Thursday, April 25, 2024

మోదీ-యోగీ డబుల్ ఇంజన్ రైలు దూసుకుపోయిన విధంబెట్టిదన….

  • నాలుగు రాష్ట్రాలలో రెండో విడత గెలుపు
  • హిందూత్వ విధానాలను నెత్తికెత్తుకుంటారా?
  • రైతు చట్టాలను వాపసు తెస్తారా?

నెల పొడవునా పోలింగ్ జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూడడం, వినడం, జీర్ణించుకోవడంతో గురువారం (మార్చి 10) అంతా గడిచిపోయింది. ఫలితాలు అనూహ్యమైనవేమీ కావు. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఈ ఫలితాలనే చెప్పాయి. చాలా కాలం తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిజమైన సందర్భం ఇది.

బలమైన అవరోధాలను ఛేదిస్తూ మోదీ-యోగీ డబుల్ ఇంజన్ రైలు గమ్యం చేరుకుంది. కోవిడ్ కారణంగా చనిపోయిన వ్యక్తుల శవాలు గంగా నదిలో తేలుతూ యూపీ నుంచి బీహార్ వైపు ప్రయాణించిన మాట వాస్తవం. రైతులు కోపంగా ఉన్నారనే విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. నిత్యావసర వస్తువుల ధరలు నింగికి తాకుతున్నాయనే విషయం అందరూ అంగీకరిస్తారు. నిరుద్యోగం ఇదివరకు ఎన్నడూ లేనంత అధికంగా ఉంది. బ్రాహ్మణులు ఆగ్రహంగా ఉన్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పట్ల, ఠాకూర్ రాజ్యం పట్ల. ముఖ్యమంత్రి పదవి నుంచి యోగీని తప్పిందామా అని మోదీ-షా కొంతకాలం కిందట ఆలోచించారు. ముప్పయ్ సంవత్సరాలుగా యూపీలో ఒక సారి అధికారంలో  ఉన్న పార్టీని వెంటనే గెలిపించి మళ్ళీ పట్టం కట్టలేదు. ఇన్ని బలమైన అవాంతరాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి మోదీ-యోగీ ద్వయం లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు వోట్ల శాతం పెంచుకున్నారు. అయిదేళ్ళపాటు పోలీసు అత్యాచారాలు సాగి, దారిద్ర్యం అనుభవించి, చీలిక రాజకీయాలు చేసి, వివాదాలతో వర్థిల్లిన ప్రభుత్వాధిపతిని తిరిగి ఎన్నుకోవడం చెప్పుకోదగిన విశేషం.

అఖిలేష్ యాదవ్ తెలివైన యువకుడు. 2017లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు. 2019లో బహుజన సమాజ్ పార్టీతో కలిసి పోటీ చేశాడు. రెండు ఎన్నికలలోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ సారి పెద్ద ప్రతిపక్షాలను పక్కన పెట్టి యాదవేతర వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్నాచితకా పార్టీలు ఎనిమిదింటితో పొత్తులు పెట్టుకున్నాడు. అధికార బీజేపీ నుంచి ఈ వర్గాలకు చెందిన ముగ్గురు మంత్రులూ, అరడజను మంది ఎంఎల్ ఏలూ పదవులు త్యాగం చేసి ప్రతిపక్ష శ్రేణుల్లో చేరిపోయారు. నిజంగానే అఖిలేష్ బలం పుంజుకుంటున్నాడనీ,  ఈ సారి గెలిచితీరుతాడనీ అనుకున్నాం. కానీ జిత్తులమారి మోదీ-యోగీ ద్వయాన్ని ఎదుర్కోలేకపోయారు. మాయావతి పైన బీజేపీ ఏదో మత్తుమందు చల్లినట్టు కనిపిస్తోంది. ఆమెలో ఇదివరకటి చైతన్యం లేదు. ఎన్నికలలో నామమాత్రంగా అభ్యర్థులను నిలబెట్టారు. తాను రంగంలో దిగలేదు. ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రచారం చేశారు. సభికులు బాగానే వచ్చారు. ఆమె  అర్థవంతంగానే మాట్లాడినట్టు కనిపించారు. కానీ ఓట్లు రాల్చుకోలేకపోయారు. మొత్తం మూడు శాతం ఓట్లు సైతం రాబట్టుకోలేకపోయారు. కేవలం పశ్చిమ ఉత్తరప్రదేశ్ కే పరిమితమైన చరణ్ సింగ్ మనవడి పార్టీ ఆర్ ఎల్ డీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.  అన్నాచెల్లెల్లు ఇక పార్టీని వదిలేస్తే దేశానికి మేలని చరిత్రకారుడు రామచంద్రగుహ అంటున్నారు. ఈ ఎన్నికలపైన వ్యాఖ్యాతలందరూ ఇటువంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు.

యోగీకి వ్యతిరేకత లేదని నిరూపించాలని మోదీ ప్రయాస. ఉపన్యాసాలలో ఎక్కువ భాగం యోగీ పరిపాలనా దక్షతను పొగడటానికి కేటాయించారు. తర్వాత లాల్ టోపే (అఖిలేష్ టోపీ)పైన వ్యాఖ్యాలు, రాహుల్, ప్రియాంకలపైన వ్యంగ్యాస్త్రాలూ. యోగీపైన ప్రతికూలత లేదనీ, సానుకూలత ఉన్నదనే అభిప్రాయాన్ని ప్రజలలో బలంగా కలిగించడం మోదీ లక్ష్యం. చాలావరకూ నెరవేరారు. తమ ప్రధాని తమ ముఖ్యమంత్రి గురించి చెబుతున్న అతిశయోక్తులను ప్రజలు విశ్వసించినట్టే కనిపిస్తోంది. కలిసి వచ్చిన మరొక అంశం హిందూ ఆధిక్యవాదం. ఇది 2014లోనే ప్రజల మనస్సులో బాగా నాటుకుంది. ఇప్పుడు అక్కడే భద్రంగా, బలంగా ఉంది. ప్రత్యేకించి రెచ్చగొట్టవలసిన పని లేదు. గుజరాత్ ప్రజల మస్తిష్కాలలో హిందూవాదం ఎంత బలంగా నాటుకున్నదో అంతే బలంగా యూపీ ప్రజల మనస్సులలో సైతం నాటుకున్నది. ఇది 80  శాతానికీ, 20 శాతానికి మధ్య లడాయి అంటూ యోగీ బడాయిపోవడాన్ని హిందువలకూ, ముస్లింలకూ మధ్య పోరాటంగానే ప్రజలు అర్థం చేసుకున్నురు. యోగి కోరుకున్నది కూడా అదే. బ్రాహ్మణులు యోగీపైన కోపంగా ఉన్నప్పటికీ ఎన్నికలలో ఓడించాలన్నంత ఆగ్రహం లేదు. రైతులు దిల్లీలో సంవత్సరానికి పైగా నిరసనప్రదర్శనలు చేసినప్పటికి యోగీని ఓడించాలన్నంత పట్టుదల లేదు. ఆ కారణంగా వారు మోదీ-యోగీ రథచక్రాలకు అడ్డుపడే ప్రయత్నం చేయలేదు.

శివసేన నాయకుడు సంజయ్ రావత్ చెప్పిన మాట కొంతవరకూ నిజమే. బీజేపీ ఎన్నికల తంత్రం సాధించిన విజయమిది. బీజేపీ ప్రచారంలో అనుసరించిన వ్యూహంతో పాటు పెద్దనోట్ల రద్దు సమయంలో మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జనానికి చేరాయి. కులం, మతం, పార్టీ విదేయతలకు అతీతంగా ఈ పథకాలు అమలు జరిగాయి. గ్యాస్ బండలు, నగదు బదిలీ మహిళలను బాగా ఆకట్టుకున్నాయి. పురుషులకంటే మహిళలు అధికంగా  సమధికోత్సాహంతో ఓట్లు వేశారని అంటున్నారు. రేషన్, శాసన్ (బియ్యం, గోధుమల రేషనూ, శాంతిభద్రతలను కాపాడే యంత్రాంగం)అందుబాటులో ఉన్న కారణంగా ప్రజలకు యోగీప్రభుత్వం పట్ల అంత బలమైన వ్యతిరేకత లేదు. అఖిలేష్ పాలనలో గ్రామాలలో పోలీసు ఠాణాలు బస్తీ దాదాల చేతుల్లో ఉండేవి. ఆ గ్రామంలో బలవంతుడైన యాదవ్ నాయకుడో,ముస్లిం నాయకుడో చెప్పినట్టు పోలీసులు వినేవారు. ఎవరిని అరెస్టు చేయమంటే వారిని చేసేవారు. ఎవరిని విడుదల చేయమంటే వారిని విడుదల చేసేవారు. యోగీ పాలనలో స్థానిక బీజేపీ నాయకులకు అటువంటి అధికారాలు అందుబాటులో లేకుండా చేవారు. అధికారాలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోనే ఉంటాయి. అందుకని పోలీసులను ప్రజలపైకి వదలడం లేదు. పైగా చాలామంది రౌడీలను పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఎన్ కౌంటర్ చేశారు. వీరిలో ముస్లింలూ, యాదవ్ లూ, బ్రాహ్మణులూ ఉన్నారు. కనుక రౌడీల బెడద లేకుండా హాయిగా బతుకుతున్నామనే అభిప్రాయం జనబాహుళ్యంలో ఉంది.

సమీప సమస్యలను మరచిపోడానికి హిందూత్వ మంత్రం పనికి వస్తుంది. ‘జైశ్రీమ్’ నినాదం వింటే పరవశించిపోయి తమ సమస్యలను విస్మరించి తమ ఓటు మోదీ-యోగీలకే వేసే ప్రజలున్నంత కాలం బీజేపీకి ధోకా లేదు. ఉత్తరాఖండ్ లో కూడా ఇదే హిందూత్వ మాయాజాలం పని చేసింది. అసలే అది దైవభూమి. అందులో హిందూ ఆధిక్యభావం చెలామణిలో ఉంటుంది. మణిపూర్, గోవాలలో బీజేపీ విజయానికి నరేంద్రమోదీ వ్యక్తిగత ఆకర్షణశక్తి కారణం. పంజాబ్ లో ఆప్ సునామీ సరేసరి. అక్కడ మోదీ పప్పులు ఉడకవు. కానీ ఉత్తర ప్రదేశ్ లో మళ్ళీ పాగా వేసిన మోదీకి పంజాబ్ తనది కాకపోయినా బెంగలేదు. నాలుగు రాష్ట్రాలలో విజయాలు మోదీకి అదనపు నైతికబలం ప్రసాదించి ఉంటాయి. ఈ బలంతో సీఏఏ అమలును వేగిరం చేయడం, మొన్నరద్దు చేసిన రైతు చట్టాలను  పునరుద్ధరించడం, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రవేశపెట్టడం, ఒకదేశం-ఒక ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టడం, అధ్యక్ష తరహా పాలన గురించి ఆలోచించడం, హిందూ రాష్ట్ర వైపు అడుగులు వేయడం వంటి పనులు ఇప్పుడే ప్రారంభిస్తారా లేక 2024లో విజయం సాదించిన అనంతరం ప్రారంభిస్తారా అని దేశ ప్రజలు ఊపిరిబిగబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles