Friday, March 29, 2024

అహ్మదాబాద్ చుట్టూ తిరుగుతున్న భారత క్రికెట్

* ఒక్క వేదికలోనే 7 అంతర్జాతీయ మ్యాచ్ లు
* ఫ్రాంచైజీ లేకున్నా 12 ఐపీఎల్ మ్యాచ్ లు
* హైదరాబాద్, మొహాలీలకు మొండిచేయి

భారత రాజకీయాలు మాత్రమే కాదు…క్రికెట్ సైతం ప్రస్తుతం గుజరాత్ పెద్దల కనుసన్నలలో నడుస్తోందా? నరేంద్ర మోడీ స్టేడియానికి అనవసరపు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు..గుజరాత్ క్రికెట్ సంఘానికి, అహ్మదాబాద్ నగరానికి బీసీసీఐ పెద్దలు రెండువందల కోట్ల రూపాయలకు పైగా అనుచిత లబ్ది చేకూర్చుతున్నారా? అన్నప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

జే షాకు జై… గుజరాత్ కు జై.. జై…

భారత క్రికెట్ అంటే నిన్నటి వరకూ ముంబై, చెన్నై, కోల్ కతా లాంటి నగరాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. అయితే…ఇప్పుడు భారత క్రికెట్ కు అనధికారిక ప్రధానకేంద్రంగా అహ్మదాబాద్ చలామణి అవుతోంది. ఇంగ్లండ్ తో నాలుగుమ్యాచ్ ల టెస్టు, ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లలోని తొమ్మిది మ్యాచ్ ల్లో ఏడుమ్యాచ్ లను.. కేవలం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలను సైతం పక్కనపెట్టి…టీ-20 సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లనూ నిర్వహించారు. కరోనా, బయోబబుల్ పేర్లను అడ్డుపెట్టుకొని ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా వచ్చే వందల కోట్ల రూపాయల ఆదాయంలో సింహభాగం గుజరాత్ క్రికెట్ సంఘానికి దోచిపెడుతున్నారని దేశంలోని వివిధ క్రికెట్ సంఘాల పెద్దలు లోలోపల మధనపడిపోతుంటే.. క్రికెట్ విమర్శకులు మాత్రం.. బాహాటంగానే అంటున్నారు.

Also Read : క్రికెట్ చరిత్రలో అరుదైన రోజు

ఐపీఎల్ మ్యాచ్ ల్లోనూ అదే తీరు

ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్ ల కేటాయింపులోనూ బీసీసీఐ అహ్మదాబాద్, ముంబై నగరాల వేదికలకే పెద్దపీట వేసింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర్రాలలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా..అదేమీ పట్టించుకోకుండా ముంబైని ఐపీఎల్‌ వేదికగా ఎంపిక చేశారు. అహ్మదాబాద్‌ కేంద్రంగా ఫ్రాంచైజీ లేకపోయినా.. అత్యధికంగా 12 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం కల్పించారు. ఫైనల్స్ కు సైతం నరేంద్ర మోడీ స్టేడియమే వేదిక కానుంది.

చక్రం తిప్పుతున్న జే షా

భారత క్రికెట్ ను అహ్మదాబాద్ చుట్టూ తిరిగేలా చేయటంలో బీసీసీఐ ప్రధానకార్యదర్శి, కేంద్ర హోంమంత్రి తనయుడు జే షా ప్రధానపాత్ర వహిస్తున్నారు. బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెకవాటాల సమస్యలతో ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకొంటూ ఉండడంతో బీసీసీఐ వ్యవహారాలను జే షా ..అన్నీ తానై నడిపిస్తున్నారు.

మహనీయుడు సర్దార్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియాన్ని రాత్రికి రాత్రే నరేంద్ర మోడీ స్టేడియం గా మార్చపడేశారు. రాష్ట్ర్రపతి రామనాథ్ కోవిడ్ చేతుల మీదుగా…అమిత్ షా అధ్యక్షతన స్టేడియం ప్రారంభకార్యక్రమాన్ని నిర్వహించారు.

Also Read : మూడో యుద్ధానికి అంతా సిద్ధం

భారత అంతర్జాతీయ మ్యాచ్ లు, దేశవాళీ క్రికెట్ టోర్నీల మ్యాచ్ లు….అవీ చాలవన్నట్లుగా …12 ఐపీఎల్ మ్యాచ్ లకు నరేంద్ర మోడీ స్టేడియాన్ని వేదికగా ఎంపిక చేశారు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఏ ఒక్క క్రికెట్ వేదికకు ఇంత భారీస్థాయిలో మ్యాచ్ లు కేటాయించలేదు.

సర్దార్ పటేల్ స్టేడియం పునర్నిర్మాణ కార్యక్రమానికి గుజరాత్ క్రికెట్ సంఘం వ్యయం చేసిన 700 కోట్ల రూపాయల వ్యయంలో 300 కోట్ల రూపాయల వరకూ ఈ మ్యాచ్ ల కేటాయింపుతోనే సమకూరనున్నాయి.

మొహాలీ, హైదరాబాద్ లబోదిబో

ఐపీఎల్ వేదికలుగా ఎంపికైన కొన్ని నగరాల కంటే మెరుగైన వసతులతో పాటు, ఇతర మెట్రోసిటీలతో పోలిస్తే కొవిడ్‌-19 కేసులు నియంత్రణలో ఉన్నా.. హైదరాబాద్‌కు మాత్రం మొండిచేయి తప్పలేదు!

‘హైదరాబాద్‌కు ఐపీఎల్‌ మ్యాచ్‌లు తీసుకొచ్చే విషయంలో తాను శక్తిమేరకు పాటుపడ్డానని, స్వయంగా అహ్మదాబాద్ వెళ్లి బోర్డు కార్యదర్శి జే షాను అభ్యర్థించి వచ్చానని, అయినా ప్రయోజనం లేకుండా పోయిందని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ వాపోయారు.

Also Read : క్రికెట్ యాంకర్ కు యార్కర్ల కింగ్ మూడుముళ్లు

అహ్మదాబాద్‌ వెళ్లి.. బీసీసీఐ కార్యదర్శి జైషాతో మాట్లాడాను. ఏదైనా నేను అభ్యర్థించడం వరకే ఆ తర్వాత ఏ నిర్ణయమన్నది బీసీసీఐ చేతుల్లో ఉంటుంది. అంతకుమించి నేనేమి చేయలేను. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చూపించిన చొరవ అభినందనీయం. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు హైదరాబాద్‌ అత్యంత అనుకూలమైందంటూ బీసీసీఐని ఆయన కోరారు. హైదరాబాద్‌కు ఎందుకు అవకాశమివ్వలేదు అనే దానిపై బోర్డు ఎలాంటి కారణాలు చూపలేదు. ఏదైనా చేస్తామన్న తరహాలో వారు స్పందించారు. రాబోయే సీజన్‌లో ఏ జట్టు కూడా తమ సొంత మైదానంలో ఆడటం లేదు. కరోనా వైరస్‌ కేసులు పెరుగడమో లేక.. కొన్ని వేదికల్లో ఏమైనా సమస్యలుంటే అప్పుడేమన్న మనకు అవకాశం రావచ్చు’ అని అజర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

హైదరాబాద్ అంటే అంత అలుసా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభ సీజన్ 2008 నుంచి ప్రత్యేక కారణాలతో విదేశీ వేదికలుగా నిర్వహించిన టోర్నీలు మినహా ప్రతీ ఏటా హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరిగాయి. ఆతిథ్యంతో పాటు అభిమానంలో హైదరాబాదీల మర్యాదలను గతంలో ఎందరో అంతర్జాతీయ క్రీడాకారులు కొనియాడారు. అలాంటి ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్‌కు ఈ సారి ఐపీఎల్‌ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కలేదు.

దీనివెనుక బీసీసీఐ కార్యదర్శి జై షా హస్తం ఉందనేది కాదనలేని వాస్తవం. ఐపీఎల్‌ వేలానికి ముందే అహ్మదాబాద్‌ వేదికగా కొత్త ఫ్రాంచైజీని తెరపైకి తేవాలని ప్రయత్నించినా.. తగినంత సమయం లేకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో తన పరపతిని ఉపయోగించి ఈ సీజన్‌లో అత్యధిక మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరిగే విధంగా పావులు కదిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌ అవకాశం లేకుండా కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి కొట్టారు. దీంతో లీగ్‌ ఆతిథ్య అవకాశాన్ని కోల్పోయిన హెచ్‌సీఏ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి లభించే మొత్తంతో పాటు బీసీసీఐ నుంచి వచ్చే ఐపీఎల్‌ వాటాలను కూడా కోల్పోనుంది. దీంతో ఆర్థికంగా చాలా నష్టపోనుంది.

Also Read : కింగ్ పీలేను మించిన క్రిస్టియానో రొనాల్డో

కెప్టెన్ అమరీందర్ ఆగ్రహం

ఈ ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఎంపిక చేసిన వేదికల్లో మొహాలీ లేకపోవడంపై పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొహాలీతో వచ్చిన సమస్య ఏంటని, ఎందుకు పక్కనపెట్టారంటూ బీసీసీఐని ఆయన నిలదీశారు. తన అసంతృప్తిని తెలియచేస్తూ బీసీసీఐ కార్యదర్శికి ఘాటుగా ఓ లేఖ రాశారు.

రోజుకు 9వేలకు పైగా చొప్పున కరోనా కేసులు నమోదవుతున్న ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నప్పుడు.. మొహాలీతో వచ్చిన సమస్యేంటి. మేం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని అమరిందర్‌ స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో ఐపీఎల్‌ 14వ సీజన్‌ నిర్వహించనున్నట్టు షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.

Indian cricket revolving around Ahmedabad

అదే అసలు మతలబు

కేవలం కరోనా నిబంధనలు, బయోబబుల్‌ కారణంగానే అహ్మదాబాద్ ఎంపిక ప్రక్రియ జరిగిందని చెప్పేందుకు కూడా లేదు. ఆ లెక్కన చూస్తే ముంబై అసలు ఆ జాబితాలోనే ఉండాల్సింది కాదు. ఇక వసతుల విషయానికొస్తే.. మిగిలిన నగరాలకు హైదరాబాద్‌ ఏమాత్రం తీసిపోదు. గుజరాత్‌ నుంచి ఫ్రాంచైజీ లేకున్నా కేవలం బోర్డు కార్యదర్శి జై షా ప్రోద్బలం కారణంగానే అత్యధిక మ్యాచ్‌లు అహ్మదాబాద్‌కు కేటాయించారనేది బహిరంగ రహస్యమే.

ఐపీఎల్ ప్రస్తుత సీజన్ . వేదికల ఎంపికకు ముందే తెలంగాణా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బీసీసీఐతో పాటు ఐపీఎల్‌ పాలకవర్గానికి విన్నవించినా ఖాతరు చేయకుండా .. లాబీయింగ్‌ చేసిన వారికే మ్యాచ్ లు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : రెండో టీ-20లో భారత షాన్… ఇషాన్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని అహ్మదాబాద్ లో ప్రారంభించడానికి ముందు నుంచే ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బోర్డు ఎక్కడ లేని ఆసక్తి చూపుతోంది. ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులు ఇదే స్టేడియంలో జరుగగా.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ను సైతం నిర్వహిస్తున్నారు. అయినా మళ్లీ అక్కడే ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు జరుగడం వెనుక ఉన్న మతలబేంటో బోర్డు పెద్దలకే తెలియాలి. దేశంలో మరెన్నో మంచి వేదికలున్నా కేవలం గుజరాత్‌ గురించే చర్చించుకునే విధంగా పదేపదే ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం సమర్థనీయం కాదని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఐపీఎల్‌ ముగింపు దశకు వచ్చేసరికి కొవిడ్‌-19 ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి.. అందుకు తగ్గట్లే రెండో దశ మ్యాచ్‌లే అహ్మదాబాద్‌లో జరిగే విధంగా షెడ్యూల్‌ను రూపొందించడం కొసమెరుపు. ప్లేఆఫ్స్‌ సమయానికి సగం మంది ప్రేక్షకులను అనుమతించినా.. 60 వేల పైచిలుకు అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ చూసే అవకాశం ఉంటుంది. దీంతో టికెట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు.. ఫ్రాంచైజీల నుంచి వచ్చే మొత్తం, బీసీసీఐ నుంచి వచ్చే వాటాలతో అహ్మదాబాద్‌కు ఆర్థికంగా ఢోకా లేకుండా పోనుంది.

ఏది ఏమైనా భారత ప్రస్తుత రాజకీయాలలో కొనసాగుతున్న ఒంటెత్తు ధోరణే…భారత క్రికెట్లోనూ కొనసాగడం రానున్న కాలంలో దేనికి దారితీస్తుందో మరి.

Also Read : మంచిర్యాలలో అజర్ సందడి..

గత పాలకుల వల్లే

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రస్తుత స్థితికి గత పాలకుల నిర్ణయాలే కారణమని అజారుద్దీన్‌ తీవ్రంగా విమర్శించాడు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు శివలాల్‌ యాదవ్‌పై అజర్‌ విరుచుకుపడ్డాడు. ‘హెచ్‌సీఏకు శివలాల్‌ ఏం చేశాడు? ఎంత మంది ఆటగాళ్లకు శిక్షణనిచ్చాడు? గతంలో బోర్డు నుంచి 200 కోట్లు వస్తే వాటిని ఏం చేశారు? ఉప్పల్‌ స్టేడియం తప్ప ఎక్కడైనా కొత్తవి నిర్మించారా? గత 24 ఏండ్లలో జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి మీరు ఏం చేశారు? ఆ నిధులన్నీ ఎక్కడికి పోయాయి? మాపై విమర్శలు చేస్తున్న వాళ్లపై ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుండా సీనియర్‌ ప్లేయర్లు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఐదు లక్షలు ఇస్తామంటే అప్పుడు మేము సిద్ధమంటూ వస్తారు. ఈ కారణం వల్లే బయటి రాష్ర్టాల నుంచి సెలెక్టర్లను తీసుకురావాల్సి వస్తున్నది’ అని అన్నాడు. ఇదిలా ఉంటే ఈనెల 28న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్‌) ఉంటుందని అజారుద్దీన్‌ పేర్కొన్నాడు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంబుడ్స్‌మన్‌ నియామకం, సీఈవో, క్రికెట్‌ సలహాదారుల కమిటీ(సీఏసీ)తో పాటు పలు కీలక పదవులను భర్తీ చేస్తామని మీడియాకు తెలిపాడు.

Indian cricket revolving around Ahmedabad

Also Read : నవశతాబ్దిలో సరికొత్త రికార్డు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles