Friday, December 2, 2022

సమాధిలోని హిట్లర్ మేల్కొన్నాడు!

చీమ చిటుక్కుమన్నా పోలీసులకు తెలిసిపోతుంది. అందుచేతే వంటింట్లో పంచదార సీసాల చుట్టూ, బెల్లం ముద్దల చుట్టూ అందినంత నోట కరుచుకుని గునగునా తమ పుట్టల కేసి నడుస్తూ ‘‘అదిగదిగో అక్కడ కావల్సినంత పంచదార, బెల్లం ఉంద’’ని సాటి చీమలకి చాటి చెప్పి, కలివిడిగా, కలిసికట్టుగా ఉండే చీమలు, నిఘాకి భయపడి, తాము పెట్టుకున్న పుట్టమన్ను తినేసి బ్రతుకుతున్నాయేమో…కానీ, చీమలు కనిపించకుండా పోయాయి.

‘‘నిఘాలో కొట్టకుండా, తిట్టకుండా, చంపకుండా, ఒక చీమల్నే కాదు సోషలిజాన్ని కూడా రాకుండా చెయ్యొచ్చు. అలా జరగాలంటే, ప్రజల కళ్ళకి గంతలూ, పోలీసుల కళ్ళకి కెమెరాలూ తిగిలించాలని ప్రభుత్వం గ్రహించింది. మనుషుల కదలికల్ని నిరంతరం కనిపెట్టుకొని ఉండటానికి పేటలూ, కోటలూ,ఊళ్ళూ వల్లకాళ్ళూ కెమెరా కళ్ళతో కప్పేసింది. పోలీసులు డ్యూటీలో ఉన్నా లేకపోయినా దేశాన్ని మొత్తంగా కెమెరా నిఘాలో ఉంచేశారు. పైగా కుక్కలున్నాయి జాగ్రత్త అని ఇళ్ళ గేటుకి బోర్డు తగిలించినట్టుగా ‘హుశార్’ అంటూ రాత్రుళ్ళు అరిచే గూర్ఖాల్లా ఎక్కడ బడితే అక్కడ ‘‘దిస్ ఏరియా ఈజ్ అండర్ ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్’’ అంటూ అందరూ చూసేలా బోర్డులు తగిలించారు. దీంతో ఎవరికి వాళ్ళు తప్పు చేసినా, చెయ్యకపోయినా చట్టాన్ని ఉల్లంఘించినా, ఉల్లంఘించకపోయినా, అసలుచట్టం అంటే ఏమిటో తెలవకపోయినా, గిల్టీగా ఫీలవడం మొదలుపెట్టారు. ఇళ్ళలో టాయ్ లెట్ లేని నిరుపేదలు, ఒంటికీ రెంటికీ బయటికి వెళ్ళడం మానేసి, తలకి నీడ లేకపోయినా, మొలకి బట్టుండాలని ఇళ్ళ బదులు టాయిలెట్స్ కట్టుకొని బ్రతుకులీడుస్తున్నారు.

మాకూ ఇళ్ళు లేవు. వాకిళ్ళు లేవు. ఒంటికి బట్టలేదు. రేపెలాగన్న భయంతో కంటికి నిద్దర లేదు. నోరు తెరిచి బాధలు చెప్పుకుందామంటే, ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి కుట్ర పన్నుతున్నారంటారేమోనన్న భయం. పేదరికాన్ని దాటకుండా కన్నేసి ఉంచిన నిఘాలో భయంభయంగా బితుకుబితుకు మంటూ గడుపుతున్నారు. ఆ మాటకొస్తే ప్రభుత్వం దారిద్ర్యానికి పేదలూ, కూలీనాలీల దోపిడియే కారణమని, ఆ దోపిడీ కేసులెక్కడ పెడతారోనని, సభ్యసమాజం దృష్టిలో పడకుండా బ్రతుకుతున్నవాళ్ళు.

నిఘా కళ్ళలో ఎక్కడ పడతామోనని దొంగలు దొగతనం చేయ్యడం మానేశారు. పేదవాళ్ళు, అలగా జనం అలజళ్ళు మానేశారు. అది గమనించి కన్నవాళ్ళు కడుపు కట్టుకొనైనా కన్నబిడ్డల్ని కాపాడినట్లుగా, తమని పెంచిపోషించి ఇంతవాణ్ణి, అంతవాడిగా మార్చి, అందలమెక్కించిన పేదవాళ్ళని, కన్న కొడుకులు కన్నవాళ్ళని కనిపెట్టుకు చూసుకొన్నట్లుగా పేదవాళ్ళు పేదవాళ్ళని  కాపాడుకోవల్సిన విధ్యుక్తధర్మం తమ మీద ఉందని, అట్టి ధర్మం తప్పకుండా ఉండటానికి గానూ, పేదరికాన్ని తద్వారా పేదవాళ్ళను కాపాడ్డానికి నిఘా నేత్రాలు అవసరమని ప్రభుత్వం నమ్ముతోంది.

పేదవాళ్ళకి ప్రభుత్వంమీద విశ్వాసం చెడకుండా ఉండాలంటే ప్రతిపక్షంవాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. దరిద్రదేవత అలా జనం ఇళ్ళల్లో తిష్టవేసుక్కూచోవడానికి ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు పేదల్ని నమ్మించకుండా చూడాలంటే ప్రతిపక్షం మీద డేగ కన్నేసి ఉంచాలి.

నీ దరిద్రానికి కారణం నీ కర్మ, ఆడి సంపదకి కారణం ఆడి అదృష్టం కాదు, మీకు తెలవకుండా మీ కష్టార్జితం కొట్టెయ్యడమేనని చెప్పేవాడి దేశద్రోహాన్ని పసిగట్టాలంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, కావలి కాయాలి. అలాగైతేనే పేదరికం భద్రంగా ఉండి తిరుగుబాటు పేరిట సామాన్యుడు  చావకుండా ఉంటాడు.

దేశాన్ని యథాతథంగా, యథాశక్తిగా కాపాడాలంటే ఒక్క కళ్ళే కాదు చెవులు, ముక్కు కూడా అవసరం. నోరెండ ప్రమాదకరం అనుకున్నారు?

నోట్లోంచి వచ్చిన మాటలు వెనక్కి తీసుకోవడం కదురదు. అవి ఆటంబాంబు కంటే పవర్ ఫుల్. అది కంటికి కనిపించకుండా భూగర్భంలోంచి దహించివేస్తాయి. అందుచేత మనుషులు, ముఖ్యంగా ప్రతిపక్షంవాళ్ళ నోళ్ళకి తాళం వేయ్యాలి. అలా జరగాలంటే టెలిఫోన్  టాపింగూ, సోషల్ మీడియా మీద నిఘా ఉండాలి.

ఇది అన్యాయం, వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకం, అప్రజాస్వామికమని ఎవరైనా అంటే అనొచ్చుకానీ ప్రతి వెధవనీ నోటికొచ్చినట్లు వాగనిచ్చి, చేతికొచ్చినట్లు రాయనిచ్చి, కంటినిండా కలలు కననిస్తే ఇంకా ఏమైనా ఉందా? ప్రభుత్వం ఆస్తిత్వం సంగతలాగుంచినా పేదరికం మనుగకే పెను ప్రమాదం ముంచుకొస్తుందని వాదించింది  ప్రభుత్వం. ఈ వాదన విన్న హిట్లర్ సమాధిలో కదిలాడు. సమస్య నిఘా కాదు,మనిషి నీడను తరుముతున్నాడా, నీడ మనిషిని తరుముతోందా అన్నది ప్రశ్న. నీడ మనిషిని తరుముతోందన్నవాడి శిరస్సు వేయివక్కలు కావాలని సమాధిలోంచి శాసించాడు హిట్లర్.  

Krishna Rao Nandigam
నందిగం కృష్ణారావు ప్రముఖ నవలా రచయిత, కథకుడు. ప్రఖ్యాత న్యాయవాది. మొబైల్: 93930 22245

Related Articles

1 COMMENT

  1. ‘సమాధి లో హిట్లర్ మెల్కొన్నాడు’

    నందిగామ కృష్ణారావు గారి వ్యగ్య రచన గొప్పగా ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles