Thursday, September 29, 2022

గాజాలో శాంతి ఎంతకాలం నిలుస్తుంది?

హమాస్ నాయకుడు మషాల్, అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్నె తాన్యాహూ

ఇజ్రాయెల్ – హమాస్  మధ్య 11 రోజులపాటు జరిగిన హింసకు తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ ఇజ్రాయెల్ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇది కీలక పరిణామం. కాల్పుల విరమణను హమాస్ వర్గాలు కూడా నిర్ధారించాయి. 11రోజుల పాటు సాగిన ఘోరకలిలో 200 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. అందులో ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వీరే కాదు, ఇజ్రాయెల్ పౌరులు కూడా మరణించారు. మరణాలతో పాటు ఎక్కువ నష్టం పాలస్తీనీయులకే జరిగింది. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చింది.

Also read: పాలస్తీనా – ఇజ్రాయిల్ ఘర్షణ

చెలరేగిన ఇజ్రాయెల్

కొన్ని వందల మంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడి చేశారు. వీరిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సైనికులు ప్రతిదాడి చేశారు. హమాస్ ఉగ్రవాదులకు నిలయమైన గాజా పట్టీపై రాకెట్లు, విమానాలతో ఇజ్రాయెల్ చెలరేగి పోయింది. పెద్ద పెద్ద భవనాలు, ఆవాసాలు కూలిపోయాయి. చిన్నారులు, వృద్ధులు సైతం అసువులు బాశారు. ఈ హింస ఇప్పుడప్పుడే తగ్గదనే ఆలోచనలోకి ప్రపంచ దేశాలు వచ్చాయి. హమాస్ ఉగ్రవాదుల అంతు చూడాలనే ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పై అంతర్జాతీయంగా అనేక వత్తిళ్ళు వచ్చాయి. మిత్రదేశమైన అమెరికా కూడా కాల్పుల విరమణ కోసం చాలా ప్రయత్నం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలన్నీ దాడులు, కాల్పులను తక్షణమే విరమించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఎట్టకేలకు, కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సమ్మతించింది.

Also read: పాకిస్తాన్ కొత్త పాచిక?

కాల్పుల విరమణ వెనుక పెద్ద కథ

ఈ నిర్ణయం వెనకాల  పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఈ కాల్పుల విరమణకు దౌత్యం నెరపిన వారిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఈజిప్టు కూడా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యాహూ తో జో బైడెన్ కు 30 ఏళ్ళ నుంచి వ్యక్తిగత స్నేహం ఉంది. ఇజ్రాయెల్ కాల్పులు, దాడుల విషయంలో ఇటు బెంజిమన్ (బీబీ) పై ఎంత వత్తిడి వుందో, అగ్రరాజ్య నేత జో బైడెన్ పైనా అంతే వత్తిళ్ళు ఉన్నాయి. తమ వ్యక్తిగత స్నేహాన్ని, బెంజిమన్ ప్రతిష్ఠను దృష్టిలో పెట్టుకున్న జో బైడెన్… ఇజ్రాయెల్ చర్యలను బయట ఎక్కడా విమర్శించ లేదు.

Also read: భారత్ – రష్యా సంబంధాలలో మలుపు

ఫోన్ కాల్స్ తో దౌత్య విజయం

బహిరంగంగా విమర్శలకు దిగితే బెంజిమన్ కు నష్టం జరుగుతుందని బైడెన్ కు తెలుసు. అందుకే అందమైన పథక రచన చేశారు. కేవలం వ్యక్తిగత ఫోన్ కాల్స్ తో బెంజిమన్ తో మంతనాలు జరిపి కాల్పులు విరమించేట్లు బైడెన్ చేశారు. హమాస్ ఉగ్రవాదుల చర్యల నేపథ్యంలో, ఇజ్రాయెల్ కు ఆత్మరక్షణ హక్కు ఉందని బైడెన్ పదే పదే ప్రకటించారు. అది కూడా వ్యూహంలో భాగమే. దీని వల్ల సొంత పార్టీ నుంచి  బైడెన్ కు వత్తిళ్ళు కూడా వచ్చాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అనేక తీర్మానాలు వచ్చాయి. వీటన్నింటినీ అమెరికా అడ్డుకోవడం గమనార్హం. స్నేహితుడైన బైడెన్  కు  తలనొప్పులు తేకూడదని బెంజిమన్ సైతం అలోచించి, కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారు.

Also read: ఉక్రెయిన్ పై ఆధిపత్యానికి రష్యా ఆరాటం

ఈజిప్టు రాయబారం

ఈ మొత్తం వ్యవహారంలో ఈజిప్టు రాయబారం కూడా బాగా పనిచేసింది. ఇజ్రాయెల్ -ఈజిప్టు మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. క్యాంప్ డేవిడ్ ఒప్పందంతో ఇజ్రాయెల్ ను గుర్తించిన తొలి అరబిక్ దేశం ఈజిప్టు కావడం గమనార్హం. అరబ్ దేశాల ఒత్తిళ్లను కూడా పక్కన పెట్టి ఇజ్రాయెల్ తో ఈజిప్టు అప్పుడు శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు దాడులు జరిగిన గాజా పట్టీ తో ఈజిప్టు  సరిహద్దులు ఉన్నాయి. గాజాకు రెండు వైపుల ఇజ్రాయెల్, ఒక వైపు మధ్యదరా సముద్రం, మరోవైపు ఈజిప్టు ఉన్నాయి. గాజాపట్టీలోని హమాస్ ఉగ్రవాదుల అంశంలో ఈజిప్టు నుంచి ఇజ్రాయెల్ సహకారం పొందుతోన్నది బహిరంగ రహస్యమే. అదే సమయంలో  హమాస్ తో కూడా ఈజిప్టుకు మంచి సంబంధాలు ఉన్నాయని సమాచారం. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఘర్షణలు మొదలైన కొంచెం సేపట్లోనే శాంతించాలని ఇరువర్గాలను ఈజిప్టు కోరడం గమనార్హం. ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరుపుతూనే -ఇంకో పక్క హమాస్ తోనూ ఈజిప్టు శాంతి చర్చలు జరిపింది. పాలస్తీనా క్షతగాత్రులకు,శరణార్థులకు ఈజిప్టు ఆశ్రయం కూడా ఇచ్చింది. మరోపక్క, అంతర్జాతీయ సమాజంతోనూ ఈజిప్టు చర్చలు జరిపింది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మిర్ బెన్ కూడా ఈజిప్టుతో చర్చలు జరిపారు.

Also read: క్యూబాలో కొత్త శకం

దశాబ్దాల వైషమ్యాలు

మొత్తంమీద, ఈజిప్టు, జో బైడెన్ దౌత్యంతో ఇజ్రాయెల్ మనసు మార్చుకుంది. ఈజిప్టు చొరవతో హమాస్  దిగివచ్చింది. ఒక్కటి మాత్రం నిజం! ఈ ఇరువర్గాల శాంతి ఒప్పందాలు తాత్కాలికమైనవని గుర్తించాలి. దురాక్రమణలు, మతపరమైన వివాదాలు వీరి శతృత్వానికి ప్రథమ హేతువు అని ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. ఈ తగాదాల్లో జెరూసలేం అంశాన్ని కొట్టిపారేయలేం. ఈ 11రోజుల హింసకు జెరూసలేం లో జరిగిన ఘర్షణలే కేంద్ర బిందువయ్యాయి. ఇది పైకి కనిపించే అంశమైతే, దశాబ్దాల వైషమ్యాలే మూల కారణం. మూడు మతాలు అత్యంత పవిత్రంగా భావించే కేంద్రం జెరూసలేంలో ఉంది. యూదులు, క్రిస్టియన్స్, ముస్లింలు ఈ దేశంలో ఉన్నారు. ఇది ప్రధానంగా యూదులు ఎక్కువగా ఉన్న దేశం. ఇజ్రాయెల్ -పాలస్తీనా వెనకాల ప్రపంచ దేశాలు రకరకాలుగా చీలిపోయాయి. ఇజ్రాయెల్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ దేశం వ్యవసాయం, రక్షణ రంగాల్లో దిట్ట. ” ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” అని మహాకవి శ్రీశ్రీ అన్నమాటలు ఈ దేశాలన్నింటికీ వర్తిస్తాయి. కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగుతున్న ప్రపంచంలో శాంతి వర్ధిల్లాలంటే  కాలమే నిర్ణయించాలి.

Also read: తాలిబాన్ కు తలొగ్గిన అగ్రరాజ్యం, కశ్మీర్ కు పొంచి ఉన్న ముప్పు

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles