Tuesday, April 23, 2024

తీరిక

ఏం చేస్తున్నారీ మధ్య

రిటైరైనారు కదా

ఎట్లా గడుస్తుందిఅడిగాడతడు

చదువుకుంటున్నాను

రాసుకుంటున్నాను.

అది కాదు

ఇంకేం చేస్తున్నారు’.

సభలకూ సమావేశాలకూ

వెళ్లొస్తున్నాను

పత్రికల్లో విహరిస్తున్నాను

అది కాదు

వాకింగ్ నుంచి ఇంటికెళ్ళగానే

ఏం తోస్తుంది మీకు.

బాల్కనీలో నిలబడి

అందరినీ పరిశీలిస్తాను

తమకోసం కాక

ఒక్కరైనా ఇతరుల కోసం

నడుస్తున్నారా అని ఆలోచిస్తాను.

రాత్రంతా వొంటి కంటిన

నిద్ర బూజును కిరణాల్తో దులుపుకుంటూ

స్వప్నాలను సాన బెట్టుకుంటాను.

తీరిక లేదంటారు

కాలక్షేపం కోసం వస్తానంటే వద్దంటారు

నిర్వ్యాపార పారాన్ని ముట్టిన

నిరంతర స్తబ్ద శబ్దంలా

ఏమిటో మాట్లాడుతున్నారు

ఇంతకూ ఏం చేస్తున్నారు

మనుష్యుల్ని కలుస్తున్నాను

ప్రయోజకత్వంమంటే ఏమిటో

తరచి చూస్తున్నాను

గతంలో చేసిన

పనికిమాలిన పనుల్ని

సమీక్షిస్తున్నాను

మా ఆవిడను మరింత పరిచయం చేసుకుంటున్నాను

పిల్లల్ని ప్రేమగా విపులంగా గమనిస్తున్నాను.

గతం కంటే వర్తమానమే

విలువైందని అవగతం చేసుకుంటున్నాను

భవితవ్యానికి ఆహ్వానం పలుకుతున్నాను

గానుగెద్దు జీవితానికి స్వస్తి చెప్తూ

ఏనుగెక్కినంత సంబర పడి పోతున్నాను

నాకు కాదు

నా మనసుకు తీరిక లేదని విన్నవించుకుంటున్నాను.

Also read: వఖ్త్

Also read: మారాము

Also read: మా ఊరు తప్పిపోయింది

Also read: ఒక రోజు

Also read: ప్రేమ తత్త్వం

Dr N.Gopi
Dr N.Gopi
ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ కులపతి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles