Tuesday, September 26, 2023

బీజేపీలోకి జానారెడ్డి ?

• జానారెడ్డితో టీఆర్ఎస్, బీజేపీ మంతనాలు
• రఘువీర్ తో టచ్ ఉన్న బీజేపీ నేతలు
• నోరుమెదపని జానారెడ్డి

జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కూడా రాష్ట్రంలో రాజకీయ వేడి ఆరని కుంపటిలా రగులుతూనే ఉంది. దుబ్బాక ఉప ఎన్నికతో మొదలైన వేడి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తారాస్థాయికి చేరింది. తాజాగా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ లు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పై దృష్టిపెట్టాయి. దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో విజయంద్వారా ఊపుమీదున్న బీజేపీ రాష్ట్రంలో జరిగే ప్రతిఎన్నికలోనూ బీజేపీ ఇదే హవా కొనసాగిస్తుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు నాగార్జున సాగర్ లో పెద్దగా బలం లేకపోయినప్పటికీ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి సమయమున్న ఇరు పక్షాలు ఇప్పటి నుండే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.

నాగార్జున సాగర్ లో బలమైన నేత జానారెడ్డి
నాగార్జున సాగర్లో గత 35 ఏళ్లుగా బలమైన నేతగా ఉన్న కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డిపై బీజేపీ దృష్టి సారించింది. ఆయనను బీజేపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం కేరళ వెళ్లిన జానారెడ్డి రేపు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. చర్చల తర్వాత ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి ఆయన వారసుడిగా కుమారుడు రఘవీర్ రెడ్డిని రాజకీయాలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తన సత్తా చూపించిన బీజేపీ రఘువీర్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రఘువీర్ రెడ్డికి తండ్రి జానారెడ్డి పచ్చజెండా ఊపితే బీజేపీలో చేరి నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

జానారెడ్డితో టీఆర్ఎస్ సంప్రదింపులు
మరోవైపు జానారెడ్డిని తమ పార్టీలోకి రప్పించేందుకు టీఆర్ఎస్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కు, పార్టీ అధినేత కేసీఆర్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో జానారెడ్డి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జానారెడ్డి టీఆర్ఎస్ లో జాయిన్ కాకపోతే బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీకి ఒకటే అవకాశం కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత నోముల నర్శింహయ్య కుమారుడు భరత్ కి టికెట్ ఇచ్చి సానుభూతి ఓటుతో గట్టెక్కడం ఒకటే మార్గం ఉంది. అయితే మారుతున్న రాజకీయాల నేపథ్యంలో సానుభూతి ఓటుతో విజయం సాధించాలంటే అంత తేలికైన వ్యవహారం కాదు.

ఊహాగానాలను ఖండించిన రఘువీర్ రెడ్డి
రఘువీర్ రెడ్డిని బీజేపీ నేతలు కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సామాజిక మాధ్యమాలలో విపరీత ప్రచారం జరిగింది. రఘువీర్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై సమాధానం చెప్పేందుకు ఆయన సుముఖత చూపలేదు. అయితే దీనిపై రఘువీర్ రెడ్డి స్పందిస్తూ నోముల నర్శింహయ్య వర్థంతి కార్యక్రమాలు జరిగే వరకు రాజకీయాలు మాట్లాడవద్దని సున్నితంగా తిరస్కరించారు. కొన్ని పార్టీలు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.

అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం జానారెడ్డిని ఎన్నికల బరిలో దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో జానారెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విజయంతో పార్టీ పునర్ వైభవం సంతరించుకుటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles