Friday, April 19, 2024

రామతీర్థంలో రాజకీయాలు

ఏపీ రాజకీయాలు  విజయనగరం జిల్లా రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. డిసెంబరు 29న రాముడి విగ్రహంపై దాడి జరగ్గా, 30 వ తేదీన సమీపంలోని కొలనులో రాముడి శిరస్సు లభ్యమైంది.  రాముడి విగ్రహ ధ్వంసంపై రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం చెలరేగింది. టీడీపీ, బీజేపీ పెద్ద ఎత్తున ప్రభుత్వం పై విమర్శలకు దిగడంతో రాజకీయం బాగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘటనాస్థలిని పరిశీలించేందుకు ప్రయత్నించడంతో ఈ వ్యవహారం మరింత ఉద్రిక్తంగా మారింది.

విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రామతీర్థం చేరుకునేందుకు  పయనమయ్యారు. వైసీపీ నేతలతో కలిసి కోదండరాముడి ఆలయం ఉన్న బోడికొండ ఎక్కారు. అదేసమయంలో కొండపైకి తమను అనుమతించాలంటూ బీజీపీ శ్రేణులు చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.  కోదండరామాలయాన్ని సందర్శించిన అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మెట్లమార్గంలో తిరిగి వస్తున్న సమయంలో ఎంపీ వాహనంపై ఆందోళనకారులు రాళ్లురువ్వారు.  

అప్రమత్తమైన పోలీసులు

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు రాజకీయ పార్టీల నాయకుల పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ శ్రేణులు రామతీర్థానికి భారీసంఖ్యలో చేరుకున్నాయి. బోడిగుండ దిగువన బీజేపీ శ్రేణులు దీక్షకు దిగాయి. ఇదే ప్రాంతంలో టీడీపీ, వైసీపీ నేతలు కూడా శిబిరాలను ఏర్పాటు చేశారు.

చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు

రామతీర్థం పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ ను విజయనగరంలో పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది వాహనాలను అనుమతించిన పోలీసులు నేతల వాహనాలను అడ్డుకున్నారు. టీడీపీ నేతల వాహనాలు వెళ్లకుండా లారీలు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు సహా టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించాడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

తీవ్ర ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. ఆలయం మెట్లవద్ద కొబ్బరికాయను కొట్టిన చంద్రబాబు బోడికొండపైకి వెళ్లారు. చంద్రబాబు వెంట అశోక్ గజపతిరాజు, అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. విగ్రహం ధ్వంసమైన బోడికొండ ప్రదేశాన్ని చంద్రబాబు పరిశీలించారు. అక్కడ రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును పరిశీలించారు. విగ్రహం ధ్వంసం చేసిన తీరును అక్కడి పూజారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరగడం దారుణమన్నారు. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రాంలోని వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయని అన్నారు. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రార్థనలు చేసినా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు.

ఎండోమెంట్ అధికారులతో మంత్రి భేటీ

ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం లో అధికారులతో మంత్రి అత్యవసర భేటి నిర్వహించారు. దేవాలయాల పై జరుగుతున్న వరుస దాడులను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. విజయనగరం లో హై టెన్షన్ నేపథ్యం లో దేవాదాయ శాఖ ఆలయాల రక్షణకు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

ఇదీ చదవండి:జగన్ ఫిర్యాదుపై జస్టిస్ రమణ స్పందన కోరిన సుప్రీం చీఫ్ జస్టిస్

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles