Friday, April 19, 2024

చైనాతో భారత్ వేగేదెట్లా?

  • మార్కెట్ ను విస్తరించుకోవడం, ఆర్థికంగా బలపడటం ఒక్కటే మార్గం

కె. రామచంద్రమూర్తి

ప్రస్తుత వాస్తవాధీన రేఖను చైనా గుర్తించడం లేదు కనుక ఆ దేశంతో సరిహద్దు సమస్య అపరిష్కృతంగానే ఉన్నదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారంనాడు పార్లమెంటులో చెప్పారు. సరిహద్దుపైన భారత దేశం అభిప్రాయాలకూ, చైనా అభిప్రాయాలకూ మధ్య వ్యత్యాసం ఉన్నదంటూ చైనా నేతలు మాట్లాడుతున్నారని రాజ్ నాథ్ అన్నారు. 1993లో, 1996లో సంతకాలు చేసిన ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా బుద్ధిపూర్వకంగా ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు.

జూన్ 15న లఢాఖ్ లోని పెంగాంగ్ సరస్సు దగ్గర చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. బిహార్ రెజిమెంట్ కు చెందిన  కెప్టెన్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులలో ఒకరు. ఆయన నల్లగొండ జిల్లాకు చెందిన తెలుగు యువకుడు. వ్యవహారం సున్నితమైనది కనుక సరిహద్దు సమస్యపైన పార్లమెంట్ లో చర్చ ఉండబోదని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కీలకమైన అంశం కనుక సరిహద్దులో ఏమి జరిగిందో వాస్తవాలను సభకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదంటూ కాంగ్రెస్ సభ్యులు వాదించారు.

చైనా రక్షణమంత్రితో రాజ్ నాథ్ భేటీ

భారతదేశ సార్వభౌమత్వం పట్ల ప్రభుత్వం పట్టుదలగా ఉన్నదనీ, సరిహద్దులో ఎటువంటి పరిణామం సంభవించినా ఎదుర్కోడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదనీ రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. మాస్కోలో చైనా రక్షణ మంత్రి వీఫెంగ్ ని కలుసుకున్నాననీ, సార్వభౌమత్వం విషయంలో ఇండియా రాజీపడే సమస్య లేదని ఆయనకు స్పష్టం చేశాననీ తెలియజేశారు. అదే సమయంలో సమస్యను సామరస్యంగా, శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇండియా సిద్ధంగా ఉన్నదని కూడా రాజ్ నాథ్ సింగ్ చైనా రక్షణమంత్రికి తెలిపారు. భారత భూభాగాన్ని రక్షించుకునేందుకూ, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తీసుకోవలసిన సకల చర్యలనూ భారత్ తీసుకుంటుందని రాజ్ నాథ్ చైనా మంత్రికి స్పష్టంగా తెలియజేశారు.

చైనాతో సరిహద్దు సమస్యపైన మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సరిహద్దులో వాస్తవంగా ఏమి జరుగుతున్నదో దేశ ప్రజలకు ప్రభుత్వం చెప్పడం లేదనీ, 1962లో చైనా ఆక్రమించుకున్న వేల ఎకరాల భూమి కాకుండా జూన్ మాసంలో కూడా కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నట్టు చైనా అధికార పత్రికల కథనాలు వెల్లడిస్తున్నాయనీ కాంగ్రెస్ సభ్యులు అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఎవ్వరూ సరిహద్దును ఉల్లంఘించలేదు, దురాక్రమణ జరగలేదు అంటూ టూకీగా ప్రకటిస్తున్నారు.

చర్చలు సాగిస్తూనే దురాక్రమణ చర్యలు

ఒక వైపు కమాండర్ల స్థాయిలో, విదేశాంగమంత్రుల స్థాయిలో, రక్షణ మంత్రుల స్థాయిలో చర్చలు కొనసాగిస్తూనే దురాక్రమణను చైనా యథావిధిగా కొనసాగిస్తున్నదని విదేశీ పత్రికలు ఘోషిస్తున్నాయి. చర్చలు విఫలమైతే సైనిక చర్యకు వెనకాడే సమస్య లేదంటూ సర్వసైన్యాధికారి జనరల్ బిపిన్ రావత్ ఆగస్టు 24న ధీరవచనాలు గంభీరంగా పలికారు. భారత సైన్యం కొత్త కొండలను ఆక్రమించుకొని ఆదిక్యం సాధించిందంటూ ప్రభుత్వ సంస్థలూ, కొన్ని మీడియా సంస్థలూ చెబుతున్నాయి. చైనా ఆక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది. బ్రిటన్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి హాంగ్ కాంగ్ పైన పట్టు బిగించింది. ఏడాది కిందట కశ్మీర్ లో 370 అధికరణను రద్దు చేయడాన్ని చైనా వ్యతిరేకించింది. అదే సమయంలో భారత సరిహద్దులోకి చొచ్చుకొని రావడం ప్రారంభించింది. చైనా సర్వాధికారాలనూ సీపింగ్ హస్తగతం చేసుకొని మావో కంటే శక్తిమంతుడుగా తయారు కావడం , చైనా ఆర్థిక బలం, అర్థబలం విపరీతంగా పెరడగం, మిగులు పెట్టుబడులు కలిగి ఉండటం, మార్కెట్ లీడర్ గా ఏ దేశానికీ అందనంత ఎత్తుకు ఎదగడంతో చైనా అమెరికాకు కానీ భారత్ కు కానీ కొరకరాని కొయ్యగా తయారైంది. సీపింగ్ అధికారంలో స్థిరపడిన తర్వాత విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారత్ చుట్టూ ఉన్న దేశాలను సుముఖంగా చేసుకోవడానికి తన దేశ సంపదను, ఆర్థికరంగంలో ఆధిపత్యాన్నీ వినియోగించారు. నేపాల్ వంటి చిన్న దేశ ప్రధాని సైతం భారత్ పైన కాలుదువ్వుతున్నాడంటే చైనా అండ చూసుకునే మిడిసిపడుతున్నారని అర్థం చేసుకోవాలి.  యూరోపియన్ దేశాలను, ముఖ్యంగా తూర్పు యూరప్ దేశాలను, వర్తకభాగస్వాములుగా దగ్గరికి చేర్చుకున్నారు. రష్యాతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకున్నారు. అమెరికాతో వైరం కలిగిన ఇరాన్ దువ్వి అక్కున చేర్చుకున్నారు. యూరప్, ఇజ్రేల్ కంపెనీల నుంచి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా సేకరించింది. చైనా-రష్యా-ఇరాన్-పాకిస్తాన్ లు ఒక కూటమిగా ఏర్పడి ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నిస్తున్నాయి.

కూటముల కుంపట్లు

ఈ కూటిమికి దీటుగా అమెరికా-ఇండియా-జపాన్ – ఆస్ట్రేలియా కూటమి రూపుదిద్దుకుంటున్నది. మూడు దశాబ్దాల కిందట ఉన్నట్టు  ప్రపంచం ఇప్పుడు లేదు. 1990లో సోవియెట్ యూనియన్ పతనమైన తర్వాత అమెరికా ఒకే ఒక అగ్రరాజ్యం. సోవియెట్ యూనియన్ చీలికలుగా, పేలికలుగా విడిపోయింది. అంతవరకూ సోవియెట్ యూనియన్ తో సన్నిహితంగా ఉంటూ అమెరికాకు దూరంగా ఉంటూ వచ్చిన ఇండియా పీవీ నరసింహారావు దౌత్యం ఫలితంగా అమెరికా పరిష్వంగంలో చేరిపోయింది. కడచిన మూడు దశాబ్దాలలోనూ చైనా బాగా ఎదిగింది. 1978లో డెంగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన చైనా ప్రజలు పారిశ్రామికరంగంలో, వాణిజ్యపరంగా అతివేగంతో దూసుకొని వెళ్ళారు. కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వం ఫలితంగా ప్రభుత్వానికి ఎదురు లేకపోవడం, అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉండటం చైనాకు కలసి వచ్చిన అంశాలు. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (ఆర్ బీఐ)’తో చైనా కేంద్రంగా వాణిజ్యం విస్తరించుకోవడానికి రహదారి నిర్మిస్తున్నది.  ముడి పదార్థాలకూ, చైనా పరిశ్రమలకూ వారధిగా ఈ రహదారి పని చేస్తుంది.  1991లో భారత్ సైతం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ చైనా అంత వేగంగా పురోగమించలేకపోయింది. 1991-96లో సగటున ఎనిమిది శాతం వృద్ధి రేటు ఉండగా అనంతరం అది తగ్గుతూ వచ్చింది. 2009లో ప్రపంచవ్యాప్తగా నెలకొన్న ఆర్థికమాంద్యం ఫలితం ఇండియాపైన కూడా పడింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ఆర్థికరంగంలో వెనకపడిపోయింది. 2014 నుంచీ ఇప్పటి వరకూ సాగుతున్న నరేంద్రమోదీ పాలన ఆర్థికరంగాన్ని త్వరితగతిన నడిపించలేకపోయింది. పెద్దనోట్ల రద్దు వంటి తప్పుడు నిర్ణయాలతోనూ, రెండవ తరం సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సుముఖంగా లేకపోవడం చేతనూ ఆర్థికరంగం కుంటినడక నడుస్తూ వచ్చింది. ఈ లోగా కోవిద్ మహమ్మారి రావడం, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆర్థికంగా కుదేలు కావలసి వచ్చింది. పోయిన త్రైమాసికంలో ఆర్థికాభివృద్ధిరేటు విలోమంలో పడిపోవడం, మైనస్ 0.28గా నిర్ణయించడం అవమానకరమైన పరిస్థితి. కోవిడ్ తగ్గుముఖం పట్టే జాడలు కనిపించడం లేదు. ఆర్థికంగా పరిస్థితి నష్టదాయకంగా సాగుతోంది. మూలిగే నక్కపైన తాటిపండు పడినట్టు చైనా దురాక్రమణ చర్యలు ప్రారంభించింది. గత ముప్పయ్ రెండు సంవత్సరాలలో ఆర్థికంగా చైనా ఇండియా కంటే అయిదు రెట్టు ఎక్కువగా ఎదిగింది. ఈ రోజు ఇండియా జీడీపీ ఒక రూపాయి ఉంటే చైనాది అయిదు రూపాయలు.

చైనాపై సర్జికల్ స్ట్రయిక్స్ సాధ్యం కాదు

పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనిక శిబిరాలపైన దాడులు చేసి నరమేథం సృష్టిస్తే మన సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రయిక్ లు చేసి వచ్చారంటూ మోదీ ప్రభుత్వం ప్రకటించింది. దేశభక్తితో భారతీయుల గుండెలు పొంగాయి. యుద్ధం చేయకుండా, ప్రాణనష్టం జరగకుండా మనం పాకిస్తాన్ పైన పైచేయి సాధించామని చెప్పుకునేందుకు సర్జికల్ స్ట్రయిక్స్ ఒక అవకాశం కల్పించాయి. బాలాకోట్ పై ఉగ్రవాదుల చర్యకు ప్రతీకారం చేశామనీ, పాకిస్తాన్ పాలకులకూ, ఉగ్రవాదులకూ బుద్ధి చెప్పామంటూ ప్రచారం చేసుకొని మోదీ 2019 ఎన్నికలలో ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు. ఎన్నికల తర్వాత సైతం సర్జికల్ స్ట్రయిక్స్ గురించి గొప్పలు చెప్పుకున్నారు.  చైనాపైన అటువంటి విధానానికి తావు లేదు. చైనాపైన సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం సాధ్యం కాదు. చైనా భారత్ కంటే బలోపేతమైన దేశం. మనం ముప్పయ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తే ఆ దేశం మూడు వందల యుద్ధవిమానాలను కొనుగోలు చేయగలదు. రఫేల్ యుద్ధ విమానాలు ఆరు వచ్చి మన వాయుసేనలో చేరగానే యుద్ధం గెలిచినంతగా ఆనందపడటం, విజయహాసం చేయడం చిన్నపిల్లలు చేయవలసిన పని. పరిపక్వత లేని జాతి చేయవలసిన పని. ఊహాప్రపంచంలో విహరించేవారు చేయవలసిన పని. వాస్తవం ఏమంటే చైనాతో తలబడే సత్తువ మనకు లేదు. అంతమాత్రాన చేతులెత్తేసి శత్రువుకి దాసోహం అనమని అర్థం కాదు. వాస్తవికంగా ఆలోచించాలనీ, మాట్లాడాలనీ చెప్పడమే ఉద్దేశం. చైనాతో తలబడటానికి అవసరమైన శక్తిసామర్థ్యాలను సంపాదించుకోవాలని చెప్పడం లక్ష్యం.

సాధ్యమైనంత వరకూ శాంతియుతంగానే చైనా వ్యవహారం సాగించాలి. సరిహద్దు సమస్యను పక్కన పెట్టి తక్కిన రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలని 1977-79లో జనతా ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజపేయి, 1984-89లో ప్రధాని రాజీవ్ గాంధీ, 1991-96లో ప్రధాని పీవీ నరసింహారావు  చొరవ చూపించారు. సరిహద్దు సమస్య పరిష్కరించుకున్న తర్వాతనే తక్కిన రంగాలలో సంబంధాలను పెంపొందించుకోవడం అవసరమని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. సరిహద్దు సమస్య అపరిష్కృతంగా ఉన్నంతకాలం చైనాతో వ్యవహారం ప్రమాదకరమే. వాణిజ్య రంగంలో సహకరించి, సాంకేతికరంగంలో పూర్తిగా చైనా యాప్ లపైన ఆధారపడి ఇండియా బాగా దెబ్బతిన్నది. చైనా దినదినాభివృద్ధి చెందింది. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ ప్రధాని మోదీ చేసిన నినాదం నినాదంగా మిగిలిపోయింది. భారతదేశంలో కొత్తయాప్ లు తయారు చేయడంగానీ, వాణిజ్యపరంగా విస్తరించడం గానీ ఏమీ జరగలేదు. మతపరమైన కార్యక్రమాలూ, ప్రతిపక్షాలను దెబ్బతీసే ప్రణాళికలకే ప్రాధాన్యం ఇచ్చాం కానీ శక్తియుక్తులు పెంపొందించుకునే ప్రయత్నం చేయలేదు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను మరిగి దేశవాసులు సోమరులుగా మిగిలిపోయారు. సృజనశక్తిని కోల్పోయారు. చైనాకు మంచి మార్కెట్ గా మిగిలిపోయారు. రాజీకీయ నాయకులు గంభీరవచనాలకే పరిమితమై కార్యవిముఖులై దేశానికి తీరని నష్టం కలిగించారు.

చైనా వాణిజ్య రహదారి ఆర్.బీ.ఐ.

రోడ్ అండ్ బెల్ట్ రహదారి నిర్మాణాన్నీ, దక్షిణ సముద్రంలో చైనా ఆధిపత్యాన్నీ ఇండియా, అమెరికా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణ సముద్రంలో చైనా పెత్తనాని జపాన్, ఆస్ట్రేలియా సైతం ఒప్పుకోవడం లేదు. రోడ్ అండ్ బెల్ట్ రహదారిని ఇటలీ సమర్థిస్తున్నది. యూఘుర్ రాష్ట్రంలో ముస్లింలపట్ల చైనా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అమానవీయ వైఖరినీ, హాంగ్ కాంగ్ లో పౌరహక్కులను ఉక్కుపాదంతో అణచివేయడాన్నీ యూరోపియన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా సరే శత్రుదేశంగా పరిగణించడం లేదు.  చైనా పెద్ద మార్కెట్. అంత పెద్ద మార్కెట్ ను దూరం చేసుకోవడం జర్మనీ వంటి పశ్చిమ యూరోపియన్ దేశాలకు సైతం ఇష్టం ఉండదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ను చైనా విదేశాంగమంతి వాంగ్ యీ కలుసుకొని సుముఖం చేసుకున్నారు. తైవాన్ కు వ్యతిరేకండా ఫ్రాన్స్ చర్య తీసుకునే విధంగా ప్రభావితం చేయగలిగారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఎన్నికల ముందు తెల్ల అమెరికన్ లను మెప్పించడం కోసం చైనాపైన ధ్వజమెత్తుతున్నారే కానీ ఎన్నికల తర్వాత చల్లబడతారు. అమెరికాకు సైతం చైనా మార్కెట్ కావాలి. మేధోపరమైన హక్కులను ఉల్లంఘించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని బలవంతంగా బదలాయించుకోవడం వంటి చర్యల పట్ల మాత్రమే అమెరికా పెట్టుబడిదారులకు చైనా పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను చైనా దిగుమతి చేసుకుంటున్నది. ఇది ట్రంప్ కు దోహదం చేసే ఉపకారం. చైనా ఎంత ఎక్కువగా అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే అంత ఎక్కువగా అమెరికా వ్యవసాయదారులు ట్రంప్ ను మెచ్చుకుంటూ ఎన్నికలలో గెలిపిస్తారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశం

అక్టోబర్ లో చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమీక్షా సమావేశాలు జరగబోతున్నాయి.  కిందటి సారి జరిగిన సమావేశాలలో దేశాధ్యక్షుడిగా ఎవరైనా రెండు విడతలు (టరమ్ లు) మాత్రమే ఉండాలన్న నిబంధనను తొలగించి సీపింగ్ ను అమితమైన శక్తిమంతుడిగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేసింది. పార్టీని మెప్పించడానికీ, తాను రాజీలేని పోరాటయోధుడిగా దేశ ప్రజలకు కనిపించడానికీ సీపింగ్ ఇండియాతో కయ్యానికి కాలుదువ్వే ప్రమాదం ఉన్నది. దేశభక్తినే ఆయుధంగా ఉపయోగించే సీపింగ్, నరేంద్రమోదీ నాయకులుగా ఉన్న చైనా, భారత్ లు మరోసారి పరిమిత యుద్ధానికి దిగే ప్రమాదం లేకపోలేదు.

ప్రజలను ప్రధాని ప్రేరేపించాలి

యుద్ధం మంచుకొండలలో జరిగినా జరగకపోయినా, వాణిజ్య పోటీ మాత్రం అనివార్యం. ఇప్పటికైనా నరేంద్రమోదీ తానే చేసిన ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి కట్టుబడి ఉండాలి. దాన్ని అమలు చేసే ప్రయత్నం నిజాయితీగా చేయాలి. కేవలం నినాదాలకే పరమితమైతే ఒరిగేది ఏమీ ఉండదని గత ఐదేళ్ళుగా చూశాం. సాంకేతిక రంగంలో, యాప్ ల తయారీలోనూ, పరిశ్రమల అభివృద్ధిలోనూ జాంబవంతుని అంగలు వేయవలసిన అవసరం ఉన్నది. దేశంలో మానవ వనరులకు కొదవ లేదు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువత ఉపాధికోసం అర్రులు చాచి ఎదురు చూస్తున్నారు. మేధాసంపత్తి కొరత లేదు. అత్యవసరం ఏమిటంటే ఏకోన్ముఖదీక్షతో పనిసాగించే విధంగా దేశ ప్రజలను, ముఖ్యంగా యువతను ప్రేరేపించడం. ప్రజలను ప్రేరేపించే శక్తి ప్రధాని నరేంద్రమోదీకి పుష్కలంగా ఉంది. సుశాంతి సింగ్ ఆత్మహత్యను బిహార్ ఎన్నికలలో గెలుపుకోసం ఎట్లా ఉపయోగించుకోవాలో, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలో, పశ్రిమబెంగాల్ లో మమతా దీదీని ఎట్లా అరికట్టాలో ఆలోచించే బదులు దేశ మార్కెట్ ను ఎట్లా విస్తరించాలో, ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని ఎట్లా మనస్పూర్తిగా అమలు చేయాలో ఆలోచించి, ఆచరిస్తే మోదీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. చైనాకు సమాధానం చెప్పాలన్నా, అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ , బ్రిటన్ వంటి దేశాల గౌరవాభిమానాలు పొందాలన్నా ఆర్థికంగా విశేషంగా, వేగంగా బలపడటం ఒక్కటే మార్గం. మార్కెట్ ను విస్తరించుకోవడం ఒక్కటే ఉపాయం. ఈ వాస్తవాన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా అధికార బీజేపీ, గుర్తించి అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా దేశానికి ద్రోహం చేసినట్టే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles