Thursday, December 8, 2022

సిడ్నీలో భారత్-కంగారూ టగ్ -ఆఫ్- వార్

రోహిత్ శర్మ ,డేవిడ్ వార్నర్ ,  నవదీప్ సైనీ

  • ఇటు రోహిత్ శర్మ, అటు డేవిడ్ వార్నర్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో దిగ్గజాల సమరం పతాకస్థాయికి చేరింది. టాప్ ర్యాంక్ జట్లు ఆస్ట్ర్రేలియా, భారత్ జట్ల నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని నిర్ణయాత్మక మూడోటెస్ట్ సమరానికి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో రంగం సిద్ధమయ్యింది. సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో రెండుజట్లూ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే మూడోటెస్ట్ కీలకంగా మారింది.

  పరిమిత సంఖ్యలోనే అభిమానులు…       

ఆస్ట్ర్రేలియాను ప్రధానంగా విక్టోరియా స్టేట్ ను, సిడ్నీ ప్రాంతాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో భారత్, ఆస్ట్ర్రేలియాజట్ల టెస్ట్ సమరానికి క్రికెట్ ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభిమానులు మాస్క్ ధరించడాన్ని నిర్భందం చేసింది. సిడ్నీ స్టేడియం సామర్థ్యంలో కేవలం నాలుగోవంతుతోనే మ్యాచ్ నిర్వహించనుంది. కేవలం 25 శాతం మంది అభిమానులకు మాత్రమే టికెట్లు విక్రయించింది. టెస్ట్ మ్యాచ్ జరిగే ఐదురోజులూ రోజుకు 10వేల మంది అభిమానులను మాత్రమే అనుమతించనుంది.

రోహిత్, వార్నర్ బ్యాక్

మెల్బోర్న్ నుంచి సిడ్నీ చేరిన భారతజట్టు సభ్యులు బయోబబుల్ వాతావరణంలోనే నెట్ ప్రాక్టీసులో పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాలు, క్వారెంటీన్ నిబంధనల కారణంగా మొదటి రెండు టెస్టులకూ దూరమైన డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సిడ్నీటెస్ట్ బరిలోకి దిగనున్నాడు. మొదటి రెండుటెస్టుల్లో దారుణంగా విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మకు చోటు కల్పించారు.

ఇక తొడకండరం గాయంతో మొదటి రెండుటెస్టులకు దూరమైన కంగారూ ధూమ్ ధామ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం పూర్తి ఫిట్ నెస్ తో అందుబాటులోకి వచ్చాడు. యువ ఓపెనర్ పుకోవస్కీతో కలసి వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయి. తమదైన రోజున విధ్వంసకర బ్యాటింగ్ తో ఆట స్వరూపాన్నే మార్చివేయడంలో మొనగాళ్లుగా పేరుపొందిన రోహిత్, వార్నర్ తమతమ జట్ల జయాపజయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నారు.

నవదీప్ సైనీకి టెస్ట్ క్యాప్…!

ప్రస్తుత సిరీస్ లో ఇప్పటి వరకూ పరిమిత ఓవర్ల సిరీస్ కు మాత్రమే పరిమితమైన యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి తుదిజట్టులో చోటు కల్పించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయంతో నిష్క్ర్రమించడంతో…అతని స్థానం కోసం శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, నటరాజన్ పోటీపడుతున్నారు. అయితే…ఈ ముగ్గురిలో మెరుపు ఫాస్ట్ బౌలర్ సైనీ వైపే కెప్టెన్ రహానే, చీఫ్ కోచ్ రవిశాస్త్రి మొగ్గుచూపారు.

సిరీస్ లోని తొలి డే-నైట్ టెస్టులో ఆతిథ్య కంగారూ జట్టు 8 వికెట్లతో నెగ్గి 1-0తో పైచేయి సాధిస్తే  మెల్బోర్న్ లో ముగిసిన రెండోటెస్టులో భారత్ సైతం 8 వికెట్ల తేడాతోనే నెగ్గి 1-1తో సిరీస్ ను డ్రా చేయగలిగింది. సిరీస్ పై పట్టు బిగించాలంటే సిడ్నీలో జరిగే మూడోటెస్టులో నెగ్గితీరాల్సి ఉండడంతో రెండుజట్లు విజయమే లక్ష్యంగా సమరానికి సై అంటున్నాయి.

WATCH: Navdeep Saini Bowls a Fast Yorker to Dismiss Danushka Gunathilaka -  EssentiallySports

 భారత్ కే విజయావకాశాలు

స్వదేశీ వికెట్లు,వాతావరణాన్ని పోలివుండే సిడ్నీ గ్రౌండ్స్ లో భారత్ కు గొప్పగా విజయాల రికార్డు లేకపోయినా సంతృప్తికరమైన అనుభవాలే ఉన్నాయి. ఇప్పటి వరకూ సిడ్నీ వేదికగా 12 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన భారత్ గత మూడు టెస్టుల్లోనూ అజేయంగా నిలువగలిగింది. 1978లో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ 2 పరుగుల భారీవిజయం నమోదు చేసిన భారత్ గత రెండు టెస్టులను డ్రాగా ముగించిన ఆత్మవిశ్వాసంతో పోటీకి సిద్ధమయ్యింది. సిడ్నీ వేదికగా భారతజట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని కరీబియన్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ సైతం జోస్యం చెబుతున్నాడు.

బుమ్రా, సిరాజ్, సైనీ లతో కూడిన భారత పేస్ ఎటాక్, అశ్విన్, జడేజాల స్పిన్ జాదూను..కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ ఎంత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనగలదన్న అంశంపైనే టెస్ట్ తుదిఫలితం ఆధారపడి ఉంది. 2020 టెస్ట్ సీజన్ ను అద్భుత విజయంతో ముగించిన భారత్ 2021 సీజన్ ను మరో అద్భుత విజయంతో ఆరంభించాలని అజింక్యా రహానే అండ్ కో మాత్రమే కాదు. కోట్లాదిమంది భారత క్రికెట్ అభిమానులు సైతం కోరుకొంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles