Friday, October 4, 2024

సెమీఫైనల్స్ కు రంగం సిద్ధం

5 రాష్ట్రాలలో పోటాపోటీగా అసెంబ్లీ ఎన్నికలు

ఎక్కువ చోట్ల బీజేపీ, కాంగ్రెస్ ల ముఖాముఖీ

లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలు కీలకమైనవి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. విస్పష్టమైన ఫలితాలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియ మాత్రమే మిగిలివుంది. ఎవరి రాజకీయాలు ఎట్లా ఉన్నప్పటికీ, ప్రజాతీర్పుకు ఎవరైనా తలవగ్గక తప్పదు. 2024 ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికలు జరగాల్సివుంది. ఈ లోపు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యంగా, ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాల్సివుంది. లోక్ సభ ఎన్నికలకు కాస్త ముందుగా ఈ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో, వీటిని సెమీఫైనల్స్ గా అభివర్ణిస్తున్నారు. ఈ రాష్ట్రాలలోని గెలుపుఓటములు ఆయా పార్టీల తీరుతెన్నులపై ఎంతో కొంత ప్రభావం చూపించవచ్చు. రాష్ట్రరాష్ట్రానికి సమీకరణాలు, సిద్ధాంతాలు వేరువేరైనప్పటికీ ఫలితాల ప్రభావాన్ని కొట్టి పారేయలేం. తాజాగా కర్ణాటక, కొన్ని నెలల క్రితం హిమాచల్ ప్రదేశ్ లో వచ్చిన గెలుపుతో కాంగ్రెస్ రెచ్చిన ఉత్సాహంతో ముందుకు సాగనుంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కోల్పోయిన దిగులులో బిజెపి వుంది. కొందరు నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి, తమ ఓటమికి కారణాలుగా వేరువేరు లెక్కలు చూపించినా ఓటమే ఓటమే -గెలుపుగెలుపే.

కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండాలి

అట్లే కాంగ్రెస్ కు కూడా, ఈ రెండు రాష్ట్రాల్లో గెలిచినంత మాత్రాన సంబరం చేసుకుంటే సరిపోదు. తమ వైఫల్యాలు,బలాబలాలు, సాధ్యాసాధ్యాలు, క్షేత్ర వాస్తవాలు గుర్తెరిగి ముందుకు సాగాలి. అధికారం ఎల్లకాలం ఎవరి సొత్తు కాదు. గెలుపు ఓటములు కావడికుండలవంటివి. అధికారంలో ఉన్న పార్టీలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతిపక్షంలో వున్న పార్టీలు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగాలి. ఈ సంవత్సరం మొదట్లో నాగాలాండ్,  త్రిపుర,  మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి గెలుపుబాట పట్టింది. ఇప్పుడు ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో మిజోరాం, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా బరిలో నిలబడి తమ సత్తా చాటుకోవాల్సివుంది. కశ్మీర్ లో కూడా ఎన్నికలు నిర్వహించవచ్చనీ వినపడుతోంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు వచ్చే జూన్ లో గడువు ముగుస్తుంది. ఏప్రిల్ లోనే లోక్ సభ ఎన్నికలు నిర్వహించాల్సిన నేపథ్యంలో, ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలకి కూడా కలిపి నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా ఎన్నికలు వచ్చే ఈ ఐదు రాష్ట్రాల్లో గెలుపు కోసం కత్తులు సాన పట్టే కాలం వచ్చేసింది. 40స్థానాల మిజోరాంలో ప్రస్తుతం ఎంఎన్ఎఫ్ అధికారంలో వుంది. కాంగ్రెస్ -5, బిజెపి – 1 సీటుతో ఉన్నాయి.ఈసారి కూడా ఎంఎన్ఎఫ్ కే అధికారం దక్కనుందని వినిపిస్తోంది.

ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో బీజేపీకి అవకాశాలు

90అసెంబ్లీ స్థానాలు కలిగివున్న ఛత్తీస్ గడ్ లో 71సీట్ల బలంతో కాంగ్రెస్ (యుపీఏ) అధికారపీఠంపై కూర్చొనివుంది. బిజెపి కేవలం 14సీట్లకే పరిమితమై వుంది. ఇక్కడ కూడా రేపటి ఎన్నికల్లో అధికార పార్టీకే ప్రజలు పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. 200మంది సభ్యులతో వున్న రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ బలమే ఎక్కువగా వుంది. కాంగ్రెస్ ఏలుబడిలోనే ఆ రాష్ట్రం వుంది.70 సీట్లతో బిజెపి బలమైన ప్రతిపక్షంగా నిలిచి వుంది. ఈసారి ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ఇక్కడ పాగా వెయ్యాలని బిజెపి శత విధాలా ప్రయత్నం చేస్తోంది.మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కు సవాల్ గానే మిగలనుంది. మధ్యప్రదేశ్ మాత్రం బిజెపి ఏలుబడిలోనే వుంది. మొత్తం 230స్థానాల్లో బిజెపి -130, కాంగ్రెస్ -96 సీట్లతో ఉన్నాయి. ఇక్కడ కూడా పోరు హోరుగానే సాగుతుంది. ఇక్కడ బిజెపి గెలుపుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత సమాచారం. 119స్థానాల తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం అధికారంలో వున్న బిఆర్ ఎస్ కు 103 స్థానాల గట్టి బలమే ఉంది. సీట్ల ప్రకారం చూస్తే బిజెపి 2సీట్లతో బలహీనంగా ఉంది.5సీట్లతో కాంగ్రెస్ కూడా దాదాపు అంతే వుంది. ఏఐఎంఐఎం కు 7స్థానాల బలం వుంది. రేపటి ఎన్నికల్లో గెలిస్తే

కేసీఆర్ పార్టీ (బిఆర్ఎస్ /టీఆర్ ఎస్) హ్యాట్రిక్ సాధించినట్లే.

బీజేపీ బలం తెలంగాణ పట్టణాలకే పరిమితమా?

పట్టణ ప్రాంతాల్లో బిజెపి బలంగానే వుంది. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు నష్టం తీసుకొచ్చే అవకాశం వుంది. ఆ మాటకొస్తే బిజెపిలోనూ రాష్ట్ర నాయకుల

మధ్య అంతర్గత కొట్లాటలు లేవని చెప్పలేం. మొన్న కోమటిరెడ్డి ఓటమే దీనికి ఉదాహరణ. కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టి అధికారంలోకి రావాలని బిజెపి చూస్తుంటే, బీఆర్ ఎస్ స్థాపనతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కెసిఆర్ చూస్తున్నారు. ప్రస్తుతం వున్న సమాచారం మేరకు రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపే గెలుపు గాలులు వీస్తున్నాయి. ఎన్నికల్లో రాజెవడో? రెడ్డవడో? తేలాలంటే అప్పటి దాకా ఆగాల్సిందే.ముందుముందు జరుగబోయే పరిణామాలను బట్టి అంచనాలు మారుతూ వుంటాయి. ఏదేమైనా సెమీఫైనల్స్ కు ప్రాక్టీస్ మొదలైంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles