Tuesday, April 16, 2024

ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!

తు హింద్ బనేగా న  ముసల్మాన్ బనేగా

ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా

అచ్ఛా హై అభీతక్ తెరా కుచ్ నామ్ నహీహై

తుఝ్ కొ కిసీ మజ్ హబ్ సె కొయి కామ్ నహీహై

జిస్ ఇల్మ్ నె ఇన్సానోంకో తక్సీమ్ కియా హై

ఉస్ ఇల్మ్ క తుఝ్ పర్ కొయి ఇల్జామ్  నహీహై

తు బద్ లె హుయే వఖ్త్ కి పహచాన్ బనేగా

నువ్వు హిందువువీ కావు. ముస్లింవీ కావు. మనిషికి వారసుడివి. మనిషివే అవుతావు. మంచిదయ్యింది నీకు ఇంకా ఏ పేరూ లేదు. నీకు ఏ మతంతోనూ పని లేదు. ఏ ధర్మమైతే మనుషుల్ని విడగొట్టిందో – ఆ ధర్మం – నీ మీద ఏ అపవాదు వేయలేదు. మారుతున్న కాలానికి నువ్వొక గుర్తింపువి అవుతావు. మానవుడికి వారసుడివి నువ్వు మానవుడివే అవుతావు!

Also read: దళితుల రక్షణకోసం అవార్డు వాపసీ

మనిషికి ఆ పైవాడు ఈ భూ ప్రపంచాన్నిచ్చాడు. మనం దాన్ని ఓ వైపు భారత్ అని, మరో వైపు ఈరాన్ అని విభజించాం. మనుషులు మనుషులుగా పుట్టిన ఈ మానవజాతిని కొందరిని హిందువులుగా మరికొందరిని ముస్లింలుగా మనమే విడగొట్టాం – అంటూ సాగిన గీతంలో అక్కడక్కడ పైవాడు – గీత – ఖురాన్ ల ప్రసక్తి వచ్చినా వాటికంత ప్రాధాన్యత లేదు. పాట చివరి చరణాలు మరింత వెడెక్కి ఉంటాయి.

ఏ దిన్ కె తాజిర్ యె వతన్ బేచ్ నె వాలె

ఇన్సానోంకె లాషోంకొ కఫన్ బేచ్ నె వాలె

ఎ మహలోమె బైఠేహుయే ఖాతిల్ యె లుటేరే

కాంటొంకె ఎవజ్ రూహ్ ఎ చమన్ బేచ్ నె వాలె

తూ ఇన్ కె లియె మౌత్ క ఏలాన్ బనేగా

ఇన్పాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా

దేశాన్ని, స్వాంత్ర్యాన్ని అమ్మేవారు.. శవాల్ని కప్పడానికి పై గుడ్డలు  (కఫన్) అమ్మేవారు…సద్భావంలో ఉన్న అందమైన తోటల్ని నాశనం చేసేవారు – ఇప్పుడు గొప్ప గొప్ప భవనాల్లో తిష్టవేశారు (అధికార పీఠమెక్కి కూర్చున్నారు). ఆ హంతకుల, ఆ దోపిడిదార్ల మరణాల ప్రకటన – నువ్వే అవుతావు. మారుతున్న కాలానికి నువ్వొక గుర్తింపువి అవుతావు. నువ్వు మనిషికి వారసుడివి మనిషివే అవుతావు!

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

ఇంత అర్థవంతంగా, ఇంత ఆర్ద్రంగా, కళ్ళు చెమ్మగిల్లే గీతం రాసింది సాహిర్ లుథియానవి. ‘ధూల్ క ఫూల్’ అనే హిందీ చలనచిత్రం కోసం 1959లో రాసింది. కవి క్రాంతిదర్శి అంటే ఇదే. కవి దార్శనికుడు అంటే ఇదే. రాగల కాలాలలో సమాజంలో జరగబోయే అస్తవ్యస్త స్థితిగతుల్ని ఆయన ముందే పసిగట్టి చెప్పారు. జనాన్ని విడగొట్టడానికే అధికారంలోకి వచ్చే ప్రభుత్వ పెద్దలు ఎలాంటి వారై  ఉంటారో కూడా పాట చివరి చరణాల్లో  స్పష్టంగా చెప్పారు. మొత్తానికి మొత్తంగా మానవవాద ఆలోచనా ధోరణికి విస్తృత ప్రచారం లేని రోజుల్లోనే, ఆధునిక జన్యుశాస్త్రం నిగ్గుతేల్చిన విషయాన్ని ఆయన తన పాటకు పల్లవిగా చేశారు. నువ్వు ప్రత్యేకించి ఏ ఒక్క జాతికో చెందినవాడివి కాదు. మొత్తానికి మొత్తంగా మావనజాతికి చెందినవాడివి – అని గుర్తు చేస్తూ మానవుడికి వారసుడివి కాబట్టి మానవుడివే అవుతావు అనే సందేశం ఇచ్చారు – కవి సాహిర్ లుథియానవీ.

Also read: ‘విశ్వాసవ్యవస్థ’లోంచి-ఆత్మవిశ్వాసంలోకి….

సాహిర్ లుథియానవీ 1921-1980 మధ్య కాలంలో జీవించిన ప్రగతి శీల భావాలు గల కవి. సాహిత్యజగత్తులో తనదైన స్థానం సంపాదించుకుంటూనే తన ఉరుదూ/హిందీ పాటలతో అటు బాలివుడ్ సినీ ప్రపంచాన్నికూడా ఉర్రూతలూగించిన కవి. పుట్టినప్పుడు పెట్టిన అబ్దుల్ హై అనేపేరు మరుగున పడిపోయింది. సాహిర్ లుథియానవీ అంటే తను లుథియానాకు చెందినవాణ్ణని చెప్పుకోవడం. తమ స్వస్థలం పేరు తమ పేరు తేదా కలంపేరు చివర తగిలించుకోవడం ఉరుదూ కవులకు అలవాటు. పుట్టింది ధనిక గుజ్జర్ ముస్లింగానే అయినా, ముస్లిం మత పక్షపాతంతో ఎప్పుడూ ఎక్కడా వ్యవహరించలేదు. చిన్నప్పుడే ఆయన తండ్రి తన తల్లిని వదిలేసి వేరే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాడు. తల్లి సర్దార్ బేగం ఒంటరిగా ఎంతో శ్రమించి సాహిర్ ను పెంచి పెద్ద చేసింది. విద్యాభ్యాసం చేస్తున్న దశలోనే కమ్యూనిస్ట్ భావాలకు ఆకర్షితుడైనందువల్ల పాకిస్తాన్ లోని లాహోర్ లో ఆయనకు పోలీసుల వేధింపులు ప్రారంభమయ్యాయి. అందువల్ల ఆయన అక్కడి నుండి దిల్లీకి చేరుకున్నారు. కొన్ని వారాల వ్యవధిలో మళ్ళీ ముంబై చేరుకుని క్రమంగా స్థిరపడ్డారు. స్థిమితంగా తన రచనా వ్యాసంగం కొనసాగించారు. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఒక వైపు కవి, దర్శకుడు గుల్జార్ మరొక వైపు ప్రసిద్ద కథకుడు కిషన్ చందర్ ఉండేవారు. కాలక్రమంలో షాహిర్ ఒక బంగళా కొనుక్కున్నారు. దానికి పరిఛాయియా(నీడలు) అని పేరు పెట్టుకున్నారు. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా తల్లిని మాత్రం అపురూపంగా చూసుకున్నారు. ఎంత చిన్న విషయం అయినా, వృద్ధురాలైన తల్లితో సంప్రదించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకునేవారు. ఆమెమరాణాన్ని తట్టుకోలేని సాహిర్, ఆమె లేకుండా ఎక్కువ కాలం బతకలేకపోయారు. మూడేళ్ళ తర్వాత ఆయన కూడా కన్నుమూశారు.

Also read: ‘‘మేం చదువుకోవాలి’’ అంటూ నినదించిన కమలా భాసిన్

ఒకసారి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు కవిత్వం గురించి అంటే సినీగీతాల గురించి తేలికగా మాట్లాడాడు – ‘‘సంగీత బాణీల వల్ల పాటలు హిట్టవుతాయే కానీ పాటల చరణాల వల్ల అవుతాయా?’’- అని! ఆ మాటలకు కవి సాహిరి తట్టుకోలేక పోయాడు. పాటల్లోని భావం- అంటే – జీవం!అది లేకుండా ట్యూన్ లు ఎంత మంచివైనా జనం గుర్తుంచుకోరు – అన్నది సాహిర్ అభిప్రాయం. ఆ తర్వాత ఆయన, ఆ ప్రముఖ సంగీతకారుడికి పాటలు రాయడం మానేసి, కొత్త సంగీతకారుల్ని ప్రోత్సహించం ప్రారంభించారు. తన పాటల చరణాల్లో ఉన్న బలాన్ని అర్థం చేసుకునే వారికి మాత్రమే రాసేవారు. కేవలం తన రచనా సామర్థ్యంతోనే ఇటు సాహిత్య రంగంలోను, అటు హిందీ చలనచిత్ర పరిశ్రమలోనూ తన సత్తా చూపారు. గాయకుల కన్నా తనకు ఒక రూపాయి ఎక్కువ ఇవ్వాలనేవారు. అది లతామంగేష్కర్ అయినా సరే అదే నిబంధన! ఆ ఒక్క రూపాయితో ఏమీ కాదు కానీ, కవి లేకపోతే గాయకులు, సంగీతకారులు ఎవరూ లేరు. వారికి పనే ఉండదు.. అనే నిజాన్ని జనానికి అర్థం చేయించడం కోసం అలా చేసేవారు. కవికి కవిత్వానికీ ఉండాల్సిన ప్రాధాన్యతను తెలియజేయడం అక్కడ ఆయన ఉద్దేశం. బాజి, ప్యాసా,  ఫిర్ సుబహ్ హోగీ, కభీకభీ వంటి గొప్ప చిత్రాలన్నీ సాహిర్ కవితా చరణాలతోనే జనాదరణ పొందాయంటే అతిశయోక్తి కాదు.

మై ఎక్ దో పల్ క సాయర్ హూ

పల్ దో పల్ మెరీ కహానీ హై

ముఝ్ సె పహలే కిత్ నే షాయర్

ఆయే ఔర్ ఆకర్ చలేగయే

కుఛ్ ఆహే భర్ కర్ చలేగయే

కుచ్ నగ్ మే గాకర్ చలేగయే

ఓ భి ఎక్ పల్ క కిస్సాథా

మై భి ఎక్ పల్ క కిస్సాహూ

కల్ ఔర్ అయెంగె నగ్ మోంకి

ఖిల్ తీ కలియా చున్ నే వాలె

ముఝ్ సె బెహతర్ కహానే వాలె

తుమ్ సె బెహతర్ సున్ నే వాలే

నేను ఒకటి రెండు క్షణాల కవిని. నా కథ ఆ ఒకటి రెండు క్షణాలే. నాకంటే ముందు ఎంతో మంది కవులొచ్చారు. వచ్చివెళ్లిపోయారు. కొందరు ఆశలు నింపి, మరికొందరు గీతాలు పాడి పోయారు. అది ఒక క్షణంలో జరిగిన ఘటనే. నేనూ అంతే – ఒక్క క్షణకాలం వాణ్ణే… రేపొస్తారు వికసించిన గీతాల లేత మొగ్గలు వేరే వాళ్ళు. నా కంటే బాగా చెప్పేవాళ్ళు. మీకంటే బాగా విని ఆనందించేవాళ్ళు – అన్నది సాహిర్ తాత్త్వికత. ఇక్కడ కవిత్వం గురించి చెప్పినా, అది కేవలం దానికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం జీవితానికి సంబంధించింది. ఈ ప్రపంచం మారుతుంది. మనకన్నా హృదయ వైశాల్యం ఉన్నవాళ్ళు, మనకన్నా విజ్ఞత గలవాళ్ళు రేపొస్తారు – అన్న ఆశాభావం అందులో నిక్షిప్తమై ఉంది.

Also read: ఇండియాపై అభిమానం చూపిన బ్రాడ్లా

మిగతా చాలా మంది ఉరుదూ కవుల లాగా సాహిర్ దేవుణ్ణి (ఖుదా) ప్రేయసి అందాన్ని (హుస్న్), మద్యం (జామ్)ల గొప్పతనాన్ని ప్రశంసిస్తూ కవిత్వం రాయలేదు. జీవిత వాస్తవాల్ని, సమాజంలో దిగజారుతున్న విలువల్ని రాజకీయ దుష్పరిణామాల్ని చిత్రీకరించారు. ‘‘ఎక్ షహన్ షా నె దౌలతోంక సహారా లేకర్ హం/గరీంబోంకి మొహోబ్బత్ కీ ఉడాయా హై మజాక్’’ – తాజ్ మహల్ అందాలకు పొంగిపోకుండా, సామాన్యుడి హృదయఘోషను అలా పలికించారు. ఒక చక్రవర్తి తన ధన సంపద ఆసరాతోబీదల ప్రేమను అపహాస్యం చేశాడు అన్నది దాని అర్థం. ప్రేమ చక్రవర్తులకు, భూస్వాములకు, కార్పొరేట్లకు మాత్రమే పరిమితమా? పేదలకు, సగటు మనుషులకు ప్రేమించే హక్కే లేదా? – అని తీవ్రంగా మదన పడడం అందులో ఉంది. ప్రేమను వ్యక్తీకరించుకోవాలంటే డబ్బే ప్రధానమా? డబ్బులేని వారికి ప్రమలుండకూడదా? – అని ఆ చిన్న చరణంలో వ్యాఖ్యానించడానికి ఎంతైనా విషయం ఉంది. సాహిర్ చివరి దశలో – సినీరచయిత, హేతువాది జావిద్ అఖ్తర్ ఆయనతో సన్నిహింతంగా మెలిగారు.

Also read: నిజం బతికే రోజు రావాలి!

ఇక ఒక సారి సమకాలీన పరిస్థితులలోకి వస్తే – సమాజంలో పసిపిల్లలకు రక్షణ లేదు. మహిళలకు రక్షణ లేదు. మైనారిటీలకు, అణగారిన వర్గాలకు రక్షణ లేదు. ఒక వైపు ప్రణాళికలు, పథకాలూ లేని ప్రభుత్వం వలస కార్మికుల్ని వేల కిలోమీటర్లు నడిపించింది. ప్రభుత్వాలు చేతులెత్తేసినా, మనుషులే మనుషుల్ని ఆదుకున్నారు. సోనూ సూద్ లు మనవత్వ పతాకను పైకెత్తి రెపరెపలాడించారు. ఊహించని కరోనాతో దేశం తల్లడిల్లుతూ ఉంటే, మరో వైపు చెరువులు తెగి హైదరాబాద్ నగరాన్నివరదబురద ముంచేసింది. అంటే చెరువల్ని కాలనీలుగా మార్చిన అధికారుల అవినీతి ముంచేసింది. అన్ని వైపులా దారులు మూసుకుపోయిన స్థితిలో మహానగరంలో కొందరు ‘మనుషులు’ కనిపించారు. మతాలు,వర్గాలూ, ప్రాంతీయతలు వదిలేసి మనుషులే మనుషుల్ని ఆదుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువతీయువకులంతా నడుం బిగించారు. సహాయత-హెల్పింగ్ హాండ్స్- ముందుకొచ్చాయి. ఎన్నో ఎన్ జీ ఓలు, సామాజిక సంస్థలూ కలిసి పోయి ఒక్క తాటిమీద నడిచాయి. బట్టలూ, ఆహారం, మందులూ విరాళంగా సేకరించి, సర్వస్వం కోల్పోయినవారికి అందించారు. ఎక్కడెక్కడినుండో వచ్చిన అపరిచితులు స్నేహితులుగా కలసిపోయి స్వచ్ఛందంగా వాలంటీర్లయ్యారు. ఏ మతాలు, ఏ దేవుళ్ళు, ఏ మత గురువులు ఇందులో భాగస్వాములు కాలేదు. మనిషిలో క్రూరత్వం, ఈర్ష్యాద్వేషాలున్న మాట నిజమే కానీ, వాటిని అధిగమిస్తూ జాలి, దయ, ప్రేమ, బాధ్యత వంటి గుణాల్ని బహిర్గతం చెయ్యడం ఎంత గొప్పవిషయం? మనిషికి వారసుడు కేవలం మనిషే కదా?

Also read: నిజాం దుష్టపాలన అంతమైన రోజు

(25 అక్టోబర్ సాహిర్ లుథియానవీ వర్థంతి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles