Tuesday, September 26, 2023

జస్టిస్ రమణపైన సీజేఐకి జగన్ ఫిర్యాదు

  • చీఫ్ జస్టిస్ బాబ్డేకి జగన్ మోహన్ రెడ్డి లేఖ
  • ఆంధ్రప్రదేశ్ లో సంచలనం
  • చరిత్రలో ఇదే ప్రథమం
  • హైకోర్టును జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపణ
  • అన్ని కేసులలోనూ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు
  • అమరావతి భూముల వ్యవహారంపైన దర్యాప్తు నిలిపివేశారు
  • దమ్మాలపాటి ఎఫ్ఐఆర్ వివరాలు ప్రచురించవద్దన్నారు

కె. రామచంద్రమూర్తి

దేశంలో రాజ్యాంగ పాలనా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎన్నడూ జరగని పరిణామం శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సంభవించింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా, మరికొందరు న్యాయమూర్తులపైనా భారత ప్రదాన న్యాయమూర్తి ఎస్. ఏ. బాబ్డేకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వారి తీర్పులన్నీ పక్షపాతంగా ఉన్నాయంటూ ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం శనివారం పొద్దుపోయిన తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలు ఆంధ్రావనినే కాకుండా యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే విధంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణతో కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర హైకోర్టు తటస్థంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలనీ అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తికి 06 అక్టోబర్ 2020న ఎనిమిది పేజీల  లేఖ రాశారు. రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రి లేఖలోని అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలనూ, నిరూపణలనూ భారత ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్టు అజేయ కల్లం చెప్పారు. 1952లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిపైన ఇటువంటి ఆరోపణలు చేయలేదు. ఇదే ప్రథమం.

హైకోర్టుపై ప్రభావం

జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపైన ప్రభావం చూపుతున్నారనీ, కొంతమంది న్యాయమూర్తుల రోస్టర్లు కూడా మార్చే విధంగా తన ప్రభావం వేస్తున్నారనీ జగన్ మోహన్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు. న్యాయమూర్తుల పేర్లూ, కేసుల వివరాలూ వెల్లడించడం సాహసోపేతమైన చర్య. హైకోర్టు వెలువరిస్తున్న తీర్పుల పట్లా, చేస్తున్న  వ్యాఖ్యల పట్లా ప్రభుత్వ ప్రతినిధులు కొంతకాలంగా అభ్యంతరాలు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సారి మీడియా సమావేశంలోనూ, మరొకసారి ట్విట్టర్ ద్వారానూ తన వ్యతిరేకత వెల్లడించారు. వ్యాఖ్యలు చేసే హక్కు తమకు ఉన్నదంటూ ఒక న్యాయమూర్తి బదులు ఇచ్చారు. వ్యాఖ్యలు చేసే బదులు తమ అభిప్రాయాలను తీర్పులలో వెల్లడించాలని సలహాదారు సలహా. వ్యాఖ్యలూ, తీర్పులూ అదే పనిగా ప్రతికూలంగా రావడంతో భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం మినహా   ముఖ్యమంత్రికి మరో మార్గం లేదు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసినప్పటి నుంచీ ఆయనకు హైకోర్టు నుంచి వరుసగా శ్రీముఖాలే అందుతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తులు వెలువరించిన కొన్ని తీర్పులపైన జాతీయ స్థాయి మీడియా ప్రముఖులూ, న్యాయకోవిదులు కూడా విస్మయం వెలిబుచ్చారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు మాయజేస్తున్నారనీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారనీ ప్రజలలో ఒక అభిప్రాయం మాత్రం ఉంది. కానీ న్యాయస్థానాలనూ, న్యాయమూర్తులనూ గౌరవించాలి కనుక ఆ విషయం ఎవ్వరూ బహిరంగంగా చర్చించే సాహసం చేయడం లేదు.

ప్రజలే ప్రభువులు  

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారి పరిపాలన క్రమబద్ధీకరించడానికి రాజ్యాంగాన్ని రాసుకొని అమలులోకి తెచ్చుకొని మన దేశాన్ని భారత రిపబ్లిక్ అని పిలుచుకుంటున్నాం. రాజ్యాంగం కింద ఏర్పడినవే చట్టసభలూ, ప్రభుత్వాలూ, న్యాయస్థానాలూ. చట్టసభలకూ, న్యాయస్థానాలకూ మధ్య స్పర్థలు తలెత్తడం కొత్తకాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైన ఆరోపణలు రావడం కూడా ఇదే ప్రథమం కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసించే ప్రక్రియను కూడా చూశాం. విషయం ముగింపునకు రాకుండానే సదరు న్యాయమూర్తి రాజీనామా సమర్పించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ‘ఈనాడు’ పత్రికాధిపతి రామోజీరావు పైన శాసనమండలి అభిశంసన తీర్మానం పెట్టినప్పుడు  కూడా పత్రికావ్యవస్థకూ, శాసనవ్యవస్థకూ మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. రామోజీరావును అరెస్టు చేయడానికి నాటి పోలీసు ఉన్నతాధికారి విజయరామారావును పంపించారు. అరెస్టు చేయలేదు. సుప్రీంకోర్టు జోక్యంతో వివాదం ముగిసింది. నాటి ఎన్.టి. రామారావు ప్రభుత్వం తటస్థంగా ఉంది. మీడియాకు ప్రత్యేకమైన అధికారాలంటూ రాజ్యాంగంలో లేవు కనుక రక్షణ లేదు. కానీ న్యాయవ్యవస్థకూ, పరిపాలనావ్యవస్థకూ, చట్టసభలకు అధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా శాసనవ్యవస్థకూ, న్యాయవ్యవస్థకూ విశేషాధికారాలు ఉన్నాయి. ఒక వ్యవస్థ మరొక వ్యవస్థతో ఢీకొనకుండా సామరస్యంగా వ్యవహరించాలనీ, పరిపాలన సజావుగా సాగడానికి మూడు వ్యవస్థలూ పరస్పరం సహకరించుకోవాలన్నది రాజ్యాంగ నిర్మాతల అభీష్టం.

అన్ని వ్యవస్థలూ అంతంతమాత్రమే

ఒక వ్యవస్థకైనా, ఒక వ్యక్తికైనా గౌరవం బలవంతంగా ఇవ్వడం సహజంగా ఉండదు. గౌరవాన్ని సంపాదించుకోవాలి. వ్యవస్థ వ్యవహరణ తీరు ఆ వ్యవస్థను ప్రజలు గౌరవించాలో, లేదో నిర్ణయిస్తుంది. చట్టసభలూ, పరిపాలనావ్యవస్థ ఇదివరకటి గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. న్యాయవ్యవస్థ సైతం మినహాయింపుకాదు. మూడు వ్యవస్థలూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. చట్టసభలకు అయిదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజాప్రతినిధుల పరీక్షకు నిలబడాలి. ప్రజలకు ఇష్టం లేకపోతే చట్టసభ సభ్యులను ఓడించవచ్చు. ప్రభుత్వాన్ని నడిపించే అధికారులపైన చట్టసభకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు కొంత పట్టు ఉంటుంది. వారి నడవడికను ప్రజాప్రతినిధులూ, ప్రభుత్వాధినేతలకూ కొంతవరకూ నియంత్రించవచ్చు. న్యాయవ్యవస్థను ప్రజలు ఏమీ చేయలేరు. ప్రభుత్వాలు సైతం జోక్యం చేసుకోజాలవు. ఇటీవల న్యాయమూర్తుల నియామకానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా నియామకాలు జరిపించాలని నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన ప్రయత్నం ఫలించలేదు. సీనియర్ న్యాయమూర్తుల బృందం (కలీజియం) న్యాయమూర్తులను నియమించే ఆచారం కొనసాగుతోంది.

న్యాయవ్యవస్థతో ఢీకొన్న రాజకీయ నాయకులు చరిత్రలో చాలామంది ఉన్నారు. న్యాయవ్యవస్థలో నిర్ణయాలు తమకు అనుకూలంగా జరిగే విధంగా తెలివిగా వ్యవహరించే రాజకీయ నాయకులూ ఉన్నారు. వారిలో అగ్రగణ్యుడు చంద్రబాబునాయుడు. 1996లో పదవీచ్యుతుడైన ఎన్.టి. రామారావుకు పార్టీ ఫండ్ కూడా దక్కకుండా చేయడంలో కానీ, రామారావుని కాదని చంద్రబాబునాయుడికి గవర్నర్ కృష్ణకాంత్ పట్టం కట్టడం సరైన నిర్ణయమేనంటూ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచి తీర్పు ఇచ్చినప్పుడు కానీ చంద్రబాబునాయుడు చక్రం తిప్పారని అందరూ చెప్పుకున్నారు. ఎన్ టి రామారావు స్వయంగా అన్యాపదేశంగా అదే అభిప్రాయం వెలిబుచ్చారు.

ఇందిరాగాంధీ వివాదాస్పద నిర్ణయం

ప్రభుత్వాలకు వ్యతిరేకంగా న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడం స్వతంత్ర భారతంలో పరిపాటే. 1975లో అలహాబాద్ హైకోర్టు నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాయబరేలీ నుంచి ఎన్నిక కావడంలో నిబంధనలు ఉల్లంఘించారని నిర్ణయించి, ఎన్నిక  చెల్లనేరదని తీర్పు ఇచ్చినప్పుడు, పదవి నుంచి వైదొలగి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవలసిన ఇందిరాగాంధీ ఆ పని చేయలేదు. పదవిలో కొనసాగుతూ,సుప్రీంకోర్టు వ్యవస్థను మార్చివేసి దేశంలో ఆత్యయిక పరిస్థితి ప్రకటించి గందరగోళం చేశారు. తన మాట కాదనని న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తిగా నియమింపజేశారు. ఆ విషయం పక్కన పెడితే, న్యాయస్థానాలలో ‘నాట్ బిఫోర్’ నిబంధనను వినియోగించుకోవడంలో కానీ, కేసులపైన ‘స్టే’లు తెచ్చుకోవడంలో కానీ, న్యాయమూర్తి సీబీఐ చేత దర్యాప్తు చేయంచమని ఆదేశించినప్పుడు తమ వద్ద సిబ్బంది లేరని సీబీఐ చేత చెప్పించుకోవడంలో కానీ చంద్రబాబునాయుడి తెలివితేటలు ప్రజలకు  బాగా తెలుసు.

ఆర్ టీసీ బస్ రూట్లు ప్రైవేటీకరించిన వ్యవహారంలో హైకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిన కారణంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత న్యాయస్థానాల తీర్పుల ఫలితంగా పదవి నుంచి వైదొలిగిన ముఖ్యమంత్రులు ఎవ్వరూ లేరు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నేదురుమల్లి జనార్దనరెడ్డి నిర్ణయాన్న కోర్టు ఆక్షేపించినప్పటికీ పార్టీ అధిష్ఠానం ఆదేశించినప్పుడే ఆయన గద్దె దిగారు.

పర్యావరణం అనుమతులు లేకుండా కృష్ణానదీ గర్భంలో నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయడంతోనే జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభమైంది. అక్రమంగా అక్కడే నిర్మించిన తక్కిన కట్టడాలని సైతం కూల్చివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తలబెడితే అది కుదరదని హైకోర్టు మోకాలడ్డింది. అప్పటి నుంచి వైఎస్ ఆర్ ప్రభుత్వంపైన వచ్చిన ప్రతి పిటీషన్ నూ విచారించడం, దాదాపు అన్ని పిటిషన్లపైనా ప్రభుత్వానికి ప్రతికూలంగా తీర్పులు వెలువడడం సర్వసాధారణంగా పరిణమించింది.

న్యాయమూర్తుల ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు

ఈ మధ్య న్యాయమూర్తులు పిటిషన్లను విచారణకు స్వీకరించే దశలోనే ప్రభుత్వంపైన వ్యాఖ్యలు చేయడం గమనించాం. అదే విధంగా శాసనసభాపతి, మంత్రులు న్యాయమూర్తులపైనా, వారి నిర్ణయాలపైనా ప్రతికూలంగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తెలుగుదేశంపార్టీ, వైఎస్ఆర్ సీపీ అభిమానుల  బాహాబాహీ సరేసరి. హద్దుమీరిన వ్యాఖ్యలు కోకొల్లలు. న్యాయవ్యవస్థపైన విమర్శలు కురిపించినవారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు.

అన్ని కేసులలోనూ ప్రభుత్వం వీగిపోవడం వెనుక ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న న్యాయవాదుల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉన్నదనే విమర్శలు కూడా వచ్చాయి. దాదాపు అన్ని కేసులలో ప్రభుత్వం వీగిపోవడం వింతగా కనిపించింది. పదిమంది మరణించిన ఆస్పత్రి ప్రమాదం ఘటనపైన కూడా విచారించవద్దని ఆదేశించడం విశేషం.

అమరావతి భూముల కుంభకోణం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులూ, చేసిన నిర్ణయాలూ వివాదాస్పదమైనవనడంలో సందేహం లేదు. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి జారీ చేసిన ఆదేశం న్యాయవ్యవస్థను పరిశీలిస్తున్నవారికి ఆశ్చర్యం కలిగించింది. శ్రీనివాస్ పదవిలో ఉన్న కాలంలో తనకోసం, తన బంధువులకోసం, న్యాయమూర్తి రమణ కుమార్తెలకోసం అమరావతిలో భూములు కొనుగోలు చేయడంలో చురుకైన పాత్ర పోషించారని ఆరోపణ.

అమరావతి భూముల వ్యవహారం

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అమరావతి భూముల విక్రయాలపై వివాదం తలెత్తింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన  నాటికీ, అమరావతి ఫలానా చోట నిర్మాణం జరుగుతుందని ప్రకటించిన  నాటికీ మధ్య కాలంలో ఆయనకు అయినవారందరూ భూములు కొనుగోలు చేశారనీ, వారికి మాత్రమే వాస్తవంగా రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుననీ, దీనినే ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ అంటారనీ, ఈ నేరానికి అమెరికాలోని న్యాయూర్క్ లో ప్రసిద్ధ ఇండియన్ అమెరికన్ రజత్ గుప్తా  (1994 నుంచి 2003 వరకూ మెకెన్సీ అండ్ కంపెనీకి సీఈవోగా పనిచేసిన వ్యక్తి) పాల్పడిన కారణంగా దోషిగా తేలి కారాగార శిక్ష అనుభవించారనీ అధికారపార్టీ నాయకులూ, పత్రికా ప్రతినిధులూ వ్యాఖ్యలు చేశారు. అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఫస్ట ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-ఎఫ్ఐఆర్)లోని వివరాలను ప్రచురించరాదనీ, ప్రసారం చేయరాదనీ, ప్రచారం చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి పత్రికలపైనా, టీవీచానళ్ళపైనా, సోషల్ మీడియాపైన ఆంక్షలు (గాగ్ ఆర్డర్) విధించారు. ఆ మర్నాడే అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంపైన ప్రభుత్వ సంస్థలు దర్యాప్తును నిలిపివేయాలంటూ జస్టిస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను చాలామంది పరిశీలకులు తప్పుపట్టారు. దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాలు కోరాలి కానీ దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించడం అసాధారణమంటూ వ్యాఖ్యలు వెలువడినాయి.

ఈ ఉత్తర్వులకంటే ముందు ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ అభ్యంతరం తెలుపుతూ తెలుగుదేశం పార్టీ సభ్యులో, సానుభూతిపరులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు వెనువెంటనే స్టే జారీ చేయడం ఆనవాయితీగా మారింది. రాజధాని తరలింపు విషయంలో కానీ, భూముల పంపిణీ వ్యవహారంలో కానీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితులు ఏర్పడినాయి. ప్రతివ్యాజ్యంలో లబ్ధి ఎవరికి కలుగుతోందంటే తెలుగుదేశం నాయకులకూ, సానుభూతిపరులకే అనే మాట వినిపిస్తున్నది.

చంద్రబాబునాయుడితో సాన్నిహిత్యం

జస్టిస్ రమణకు చంద్రబాబునాయుడితో సాన్నిహిత్యం ఉన్నదని జగన్ లేఖలో రాశారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జస్టిస్ రమణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పని చేశారు. ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఒక సారి న్యాయమూర్తిగా నియుక్తుడైన తర్వాత న్యాయమూర్తిగానే ఆలోచిస్తారు. న్యాయవ్యవస్థను తాను పూర్తిగా గౌవరిస్తాననీ, కొందరు న్యాయమూర్తుల పక్షపాత వైఖరిపైననే తాను అభ్యంతరం చెబుతున్నాననీ జగన్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో అన్నారు.

అమరావతి భూకుంభకోణంపై నమోదైన ఎఫ్ఐఆర్ లపైన జాప్యం లేకుండా వెంటనే స్టే ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. ఈఎస్ ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉండిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడును జస్టిస్ కె. లలిత విడుదల చేయించారు. అరెస్టయిన వెంటనే అచ్చెన్నాయుడిని ఆస్పత్రికి తరలించాలని ఆమె ఆదేశించారు. చంద్రబాబునాయుడు నివసించిన భవంతి, నదీగర్భంలో నిర్మించిన ఇతర కట్టడాలనూ తొలగించడంపైన హైకోర్టు ‘స్టే’ విధించింది. విజయవాడలోని రమేశ్ హాస్పిటల్ లో జరిగిన అగ్నిప్రమాదం విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకుండా కోర్టు ‘స్టే’ విధించింది. జస్టిస్ డీ. రమేశ్ ఇచ్చిన ఈ ‘స్టే’ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అసిస్టెంట్ సెక్రటరీపై దాఖలైన ఎఫ్ఐఆర్ లోని ఆరోపణలపైన ఎటువంటి దర్యాప్తునకు అవకాశం లేకుండా హైకోర్టు ‘స్టే’ మంజూరు చేసింది.

ఇళ్ల స్థలాల పంపిణీపైన ‘స్టే’

జస్టిస్ సత్యనారాయణమూర్తి జస్టిస్ రమణకు నమ్మకమైన వ్యక్తి అనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన అన్ని తీర్పులలో జస్టిస్ సత్యనారాయణమూర్తికి సంబంధం ఉన్నదనీ ప్రభుత్వం ఆరోపించింది. రాజధాని తరలింపు కేసులో కూడా చీఫ్ జస్టిస్ మహేశ్వరితో పాటు జస్టిస్ సత్యనారాయణమూర్తి బెంచ్ లో ఉన్నారని జగన్ తన లేఖలో తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదులను కించబరుచుతూ మాట్లాడటం జస్టిస్ సత్యనారాయణమూర్తికి అలవాటైపోయిందనీ, ప్రభుత్వం సంకల్పించిన ఇళ్ల స్థలాల పంపిణీపైన కూడా ఈ న్యాయమూర్తి ‘స్టే’ విధించారనీ జగన్ భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొని వెళ్ళారు.

జస్టిస్ రమణకు నమ్మకస్తుడైన దమ్మాలపాటి శ్రీనివాస్ పైన నమోదైన చీటింగ్ కేసుపైన విచారణ జరగకుండా హైకోర్టు ‘స్టే’ విధించిందని ముఖ్యమంత్రి చెప్పారు.  అదే విధంగా,  నవయుగ ఇంజనీరింగ్ కు కేటాయించిన పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసే జీవోను జస్టిస్ సోమయాజులు కొట్టివేశారనీ, అంతకు మునుపు నవయుగ ఇంజనీరింగ్ సంస్థకు జస్టిస్ సోమయాజులు సేవలు అందించిన సంగతి విదితమేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు (చేయని) విశాఖ పర్యటన వ్యవహారంపైన కూడా ప్రభుత్వ వ్యతిరేకమైన ఆదేశాలు జారీ చేశారనీ, ప్రభుత్వానికి ప్రతికూలంగా ఆదేశాలు జారీ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు హైకోర్టు పనితీరు కనిపిస్తున్నదనీ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చినంత మాత్రాన అవన్నీ పక్షపాతంతో ఇచ్చినవని చెప్పలేం. దమ్మాలపాటి శ్రీనివాస్ పైన దాఖలైన ఎఫ్ ఐఆర్ గురించి రాయవద్దూ, ప్రసారం చేయవద్దూ, ప్రచారం చేయవద్దూ అని ఆదేశించడాన్ని ప్రశ్నించవచ్చు. అదే విధంగా అమరావతి భూముల వ్యవహారంపైన దర్యాప్తు జరపకూడదంటూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా ప్రశ్నించవచ్చు. ఆ పని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలులో చేసింది. 

ఏం జరుగుతుందో చూడాలి

ఇది నిజంగా సంచలనాత్మకమైన లేఖ. సౌమ్యుడని పేరున్న అజేయ కల్లం చేత మీడియాగోష్ఠిలో మాట్లాడించడం ఆలోచించి తీసుకున్న నిర్ణయం. తాను చెప్పదలచింది చెప్పిన తర్వాత అజేయ కల్లం విలేఖరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వబోనని గోష్ఠి ప్రారంభించే ముందే చెప్పారు. భారత ప్రధాన న్యయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులూ ఈ లేఖపైన ఎట్లా స్పందిస్తారో, భారత ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందడానికి సిద్ధంగా ఉన్న జస్టిస్ రమణ ఈ వ్యవహారాన్ని ఎట్లా పరిగణిస్తారో, కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉంటుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles