Thursday, April 25, 2024

సంకీర్ణం దిశగా కర్ణాటక

సంకీర్ణ దిశగా కర్ణాటక … – పీపుల్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ ప్రీపోల్‌ సర్వేలో వెల్లడి

•        మే 10వ తేదీన కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయపార్టీకి సంపూర్ణ మెజార్టీరాదని పీపుల్స్‌పల్స్‌ ప్రీపోల్‌ సర్వేలో వెల్లడి

•        కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ – పీపుల్స్‌ పల్స్‌

•        కాంగ్రెస్‌పార్టీకి 98,  బిజెపికి 92, జెడిఎస్‌కు 27 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్‌ ప్రీపోల్‌ సర్వేలో వెల్లడి

•        కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి 95 – 105, బిజెపికి 90`100, జెడిఎస్‌క 25-30, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌ ప్రీపోల్‌సర్వేలో వెల్లడి

•        కర్ణాటకలో ప్రీపోల్‌ సర్వేను పీపుల్స్‌పల్స్‌ సంస్థ – సౌత్‌ఫస్ట్‌ అనే ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌ కోసం నిర్వహించింది.

•        25 మార్చ్‌ నుండి 10 ఏప్రిల్‌ 2023 వరకు 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5600 శాంపిల్స్‌తో పీపుల్స్‌పల్స్‌ సంస్థ ప్రీపోల్‌ సర్వే నిర్వహించింది.

•        కాంగ్రెస్‌పార్టీకి  41 శాతం, బిజెపికి 36 శాతం, జెడిఎస్‌కు 16 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం – పీపుల్స్‌పల్స్‌

•        2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌పార్టీ అధికంగా 18 సీట్లు వచ్చే అవకాశం – పీపుల్స్‌పల్స్‌

•        2018 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత అధికార బిజెపి పార్టీ 12 సీట్లు, జెడిఎస్‌ 10 సీట్లు కోల్పోనున్నాయి – పీపుల్స్‌పల్స్‌

•        సిద్ధిరామయ్యకు జైకొట్టిన కర్ణాటక ప్రజలు – పీపుల్స్‌పల్స్‌

•        కర్ణాటక రాష్ట్రానికి సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 32 శాతం, 25 శాతం యడ్డ్యూరప్ప, 20 శాతం బసవరాజ బొమ్మై , 18 శాతం కుమారస్వామి, 5 శాతం డి.కె.శివకుమార్‌ను కోరుకుంటున్నారు – పీపుల్స్‌పల్స్‌

•        కర్ణాటక రాష్ట్రం అభివృద్ధి కాంగ్రెస్‌పార్టీతో సాధ్యమని 42 శాతం మంది, 38 శాతం మంది బిజెపి, 14 శాతం మంది జెడిఎస్‌ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు – పీపుల్స్‌పల్స్‌

•        ఏ పార్టీకి మెజార్టీ రానిపక్షంలో కాంగ్రెస్‌`జెడిఎస్‌ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని 46 శాతం, బిజెపి-జెడిఎస్‌ 41 శాతం, కాంగ్రెస్‌-జెడిఎస్‌-ఇతరులు 6 శాతం, బిజెపి-జెడిఎస్‌-ఇతరులు 7 శాతం మంది కోరుకున్నారు – పీపుల్స్‌పల్స్‌

•        రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశం ఏ పార్టీకి లేదని 31 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని 26 శాతం, బిజెపి 24 శాతం, జెడిఎస్‌ 15 శాతం మంది, చెప్పలేమని 4 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు – పీపుల్స్‌పల్స్

‌ఆర్. దిలీప్ రెెడ్డి

కర్ణాటక రాష్ట్రంలో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మెజార్టీకి అవసరమైన 113 స్థానాలు ఈ సారి కూడా ఏ పార్టీకీ లభించడంలేదని ‘పీపుల్స్ పల్స్‌’ రీసెర్చ్‌ సంస్థ‌ ఎన్నికల ముందు నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ‘‘సౌత్‌ ఫస్ట్‌’’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 మార్చి నుండి 10 ఏప్రిల్‌ వరకు నిర్వహించిన ఈ సర్వే ద్వారా కర్ణాటకలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈ సర్వేను పీపుల్స్ పల్స్‌ సంస్థ డైరెక్టర్‌ శ్రీ ఆర్‌.దిలీప్‌రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది.

సర్వేలో వెల్లడైన అంశాల్ని గమనిస్తే హోరాహోరి పోరులో ప్రతిపక్ష కాంగ్రెస్‌, పాలక బీజేపీపై కొంతమేర పైచేయి సాధిస్తుందని స్పష్టమవుతోంది. జాతీయ ప్రధాన స్రవంతి పార్టీలైన బీజేపీ-కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్ని ముఖాముఖి పోటీగా మలచడంలో విఫలమయ్యాయి. ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రభావంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మెజార్టీ సాధిస్తుందని ప్రచారం జరిగినా, అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రాహుల్‌ భారత జోడో యాత్ర ప్రభావం, ఇదే రాష్ట్రం నుంచి మల్లికార్జున్‌ ఖర్గేను పార్టీ అఖిల భారత అధ్యక్షుడుగా చేసిన పరిణామ ప్రభావం…. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల శ్రేణులు ఆశించిన స్థాయిలో ప్రజాక్షేత్రంలో లేదని తెలుస్తోంది. సర్వే ఫలితాల్ని బట్టి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్‌ మెథడాలజీ’ (పీపీఎస్‌) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో 20 శాంపిల్స్‌ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేద, సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 5600 శాంపిల్స్‌ సేకరించడం జరిగింది.

కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో కొంత మొగ్గు ఈ సర్వేలో కనిపించింది. కాంగ్రెస్‌ 98 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచే అవకాశాలున్నాయి. సర్వేలో ఆ పార్టీకి 95-105 స్థానాలు వస్తాయని తేలింది. బీజేపీకి 92 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆ పార్టీకి 90-100 సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఈ సర్వేలో వెల్లడయిన అంశాలను బట్టి చూస్తే రాష్ట్రంలో హోరాహోరీ పోటీ తప్పదనిపిస్తోంది. 27 సీట్లతో జేడీ (ఎస్‌) మరోమారు కీలకపాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ 25-30 సీట్లు గెలవవచ్చు. ఈ పరిణామాలను గమనిస్తే మరోమారు 2018లో వచ్చినట్టు హంగ్‌ ఫలితాలు పునరావృత్తమవడం ఖాయంగా కనిపిస్తోంది. గాలి జనార్థన్‌ నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన కేఆర్‌పీపీ పార్టీకి 1-2 సీట్లు రావచ్చు. ఎస్‌డీపీఐ, ఏఐఎంఐఎం పార్టీలకు ఒక్క సీటు కూడా వచ్చేలా లేదు. ఆప్‌ పార్టీ ప్రభావం స్వలంగా ఉన్నా నిర్దిష్టంగా సీట్లు లభించే అవకాశం లేదు. మరోవైపు ఈ సర్వేలో సుమారు నాలుగు శాతం మంది రాబోయే ప్రభుత్వం గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. మే 10న జరగనున్న ఎన్నికల్లో ఈ తటస్థుల పాత్ర కీలకం కాబోతుంది.

          2022 డిసెంబర్‌లో ‘పీపుల్స్ పల్స్‌’ నిర్వహించిన ట్రాకర్‌ పోల్‌లో వచ్చిన ఫలితాలే దాదాపు ప్రస్తుత సర్వేలో కూడా పునరావృత్తమయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వ మార్పు అనేది సూచిస్తోంది. కర్ణాటకలో 1985 నుండి వరుసగా రెండో సారి ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనే అంశం ఇక్కడ గమనార్హం.        ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ 2018 ఎన్నికలతో పోలిస్తే 2.86 శాతం ఓట్లను పెంచుకొని 18 సీట్లను అధికంగా సాధిస్తుంది. 2018లో 38.14 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌కు ఇప్పుడు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి.

          పాలక బీజేపీ ఓట్ల శాతం స్వల్పంగా తగ్గుతోంది. 2018లో 36.35 శాతం సాధించిన బీజేపీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది.

          గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన జేడీ (ఎస్‌) 16 శాతం ఓట్లను పొందనుంది. అంటే, 2018 కంటే 2.3 శాతం ఓట్లు తక్కువ. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 10 సీట్లు కోల్పోయి, ఇప్పుడు 27 సీట్లు పొందే అవకాశాలున్నాయి.

          ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని పీపుల్స్‌ పల్స్‌ ఓటర్లను ప్రశ్నించినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సానుకూలంగా 32 శాతం మంది స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి బి. యడియూరప్పకు 25 శాతం మంది ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైకి 20 శాతం మద్దతివ్వగా, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 18 శాతం, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు 5 శాతం మంది మద్దతిచ్చారు.

          కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని భావిస్తున్నారన్న ప్రశ్నకు, కాంగ్రెస్‌ అని 42 శాతం, బీజేపీ అని 38 శాతం, జేడీ (ఎస్‌) అని 14 శాతం మంది స్పందించారు.

          కర్ణాటకలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించగా 26 శాతం మంది కాంగ్రెస్‌ అని, 24 శాతం మంది బీజేపీ అని, 15 శాతం మంది జేడీ (ఎస్‌) అని తెలిపారు. నిర్దిష్టంగా ఎవరూ చేయలేరని 31 శాతం మంది, తెలియదని నాలుగు శాతం మంది చెప్పారు. పోలింగ్‌ తేదీన వీరు ఎలా స్పందిస్తారన్నది తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వానికి మరోమారు అవకాశమిస్తారా? అన్న నిర్దిష్ట ప్రశ్నకు 51 శాతం మంది ఇవ్వమని, 43 శాతం ఇస్తామని, ఆరు శాతం మంది చెప్పలేమనీ బదులిచ్చారు. 

          ఒకవేళ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే, ఏయే పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారని ‘పీపుల్స్ పల్స్‌’ ఓటర్లను ప్రశ్నించినపుడు కాంగ్రెస్‌ పార్టీ జేడీ (ఎస్‌)తో చేతులు కలపాలని 46 శాతం మంది చెప్పారు. 41 శాతం మంది బీజేపీ-జేడీ (ఎస్‌) కూటమిగా ఏర్పడాలని భావించారు. కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌)-ఇతరుల కూటమికి ఆరు శాతం, బీజేపీ-జేడీ(ఎస్‌)-ఇతరుల కూటమికి ఏడు శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతనిచ్చారు.

ప్రాంతాలు, వర్గాలుగా సమీకరణాలు…….            

          సామాజిక వర్గాలుగా విశ్లేషిస్తే… నూతన ఓటు బ్యాంకింగ్‌ను సానుకూలంగా ఏర్పర్చుకోవడంలో అన్ని పార్టీలూ విఫలమయ్యాయి. ముస్లిం ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌ పక్షంవైపు నిలబడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కొంత కాంగ్రెస్‌కు తోడవనుంది. కళ్యాణ్‌ కర్ణాటక కాంగ్రెస్‌కు సురక్షిత ప్రాంతంలా ఉండగా, ముంబాయి కర్ణాటక ప్రాంతంలో ఆ పార్టీకి కష్టంగా ఉంది. మధ్య కర్ణాటక, బెంగుళూరు ప్రాంతాలలో నువ్వా నేనా అనే పోటీ నెలకొని ఉంది. పాత మైసూరు, కోస్తా ప్రాంతాలు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి. పాత మైసూరులో జేడీ (ఎస్‌) కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ ఉంది. ఇక్కడ జేడీ (ఎస్‌) ఒకింత మెరుగ్గా ఉంది. కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్‌ బీజేపీ మధ్య పోటీ హోరాహోరిగా ఉంది. ఇక్కడ బీజేపీ ఇప్పుడున్న స్థానాలు కొన్ని కోల్పోయే అవకాశాలున్నాయి.

          కర్ణాటక ఎన్నికల్లో కులాలు కీలక పాత్రను పోషించనున్నాయి. ఇటీవల రాష్ట్రంలో అనేక ఘర్షణలు జరగడం కూడా గమనించవచ్చు. రాష్ట్రంలో సామాజిక వర్గాల వారిగా చూస్తే 55% ఓబీసీలు, 17% ఎస్సీలు, 7% ఎస్టీలు, 11% ముస్లింలు, 3.5% అగ్రవర్ణాలు, 2% క్రిస్టియన్లు ఉన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లు, అందులో చేసిన తాజా మార్పులు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.

          ఎన్నికల్లో లింగాయత్‌ల పాత్ర కీలకమైంది. జనాభాలో 15.3 శాతంతో వీరు 50 ఉపకులాలుగా ఉన్నారు. లింగాయత్‌లలోనూ వారివారి ఉపకులాల వర్గాలను బట్టి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలో రిజర్వేషన్లున్నాయి. పంచమశాలి లింగాయత్‌లు అధికంగా ఉంటారు. తర్వాత స్థానం వీరశైవ లింగాయత్‌, గానిగ్‌ లింగాయత్‌, సాదర్‌ లింగాయత్‌లది. ఈ వర్గాల ప్రభావం 70కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉంటుంది. బీజేపీకి మొదటి నుండి మద్దతుగా ఉంటున్న లింగాయత్‌లు మాజీ ముఖ్యమంత్రి యడియురప్ప కారణంగా ఇప్పటికీ ఆ పార్టీకే మద్దతుగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ అంచనాలను పరిశీలిస్తే లింగాయత్‌ అభ్యర్థుల ఎంపిక ఆధారంగా బీజేపీ, కాంగ్రెస్‌, జేడీ (ఎస్‌) పార్టీలు ఆయా సీట్లు పొందే అవకాశాలున్నాయి.

          కర్ణాటకలో వొక్కలింగాలు రెండో పెద్ద సామాజిక వర్గం. వీరు జనాభాలో 11శాతం ఉండి, 44కు పైగా నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన దేవగౌడ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈయన కుటుంబం ప్రభావం ఈ సామాజిక ఓటర్లపై అధికంగా ఉంటుంది. కాంగ్రెస్‌లో కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలుండడంతో కొన్ని ప్రాంతాల్లో వారి ఓటు బ్యాంకు ఆ పార్టీకి దోహదపడుతోంది. ప్రస్తుతం వొక్కలింగాలు ప్రధానంగా జెడీ (ఎస్‌)కు మద్దతుగా ఉంటున్నారు, తర్వాత కాంగ్రెస్‌ పక్షాన నిలుస్తున్నారు.

          కాంగ్రెస్‌ అహిండా సమీకరణాల ఫలితంగా ఓబీసీలో కురుబలు, లింగాయతేతరులు, వొక్కలింగాయేతరులు ఆ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభావంతో కూడా ఆయా  వర్గాలు కాంగ్రెస్‌ పక్షాన ఉంటున్నారు.

          2011 జనాభా లెక్కల ఆధారంగా కర్ణాటకలో 17.15% మంది ఎస్సీలున్నారు. ఎస్సీ వర్గాలలో ప్రధానంగా ఆది కర్ణాటక (25.7%), మాదిగ (15.2%), బంజారా (11.6%), బోవి (11.2%), హోలయా (7.5%), ఆది ద్రావిడ (7.2%), భాంబి (6.6%) ఉపకులాల వారున్నారు. ఎస్సీలలో వారి వారి సంప్రదాయాల ఆధారంగా ఎస్సీ లెఫ్ట్‌, ఎస్సీ రైట్‌ వర్గాలున్నాయి. ఓటింగ్‌ సమయంలో ఈ విభజన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్సీ లెఫ్ట్‌ (మాదిగలు) కాంగ్రెస్‌పై కొంత అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్‌ ఖర్గే ప్రభావంతో ఎస్సీ రైట్‌ వర్గం ఆ పార్టీ పక్షాన నిలుస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఎస్సీ లెఫ్ట్‌ బీజేపీకి, ఎస్సీ రైట్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు.

          రాష్ట్రంలో ఎస్టీలు దాదాపు ఏడు శాతం ఉన్నారు. ఈ వర్గంలో ఎస్టీ`వాల్మీకీ వర్గం 70%తో ఆధిపత్యం కలిగి ఉంది. బీ.శ్రీరాములు ప్రభావంతోపాటు హిందుత్వం కారణంగా ఎస్టీ నాయక్‌లు బీజేపీ వైపు ఉన్నారు. ప్రస్తుత స్థూలంగా ఎస్టీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.

కోస్తా కర్ణాటక

          కోస్తా కర్ణాటక ప్రాంతంలో సామాజిక ప్రభావం భిన్నంగా ఉంటుంది. ఓబీసీలలో ఈదిగా, మొఘవీర, బంట్స్‌ (షెట్టి), తులుస్‌, బెల్లావాస్‌ వర్గాల ఆధిపత్యం ఉంది. ఈ ప్రాంతంలో ముస్లింలు కూడా అధికంగానే  ఉన్నారు. మంగళూరు సమీపంలో క్రిస్టియన్ల ప్రభావం కూడా ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో బ్రాహ్మణుల ఆధిపత్యం కనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని బట్టి ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్‌ వైపు ఉండగా, బ్రాహ్మణులు బీజేపీ పక్షాన ఉన్నారు. ఓబీసీలోని ఈదిగాలు, మొఘవీరాలు బీజేపీకి మద్దతుగా ఉంటున్నా, అభ్యర్థులను బట్టి కొంతమేర కాంగ్రెస్‌కూ అనుకూలంగా ఉండవచ్చు. విశ్వకర్మ, ఉపార, జైన్‌, క్షత్రియ, బలిజ, హడ్పాడా సామాజిక వర్గాల ఓట్లు రెండు ప్రధానపక్షాలకూ పడనున్నాయి.

          బాంబే కర్ణాటక, హైదరాబాద్‌ కర్ణాటకలోని కొన్ని భాగాలలో ఉండే మరాఠాల మద్దతు చాలావరకు బీజేపీకి ఉండగా, కాంగ్రెస్‌లో బలమైన నేతలున్న చోట ఆ పార్టీకి అనుకూలంగా ఉంది. మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎమ్‌ఈఎస్‌) ఈ ప్రాంతంలో అభ్యర్థులను బరిలోకి దింపడంతో ప్రధానంగా బెల్గావి జిల్లాలో ఆ ప్రభావం కొంతమేర కనిపిస్తుంది.

భారతీయ జనతా పార్టీ బలాలు, బలహీనతలు

          లింగాయత్‌ ముఖ్యమంత్రి బీజేపీకి ప్రధాన బలం. ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్‌ కురుబాలకు (సిద్దరామయ్య సామాజిక వర్గం), జేడీ (ఎస్‌) వొక్కలింగాలకు (దేవగౌడ్‌ సామాజిక వర్గం) ఇస్తుందని, బీజేపీ మాత్రమే లింగాయత్‌లకు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందనే ప్రచారంతో ఆ వర్గం ఓట్లను గంపగుత్తగా పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

          బీజేపీ ప్రభుత్వం ఈబీసీల్లోని ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి లింగాయత్‌లకు, వొక్కలింగాలకు సమానంగా పంచింది. దీంతో వొక్కలింగాల రిజర్వేషన్లు 4 నుండి 6 శాతానికి, లింగాయత్‌ల రిజర్వేషన్లు 5 నుండి 7 శాతానికి పెరిగాయి. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెంచారు. ఎస్సీ లెఫ్ట్‌ వర్గానికి ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లపై లింగాయత్‌లలో హర్షం వ్యక్తంగా కాగా, వొక్కలింగాలలో ఎలాంటి స్పందన లేదు. ఎస్సీ లెఫ్ట్ లో దీనిపై అవగాహన కనిపించలేదు. ముస్లింలలో రిజర్వేషన్ల అంశంపై అవగాహన తక్కువ ఉన్నా వారంతా కాంగ్రెస్‌ పక్షాన నిలబడుతున్నారు.

          టిప్పు సుల్తాన్‌, ఈద్గా మైదాన్‌ వివాదాస్పద అంశాలను బీజేపీ లేవనెత్తింది. దీని ప్రభావం కోస్తా కర్ణాటకలో ఉండొచ్చు. 2018 ఎన్నికల ముందు జరిగిన పరేశ్‌ మిశ్రా హత్య ప్రభావం ఆ ఎన్నికల్లో చూపలేదనే అంశం ఇక్కడ గమనార్హం.

మోడీ ప్రజాకర్షణపైనే బీజేపీ ఆశలు

          బీజేపీ మోడీ ప్రజాకర్షణపైనే అధికంగా ఆధారపడిరది. బీజేపీ ప్రచారం మోడీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ పేదల కోసం పనిచేస్తున్నారనే ప్రచారాన్ని బీజేపీ పెద్ద ఎత్తున చేపట్టింది. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సామాన్య ప్రజల్లో అంతగా వ్యతిరేకత కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వం పనితీరుపై 47% కంటే ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దాదాపు రాష్ట్ర సర్కారుపై వ్యక్తం చేసిన సంతృప్తి కంటే రెండిరతలు.

          కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్‌ మధ్య విభేదాలపై బీజీపీ ఆశలు పెట్టుకొంది. అయితే ఈ ఇద్దరి నేతల మధ్య పోటీ లేదని, సిద్దరామయ్య వైపే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నారని ‘పీపుల్స్ పల్స్‌’ సర్వేలో తేలింది. లోగడ సిద్దరామయ్య ప్రభుత్వంలో అవినీతిని బీజేపీ ప్రస్తావిస్తోంది. అయితే, ప్రస్తుతమున్న బీజేపీ ప్రభుత్వం అవినీతిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నందున సదరు ప్రస్తావనల ప్రభావం పెద్దగా లేదని ‘పీపుల్స్ పల్స్‌’ సర్వేలో తేలింది. కర్ణాటక అభివృద్ధిపై ఆలోచన కాకుండా, అధికారం చేపట్టి రాష్ట్రాన్ని ఒక ఏటీఎమ్‌గా కాంగ్రెస్‌ వాడుకోజూస్తోందన్నది బీజేపీ విమర్శ. ఈ అంశం కన్నా…. కాంగ్రెస్‌లో వర్గాల వారీ టిక్కెట్టు పంచాయితీలే వారికి ఎక్కువ నష్టం కలిగించేలా కనిపిస్తోంది.

ఉజ్వల యోజన, పీఎమ్‌ ఆవాస్‌ యోజన పథకాల లబ్దిదారులను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి అంశాలను బీజేపీ ప్రచారం చేస్తోంది.

కాంగ్రెస్‌ బలాలు, బలహీనతలు

          ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతూ ‘40% సర్కారు’ కమీషన్‌ నినాదంతో కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరుస్తోంది. బీఎస్‌ బొమ్మై ఒక బలహీన ముఖ్యమంత్రిగా ప్రజలు భావిస్తున్నారని, తమ అస్త్రం అదే అని కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను బీజేపీ తొలగించిందనే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ లింగాయత్‌లలో విభజన ద్వారా బీజేపీకి నష్టం కలిగించాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది. దీని ప్రభావం అంతగా లేదు. ఎన్నికల హామీలుగా తాను ప్రకటించిన గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి పథకాలపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. దీనికి స్పందన కూడా లభిస్తోంది.

          రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడం ఎన్నికల జిమ్మిక్కుగా విమర్శిస్తున్న కాంగ్రెస్‌, ఈ అంశం తమకు లాభిస్తుందనే ఆశలో ఉంది. రిజర్వేషన్లపై విమర్శలను బీజేపీ పట్టించుకోవడం లేదు. బీజేపీలో చీలికలు తమకు కలిసొస్తాయన్నది కాంగ్రెస్‌ ఆశ. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీ, ఇతర పక్షాల నుంచి కాంగ్రెస్‌లో చేరుతుండటం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందనే అంచనాతోనే బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆ పార్టీ చెప్పుకుంటుంది. కన్నడనాట హిందీ భాషను రుద్దడం అనే అంశాన్ని కాంగ్రెస్‌ ‘సెంటిమెంట్‌’గా లేవనెత్తుతోంది. పెరుగుపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించిన విధంగా ‘మొసరు’ స్థానంలో ‘దయి’ పదం వాడే అంశాన్ని ‘కర్ణాటక ఆత్మగౌరవ’ అంశంగా కాంగ్రెస్‌ ప్రచారం చేస్తుంది.

ఎన్నికల ప్రధానాంశాలు

          అవినీతి ఎన్నికల ప్రధాన ప్రచారాంశంగా మారింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టులలో, పథకాల అమలులో ‘40% సర్కార్‌’(కమీషన్లు)ఎన్నికల్లో ప్రధానాంశంగా ఉంది. కర్ణాటక ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రధానమైనవి. ఎన్నికల ముందు రిజర్వేషన్లలో సవరణలను బీజేపీ ప్రకటించింది. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలింగాలకు, లింగాయత్‌లకు పంచింది.

కీలకం కానున్న వ్యవసాయ అంశాలు

          చెరకుకు, కొబ్బరికి కనీస మద్ధతు ధర ప్రధాన అంశంగా ఉంది. ప్రస్తుతమున్న మద్దతు ధరలు సరిపోవడం లేదని రైతులు అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు బీమా అందకపోవడంతోపాటు ఇందులో అవినీతి జరుగుతోందని రైతులు విమర్శిస్తున్నారు. మహాదాయి నది నుండి నీటి సరఫరా కోసం ముంబాయి కర్ణాటక రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇక్కడ గోవా ప్రభుత్వం అడ్డంకులతో ప్రాజెక్టు పూర్తి కాలేదు.

కీలకం కానున్న ప్రజా సమస్యలు

          రోడ్ల దుస్థితిపై ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది. పాత పెన్షన్‌ పథకం అమలుకు ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పథకం అమలు చేయడానికి ముందుకొచ్చే పార్టీకే మద్దతివ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.

          మతతత్వ అంశాలు, హిందుత్వ అంశాలు కోస్తా కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలలో కనిపిస్తున్నాయి. వొక్కలింగాల యోధులైన ఊరిగౌడ, నంజేగౌడలను టిప్పు సుల్తాన్‌ హత్య చేసిన అంశాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేస్తూ ఆ సామాజిక వర్గాల మద్దతును కూడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ కోరుకున్నట్లు వొక్కలింగాల పూర్తిమద్దతు ఆ పార్టీకి లభించడం లేదు. వారు, మొదటి ప్రాధాన్యత జేడీ (ఎస్‌)కు, రెండో ప్రాధాన్యత కాంగ్రెస్‌కు ఇస్తున్నారు.

రాజకీయల పార్టీల యాత్రలు

          విజయ్‌ సంకల్ప యాత్ర (బీజేపీ) : బీజేపీ చేపట్టిన విజయ్‌ సంకల్ప యాత్ర సామన్య ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యింది. మరోవైపు బీజేపీ చేపట్టిన బూత్‌ విజయ్‌ సంకల్ప అభియాన్‌ ప్రచారం విజయవంతం అయ్యింది.

          ప్రజాధ్వని యాత్ర (కాంగ్రెస్‌) : కాంగ్రెస్‌ చేపట్టిన ప్రజాధ్వని యాత్ర సామన్య ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యింది.

          పంచరత్న యాత్ర (జేడీఎస్‌) : జేడీఎస్‌ చేపట్టిన పంచరత్న యాత్ర సామాన్య ప్రజలను ఆకర్షించడంలో విజయవంతం అయ్యింది.

ఇతర అంశాలు

          బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌లో ముఖ్యనేతలు రాష్ట్రంలో తక్కువగా పర్యటించారు. బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంలో అనేకమార్లు విస్తృతంగా పర్యటించగా, కాంగ్రెస్‌ జాతీయ నాయకులు రాష్ట్రంలో ఒకటి, రెండు మార్లే పర్యటించారు.

          కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డులను అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ గ్యారెంటీ కార్డుల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం కూడా జరగలేదు.

          ‘పీపుల్స్‌ పల్స్‌’ ప్రతినిధులు ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో నెల రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లతో ముఖాముఖిగా మాట్లాడి, గ్రూపులవారీగా మాట్లాడి రాజకీయ పరిస్థితులను పరిశీలించి అక్కడ ఏ పార్టీవైపు మొగ్గు ఉందో ఒక అంచనాకు వచ్చారు.

దిలీప్‌రెడ్డి,

డైరెక్టర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles