Tuesday, November 12, 2024

హేతుబద్ధత కొరవడిన దేశాల్లో భారత్ ఫస్ట్!

దేవుడి మీద అచంచల విశ్వాసం ఉండి, ప్రతిదాంట్లోనూ దైవాన్ని చూసే జనం ప్రకృతి ధర్మాల్ని అర్థం చేసుకోరు. శాస్త్రవివరణలను అర్థం చేసుకునే  ప్రయత్నమూ చేయరు. రోజూ పాలు తాగని విగ్రహాలు అప్పుడప్పుడు మాత్రమే ఎందుకు తాగుతున్నాయీ? ఏదో కొద్దిమంది విగ్రహాలకు పాలు తాగించి, దానికి విస్తృత ప్రచారం ఎందుకిస్తున్నారూ? అట్లా చేయడం వల్ల ఎవరికి లాభం? అనే విషయాలు ఆలోచిస్తే చాలా సులభంగా సమాధానాలు దొరుకుతాయి. అందులో అర్థం కానీ, గొప్పగొప్ప విషయాలు ఏమీ లేవు.

Also read: నిత్యజీవితంలో వైజ్ఞానిక స్పృహ

జనం హేతుబద్ధంగా ఆలోచించడం ఎక్కువైంది. పైగా దైనందిన యాంత్రిక జీవితం – ఏవో కొన్ని పండుగలు, పర్వదినాలల్లో తప్ప, రోజూ గుడికి వెళ్ళి అర్చనలు చేయించి, హారతులిచ్చి, దేవుడికి భారీగా కానుకలు సమర్పించే జనం తక్కువవుతున్నారు. ఆలయ ఆదాయం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డవాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న ధరల కారణంగా వీరి బతుకులు దర్భరమవుతున్నాయి. అలాంటప్పుడు ఎవరో కొద్ది మంది ఇలాంటి వదంతులను వ్యాపింపజేసి, ప్రజల్లో మూఢత్వాన్ని పెంచుతున్నారు. ఏదో ఒక సంచలనం సృష్టిస్తే గాని జనం దృష్టి పడదు.  జనం దృష్టి పడితేగాని, దేవుణ్ణి మొక్కుతూ గుళ్ళకి రారు. ‘‘దేవుడి మహిమ’’ అనే ఒక విస్మయం, ఒక అద్భుతం, ఒక భయం కల్పిస్తే గాని, వారు దేవుడి హుండీలో నాలుగు డబ్బులు రాల్చరు. హుండీలో డబ్బులు పడితేగాని, దేవాలయం ఆదాయం పెరగదు. అది పెరిగితే గాని ఆలయ సిబ్బందికి ఆర్థిక ఇబ్బందులు తగ్గవు. బహుశా ఇదీ దానికి నేపథ్యం! ఇదీ దాని నెట్ వర్క్!! విగ్రహాలు పాలు తాగే విషయమై జాతీయ స్థాయిలో ఒక టెలివిజన్ ఛానెల్ అభిప్రాయ సేకరణ చేపడితే- ‘‘తెలిసినవాళ్ళెవరైనా శాస్త్రీయ వివరణ ఇస్తే (కేవలం సర్ఫేస్ టెన్సన్ మాత్రమేనని నిరూపిస్తే) నమ్మడానికి తాము సిద్ధంగా ఉన్నామని’’ 85 శాతం మంది చెప్పారు.

Also read: విజ్ఞానమా? మతవిశ్వాసమా? ఏది కావాలి?

విగ్రహాలు పాలు తాగుతున్నాయన్న వదంతులు దేశాన్ని అప్పుడప్పుడు కుదిపేస్తున్నాయి. అయితే ఇది దేవుడి మహిమవల్ల కాదు – దానికి కారణం మరొకటి ఉంది. దేవుని మహిమే అయితే, ఆ దేవుడు తీర్థంతో పాటు ప్రసాదం కూడా స్వీకరించాలి కదా? భక్తులు దేవతా మూర్తులకు పులిహోర, దద్ధొజనం, లడ్డూ,  కోవ, పరమాన్నం లాంటివి తినిపిస్తే మనం కూడా ఆ భక్తుల అడుగుజాడల్లోనే నడిచి, వారు చెపుతున్న మహిమల్ని నమ్మొచ్చు. కానీ, ఆ పని వారుచేయలేదు. ఇక ముందు కూడా చేయలేరు. ఎందుకంటే  ద్రవపదార్థాలు తప్ప, ఘనపదార్థాలని విగ్రహాలు పీల్చుకోవు.

దేవుడి మహిమే అయితే విగ్రహాలు చక్కగా నోటీ ద్వారానే పాలు తాగాలి. కానీ, పాల చెంచా విగ్రహానికి ఏ భాగంలో తాకించినా అది పాలు పీల్చుకుంటుంది. దేవుడు గనక ఆయనకు నోరేమిటీ? అన్నిభాగాల నుండి స్వీకరిస్తాడు అని అంటే అది వితండవాదం అవుతుంది. అంత మాత్రానికి దేవతా విగ్రహానికి నోరు, ముక్కు, చెవులు, కళ్ళూ వంటి భాగాలెందుకూ? ఒక నిర్దుష్టమైన ఆకారమెందుకూ? ఇక్కడ తెలుసుకోవాల్సింది దేవుడి ధర్మాలు కానేకాదు. శిలాధర్మాలు తెలుసుకోవాలి! 21 సెప్టెంబర్ 1995న దేశంలో తొలిసారి ప్రచారంలోకి వచ్చిన ఈ సంఘటన- అప్పుడప్పుడు పునరావృత్తం అవుతూనే ఉంది. విగ్రహాలు పాలు పీల్చుకోవడం గుళ్ళోనే కాదు, బయట కూడా జరుగుతుంది. దానికి కారణం ‘‘సర్ఫేస్ టెన్సన్’’ అనే ఒక శాస్త్రీయమైన ధర్మం. అదేమిటంటే విగ్రహం అంతా మనకు కనిపించని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. అందువల్ల అవి పాలు పీల్చుకోవడం సాధ్యమవుతుంది. పీల్చుకున్న పాలు ఎక్కడికి పోతున్నాయీ? దేవుడి విగ్రహం జీర్ణం చేసుకుంటుందా? లేదు. విగ్రహం వెనుక వైపుకు గానీ, కింది వైపుకు గానీ పాలుకారిపోతున్నాయి. అంటే ఏమిటీ?ఇటు నుంచి పీల్చి, విగ్రహం అటు వదిలేస్తుందన్నమాట! అది కేవలం శిలాధర్మం మాత్రమే!

Also read: జ్ఞానం’- సంపాదించినవారంతా బౌద్ధులే!

ఇటీవల ఒకాయన గోడమీది కేలండర్ లోని దేవుని చిత్రానికి పాలు తాగించాడట. కేలండర్ అంటే పేపర్. పేపర్ పాలను పీల్చుకుంటుది కదా? కేలండర్ లు గుడ్డతో కూడా తయారవుతుంటాయి. అది కనుక గుడ్డ కేలండర్ అయి ఉంటే తప్పకుండా పాలు పీల్చుకుంటుంది.  అలాగే ఇటుకలక్కూడా పాలు తాగించొచ్చు. రోడ్డు మీద పడి ఉన్న రాయికీ తాగించొచ్చు. అంటే అలా పీల్చుకోవడం వాటి ప్రాథమిక లక్షణం! అదే మనం విగ్రహాలలో చూస్తున్నాం. తప్పితే, విగ్రహాలకు మహిమ ఉన్నట్టు కాదు. అలా మహిమలు ఉన్నట్టు ప్రకటించడమంటే, అది అజ్ఞానమైనా కావాలి. లేదా ప్రజలను మోసగించేందుకు ఉద్దేశపూర్వకంగా పన్నిన పన్నాగమైనా కావాలి.

‘‘ఏ నిరూపణకూ అందనిదే మహిమ’’- అని కొందరు భక్తులు నిర్వచిస్తున్నారు. మరి దాన్ని సవాలుగా తీసుకుని శాస్త్రజ్ఞులు కళ్ళకు ఎదురుగా నిరూపణలు జరుపుతూ  ఉంటే దాని గురించి జనం ఎందుకు ఆలోచించరూ? ఒక శాస్త్రవేత్త హైదరాబాద్ హబ్సీగూడలోని ఒక జాతీయ పరిశోధనా సంస్థ ఎదుట చెప్పులు కుట్టే మోచి పరికరానికి పాలు తాగించి చూపాడు. ఇటుకలు, రాళ్ళు, విగ్రహాలు పాలు పీల్చుకోవడం ప్రకృతి సహజమైన చర్య అని, దేవుడి మహిమ కాదని శాస్త్రజ్ఞులు ప్రత్యక్షంగా టెలివిజన్ కార్యక్రమంలో చూపారు. పాలల్లో రంగు కలిపి తాగిస్తే గనక, ఆ పాలు  ఆ విగ్రహంలో ఏఏ భాగాల్లోకి పీల్చుకోబడిందో, మళ్ళీ ఎక్కడి నుండి వదిలివేయబడిందో స్పష్టంగా చూసే అవకాశం కూడా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు చేసి చూసుకోవచ్చు.

Also read: ప్రపంచంలోని తొలి భౌతికవాదులు మన చార్వాకులు

ఇది ఇలా ఉండగా, లోగడ ఒక రోజు ముంబాయిలోని మహీమ్ బీచ్ వద్ద సముద్రంలోని నీరు తీయగా మారిందని, అందుకు కారణం హాజీ మక్దుమ్ బాబా మహిమేనని…వేల జనం కలుషితమైన నీరు తాగారు. వర్షం ఎక్కువగా పడ్డప్పుడు మన దొడ్లో చేదబావి నీరు పైకి రావడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అదే సూత్రం అక్కడ సముద్రపు పాయకు వర్తిస్తుంది కదా? భూగర్భ జలాలు పైకి రావడం,  వాతావరణ మార్పుల వల్ల, కెరటాలు రాకపోవడం వల్ల నీటిలో ఉప్పు శాతం తగ్గి ఉంటుంది. అంతేగాని, అది ఎవరి మహిమా కాదు. కాని ఇలాంటివి ‘‘మాస్ హిస్టీరియా’’ కింద మారి, జనం అంధవిశ్వాసాలకు బలి అవుతున్నారు. ఇప్పటికే అనేక రకాల మూఢనమ్మకాలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ  ఉండే జనం, ఎల్లప్పుడూ హేతుబద్ధంగా ఆలోచిస్తూ ఉంటే, ఒక ఆరోగ్యవంతమైన నూతన ఆదర్శ సమాజం రూపొందుతుంది.

దేశం బాబాలతో, స్వాములతో, మహర్షులతో రోగగ్రస్తమైపోతూ ఉంటే శాస్త్రవేత్తలు, సైన్సు కార్యకర్తలు, విద్యావేత్తలు ఎక్కువమంది కార్యరంగంలోకి రావాలి. ఓ పెద్ద డిగ్రీ సంపాదించుకుని, ఓ పది పరిశోధనా పత్రాల్ని ప్రచురించుకుని, మూడు సెమినార్లు, ఆరు సింపోజియాలకు హాజరైనంత మాత్రాన అయిపోయిందా? తమకు ఒక విలువను, గౌరవాన్ని ఇచ్చిన సమాజం పట్ల తమ బాధ్యత  తీరిపోతుందా? ఓ మహర్షి ‘‘ఆధునిక శాస్త్రవిజ్ఞానమంతా వేదాలలో ఉంది’’- అనంటే అందరూ స్పందించి ఖండించాల్సిందికదా? ఓ మహర్షి ‘‘విమానాల తయారీ వేదలలో ఉంది’’ అని వక్రంగా చెపితే అట్లా ఊరికే ఎందుకు వదిలేశారూ? ఇటు మతానికి అటు రాజకీయాలకు ముడిపెట్టిన స్వామి జైల్లో పడితే మేధావులు ఎందుకు మాట్లాడలేదూ? ఓ బాబా పడకగదిలో యువకుల హత్యలు జరిగితే అదేదో పవిత్ర కార్యంగా భావించారా? ఇలాంటి విషయాల్లో మార్గదర్శకంగా ఉండాల్సిన శాస్త్రజ్ఞుల పాత్రేది?  చొరవేదీ? ప్రభుత్వాలే మూఢనమ్మకాల్లో  కొట్టుకుపోతున్నప్పుడు వివేకవంతులైన సామాన్యులు తప్పకుండా ముందుకు రావాలి! తప్పదు.

Also read: భారత్ విశ్వగురువు ఎలా అయ్యింది?

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles