Friday, June 21, 2024

చర్చ లేకుండా బిల్లుల ఆమోదం: రాజ్యాంగ సూక్ష్మాన్ని గుర్తు చేసిన ప్రధాన న్యాయమూర్తి

స్వాతంత్ర్య దినోత్సవంనాడు, ఆగస్టు 15న, బార్ కౌన్సిల్ లో ప్రసంగిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ చాలా ధైర్యంగా సకాలంలో ఒక ముఖ్యమైన అంశాన్ని జాతికి గుర్తు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. కొన్ని మీడియా సంస్థలు జస్టిస్ రమణ ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా చిత్రిస్తున్నాయి కానీ పార్లమెంటు పని చేస్తున్న తీరు పట్ల సాధారణ ప్రజానీకంలో ఆందోళనకే కాకుండా ఇటీవల ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వెలిబుచ్చిన ఆవేదనకు కూడా ప్రధాన న్యాయమూర్తి అక్షర రూపం ఇచ్చారు. చట్టసభలలో చర్చ లేకుండా శాసనాలను చేయడం అనే దుస్థితినీ, దేశం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులనూ ఆయన సూచనమాత్రంగా ప్రస్తావించారు. లోగడ ఆయన స్థానంలో ఉన్నవారు కొందరు అదే పని చేశారు.

Also read: జనాభా విధానం ఎన్నికల హెచ్చరికా? ఎన్నికల వాగ్దానమా?

పార్లమెంటులో, అసెంబ్లీలలో ప్రభుత్వ విధానాలపైన చర్చ లేకుండానే చట్టాలు చేయడం ప్రధాన న్యాయమూర్తి దేశవాసులకు గుర్తు చేసిన అంశాలలో ఒకటి. చర్చ లేకుండా, సభ అల్లరిగా, అస్తవ్యస్తంగా, గందరగోళంగా ఉన్న దశలో బిల్లులు ఆమోదించడంలోని ప్రమాదాల గురించి జస్టిస్ రమణ కంటే ముందు ఎవ్వరూ ఇటీవలి కాలంలో మాట్లాడలేదు. దీనివల్ల చట్టాలలో అస్పష్టత చోటుచేసుకుంటున్నదనీ, అటువంటి చట్టాల విషయంలో కోర్టులలో కేసులు పెరుగుతున్నాయనీ, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయనీ జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. న్యాయసేవలు విపరీతమైన ఖర్చుతో కూడినవిగా తయారైనాయనీ, ఈ విషయంలో న్యాయవాదులు ఆలోచించి ఏదైనా సకారాత్మకంగా చేయవలసి ఉంటుందని కూడా జస్టిస్ రమణ తన ప్రసంగంలో గుర్తు చేశారు. ప్రజలపట్ల కర్తవ్యనిర్వహణకు సంబంధించిన స్పృహ (స్పిరిట్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ)న్యాయవాదులలో పెరగాలని అన్నారు. న్యాయమూర్తులు చేస్తున్న పని గురించి ప్రజలకు తెలియజేయడం కూడా అవసరమని అన్నారు. ఎంపీల, ఎంఎల్ఏల పని గురించి ఇదివరకు ఎవరైనా ఈ విధంగా వ్యాఖ్యానించారా?

సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏమన్నారు?

పార్లమెంటు కేవలం చట్టాలు చేయడానికే పరిమితం కాదనీ, చర్చ జరపడం కూడా చట్టసభల బాధ్యత అనీ అరవై సంవత్సరాల క్రితమే భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. నిజానికి, చట్టాలు చేయడానికీ, చర్చ జరపడానికి మధ్య సమతౌల్యాన్ని పాటించాలని ఆయన అన్నారు. రాజ్యసభ అధ్యక్షుడిగా పని చేసిన తర్వాత, రెండవ రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ముందు ఆయన దూరదృష్టితో ఆ విధంగా మాట్లాడారు. గొప్ప తత్వవేత్త అయిన తొలి ఉపరాష్ట్రపతి పుట్టిపెరిగిన ప్రాంతం నుంచే ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రావడం కాకతాళీయం. తన అనుభవాన్ని, అవగాహనను పురస్కరించుకొని సభ నడుస్తున్న తీరు గురించి వెంకయ్యనాయుడు కూడా వ్యాఖ్యానం చేశారు.  రాజ్యసభకు  రెండేళ్ళకు పైగా అధ్యక్షత వహిస్తున్న వెంకయ్యనాయుడు సభ చర్చలలో సభ్యులు ఏమేరకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారో, పార్లమెంటరీ సంఘాల సమావేశాలలో వారి హాజరు ఏమాత్రం ఉన్నదో అనే అంశాలపైన తన ఆవేదనను పంచుకునే విషయంలో చాలా నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నారు.

Also read: ప్రాథమి విద్యను ప్రోత్సహిస్తున్నామా? పాడుచేస్తున్నామా?

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యాలను న్యాయవ్యవస్థ దూకుడుతనంగా అర్థం చేసుకోకూడదు. రాజ్యాంగంలో ఇమిడి ఉన్న విశేషమైన లక్షణాన్ని గుర్తు చేయడంగానే భావించాలి. రాజ్యవ్యవస్థకు రెండు మూలస్తంభాలైన చట్టసభలూ (లెజిస్లేచర్), న్యాయవ్యవస్థ (జుడిషియరీ) మధ్య చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ (ఒకదానిపై ఒకదానికి అదుపు, ఒకదానితో మరొకటి సమతుల్యంగా ఉండే విధానం) సూత్రాన్ని గుర్తు చేయడంగా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను పరిగణించాలి. ఉదాహరణకు ట్రిబ్యూనళ్ళ సంస్కరణలు చెల్లవని సుప్రీంకోర్టు అప్పటికే నిర్ణయించిన తర్వాత ట్రిబ్యూనళ్ల సంస్కరణల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి? దీనిని న్యాయవ్యవస్థపైన చట్టసభలు స్వారీ చేసినట్టు బావించవచ్చును కదా అని సుప్రీంకోర్టు అనుకోవచ్చు. రెండు అంశాలనూ ప్రజాస్వామ్యంలో ఆరోగ్యప్రదమైన లక్షణాలుగా పరిగణించవచ్చు.

‘రిజువనేటింగ్ ద రిపబ్లిక్’ (గణతంత్రాన్ని పునరుద్దీపింపజేయడం) అనే టైటిల్ తో వచ్చే నెల  విడుదల కాబోతున్న నా పుస్తకంలో ఇటువంటి అంశాలను వివరంగా చర్చించాను. చట్ట సభలలో చర్చ జరగకుండా, పౌరసమాజం చర్చించకుండా ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందడం వల్ల ప్రగతి, ప్రజాస్వామ్యం, పరిపాలన ఏ విధంగా దెబ్బతింటూ ప్రజల అభిప్రాయాలలో అయోమయం ఎట్లా సృష్టిస్తున్నాయో వివరించాను. నేను రాసిన మరో పుస్తకం ‘ ద థర్డ్ ఐ ఆఫ్ గవర్నెన్స్’ (పరిపాలన వ్యవస్థ మూడో నేత్రం)లో పరిశోధన, విశ్లేషణ లేకుండా, విధాన నిర్ణయ తీరుతెన్నుల గురించి ఇతరులతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం లేకుండా ప్రభుత్వాలు ఎట్లా చిత్తం వచ్చినట్టు పని చేస్తున్నాయో వివరించాను. అటువంటి ధోరణులు ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య ప్రమాణాల పతనాన్ని సూచిస్తాయి. కార్యక్రమాల అమలు తీరును ప్రభావితం చేస్తాయి. ఎన్నో రాజ్యాంగ సవరణలూ, కోర్టు కేసులూ, ప్రజాప్రయోజన వ్యాజ్యాలూ, ఫిర్యాదులూ వగైరా అవసరం అవుతాయి.

విధిగా చదువవలసిన రెండు నారిమన్ పుస్తకాలు

పోయినవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రొహిన్టన్ ఫాలీ నారిమన్ పదవీ విరమణ సుప్రీంకోర్టుకు మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థపైన ఆశలు పెట్టుకున్నవారందరికీ తీరని నష్టం. నారిమన్ వీడ్కోలు సభలో ప్రదాన న్యాయమూర్తి చక్కగా చెప్పినట్టు న్యాయవ్యవస్థకు కాపలాకాస్తున్న సింహాలలో ఒకటి విరమించుకుంటున్నది. సమాచార సాంకేతిక (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ) చట్టానికి సవరణను కొట్టివేస్తూ నారిమన్ ఇటీవల ఇచ్చిన తీర్పు ఆయన సాహసానికీ, సంస్కారానికీ, ప్రజాస్వామ్యం పట్ల ఆదరణకూ నిదర్శనం. సుప్రీంకోర్టులో ఏడేళ్ళు న్యాయమూర్తిగా పని చేసి 13,565 కేసులు పరిష్కరించారు. దేశ న్యాయస్పృహ పైన తన ముద్ర వేశారు. హేతుబద్ధమైన తీర్పులు ఇవ్వడంలో ఆదర్శంగా నిలిచిన నారిమన్ అంటే దేశంలో అపారమైన గౌరవం ఉంది. ఎందరికో ఆయన వ్యక్తిత్వం స్ఫూర్తినిస్తుంది. అద్భుతమైన, ప్రతిభావంతమైన న్యాయనిపుణుడు ఆయన. వస్తునిష్టంగా, విశ్లేషణాత్మకంగా విషయాలను ఎట్లా పరిశీలించాలో అందరికీ నేర్పిన వ్యక్తిగా ఆయనను పరిగణించవచ్చు. ఆయన తండ్రి, అత్యంత ప్రతిభావంతుడైన న్యాయవాది ఫాలీ నారిమన్ తో పరిచయభాగ్యం నాకున్నది. దేశంలో వేళ్ళూనుకుంటున్న నిరంకుశ దోరణుల పట్ల, మెజారిటీవాదం పట్ల ఇద్దరూ అభ్యంతరాలు ప్రస్ఫుటంగా వెలిబుచ్చారు. ‘డిస్కార్డెంట్ నోట్స్,’ ‘ది వాయిస్ ఆప్ డిసెంట్ ఇన్ ద లాస్ట్ కోర్ట్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్’ అనే టైటిల్స్ తో వచ్చిన రెండు పుస్తకాలూ దశాబ్దాలుగా ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ నిర్వహించి పాత్ర ఔన్నత్యాన్నితెలుపుతాయి. ప్రజాస్వామ్యప్రియులందరూ చదవదగిన పుస్తకాలు.  

Also read: మనదేశంలో గాంధీజీ ఆదర్శాలు వేళ్ళూనుకున్నాయా?

Dr. N. Bhaskara Rao
Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles