Monday, June 24, 2024

అవసరార్థుల ‘దేవర’ అయ్యదేవర

‘ఆంధ్ర దేశపు మట్టి అదిమాకు కనకముత
ఆంధ్రదేశపు జలము అమృతంపు రసము
ఆంధ్రదేశపు గాలి అది మాకు ప్రాణము

ఆంధ్రదేశమే మాకు అమరదైవతము

అని జన్మభూమి గొప్పతనాన్ని ఎలుగెత్తిన నేత అయ్యదేవర కాళేశ్వరరావు.`

మన దేశంలోని 14 భాషలలో దేనిలో మాట్లాడినా నాకు అభ్యంతరంలేదు. కానీ అందరికి అర్థం కాకపోతే ప్రయోజనం ఉండదు. రాష్ట్రంలో అందరికి తెలిసిన భాష తెలుగు  కనుక అందులో మాట్లాడితే భాగుంటుంది. ఉర్దూ తెలిసిన వారూ కొన్నిలక్షల మంది ఉంటారు కనుక  ఈ రెండు భాషలను ప్రధాన భాషలుగా పరిగణిస్తున్నాం` అని రాష్ట్ర శాసనసభాపతిగా మాతృభాష పట్ల గల అభిమానాన్ని, ఇతర భాషల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. పరిపాలనా, వ్యవహారాలు మాతృభాషలోనే సాగాలని  అభిలషించారు.

Also Read : నట `మిక్కిలి`నేని

జీవిత విశేషాలు

కృష్ణా జిల్లా నందిగామలో 1881 జనవరి 22వ తేదీన లక్ష్మయ్య, వరలక్ష్మి దంపతలుకు  జన్మించిన  కాళేశ్వరరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలో, ఉన్నత విద్య కాస్త ఆలస్యంగా మచిలీపట్నంలో జరిగింది. రఘుపతి వెంకటరత్నంనాయుడుగారి ప్రియశిష్యులలో ఒకరిగా గుర్తింపుపొందిన ఆయనకు అక్కడ పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావుగార్లతో స్నేహం కుదిరింది. ఆంగ్ల, గణిత శాస్త్రాలలో మంచి ప్రావీణ్యం గల అయ్యదేవరకు మదరాసువెళ్లి ఇంజనీరింగ్ చదవాలని ఉండేది. కానీ చరిత్ర ప్రధానాంశంగా పట్టభద్రులై బందరులో చదివిన బడిలోనే  చరిత్ర ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు.  రెండేళ్ల పాటు  (1901-1903) ఉత్తమఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్న అనంతరం మదరాసు వెళ్ళి న్యాయ విద్యను అభ్యసించారు. 1906 నుండి విజయవాడ సబ్‌కోర్టులో 14 ఏళ్ళు న్యాయవాదిగా పనిచేశారు. 1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభల నుంచి ఆంధ్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడంతో పాటు స్వాతంత్య్ర పోరాటంలో నాలుగు సార్లు జైలుకు వెళ్ళారు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోనూ, హోంరూలు ఉద్యమంలోనూ వీరు పనిచేశారు.

Also Read : సరళ స్వభావుడు… సు­మధుర గాత్రుడు­

శాసనసభ్యుడిగా…

అవిభక్త మద్రాసు రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్ర శాసనసభలకు విజయవాడ నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1939లో మదరాసు అసెంబ్లీకి కాంగ్రెస్ పక్షాన విజయవాడ-బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ అఖండ విజయం సాధించి,  ప్రధానమంత్రి    రాజాజీకి  కార్యదర్శిగా  ఎన్నికయ్యారు. మద్యపాన నిషేధ చట్టం, అమ్మకం పన్ను,  దళితుల   దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో విశేష  కృషి చేశారు. బహుభార్యత్వ నిషేధపు బిల్లు ప్రవేశపెట్టారు.దేశానికి పల్లెలే పట్టు గొమ్మలంటూ చేతివృత్తులనూ, కుటీర పరిశ్రమలనూ ప్రోత్సహించారు. వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

1946లో శాసనసభకు విజయవాడ నుంచి ఎన్నికైన ఆయన   ప్రకాశంగారి పక్షం వహించారు. ప్రకాశంగారి మంత్రివర్గంలో  అవకాశం దక్కపోయినా ఆయనను  వీడలేదు. ఏడాది వ్యవధిలోనే  ప్రకాశం ప్రభుత్వం పడిపోయినా ఆయకు అండగా నిలిచిచారు.

సంస్కరణాభిలాషి

మదరాసులో న్యాయవాదిగా ఉన్న  సమయంలోనే కందుకూరి వీరేశలింగం పంతులు,  కొమర్రాజు లక్ష్మణరావుతో పరిచయం ఏర్పడింది. ఆ కారణంగా సంఘ సంస్కరణోద్యమానికి  బీజం పడింది. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావంతో  బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. నిమ్నజాతి ఉద్దరణ, సహపంక్తి భోజనాలు, మతాంతర కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. హిందుధర్మ పునరుద్ధరణకు కృషి చేశారు.

Also Read : విద్యాపిపాసి `కట్టమంచి`

వితరణశీలి

దాతృత్వంలోగురువు ప్రకాశం పంతులుగారికి ఏ మాత్రం తీసిపోని మనస్తత్వం. అయ్యదేవర వారిల్లు అతిథులు, అభ్యాగతులతో కళకళలాడుతుండేదిట. ఒక్కమాటలో`ధర్మసత్రం` లాంటిదని చెబుతారు. ఎవరైన చందాకు వస్తే ఆయనదే మొదటి చందా. అదీ పెద్ద మొత్తంగా ఉండేదట. `పంతులుగారిని చూస్తే ఊరికే పంపరులే` అని విరాళాల సేకర్తలు భరోసాగా  ఉండేవారట. అలాంటి పరిస్థితులలో గాంధీజీ పిలుపు స్ఫూర్తితో సహాయ నిరాకరణ ఉద్యమం, స్వరాజ్య సమరంలో పాల్గొంటూ న్యాయవాద వృత్తిని వదులుకున్నారు. దరిమిలా అటు కారాగారవాసం, ఇటు ఆర్థిక  ఇబ్బందులతో నలిగిపోయారు.అయినా దేశభక్తి, త్యాగనిరతి  తగ్గలేదు.

పురపాలక అధ్యక్షుడి నుంచి సభాపతి దాకా

బెజవాడ పురపాలక సంఘానికి రెండుసార్లు (1923-30) అధ్యక్షులుగా వ్యవహరించారు. కేంద్ర సహకార బ్యాంకు స్థాపనకు విశేష కృషి చేశారు. విజయవాడలో  మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, వంతెలన నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేపట్టారు.

Also Read : హాస్య కృష్ణ `మోహనీ`యం

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర శాసనసభకు జరిగిన  ఎన్నికలలో గెలిచి తొలి సభాపతిగా ఎన్నికయ్యారు. 1956 డిసెంబర్ 4వ  తేదీన ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై  1962వరకు కొనసాగారు. వారి హయాంలో మొట్టమొదటి సారిగా 1960లో హైదరాబాద్ లో అఖిల  భారత సభాపతులు సదస్సు జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా, విజయవాడ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించారు.    

సాహితీవేత్తగా

అయ్యదేవర  అనేక గ్రంథాలూ, వ్యాసాలూ  రాశారు.  గ్రంథాలయోద్యమంలో చురుకుగా పాల్గొంటూ  విజయవాడలో రాజారామ్మోహన్ రాయ్  గ్రంథాలయాన్ని స్థాపించారు. కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన విజ్ఞాన చంద్రిక గ్రంథమండలిలో కార్యదర్శిగా పనిచేశారు.  జైలులో ఉన్నకాలంలో ఫ్రెంచి విప్లవ చరిత్ర. అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర,, తురుష్క ప్రజాస్వామ్యం, చైనా జాతీయోద్యమ చరిత్ర,, ఈజిప్టు చరిత్ర అనే గ్రంథలు రాశారు.`నా జీవిత కథ-నవ్యాంధ్రం`పేరిట  స్వీయ చరిత్ర రాశారు.

Also Read : కథామురిపాల`గుమ్మి` పాలగుమ్మి

1962 ఎన్నికలలో పోటీ  చేసి ఫలితాల వెల్లడి ముందే రోజే (ఫిబ్రవరి 26) కన్నుమూశారు. ఆ ఎన్నికలలో విజయం సాధించారు. భారత ప్రభుత్వం `పద్మభూషణ్‌`తో గౌరవించగా,  .  ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో  సత్కరించింది. ఆయన గౌరవార్థం విజయవాడలో పేరొందిన మున్సి పల్‌ మార్కెట్‌కు ఆయన పేరు (కాళేశ్వరరావు మార్కెట్‌) పెట్టారు.

(ఈ నెల 26వ అయ్యదేవర కాళేశ్వరరావు వర్ధంతి)

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles