Wednesday, April 24, 2024

అసంతృప్తులందరికీ పదవులు … మళ్లీ అధికారంలోకి తెస్తారా?!

వోలేటి దివాకర్

ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్సిపి ఎమ్మెల్యేలు , చెప్పుకోదగిన నాయకులందరికీ పదవులు లభించాయి . మొన్నటి మంత్రివర్గంలో తాజాగా ప్రాంతీయ కోఆర్డినేటర్లు , జిల్లా అధ్యక్షుల నియామకంతో వై సిపి నాయకులందర్నీ సంతోష పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నించారు . ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చెరుకువాడ శ్రీరంగనాధరాజు వంటి సీనియర్లు పదవులు కోల్పోయారు. అలాంటి వారిని కూడా తాజా పదవుల పంపకంతో సంతృప్తి పరిచేందుకు జగన్ ప్రయత్నించారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన గొల్ల బాబూరావు, కొలుసు పార్థసారధి, సామినేని ఉదయ భాసు, శిల్పా చక్రపాణిలకు పార్టీ బాధ్యతలు కూడా అప్పగించకపోవడం గమనార్హం.

మొన్నటి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కరణం ధర్మశ్రీ, జక్కంపూడి రాజా తదితరులు పదవులను ఆశించి నిరాశకు గురయ్యారు. ఇప్పుడు వారందరికీ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మంత్రి పదవులు కోల్పోయిన మేకతోటి సుచరిత , బాలినేని శ్రీనివాస్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, పేర్ని నాని, ఆళ్ల నాని, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పాముల పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్ కు తాజా పందేరంలో పదవులు లభించాయి. అయితే, జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు, అనిల్ కుమార్ యాదవ్ కు వైఎస్సార్, తిరుపతి జిల్లాలు, కొడాలి నానికి గుంటూరు, పల్నాడు జిల్లాల కోఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించారు. మిగిలిన అసంతృప్తులను ఆయా జిల్లాలకే పరిమితం చేశారు. తాజా పదవులతోనైనా అధికార వై ఎస్సార్ సిపిలో అలకలు, అసంతృప్తులు సర్దుకుంటాయా అన్నది వేచి చూడాలి. జగన్ కొత్త టీమ్ 2024 ఎన్నికల్లో తిరిగి పార్టీని విజయపధంలోకి తీసుకుని వస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఆధిపత్యం మాత్రం వారిదే!

జిల్లా , ప్రాంతీయ స్థాయి అధ్యక్షులు , కోఆర్డినేటర్లను నియమించినా వారందర్నీ సమన్వయం చేయాల్సిన బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించడం ఇక్కడ గమనార్హం. జాతీయ స్థాయి పార్టీలో అధికారాలు, ఆధిపత్యం ఢిల్లీ స్థాయిలో ఉంటే … ప్రాంతీయ పార్టీల్లో ఆయా పార్టీల అధిపతులు, వారిబంధువులు,  అనుంగు సహచరులదే. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలు, ప్రజాస్వామ్యం వంటి ఎన్ని మాటలు చెప్పినా  పార్టీ లో అధికారం, ఆధిపత్యం పార్టీ అధినేతదే. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబునాయుడు ఆయన తరువాత కుమారుడికే సర్వాధికారాలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం . టిడిపిలో ఒక సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే . వై ఎస్సార్ సిపిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది . వైసిపిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది . వైసిపిలో జగన్ తరువాత ట్రబుల్ షూటర్ గా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆయనే తీవ్రంగా ప్రయత్నించారు. ఆతరువాత వైసిపిలో జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి, జగన్ కుటుంబ ఆర్థిక సలహాదారుడు ఎంపి విజయసాయిరెడ్డి, జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి వారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles