Thursday, April 25, 2024

ఒడిశాలో మహావిషాదం

  • మూడు రైళ్ళ ఢీతో మునుపెన్నడూ కనీవినని దృశ్యాలు
  • కవచ్ వ్యవస్థ లేకనే ఈ ప్రమాదం జరిగిందా?
  • సిగ్నల్ వైఫల్యమా, మానవ తప్పిదమా?

ఒడిశా దుర్వార్త గుండెలు పిండేసే విషాదం!! ఎంత ఘోరం జరిగిపోయింది!! ఈ ఘోరకలిని మాటల్లో వర్ణించలేం! 21 వ శతాబ్దంలోనే అతిపెద్ద దుర్ఘటనగా అభివర్ణించవచ్చు. ఎన్నో వందల ప్రాణాలు పోయాయి, ఎందరో క్షతగాత్రులై పోయారు. మరణించినవారి సంఖ్య, అవయవాలు దెబ్బతిన్నవారి సంఖ్య ఎన్ని వందల్లో ఉంటుందో చెప్పలేని అయోమయం, అగాధం అంతటా అలుముకుంది. వందల కుటుంబాలను పెనుచీకటి ఆక్రమించిన అతిపెద్ద విషాదం. మన దేశ ప్రజలే కాదు, యావత్తు మానవాళి గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ఇంతటి ఘోరానికి కారణాలు ఏంటో?  దర్యాప్తులో, పోస్ట్ మార్టమ్ లో ఎలాగూ తేలుతాయి. అదే వేరే విషయం. ఈ మధ్యకాలంలో, మన మాతృభూమిపై ఇంతటి ఘోర ప్రమాదం జరగలేదు. సిగ్నల్స్ సమస్య కారణంగానే ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ తాజాగా తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఈ ప్రమాదంపై సాంకేతిక నిపుణులు, పూర్వ అధికారులు, పరిశీలకులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టడాన్ని నివారించే ‘కవచ్’ వంటి వ్యవస్థ ఉంటే ఈ ప్రమాదం జరిగిఉండేది కాదనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. దీనిపై ‘వందేభారత్’ సృష్టికర్త సుధాన్షుమణి వేరే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. ‘కవచ్’ ఉన్నా ఈ ప్రమాదాన్ని నివారించేది కాదని అంటున్నారు. ఇది సిగ్నలింగ్ వైఫల్యం కాదని, తొలి రైలు పట్టాలు తప్పడమే ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. మొదటి రైలు ఎలా పట్టాలు తప్పిందో దానిపై ప్రభుత్వం లోతైన దర్యాప్తు జరపాలని వందేభారత్ రూపకర్త అంటున్నారు.

Also read: విపక్షాల కల సాకారం అవుతుందా?

కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరగడం మూడో సారి

అతివేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్ష్ప్రెస్స్ డ్రైవర్ బ్రేకులు వేయడంలో విఫలమయ్యారని సుధాన్షు అంటున్న మాటలతో రైల్వేశాఖ ఏకీభవించడంలేదు. సిగ్నల్ వ్యవస్థ లోపమే ప్రధాన కారణమని గట్టిగా చెబుతోంది. ఇది ఇలా ఉండగా, ‘కవచ్’ మాత్రం రైళ్ళ వేగాన్ని పూర్తిగా తగ్గించి ప్రమాదాన్ని నివారిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. కోరమండల్ రైలుకు ప్రమాదాలు కొత్తకాదు. ఈ 20ఏళ్ళల్లో మూడుసార్లు జరిగాయి. అది కూడా రెండుసార్లు ఒడిశాలోనే సంభవించాయి. ఇలాంటి కేసులను రైల్వే సేఫ్టీ కమిషన్ కు అప్పగించాలని ఒకప్పటి రైల్వే మంత్రి,నేటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచిస్తున్నారు. ప్రమాదంలో నేలలో కూరుకుపోయిన చివరి బోగీని బయటకు తీస్తే కానీ, మృతుల సంఖ్య పూర్తిగా తెలియదు. ఘటన తీరును పరిశీలిస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. చివరి బోగీని వెలికితీయడం అంత ఆషామాషీ కాదు. బాలేశ్వర్ లో జరిగిన ఈ ఘటనలో మూడు రైళ్లు ఢీకొనడం మాత్రం అనూహ్యమైంది. అతి వేగమే ఇంత పనిచేసింది. బోగీలు గాల్లోకి లేచి, తిరిగి పోయాయి. అంతే బలంగా కిందికి పడడంతో పట్టాలు ధ్వంసమైపోయాయి. ఒక బోగీపై మరో బోగీ దూసుకెళ్లడంతో ప్రయాణీకులు నలిగిపోయారు. ఒడిశా ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.

Also read: శతాధిక సార్వభౌముడు ఎన్ టీ ఆర్

ఇకపై మరణమృదంగ ధ్వనులు వినపడకూడదు

ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణీకులు ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది సురక్షితంగా ఉన్నారని చెబుతున్నా, పూర్తి వివరాలు సమగ్రంగా తెలియాల్సివుంది. చాలామంది ఫోన్స్ అందుబాటులోకి రావడం లేదు. సహాయక చర్యలు ముమ్మరంగానే సాగుతున్నాయి. అవసరమైతే క్షతగాత్రులను ఎయిర్ లిఫ్ట్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకూ అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేసింది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడం వేరు. ఇలాంటి మరణమృదంగ ధ్వనులు ఎన్నడూ వినపడకూడదని కోరుకుందాం. బాధ్యులకు పడే శిక్షల సంగతి అటుంచితే, ఎందరో అమాయకులు బలైపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని అధికారులు,నేతల నుంచి వచ్చే మాటలు ఇక ఎన్నిసార్లు వినాలి?

Also read: సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తి చేస్తారా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles