Thursday, April 25, 2024

పాదయాత్రే తెలంగాణ కాంగ్రెస్ కు పరమావధి

  • ప్రతినాయకుడి ప్రతిపాదనలో పాదయాత్ర ప్రధానాంశం
  • తనకు ఇస్తే మంచిదే, ఫలానా వ్యక్తికి మాత్రం ఇవ్వవద్దు
  • బహునాయకత్వమే అసలు సమస్య
  • అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన నాయకులు కూడా పగ్గాలు అడుగుతున్నారు

హైదరాబాద్ : పాదయాత్రలు పదవులను ఇస్తాయా? అంటే కొంతనిజమేనని, పట్టుదల ఉంటే సాధ్యమేనని అంటున్నారు ఔత్సాహికులు. అందుకు ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రాలలో దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి  ఎన్.చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లను ఉదహరిస్తున్నారు. ఆ కోణంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాద యాత్ర పల్లవిని అందుకున్నారు. తనకు టీపీసీసీ   అధ్యక్ష పదవి అవకాశం కల్పిస్తే పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ లోనే వర్గ రాజకీయాలు ఉన్నట్లు అందరూ అంటుంటారని, టీఆర్ఎస్ లోనూ  అదే పరిస్థితి అని అన్నారు. తనది కాంగ్రెస్ రక్తమని,పార్టీలు మార్చే తత్వం తనది కాదని అన్నారు.­

మరి కొంత జాప్యం అనివార్యం

టీపీసీసీ కొత్త సారథి  ప్రకటనలో మరి కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన కానుకగా మొన్ననే (9న) ఆ పేరు ప్రకటించవచ్చని ఆశించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసిన  సంగతి తెలిసింది. ఆయన వాసరుడి పేరు ప్రకటించడంలో అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.ఎవరిని కాదంటే ఎలా ఉంటుందోననే పరిణమాలు  ఎలా ఉంటాయో? ఎవరు ఉంటారో?వెళతారో? అనో ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ వైపు వెళ్లకపోయినా బీజేపీ వైపు ఆకర్షితులు కాగలరని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే  కొందరు ప్రముఖుల పేర్లు ఆ దిశగా వినిపిస్తున్నాయి.

ఏఐసీసీ ప్రతినిధి మణిక్కం ఠాగూర్ జరుపుతున్న సంప్రదింపులలో రెండవ రోజు అయిన గురువారంనాడు కూడా  చాలామంది నాయకులు నాయకత్వం తమకు అప్పగిస్తే తెలంగాణ పొడవునా పాదయాత్ర చేసి పార్టీని నిర్మిస్తామని చెబుతున్నారు.

నాయకులను ప్రణాళికలు కోరిన ఠాగూర్

కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి ఎట్లా తీసుకురావాలో ప్రణాళికలు సమర్పించవలసిందిగా ఠాగూర్ సీనియర్ నాయకులను అడిగారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రణాళిక సమర్పించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో సంబంధాలు పెట్టుకుంటాననీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) చేస్తున్న తప్పిదాలను ప్రభావవంతంగా ఎత్తి చూపుతాననీ రేవంత్ చెప్పినట్టు తెలిసింది.

Also Read : టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక: ఏకాభిప్రాయం కుదిరేనా?

దిల్లీ పెద్దలకు సన్నిహితంగా మెలిగే మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ సామాజిక సమీకరణలు కాంగ్రెస్ వంటి పార్టీకి ప్రధానమని మొదటి నుంచీ చెబుతూ వచ్చారు. నిమ్నకులాలవారిలో సైతం నాయకులు ఉన్నారనీ, కాంగ్రెస్ వంటి పార్టీనే అటువంటివారికి నాయకత్వం కట్టబెట్టగలదనీ ఆయన వాదన. తనకు బాధ్యత అప్పగిస్తే పూర్తి న్యాయం చేస్తానని అన్నారు.

మరో సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క కూడా అతిథిగృహంలో ఠాగూర్ ని కలుసుకొని తనకు బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్ ని తిరిగి అధికారంలో నిలబెట్టగలనని హామీ ఇచ్చారు. ఎవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలనే విషయంపైన కూడా ఆయన ఏఐసీసీ ప్రతినిధితో చర్చించారు. సంగారెడ్డి ఎంఎల్ఏ టి. జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి), మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రిచెన్నారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి కూడా పార్టీలో అత్యున్నత పదవి తమకు అప్పగిస్తే ఏ విధంగా పార్టీ బలం పెంచగలమో వివరించారు. పార్టీ విధేయులకు గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. నిధుల సమస్య ఉండదనీ, తాను నిధులను సమీకరించగలననీ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ చెప్పారు. తాను పదవి తనకు ఇవ్వాలని అడగబోననీ, పార్టీ తనకు పదవి అప్పగిస్తే నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తాననీ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు తెలిసింది.

ఫలానా వ్యక్తికి పగ్గాలు ఇస్తే అంతే సంగతులు

తమకు బాధ్యత అప్పగించమని అడగడంతో పాటు ఫలానావారికి పగ్గాలు ఇస్తే కాంగ్రెస్ బండిని నట్టేట ముంచుతారనీ, అది చారిత్రక తప్పిదం అవుతుందని కూడా హెచ్చరించారు. తమిళనాడుకు చెందిన యువనాయకుడు మణిక్కం ఠాగూర్ కి ఇది చిక్కులతో కూడిన వ్యవహారంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ లో ముఠాలు తమిళనాడులో సైతం ఉన్నప్పటికీ ఇంతమంది నాయకులు పార్టీ పగ్గాలు తమకు ఇవ్వాలని కోరిన రాష్ట్రం మరొకటి లేదు. భారత దేశంలో ఇంతమంది నాయకులు ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ మరొకటి లేదని ఠాగూర్ ఆంతరంగికుల దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన నాయకులు కూడా పీసీసీ సారథ్యం కోరడం వింతగా ఉన్నదని ఆయన భావిస్తున్నారు. బహునాయకత్వమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు సమస్యగా, శాపంగా పరిణమించిందనీ, ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించే వాతావరణం లేదని ఆయన భావిస్తున్నారు.

అందరినీ దారిలో పెట్టడం పెనుసవాలు

వీరందరికీ ఒకే దారిలోకి తీసుకురావడం తన ముందు ఉన్న సవాలు అని ఆయన తన సన్నిహితులతో వ్యాఖ్యానించారు. తనకు కాకపోయినా సమర్థుడినీ, వివాదరహితుడిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే తాను సహకరిస్తానని చెబుతున్న సగటు సీనియర్ కాంగ్రెస్ నాయకుడి మాటలలో నిజాయితీ కనిపించడం లేదని దిల్లీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాలలో ఓటు బ్యాంకు ఉన్నదనీ, దానిని చెడగొట్టకుండా, ఇతర జిల్లాలలో పార్టీ బలం పెంచుకోవడానికి ప్రయత్నించే నాయకుడు కావాలనీ అందరూ అంటున్నారు. ఆ పని ఎవరు సమర్థంగా చేయగలరో నిర్ణయించడం ఠాగూర్ పని. ఆయన సిఫార్సు పైనే కాంగ్రెస్ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయంపైనే తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎవరు పార్టీ పగ్గాలు స్వీకరించినా టీపీసీసీ అధ్యక్షుడి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర తప్పని సరి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles