Saturday, April 20, 2024

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోనే బానిసత్వానికి చరమగీతం

ఇష్టం లేని పనిని వివిధ కారణాల వల్ల బలవంతంగా చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి చేయడమే బానిసత్వం. పిల్లలవద్ద బలవంతంగా పని చేయించుకోవడం, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇళ్ళల్లో వెట్టి చాకిరి, వ్యవసాయ కూలీలు, పిల్లలను అమ్మడం, ఇటుక బట్టీలు, బలవంతపు పడుపు వృత్తి, పిల్లల అక్రమ రవాణా లాంటి వివిధ రూపాలలో బానిసత్వం కనిపిస్తున్నది. భయ పెట్టీ, హింసించి, మోసగించి, బెదిరించి, వివిధ రకాలుగా శ్రమ దోపిడీ జరగడం అనునిత్యం జరుగుతున్నదే. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి జరిగితే తప్ప పరిష్కారం లేదని విజ్ఞుల భావన.

ఫలితం దక్కని బాలల శ్రేయస్సు కృషి

ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విధి లేక బాలకార్మికులు గానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకు కృషి జరుగుతున్నా ఆచరణలో ఫలితాలు కానరావడం లేదు. పాఠశాల సౌకర్యాలు లేక కొందరు, అవి ఉన్నా వివిధ కారణాల రీత్యా బడికి వెళ్లలేక మరికొందరు బాలలు తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటున్నారు.  ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలతో ముడివడి సంక్షేమ పథకాలకు నోచుకోక, చదువు చెప్పించే స్థోమత లేక ఎందరో పేద తల్లిదండ్రులు గత్యంతరం లేని స్థితిలో చిన్నారులపై భారాన్ని మోపుతున్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఫ్యాక్టరీలు, మిల్లులు, క్వారీలు, గనులకు తమ పిల్లలను పనికి పంపుతున్నారు. వ్యవసాయ పను లకు కొందరు బాలలు వెళుతున్నారు. చివరికి కొందరు పిల్లలను భిక్షాటన వృత్తిలోకి బలవంతంగా నెడుతున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు నీళ్ళు

వివిధ రంగాలలో బాలకార్మికులు అవస్థలు పడుతూ అనుక్షణం శ్రమిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్దలు చేయాల్సిన పనులను సైతం వీరే చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలి బాలల చేత వెట్టిచాకిరీ చేయించు కుంటున్నా, వారికి విముక్తి కలిగించాలన్న ధ్యాస సంబంధిత అధికారుల్లో లేకపోవడం బాధాకరం. యజమానులు చెప్పిందే చట్టంగా, వారు చేసేదే సంక్షేమంగా  పరిస్థితులున్నా కార్మికశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పుడప్పుడు తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నా దోషులకు ఎలాంటి శిక్షలు పడడం లేదు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ – ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని భారత రాజ్యాంగం లోని 24వ నిబంధన స్పష్టం చేస్తున్నా అది కాగితాలకే పరిమితమవడం శోచనీయం.

పేదరికమూ కలల ఛిద్రానికి కారణం

పేదరికం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పసి పిల్లల బంగారు కలలు చెదిరి పోతున్నాయి. పాలబుగ్గల లేత వయసులో వారు కార్మికులుగా మారడం బాధాకరం. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పిల్లల చేత పని చేయించుకునే యాజమాన్యాలు తగిన వేతనాలు ఇవ్వడం లేదు. పిల్లలు పనిచేసే చోట తగిన రీతిలో భద్రతా సౌకర్యాలను కల్పించక పోవడం ఆక్షేపణీయం. ప్రాథమిక హక్కులను పేర్కొన్న రాజాంగంలోని 3వ ప్రకరణంలోని 15(8)వ అంశం బాలల కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి కలుగజేస్తున్నది. 28వ అధికరణం ప్రకారం బాలలను వ్యాపార వస్తువుగా మార్చడం, నిర్బంధ సేవలను చేయించు కోవడం అపరా ధంగానే పరిగణించాలి.

నిర్బంధ ప్రాథమిక విద్య అందని ద్రాక్ష

పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో, గనులలో, ఇతర ప్రమాదకరమైన పనులలో నియమించడాన్ని 24వ ఆర్టికల్ నిషేధిం చింది. 39(ఇ) ప్రకారం బాలలను వారి వయసుకు తగని, శక్తికి మించిన పనులలో నియమించ రాదు. పేదరికాన్ని సాకుగా చేసుకుని బాలలను పనుల్లో నియ మించడం నిషేధించాలని రాజ్యాంగం ఆదేశిం చింది. కఠిన చట్టాలు ఎన్ని ఉన్నా చాలామంది పిల్లలు బాల కార్మికులు గానే మిగిలి పోతున్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న నిర్బంధ ప్రాథమిక విద్య ఈనాటికీ ఫలించని కలగానే మిగిలి పోతున్నది. ప్రపంచ బాలకార్మి కుల్లో మూడవ వంతు మంది మన దేశంలోనే ఉన్నారని ఒక అంచనా. దీంతో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. 5 నుండి 15 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టారు. పాఠశాలలో నమోదు కాని, మధ్యలో మాని వేసిన, అర్హతగల పిల్లల సమగ్ర వివరాలను సేకరించి వారిని తిరిగి తరగతులకు పంపేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఆచరణాత్మక చర్యలను చేపట్టారు.

చదువుల పండుగ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుల పండగ పేరుతో 2002 ఆగస్టు 1 నుండి 10వరకూ, 2003 సంవ త్సరం నవంబర్ 24 నుండి 29వరకూ బడి బయట ఉన్న పిల్లలనందరినీ పాఠశాలలలో చేర్పించే బృహత్ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఏటా ఆ కార్యక్ర మాన్ని అమలు చేస్తునే ఉన్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్నది వాస్తవం. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెబుతున్నా బాల కార్మికులు వివిధ పనుల్లో కొనసాగుతూనే ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించ డానికి, నిర్బంధ ప్రాథ మిక విద్య అమలుకు మరింతగా చర్యలు చేపట్టవలసి ఉంది. ముందుగా వారి తల్లిదండ్రులకు చదువు పట్ల అవ గాహన కలిగించాలి. బాలకార్మికులకు వసతి సైతం కల్పించేలా ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాలి. నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక సమస్యలను తొలగించేలా వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. పిల్లల సంపాదనపై ఆధార పడకుండా తల్లిదండ్రులకు సాధికారత కల్పించాలి.

(డిసెంబర్ 2 అంతర్జాతీయ బానిసత్వ విముక్తి దినోత్సవం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles