Friday, March 29, 2024

ప్రజల కోసం పాత్రికేయం

(ప్రమాణాలు – ప్రభావాలు)

“అన్ని ఉద్యమములకూ విలేఖరులు ప్రాణమువంటి వారు. ఏ దేశముకైనను, ఉద్యమముకైనను ప్రాణము లేఖకులే. వారి రాతలను చదివియే వక్తలు ఉపన్యసించు చుందురు. వారి గ్రంథాలు పఠించియే యువత, బాలురు విద్యావంతులు అగుచుందురు. వారి బోధల నాలకించియే సంఘములు సంస్కరింప బడుచుండును. లేఖకుల తోడ్పాటు లేనిదే ప్రపంచములోనే ఏ ఉద్యమమూ ఇంతవరకు విజృంభించలేదు. ఇక ముందు విజృంభించబోదు..!”

సరిగ్గా 85 ఏళ్ళ క్రితం కేశవరంలో జరిగిన అభ్యుదయ రచయితల మహాసభలో గరిమెళ్ళ సత్యనారాయణ గారు తన ప్రసంగంలో చెప్పిన వాక్యాలివి. ఈ చిరు సంకలనానికి ఒక విధంగా ప్రేరణ వాక్కు ల్లాంటివి. జీవితాంతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కృషి చేసిన మేకా సత్యనారాయణ శాస్త్రి @ బాంబు  జయంతి సందర్భంగా, కలం యోధుడు గణేష్ శంకర్ విద్యార్థి స్థాపించిన చారిత్రక పత్రిక “ప్రతాప్” కి 110 ఏళ్ళు పూర్తైన సందర్భంగా, సోషలిస్టు నాయకుడు, ప్రజాపాత్రికేయుడు శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య గారికి అంకితం ఇవ్వబడ్డ ఈ సంకలనం చిరుయత్నం!

“సాహిత్యం సమాజానికి దర్పణం పట్టాలి. ఆ సమాజ ఆర్థిక వ్యవస్థ నుండి ఉద్భ విస్తున్న వైరుధ్యాలను, వైవిధ్యాలను, అసమానతలను అసహజత్వాలను, రుగ్మతలను సునిశితంగా పరిశీలించి, వాటి అభివృద్ధినిరోధకత్వాన్నీ, తిరోగమనాన్నీ ఎత్తిచూపుతూ, ఉన్నతమైన మానవ సంబంధాలకూ, సృజనాత్మక శక్తికీ, వర్గ చైతన్యానికీ, వర్గ దృక్పథానికి సుగమం చేసే దిశలో సాహిత్యం కృషి చేయాలి. అది సమాజం లో సమస్యలను కేవలం ఎత్తి చూపడమే కాకుండా, వాట్ని తవ్వుకుంటూ లోపలకిపోయి అట్టడుగు భాగాన ఉన్న వాటి కారణాలనూ, మూలాల్ని పరిశోధించే సాహిత్యమే సమాజ అభ్యున్నతిని ఆశిస్తుంది.”

అయికా బాలాజీ

ముందడుగు పత్రిక, కోల్కతా

“మీడియా ప్రశ్నించే శక్తిని కోల్పోతోంది. వస్తునిష్టంగా రాసే, చూపించే స్వేచ్ఛ ఉండటం లేదు. రాజకీయ పార్టీల ప్రమేయం పెరుగు తోంది. రాజకీయ నేతలతో మీడియా సంస్థల అధిపతులు మమేకం కావడం మితిమీరి పోతోంది. మీడియా యాజమాన్యం కార్పోరేట్ హస్తగతం అవుతోంది. అందుకు తగినట్టుగానే చాలా మంది జర్నలిస్టులు యజమానులు నడిచిన బాటలోనే వారి అడుగులకు మడుగులొత్తుతూనే నడుస్తున్నారు. ఆత్మ ప్రబోధం వల్లనో, ఆత్మగౌరవం వల్లనో ఆ విధంగా నడవలేపోతే వైదొలగుతున్నారు. మీడియాకు దూరంగా జరుగుతున్నారు. ఒక పత్రిక లేదా ఒక టీవీ ఛానల్ లేదా వెబ్సైట్ సంపూర్ణంగా సర్వదా ప్రజల పక్షాన నిలిచి పోరాడాలంటే ఈ రోజుల్లో అది సాధ్యం కాకపోయినా, ప్రజలకు ఎంతోకొంత మేలు చేసే అవకాశం ఇప్పటికీ ఉంది.”

కె. రామచంద్రమూర్తి

సకలం వెబ్ పత్రిక, హైదరాబాదు

“భుజాన సంచి, జేబులో పెన్ను, చేతిలో పుస్తకం, కళ్ళజోడుతో సమస్యలపై ఆవేదనతో కూడిన ముఖ కవళికలతో ప్రతిక్షణం హడావుడిగా సంచరించే మంచి మనసున్న మనిషి జర్నలిస్టు. ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకూ మానవ సమాజ స్థితిగతులు, రూపురేఖల పై అవగాహనతో వ్యవహరించే వ్యక్తి జర్నలిస్టు. ప్రతి పరిణామం పైనా క్షేత్ర స్థాయి సమాచారాన్ని సేకరించి, మస్తిష్క మధనంతో అక్షరీకరించే నిరంతర సమాచార చైతన్య స్రవంతి జర్నలిస్టు…”

పి. లెనిన్ బాబు

జర్నలిస్టు, అంగర

“నియంతృత్వ పెట్టుబడి దారుల పత్రికలు పాత్రికేయ రంగంలో పక్కా వ్యాపార, లాభార్జనా ధోరణి జొప్పించాయి. భారత స్వాతంత్ర్య సంగ్రామం నాడే ఈ వ్యాపార ధోరణి మొదలు అయిందనీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోఅర్థం అవుతుంది. బహిష్ర్కూతభారత్, ప్రబుద్ద భారత్, మూక్ నాయక్ వంటి ప్రజా ప్రయోజన పత్రికలు నడిపిన ఆయన ఒకచోట, ‘భారతదేశంలో జర్నలిజం ఒకనాడు వృత్తి; నేడది వ్యాపారం.’ అంటారు.”

మాకా రాజేంద్రన్

సామాజిక కార్యకర్త, రావులపాలెం

“1947 ఆగష్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి నెలలోనే (సెప్టెంబరు 21) గాంధీ మహాత్ముడు పత్రికల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశాడు. పత్రికలు స్వేచ్ఛ కలిగుండటం అంటే, ప్రజల మనస్సులను విషపూరితం చేసే లైసెన్స్ ఉన్నదనా? అని ప్రశ్నించారు  ఒక సందర్భంలో. అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర నామమాత్రం. సోషల్ మీడియా లేదు. కానీ, గాడి తప్పిన పత్రికలు ఉన్నాయని అర్థమవుతుంది…”

నల్లి ధర్మారావు

  పత్రకారులు, శ్రీకాకుళం

“ఎలక్ట్రానిక్ మీడియా బలమైన మాధ్యమం. ఇంట ర్వ్యూలకు, రాజకీయ విశ్లేషణ లకు సరైన వేదిక యూట్యూబే అనటంలోఎలాటి సందేహం  ఉండాల్సిన అవసరం లేదు. ఒక వార్తా పత్రికలో వార్త ప్రచురించ బడాలంటే అదెన్నో కోతలకు గురికావలసిందే. అందులోనూ, ఆ వార్త ఆరోజు వెలువడదు. మరుసటిరోజు మాత్రమే ప్రచురించ బడుతుంది, వేగవంతమైన జీవితంలో వార్తల ప్రసారం కూడా వేగంగా జరిగితే దానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ నేపథ్యం ఒక్క యూట్యూబ్ ఛానల్స్ కే ఉంది.”

కలందర్

రాయలసీమ మహాసభ, ప్రొద్దుటూరు

“ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాలలో చిన్న పత్రికల పాత్ర గణనీయంగా ఉంది. ముఖ్యంగా అనేక స్థానిక సమస్యలను, వివక్షలను ప్రశ్నించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని అంతర్జాల సామాజిక వేదికలు, టెలిగ్రామ్, వాట్సప్ గ్రూపులు, ఫేస్‌బుక్ గ్రూపులు భావసారూప్యత ఉన్న ఎక్కడెక్కడి వారినో ఒక్క చోటికి చేర్చి వారందరి మధ్యనా పరస్పర అవగాహన పెంచడానికి, ప్రజాపక్షంగా ఉండి ఉద్యమ కార్యాచరణకు దోహదం చేస్తున్నాయి.”

అనిశెట్టి సాయికుమార్

జర్నలిస్టు, హైదరాబాద్

“అక్షరం కొందరికి ఉపయోగకరం, మరికొందరికి ప్రయోజనకరం. కావాలనే ఒక లక్ష్య శుద్ధితో పాత్రికేయ వృత్తిలోకి ప్రస్థానమైంది. అక్షరాల్ని చుట్టుకొన్న సమాజం నుంచి అక్షరాలు వెలిగించే సమాజం కోసం కష్టించి శ్రమించి ఉద్యమించిన పాత్రికేయ వృత్తిని నిబద్ధతతో, స్పూర్తితో ఈ రంగంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, కానీ అనివార్యం. అవసరం ఐన నేపథ్యం.”

పి. యస్. రవికాంత్

అడుగుజాడ పత్రిక

“జర్నలిజం ద్వారా వాస్తవాల్ని అందించాలని అనుకుంటే, జీవితం మొత్తం కేసుల మధ్య లేక ఆ జర్నలిస్టే కనుమరుగయ్యే స్థితిలో ప్రస్తుత జర్నలిజం ఉంది..”

స్టాలిన్

ఫ్రెండ్స్ న్యూస్ ఏజన్సీ, పిఠాపురం

 అనేక సంక్షోభాల మధ్య తీసుకువస్తున్న ఈ అక్షరకృతి ఆసక్తి ఉన్న మిత్రుల కోసం  సాఫ్ట్ కాపీ పంపుతున్నాను. ప్రత్యామ్నాయ పాత్రికేయుడిగా జీవించిన మేకా సత్య నారాయణ శాస్త్రి @ బాంబు కి స్మారక వేదిక తరపున రూపొందిన దీని మున్నుడిలో పేర్కొన్నట్లు” ఇది చదివిన గుప్పెడు మంది కొత్తతరం యువజనులు ప్రజల కోసం పాత్రికేయ జీవితంలోకి ప్రవేశించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నా, ఈ చిన్న పనికి అపారమైన సార్ధకత చేకూరినట్లే భావిస్తాము. ఎందుకనేది స్పష్టమే, జ్ఞానాన్ని ఎదుర్కునే ధనమూ, ధైర్యమూ ఇంకా పుట్టలేదు. బహుశా, ఎప్పటికీ పుట్టలేవు! సెలవు.”

– గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles