Friday, December 1, 2023

యుూపిీలో మండల్ వర్సెస్ కమండల్!

వోలేటి దివాకర్

దేశంలోనే అతిపెద్ద ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతూ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికలు  ముస్లిం, ఓబిసి కులాలకూ, హిందుత్వానికీ మధ్య ఎన్నికలుగా రూపాంతరం చెందుతున్నాయి . దాదాపు మూడు దశాబ్దాల క్రితం దేశాన్ని ఒక కుదుపు కుదిపిన మండల్ కమిషన్ ఉద్యమం ఉత్తరప్రదేశ్ ఎన్నికల పుణ్యమాని మరోసారి తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార బిజెపి హిందుత్వ నినాదాన్ని అనుసరిస్తోంది. దీనిలో భాగంగానే ఎమ్మెల్సీగా ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అయోధ్య నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఆయన గోరక్ పూర్ అర్బన్ స్థానాన్ని ఎంచుకున్నారు. బిజెపి హిందుత్వను దీటుగా ఎదుర్కొనేందుకు మాజీ ముఖ్యమంత్రి , సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యూహాత్మకంగా మండల్ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో 80 శాతం మంది బిజెపి వైపు, 20 శాతం మంది ప్రతిపక్షాల వైపు ఉన్నారన్న యోగి ఆదిత్యనాధ్ ప్రకటనను కూడా ప్రతిపక్షాలు వివాదాస్పదంగా మార్చేశాయి. ఆ 20 శాతం మంది ముస్లింలన్నది యోగి అభిప్రాయమని వారు ఆరోపిస్తున్నారు. దీంతో యుపి ఎన్నికలు మండల్ కు కమండలానికి మధ్య యుద్ధంగా మారిపోయాయి.

Also read: ఏమిటి చీప్ గా … ఎపి బిజెపి లిక్కర్ పాలసీ!

ముస్లిం, ఓబిసిలు అఖిలేష్ ను గెలిపిస్తారా?

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత యోగి ప్రభుత్వంలోని ఒబిసి వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులు స్వామిప్రసాద్ మౌర్య , ధారాసింగ్ చౌహాన్ , ధరమ్ సింగ్ సైనీ , 8 మంది ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలో చేరడం బిజెపి ప్రభుత్వానికి పెద్ద షాక్ గానే భావిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో కేంద్రంలో బిజెపి సర్కారులో భాగస్వామిగా ఉన్న అప్నాదళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా ఉండటం గమనార్హం. రోజుకొకరు చొప్పున రానున్న రోజుల్లో ఎస్సీలో చేరే ఎమ్మెల్యేల సంఖ్య 20 కి చేరుతుందని ఎస్పీ నేతలు ధీమాగా ప్రకటించడం విశేషం. యోగి విధానాలను నిరసిస్తూ సరిగ్గా ఎన్నికలకు ముందు మంత్రులు రాజీనామాలు చేయడం బిజెపి ప్రభుత్వంపై ఒక తిరుగుబాటుకు సంకేతంగా విశ్లేషిస్తున్నారు. అయితే ముస్లిం, దళిత, ఓబిసి వర్గాలను ఆకట్టుకుని అఖిలేష్ రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని సాధిస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది. వీరంతా గంపగుత్తగా ఎస్పీకి ఓటువేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. బిఎస్పీ , కాంగ్రెస్ పార్టీలు వీరి ఓట్లను చీల్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరోవైపు యోగి ప్రభుత్వం పట్ల ఠాకూర్లు మినహా మిగిలిన అగ్రవర్ణాలన్నీ వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది . బ్రాహ్మణులు , బనియాలు ( వైశ్యులు ) కూడా యోగి ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం యుపిలో బిజెపిపై ప్రమాద ఘంటికలకు సంకేతాలుగా భావించవచ్చు .

గోరఖ్ పూర్ నుంచి యోగి పోటీ, 107మందితో బీజేపీ తొలి జాబితా

భారతీయ జనతా పార్టీ రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం 107 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. మొదటి దశలో ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనున్న 58 స్థానాలకు గాను 57 స్థానాలకు, ఫిబ్రవరి 14న రెండో దశ పోలింగ్‌లో 55 స్థానాలకు గాను 48 స్థానాలకు అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్‌రాజ్‌లోని సిరతు స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీ తెలిపింది.  రెండు ప్రముఖ స్థానాలకు తదుపరి దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2022లో యూపీ మళ్లీ మాకు మద్దతిస్తుందని, ఈసారి 300కు పైగా సీట్లు గెలుస్తామని నమ్ముతున్నాం’’ అని అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇంచార్జి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు.

గోరఖ్‌పూర్ (అర్బన్) స్థానానికి మార్చి 3న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలో కాషాయ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యే వరకు ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ నుంచి వరుసగా ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.  ఎమ్మెల్సీ గా ఉన్న   ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

 2017 ఎన్నికల్లో యూపీలో మొత్తం 403 స్థానాలకు గానూ 312 స్థానాలను గెలుచుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది.  సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 47 సీట్లు గెలుచుకోగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 19 సీట్లు గెలుచుకుంది.  కాంగ్రెస్‌ కేవలం ఏడు సీట్లతో సంతృప్తి చెందింది.

Also read: స్వపక్షంలో విపక్షం, గోదావరి తీరంలో.. అధికార పార్టీలో ఆధిపత్యపోరు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles