Friday, September 29, 2023

చైనాకు దీటుగా ఇండియా ఎదగాలి

అభివృద్ధి చెందుతున్న దేశంగా అడుగులు వేస్తున్న భారతదేశం అభివృద్ధి చెందిన అత్యాధునిక భూమిగా రూపాంతరం చెందడానికి చేస్తున్న ప్రయాణంలో వేగాన్ని మరింత  పెంచవలసిన తరుణం ఆసన్నమైంది. అది చారిత్రక అవసరం కూడా. మనకంటే పుష్కరం ముందే ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన చైనా అనుకున్నది సాధించింది. నేడు అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని కూడా ఢీకొడుతూ, రాబోయే దశాబ్దంలోపే అమెరికాను కూడా ఆదిగమించే స్థాయికి ఎదుగుతోంది. అప్రమత్తం అవ్వకపోతే అనుకున్నాదంతా జరుగుతుంది.

జోబైడెన్ కు సవాళ్ళ స్వాగతం

మరి కొన్ని రోజుల్లో అధికార పీఠాన్ని ఎక్కనున్న జో బైడెన్ కు చాలా సవాళ్లు స్వాగతిస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా తలనొప్పులు వచ్చాయి. అమెరికా ఆర్ధిక ప్రయాణ వేగానికి కొన్ని సడన్ బ్రేకులు పడ్డాయి. ఇదే అదను చూసుకున్న చైనా తన వ్యూహాన్ని మరింత పదునుపెట్టి, రష్యాకు దగ్గరయ్యింది. కమ్యూనిస్ట్ దేశాలను,అమెరికా వ్యతిరేక దేశాలను తన వైపు తిప్పుకుంది. ఒక్క భారత్ తప్ప, మిగిలిన తన సరిహద్దు దేశాలకు అనేక రూపాల్లో ఎరవేసి తన బుట్టలో వేసుకుంది.

సరిహద్దుల్లో కత్తులు నూరుతున్న చైనా

భారతదేశంపై కక్ష మరింత పెంచుకుని, సరిహద్దుల్లో కత్తులు నూరుతూ హద్దుఆపులు లేనట్లుగా ప్రవర్తిస్తోంది. చాలా దుర్మార్గాలకు పూనుకుంది. గల్వనాలో మనవారిని అతి కిరాతకంగా హతమార్చింది. సముద్ర మార్గాల్లో డ్రోన్ లు పెట్టి కొత్త కుట్రలకు తెరలేపింది. చైనాను నమ్ముకున్న నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి నేడు పదవిని కూడా పోగొట్టుకున్నాడు. ప్రచండ ఆ పదవిని లాక్కోవలని చూస్తున్నాడు. నేపాల్ లో పార్లమెంట్ రద్దయ్యింది. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

Also Read : బ్రహ్మపుత్రపై భారత్ సైతం…

ఓలి, ప్రచండ మధ్య రాజీకి చైనా యత్నం

ఈ లోపు వీళ్ళద్దరి మధ్యా సయోధ్య కుదర్చడానికి చైనా బృందం నేపాల్ వచ్చి మంతనాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించే దృశ్యాలు కనిపించడం లేదు. నేపాల్ వివాదంలో భారత్ మౌనం పాటిస్తూ తటస్థంగా ఉంది. నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకను భారత్ పై ప్రయోగించి, దెబ్బకొట్టాలని చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం భారత్ -చైనా మధ్య వున్న వాతావరణం గమనిస్తే ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

భారత్ – అమెరికా బంధం బలోపేతం

ఈ నేపథ్యంలో, భారత్ -అమెరికా బంధాలు బాగా పటిష్ఠమవుతున్నాయి. జో బైడెన్ -కమలా హ్యారిస్ రాకతో, అవి మరింతగా బలపడే శకునాలు కనిపిస్తున్నాయి. అమెరికా, చైనా దేశాల  పరిణామాలను  ప్రతిక్షణం గమనించాల్సిన అవసరం మన దేశానికి వుంది. చైనా, భారత్ కలిసి సాగే పరిస్థితులు ప్రస్తుతం లేవనే చెప్పాలి. ఉభయ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయికానీ, అవేమీ ఆచరణలో ఫలవంతం కావడంలేదు.

ఇటు భారత్, అటు చైనా, మధ్యలో రష్యా

రక్షణకు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో రష్యాతో భారత్ బంధాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. రష్యా – చైనా మధ్య బంధాలు బలపడుతున్న నేటి వాతావరణంలో, భారత్ -రష్యా  బంధాల భవిష్యత్తు కొంత అనుమానంగానే ఉంది. రక్షణ పరమైన అంశాల్లో సమాంతరంగా భారతదేశం అమెరికా సహకారాన్ని తీసుకుంటోంది. “శత్రువు శత్రువు మిత్రుడు” సూత్రంలో భారత్ -అమెరికా దగ్గరవుతున్నాయి. భారత్ తో అమెరికాకు ఉన్నది ఆర్ధిక అవసరాలే అయినప్పటికీ, చైనాతో జరుగుతున్న తన ఆధిపత్య పోరులో భారత్ అవసరాన్ని అమెరికా మరింతగా గుర్తించింది. వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటే, మన లెక్కలు మనకు ఉన్నాయి. భారత్ ప్రగతి ప్రయాణానికి అమెరికాతో సంబంధాలు పెంచుకోవాల్సిందే.

భద్రతామండలి సభ్యంత్వం రాకుండా అడ్డుకుంటున్న చైనా

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇంకా మనం తాత్కాలిక సభ్యులుగానే ఉన్నాం. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా, ఈ ఐదు దేశాలు శాశ్వత సభ్యులుగా (పి 5) ఉన్నాయి. భారతదేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా చైనా అడ్డుకుంటోంది. రష్యా తటస్థంగా ఉంది. మిగిలిన మూడు దేశాలు భారత్ ను బలపరుస్తున్నాయి. గతంలో, చైనాకు శాశ్వత సభ్యత్వం విషయంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రు చైనాకు మద్దతుగా నిలిచారు. నేడు అదే చైనా భారత్ కు అడ్డుపుల్ల వేస్తోంది. ఈ ఐదు దేశాలను బిగ్ 5 అని కూడా అంటారు.

Also Read : భూటాన్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా

జనాభాపరంగా చైనా తర్వాత భారత్

నిజం చెప్పాలంటే, ప్రపంచంలో జనాభా పరంగా  చైనా తర్వాత రెండవ స్థానంలో భారత్ ఉంది. ప్రస్తుత గణాంకాలు చూస్తే,చైనాను త్వరలో భారత్ అధిగమిస్తుంది.జనాభా పెరుగుదలకు సమానంగా, సమాంతరంగా ఆర్ధిక అభివృద్ధిని  సాధిస్తేకానీ భారతదేశానికి పెద్ద దేశంగా గుర్తింపురాదు. పాలకులు దీనిపై బలంగా దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చింది. కరోనా కాలంలో ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠ ఏంతో పెరిగింది. దాదాపు 139.5కోట్లు జనాభా కలిగిన భారతదేశంలో ఆరోగ్య పరంగా కరోనా వైరస్ ప్రభావం చాలా తక్కువగా నమోదయింది. దీనికి కారణం, భారతీయ జీవన విధానం.

భారత్ పై ప్రపంచ దేశాల దృష్టి

అగ్రరాజ్యలుగా చెప్పుకునే దేశాల కంటే భారతదేశంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో, మనదేశానికి ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నైతిక విలువలు పాటించడం, ఐకమత్యం వంటి సుగుణాలతో పాటు, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ భారతదేశం. కాబట్టి, చాలా దేశాలు నేడు భారత్ వైపు ఆకర్షణను పెంచుకుంటున్నాయి. వీటన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ , ప్రగతి ప్రయాణాన్ని ఉరకలెత్తించాల్సిన బాధ్యత పాలకుల భుజస్కంధాలపై ఉంది. అవసరాల మేరకు అంతర్జాతీయ సంబంధాలను మెరుగు పరుచుకుంటూ, అంతర్గత శాంతిని కాపాడుకుంటూ,  సర్వోన్నత అభివృద్ధిఫై దృష్టి సారిస్తూ, భారతదేశం ప్రపంచ ప్రయాణం చెయ్యాలి. రేసులో వెనుకబడకుండా అభివృద్ధి చెందిన దేశంగా అత్యంత త్వరితగతిన అవతరించాలి. ఆ దిశగా 2021ని సద్వినియోగం చేసుకోవాలని అభిలషిద్దాం.

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles