేం అమ్మాయిలం కాబట్టే – చదువుకోవాలి!

శతాబ్దాల దుమ్మూ, ధూళీ ఊడ్చేయడానికైనా…

చదువుకోవాలి!

స్త్రీజాతి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలంటే చదువుకోవాలి!

ఒప్పేదో, తప్పేదో తెలుసుకోవడానికైనా చదువుకోవాలి!

స్త్రీలు ఏ ప్రపంచానికి చెందుతారో

ఆ ప్రపంచాన్ని – రూపొందించుకోవడానికి

చదువుకోవాలి! మేం అమ్మాయిలం కాబట్టే

చదువుకోవాలి! అవునవును – అమ్మాయిలం కాబట్టే

చదువుకోక తప్పదు – వివేకం పెంచుకోక తప్పదు-

మూలం : కమలా భాసిన్

స్వేచ్ఛానువాదం: డాక్టర్ దేవరాజు మహారాజు

కమలా భాసిన్ హిందీ లో రాసిన రెండు పుస్తకాలు: మై పఢ్ నా సీఖ్ రహీహూ తాకీ జిందగీ కో పఢ్ సకే, మై హిసాబ్ సీఖ్ రహీహూ తాకీ అప్నే అధికారోంకా భీ హిసాబ్ లే సకూం

Also read: ఇండియాపై అభిమానం చూపిన బ్రాడ్లా

Also read: నిజం బతికే రోజు రావాలి!

Also read: నిజాం దుష్టపాలన అంతమైన రోజు

Also read: వైజ్ఞానిక స్పృహకోసం ఒక రోజు – 20 ఆగస్టు

Also read: నెహ్రూ ఆత్మకథ చదివి పొంగిపోయిన రవీంద్రుడు

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

  1. World will not progress with out educated females it is a It need of worlds and primery human right
    A good article ,transaction

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles