Friday, April 19, 2024

తాలిబాన్ తో భారత దౌత్యవేత్త అధికారిక చర్చలు

  • అఫ్ఘాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక ఉగ్రవాద చర్యలకు వినియోగించరాదని సూచన
  • అఫ్ఘాన్ లో మిగిలిపోయిన భారతీయులను భారత్ కు సత్వరం పంపించాలని విజ్ఞప్తి

భారత్ దేశం మొట్టమొదటిసారిగా తాలిబాన్ తో చర్చలు జరిపింది. కతార్ లో భారత రాయబారి దీపక్ మిట్టల్ అదే దేశం రాజధాని దోహాలో ఉన్న తాలిబాన్ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల అధికారిని షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ ని మంగళవారంనాడు కలుసుకొని చర్చలు జరిపారు. దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తాలిబాన్ నాయకులు చొరవ తీసుకున్న కారణంగానే ఈ సమావేశం జరిగినట్టు భోగట్టా. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేనల ఉపసంహరణ తర్వాత, తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్న దరిమిలా భారత దౌత్యవేత్తలు తాలిబాన్ ప్రతినిధులతో రహస్య సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం ఉంది. అయితే అధికారికంగా రాయబార కార్యాలయంలో బారత దౌత్యవేత్తకూ, తాలిబాన్ రాజకీయ ప్రతినిధికీ మధ్య చర్చలు జరగడం ఇదే ప్రథమం.

తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తర్వాత కూడా ఒక సమావేశంలో ప్రదాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ఉగ్రవాదులు అధికారంలో ఎక్కువ కాలం ఉండజాలరంటూ వ్యాఖ్యానించారు. కానీ తాలిబాన్ మాత్రం అమెరికాతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో దౌత్య సంబంధాలు పెట్టుకోవాలని కోరుతున్నారు. ఆ విషయం తాలిబాన్ ప్రతినిధులు పదేపదే స్పష్టం చేశారు. ఇండియాకు అఫ్ఘానిస్తాన్ నుంచి ఎటువంటి ప్రమాదం ఉండబోదని కూడా హామీ ఇచ్చారు. తాలిబాన్ వైఖరిలోమార్పు వచ్చిందనీ, ఇదివరకటిలాగా మొండి పట్టుదలకు పోకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, సామరస్యంగా ఇతర దేశాలతో కలసిమెలసి ఉండాలని కోరుకుంటున్నామని తాలిబాన్ తెలిపారు.

తాము పాకిస్తాన్ కి దగ్గరైనంత మాత్రాన భారత్ కు వ్యతిరేకం కాదని కూడా తాలిబాన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. అఫ్ఘానిస్తాన్ భూభాగాన్ని భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదులు ఉపయోగించకుండా చూడాలని మిట్టల్ తాలిబాన్ ప్రతినిధిని కోరారు. అటువంటి సమస్యలపైన తాలిబాన్ ప్రభుత్వం సకారాత్మకంగా వ్యవహరిస్తుందని స్టానెక్జాయ్ హామీ ఇచ్చారు. ‘‘భద్రత, రక్షణ వ్యవహారాలు, అఫ్ఘానిస్తాన్ లో మిగిలిపోయిన భారతీయులను త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి వీలు కల్పించడం’’ వంటి అంశాలపైన చర్చ జరిగిందని భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భారత్ ను సందర్శించాలని కోరే అఫ్ఘాన్ పౌరులనూ, ముఖ్యంగా మైనారిటీలైన సిక్కులనూ, హిందువులనూ అనుమతించాలని కూడా స్టానెక్జాయ్ ని మిట్టల్ కోరారు. అందుకు తాలిబాన్ నాయకుడు అనుకూలంగా స్పందించారని తెలుస్తోంది. స్టానిక్జాయ్ భారతలో నౌగాంవ్ సైనిక కళాశాలలో మూడేళ్లు శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత డెహ్రాడూన్ లో ఇండియన్ మిలిటరీ అకాడెమీలో చదువుకున్నారు.

అఫ్ఘానిస్తాన్ లో అధికారం తిరిగి హస్తగతం చేసుకున్న తాలిబాన్ లో ముఖ్యులైనవారితో భారత దౌత్యాధికారులు సంపర్కంలో ఉన్నారనీ, వారితో అవసరమైన సందర్భాలలో మాట్లాడుతున్నారనీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ ష్రింగ్లా తెలియజేశారు. అఫ్ఘానిస్తాన్ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామనీ, వేచిచూసే వైఖరిని అవలంబిస్తున్నామనీ పోయినవారం విదేశాంగ మంత్రి జయశంకర్ అఖిలపక్ష సమావేశంలో తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles