Friday, September 20, 2024

భారత సారథ్యంలో జీ-20 ప్రయాణం

  • ప్రపంచ గమనాని దిశానిర్దేశం చేసే అవకాశం
  • వివాదాస్పద దేశాలన్నీఈ కూటమిలో భాగస్వాములే
  • అందుకే లక్ష్య సాధన అంత తేలిక కాదు

మనుషులంతా ఒక్కటే, ఈ ప్రపంచమంతా కలిసి ఒకే కుటుంబం. అదే ‘వసుధైక కుటుంబం’. వినడానికి ఈ వాక్యాలు చాలా బాగున్నాయి. కానీ నేటి ప్రపంచంలో ఈ సిద్ధాంతం ఆచరణ సాధ్యమా? అన్నది కోట్ల మెదళ్లను, మనసులను తొలుస్తున్న ప్రశ్న. జీ -20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం ఇప్పుడే తీసుకుంది. మంచి గుర్తింపు, మంచి పరిణామం. ఈ సందర్భాన్ని ఒక వేడుకగా మనం జరుపుకుంటున్నాం. ఈ 1వ తేదీ నుంచి 7 వ తేదీ వరకూ దేశంలోని 100 గొప్ప కట్టడాలను విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా అలంకరించుకున్నాం. భారత్ ఆధ్వర్యంలో వసుధైక కుటుంబంగా ప్రపంచం ఏకమవ్వాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ మన బృందానికి శుభాభినందనలు కూడా పలికారు.”అతిధి దేవో భవ” సంప్రదాయం అడుగడుగునా చాటి చెప్పేలా ప్రతినిధులందరికీ అద్భుతమైన ఆహ్వానం పలుకుదామంటూ రాష్ట్రపతి ట్వీట్ కూడా చేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ జీ -20 అధ్యక్షులుగా మొన్న గురువారం నాడు అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ పదవిని, పరిణామాన్ని, బాధ్యతను మోదీ చాలా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. తన పదవీ కాలంలో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసుకోవాలనే బలమైన సంకల్పంతో ఉన్నారు. దానిని ప్రతిబింబించేలా వరుసగా ట్వీట్స్ పెడుతున్నారు. మానవాళి ఏకమైతే కానీ లోకం బాగుపడదు, మంచి భవిష్యత్తు ఉండదు అన్నది ఆయన ఉద్దేశ్యంగా ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దానిని సాధించాలంటే ప్రపంచ మానవసమూహంలో ప్రాథమిక ఆలోచనా ధోరణిలో మార్పు రావాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న ఆలోచనల్లో ప్రధానమైంది.

Also read: రాజకీయాలలో పెరిగిపోతున్న నేరస్థులు

సమైక్యమనేదే నినాదం

యుద్ధాలకు ముగింపు పలకాలంటున్నారు. ఆ ఊసే ఎత్తకూడదని అంటున్నారు. “వన్ ఇండియా -వన్ నేషన్” ఆయన మొదటి నుంచీ పలుకుతున్న స్లోగన్. అదే సూత్రాన్ని జీ -20 వేదికపైన కూడా పలికించాలన్నది ఆయన ఆశయంగా కనిపిస్తోంది. ఒకే భూమి – ఒకే కుటుంబం – ఒకే భవిష్యత్తు.. అనే నినాదంతో ఏకత్వాన్ని పోషించి ప్రోత్సహించేలా కృషి చేస్తూ ముందుకు సాగుదామని  ప్రపంచానికి మన ప్రధాని మార్గదర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి జీ -20 ని వేదికగా మలుచుకున్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పు, మహమ్మారులు వంటి వాటిని ఎదుర్కోవాలంటే  ఐకమత్యమే మహాబలం, మహామార్గమని నరేంద్రమోదీ బలంగా అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ఆచరణాత్మకంగా ముందుకు సాగుతామనే ఆత్మవిశ్వాసాన్ని ఆయన ప్రకటిస్తున్నారు. వైద్యం, సామరస్యం, ఆశల పల్లకిగా భారత్ ఆధ్వర్యంలో ఈ వేదిక ఐక సాగనుంది. కొత్త బాధ్యతలను తీసుకున్న వేళ కొత్తదనం చూపించడం కోసం, తద్వారా ప్రపంచ మానవాళికి మేలు జరగడం శుభోదయమే. అమెరికా, ఫ్రాన్స్ మొదలైన దేశాల మద్దతు మనకు ఎట్లాగూ ఉంది. మిగిలిన దేశాల మద్దతును కూడా కూడకట్టాల్సి వుంది.  జీ -20 గ్రూప్ సామాన్యమైంది కాదు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలన్నీ ఇందులో ఉన్నాయి. ప్రపంచంలో జీడీపీలో 85శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతం, పరిశోధనల ఖర్చులో 85 శాతం వాటా ఈ దేశాలదే. ఇది ప్రపంచంలోని బలమైన ఆర్ధిక శక్తుల కూడలి.

Also read: తెలుగు సాహిత్యానికి అడుగుజాడ గురజాడ

శక్తిమంతమైన దేశాల కూటమి

నిర్ణయాల విషయంలో చట్టబద్ధత లేకపోయినా లోకాన్ని ప్రభావితం చేసే శక్తి ఈ గ్రూప్ కు ఉంది. 1999లో బెర్లిన్ వేదికగా తొలి సదస్సు మొదలైంది. ఈ సారి మనం బాధ్యత వహిస్తున్నాం. మొత్తంగా ఇరవైఏళ్ళ పైబడిన ప్రయాణం సాగింది. అర్జెంటీనా నుంచి యూరోపియన్ యూనియన్ దాకా ముఖ్య దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. మన పెత్తనాన్ని ఏ మాత్రం సహించలేని చైనా వంటి దేశాలు కూడా ఇందులో ఉండడం గమనార్హం. వీటికి తోడు శాశ్వత ఆహ్వానిత దేశాలు కూడా ఉన్నాయి. స్పెయిన్ కు ఆ గౌరవం దక్కింది. జీ -20 గ్రూప్ లో పాకిస్థాన్ లేకపోవడం మనకు కాస్త కలిసాచ్చే అంశం. పాకిస్థాన్ రాజనీతి, విదేశీ విధానం విచిత్రమైంది. ఒకరకంగా స్వార్థంతో పాటు లౌక్యం పాలు ఒకింత ఎక్కువే. ముఖ్యంగా అమెరికా, చైనా, రష్యా.. ఈ మూడు దేశాలతో దాదాపు సమానమైన బంధాన్ని పెనవేసుకొని సాగుతున్న వైనం పాకిస్థాన్ సొంతం. ఆ దేశాలు కూడ అవసరార్ధం పల్లవిని మారుస్తూ ఉంటాయి. ఈ మూడు దేశాల వైఖరి భారత్ విషయంలో భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా చైనా మనల్ని శత్రు దేశంగానే భావిస్తోంది. రష్యాపై చైనా ప్రభావం ఎట్లాగూ నడుస్తూనే ఉంది. అమెరికా, రష్యాతో మన ప్రయాణం కీలకం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే ప్రతి అడుగూ మనం వేయాల్సి వుంది. అమెరికాతో ఎంతో అవసరం ఉన్నప్పటికీ పూర్తిగా ఆ దేశాన్ని నమ్మలేం. అభివృద్ధి చెందుతున్న దేశం స్థితి నుంచి అభివృద్ధి చెందిన దేశం స్థాయికి ఎదగడం మన ప్రథమ కర్తవ్యం. ఈ ప్రస్థానంలో జీ -20 దేశాల అధ్యక్ష బాధ్యతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బాధ్యత పోషించిన సమయంలో మన పాత్రను మనం వివేకంగా, వినూత్నంగా పోషించడమే మన ఎదురుగా ఉన్న ఎజెండా. వరల్డ్ బ్యాంక్,యూ ఎన్ ఓ, డబ్ల్యూ హెచ్ ఓ, ఐ ఎం ఎఫ్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ మొదలైన సంస్థలు కూడా సదస్సుల్లో హాజరవుతూ ఉంటాయి. ఆర్ధిక పరమైన అంశాలు ప్రధాన భూమిక పోషిస్తాయి.

Also read: జనచైనాలో ఆగ్రహజ్వాల

భవిష్యద్దర్శనం ప్రధానం

సమకాలీన అంశాలను స్పృశిస్తూనే భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సివుంది. పర్యావరణ మార్పులు, ఉగ్రవాదం, ఆరోగ్యంతో పాటు అధిక ధరలు, పన్నుల విధానాలు, అవినీతి మొదలైన అనేక అంశాల పట్ల కూడ చర్చలు, పరిష్కారాలు ఆచరణాత్మకంగా సాగాల్సివుంది. దేశాల సరిహద్దుల పరిస్థితి ఏ మాత్రం ఆరోగ్యదాయకంగా లేదు. దురాక్రమణలు ఎక్కువై పోతున్నాయి. ఉగ్రవాదానికి, యుద్ధాలకు వ్యతిరేకంగానే దాదాపు అన్ని దేశాలు మాట్లాడుతున్నాయి. చేతల్లో మాత్రం పొంతన లేదు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిన తంటాలు సామాన్యమైనవి. ఈ యుద్ధం జరగడానికి వెనకాల ఎవరెవరు ఉన్నారో? వారంతా జీ -20 గ్రూప్ లో సభ్యులుగానే ఉన్నారు. యుధ్ధోన్మాదం, సామ్రాజ్య కాంక్ష, ఆర్ధిక స్వార్ధాలు రగులుతూనే ఉన్నాయి. పొంచివున్న ఆర్ధికమాంద్యం రూపంలో ఆ మూల్యాన్ని అన్ని దేశాలు చెల్లిస్తూనే ఉన్నాయి. ఇటువంటి మనస్తత్వాలు, సవాళ్ల మధ్య ఐకమత్యం సాధించడం అతిపెద్ద సవాల్. భిన్న సంస్కృతులకు  నెలవుగా ఉన్న భారతదేశీయులకు, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించుకొనే భారతదేశానికి  ఏకత్వమనే భావన సహజంగా కలిగివున్న సౌభాగ్యం. ఆ సంస్కారంతోనే మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని ప్రతిపాదిస్తున్నారు. మిగిలిన దేశాల తీరు మనకు పూర్తి భిన్నం. సర్వమానవ ప్రయత్నంతో మాత్రమే వసుధైక కుటుంబాన్ని సాధించగలుగుతాం.

Also read: ఎలక్షన్ కమిషనర్ నియామక తంతుపై సుప్రీంకోర్టు ఆక్షేపణ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles