Saturday, September 30, 2023

సమధికోత్సాహంతో చదువుల బాటలో…

కరోనా వైరస్ వ్యాప్తి మొదలై, లాక్ డౌన్ నిబంధనల తర్వాత, దాదాపు ఏడు నెలలకు ఆంధ్రప్రదేశ్ లో విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ జాగ్రత్తల మధ్య,  విద్యా సంస్థలను నిర్వహించాల్సి వుంది. కేంద్ర ప్రభుత్వం,    యూజిసి జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగాల్సి వుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగానే ముందుకు వెళ్తుందని విశ్వసిద్దాం. సాధారణంగా, సెలవుల తర్వాత పై తరగతి లోకి ప్రవేశిస్తూ,  బడికి వెళ్ళటానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు.

నూతనోత్సాహం

ఈ ఉత్సాహం పాఠశాల దశ నుండి విశ్వవిద్యాలయం దశ దాకా ఉంటుంది. ముఖ్యంగా డిగ్రీ చదువుల దాకా ఉంటుంది. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడూ విద్యార్థుల్లో కొంగ్రొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అదే విధంగా, విద్యా సంవత్సరంలో వచ్చే సెలవులను కూడా విద్యార్థులు చాలా మురిపెంగా చూసుకుంటారు. సెలవుల సుఖాలు అనుభవించిన తర్వాత,  బడికి వెళ్ళడానికి కాస్త బద్ధకంగా ఉంటుంది. కాస్త తక్కువ ప్రమాణాలు  (స్టాండర్డ్) కలిగిన  విద్యార్థులకు భయంగానూ ఉంటుంది. మళ్ళీ పాత మిత్రులను కలవవచ్చు, ఆడుకోవచ్చు అనీ కొందరు విద్యార్థులు ఆనంద పడతారు. ఇలా,  సెలవుల తర్వాత విద్యాలయాలకు వెళ్లే విద్యార్థుల తీరు, మానసిక ప్రవృత్తి మిశ్రమంగా ఉంటుంది.

ఫలితాల పట్ల ఉత్కంఠ

గడచిన తరగతిలో వచ్చిన మార్కులు, ఫలితాల పట్ల చాలా ఉత్కంఠ ఉంటుంది.ముఖ్యంగా,  10వ తరగతి విద్యార్థులు  తమ ఫలితాలను జీవితాంతం అపురూపంగా భావించుకుంటారు.ఇవే  మొదటి పెద్ద పరీక్షలు కావడమే దీనికి కారణం.విద్యా జీవితంలో అత్యంత కీలకమైంది ఇంటర్మీడియట్.10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకున్న కొందరు విద్యార్థులు ఇంటర్మీడియట్ లో తక్కువ ఫలితాలను సాధిస్తారు.10తరగతి వరకూ సగటు విద్యార్థిగా ఉన్నవారు శ్రద్ధ, శ్రమ పెంచుకొని ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు తెచ్చుకుంటారు.క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న విద్యార్థులు ప్రతి దశలోనూ అదే తీరున ఉత్తమమైన ఫలితాలతో విద్యాజీవితాంతం సాగుతారు.10వ తరగతి ఎంత ముఖ్యమో? ఇంటర్మీడియట్ అంతకంటే ఎంతో కీలకమని    లెక్చరర్లు విద్యార్థులను హెచ్చరిస్తూ ఉంటారు.

భావోద్వేగాల మధ్య విద్యార్థుల జీవనయానం

ఇలా,  అనేక భావోద్వేగాల మధ్య సాగే విద్యార్థుల జీవనయానంలో కరోనా సృష్టించిన అలజడి అంతా ఇంతాకాదు. అసలు పరీక్షలు రాయకుండానే ఫలితాలు, గ్రేడ్ లు ఇవ్వడం, ఇన్ని నెలల పాటు విద్యా ప్రాంగణాలకు దూరంకావడం, ఇప్పుడు విద్యాలయాలు తెరుస్తున్నా, భౌతిక దూరం పాటించడం మొదలైనవి పిల్లలను చికాకు పెట్టే అంశాలే. కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి పరిస్థితులు ఎవ్వరూ తమ విద్యాజీవితంలో అనుభవించలేదు. వీటన్నింటి నేపథ్యంలో, సిలబస్, కరోనా జాగ్రత్తలు, ప్రభుత్వం విధించే నియమ నిబంధనలు, చేసే మార్గదర్శకాలు ఎట్లా ఉన్నా వాటితోపాటు, ఇప్పుడు విద్యార్థి లోకానికి కావాల్సింది మానసిక ఉత్తేజం, మార్గదర్శనం. ఈ దిశగా అధ్యాపకులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విద్యావిధానంలో సమూలమైన మార్పులు

విద్యావిధానంలో సమూలమైన మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా వరకూ దీనికి అంగీకారం తెలిపింది. ప్రభుత్వం అంటున్నట్లుగా “ఆట-పాఠాలు” రెండూ ముఖ్యమే. శారీరక, మానసిక వికాసానికి ఆటలు ఎంతో ఉపయోగపడతాయన్న సత్యం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కరోనా  పరిస్థితుల్లో,  ఆటలు ప్రశ్నార్థకమే. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ, మనోవికాసం కలిగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఫీజుల జులుంకు అడ్డుకట్ట వెయ్యాలి. అన్నిదశల్లో,  విద్య అందరికీ అందుబాటులోకి తేవాల్సిన బృహత్ బాధ్యత ప్రభుత్వాలదే. ఫీజు రీఇంబర్స్ మెంట్ ఏ మేరకు నూటికి నూరుశాతం అమలవుతోందో సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది.

ఆన్ లైన్ విద్యావిధానం అందడం లేదు

ఆన్ లైన్ విద్యా విధానాన్ని ఇంకా సంపూర్ణంగా విద్యార్థులు అందిపుచ్చుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, సాంకేతిక ప్రగతిని అనుసరిస్తూనే బోధన-విద్యా సముపార్జనలో మరింత ముందుకు సాగాల్సి వుంది. ఇక్కడ నైపుణ్యం పెరగాల్సివుంది. విద్యా మనోవిజ్ఞానశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) నుండి నేర్చుకున్న అంశాలను ఎంతవరకూ ఆచరణలో అన్వయం చేసుకుంటున్నారని పరిశీలిస్తే, పెదవి విరవాల్సి వస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా స్థాయిలు బట్టి, ఏ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉండాలి, వారికి బోధన ఎలా చెయ్యాలనే అంశాలలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు ఎప్పటి నుండో ఉన్నాయి.దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి.

స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్

నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్ ను తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేయడం ఎంతో అభినందనీయం. శిక్షణా కేంద్రాలను బలోపేతం చెయ్యాలనే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం కూడా చాలా మంచిది. ఇప్పటికే విద్యా సంవత్సరంలో కొంత సమయం గడచిపోయింది కాబట్టి, సత్వర ఫలితాల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు హెచ్చరించారు. ఇది ఆచరణీయ మార్గం. విద్యా దీవెన, వసతి దీవెన పధకాల అమలు ఆశించిన స్థాయిలో జరిగేలా చూడడం ఎంతో ముఖ్యం. మనబడి, నాడు-నేడు  పధకాల క్రింద పాఠశాలల వాతావరణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం ఎంతో అభినందనీయం.

సానుకూల వాతావరణ కల్పించాలి

నవంబర్ 2నుండి పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో, మొదటి రోజే 80శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని సమాచారం. విద్యా సముపార్జనకు  ఎంతో ముఖ్యమైన అంశం: చుట్టూ ఉండే వాతావరణం (కంజీనియల్ ఎట్మాస్పియర్) అన్నిరకాలుగా అనుకూలంగా ఉండాలి. అది కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఫెడరల్ విధానం ప్రకారం,  విద్యారంగం చాలా వరకూ రాష్ట్రాల చేతుల్లోనే  ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతమైన ప్రమాణాల మధ్య ఉత్తమమైన విద్య అందరికీ అందుతుందని ఆశిద్దాం.

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles