Thursday, April 25, 2024

యూపీ పంచాయితీ ఎన్నికలలో పని చేసిన వందలమంది టీచర్లు కోవిద్ వల్ల మృతి

యోగీ సర్కార్ పై ప్రియాంక, అఖిలేష్ ధ్వజం

లక్నో: కోవిద్ మహమ్మారి ఉత్తరప్రదేశ్ లో విలయతాండవం చేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని ప్రభుత్వం వాస్తవాలను దాచడానికి నిర్లజ్జగా ప్రయత్నిస్తున్నది. ఆ రాష్ట్రంలో రెండో సారి కోవిద్ విలయతాండవం ప్రారంభించినప్పటి నుంచీ 1621 మంది ఉపాధ్యాయులూ, ఉపాధ్యాయినిలూ ఆ వ్యాధి కారణంగా మరణించారని ఉత్తరప్రదేశ్ ప్రాథమిక్ శిక్షక్ సంఘ్ అధ్యక్షుడు డాక్టర్ దినేశ్ చంద్ర శర్మ ప్రకటించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి మే 16 వరకూ మరణించిన ప్రాథమిక ఉపాధ్యాయులు సంఖ్య ఇది. వీరిలో 90 శాతం కంటే ఎక్కువ మంది టీచర్లు పంచాయతీరాజ్ ఎన్నికలలో విధులు నిర్వహించిన తర్వాత మృతి చెందారని డాక్టర్ శర్మ వెల్లడించారు.

పేర్లతో సహా చేసిన ఈ ప్రకటనను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరిస్తూ మరణించిన టీచర్ల సంఖ్య మూడు మాత్రమేనని దబాయిస్తున్నది. ఈ వైఖరిని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ, సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ లు ఖండించారు. పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన సందర్భంలో కూడా ప్రియాంగ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కోవిద్ విలయతాండవం చేస్తున్న దశలో పంచాయితీ ఎన్నికలు జరపవలసిన అవసరం ఏమున్నదంటూ  ఆమె గట్టిగా ప్రశ్నించారు.

మృతి చెందిన టీచర్ల సంఖ్య విషయంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా అబద్ధాలు చెబుతోందని అఖిలేష్ యాదవ్ దుయ్యపట్టారు. అబద్ధాలు చెప్పడంలో యూపీలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నదంటూ వ్యాఖ్యానించారు. పంచాయితీ ఎన్నికలలో విధుల నిర్వర్తించిన మీదట చనిపోయిన టీచర్ల కుటుంబాలకు కోటి రూపాయల వంతున నష్టపరిహారం చెల్లించాలని అఖిలేష్ డిమాండ్ చేశారు.

టీచర్ల మరణాలన్నిటినీ పంచాయితీ ఎన్నికలకు ముడిపెట్టడం సమంజసం కాదని యూపీ విద్యాశాఖ మంత్రి సతీష్ చంద్ర ద్వివేదీ అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ముగ్గురు టీచర్లు మాత్రమే పంచాయితీ ఎన్నికల కారణంగా మరణించారని ఆయన చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles