Friday, April 19, 2024

తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగానూ చెప్పగల నేర్పరి

మాడభూషి శ్రీధర్ తిరుప్పావై 15

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడఏలోర్ ఎమ్బావాయ్

తెలుగు భావార్థ గీతిక

కులుకుపలుకుల చిన్నారి చిలుక నీకింక కునుకేల

చెవులుజల్లన అరవకే, నేనిపుడె వచ్చెదనులేవే

కలికి నెరజాణ నీ మాట తెలివి మాకు తెలుసులేవే

మీకన్నజాణలు వేరెవ్వరే, పోనీ మీరే పరిపూర్ణులేలే

తెమిలి ఇకనైన రమ్ము, ’మరి చెలులెల్ల వచ్చినారొ?

అనుమానమేల సఖీ నీవె వచ్చి లెక్కించుకోవచ్చులే

కువలయాపీడమ్ముగూల్చి కంసాది రాక్షసుల కడతేర్చిన

బాలకృష్ణుడి భక్తి సేవించ రారమ్మ గొల్ల భామలారా

ఈపాశురంతో పదిమంది ఆళ్వార్ లను, పదిమంది గోపికలను మేలుకొలుపే కార్యక్రమం పూర్తయింది.  తిరుమంగయాళ్వార్ ను నిద్రలేపి శ్రీమతే శఠగోపాయనమః అనే మంత్రం ఈ పాశురంలో పలుకుతుంది. వేదాలను వివరించి వేదవిదుడు దాశరథి రంగాచార్యతన మానస తిరుప్పావై లో ఈ విధంగాచెప్పారు. తిరుప్పావైలో తొలి అయిదు పాశురాలు ప్రస్తావన వంటివి, ఆరునుంచి 15 వరకు గోపికలను ఆళ్వారులను జాగృతం చేసేవి. తొలి అయిదు పద్యాలు మాణిక్యాలు, తిరుప్పావై మహాకావ్యానికి అవి పంచ ప్రాణాలు. మొదటి పాశురంలో వెన్నెల అందచందాలు, కారు మేఘము వంటి శ్రీ కృష్ణుని కరుణా దృష్టి మనసును మురిపిస్తాయి. రెండో పాశురంలో వ్రత నియమాలుంటాయి, శెయ్యాదన శెయ్యోం అంటే చేయకూడనివి చేయబోమని వాగ్దానం చేయిస్తాయి. మూడోది ఆశీర్వచనం, వేదసూక్తమంత అందంగా ఉంటుంది. నాలుగోది వర్ష సూక్తం. వేదంనుంచి దిగివచ్చినట్టుంటుంది. అయిదో పాశురంలో స్వామిని ఆశ్రయించే విధానాన్ని వివరిస్తుంది తల్లి. ఇక ఆరునుంచి 15 దాకా జాగృతి పాశురాలు. ఈనాటికి అవి పూర్తయినాయి.

భావార్థాలు

బయటవేచి ఉన్న గోపికలకు లోన ఉన్నటువంటిగోపికలకు మధ్య సంభాషణతో కొనసాగుతుందీ పాశురం. మాయనై లీలామానుష విగ్రహుడై శ్రీకృష్ణుడిని కీర్తించడానికి కదలి రమ్మని బయట ఉన్న గోపబాలికలు పిలుస్తున్నారు.

Also read: కెందామరనేత్రుడు శంఖచక్రధరుడు ఆజానుబాహుడు
సహనం తోసాధన చేస్తే నే ఏదైనా సాధ్యం. భాగవత సహవాసం వల్ల సహనం వస్తుంది. ఆచార్యకటాక్షం లభిస్తుంది. ఆచార్యుని దయ కలగడానికి ముందు ఏం చేయాలో వివరించే పాశురం ఇదిలోపల ఉన్న గోపికను వాకిలి బయటనుంచి పిలుస్తున్నారు అక్కడ చేరిన గోపికలు. నిన్న తమతో చేరిన గోపబాలికతో కలిసి పంకజనేత్రుని పుండరీకాక్షుని వర్ణిస్తూ ఉంటే విన్న లోని గోపిక తాను బయటకు వస్తే ఈ శ్రీకృష్ణ గానామృతాన్ని ఆపుతారేమోనని లోపలనుంచే తానూ గొంతు కలుపుతుందట. అది విని, మేలుకొని ఉన్నా బయటకు రాలేదని వీరు కోపిస్తారు.

బయటగోపికలు: “ఎల్లే!” ఏమే, “ఇళంకిళియే!” తీయనిమాటల లేత చిలకా! “ఇన్నంఉఱంగుదియో” అందరూ వచ్చిన తరువాత కూడా ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా? (చిలకవంటి గొంతుగల ఆ గోపిక తమ వెంట ఉంటే శ్రీ కృష్ణుడు సులభంగా లభిస్తాడని వీరి ఆశ, కనుక పరోక్షంగా పొగుడుతున్నారు)
లోపలి గోప బాలిక: చెవులు జిల్లుమనేట్టు పిలవవద్దు. మీ అందరినీఎడబాసి బాధతో నేనుంటే మీరు నన్ను పొగడటం సరికాదు (శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నారేమో అని అనుమానించి) “శిల్ ఎన్ఱు అరైయేన్మిన్” ఏమిటీ అల్లరి శ్రీకృష్ణుడు నా దగ్గరేమీ లేడు “నంగైమీర్!” పరిపూర్ణులు మీరే. “పోదరుగిన్ఱేన్” నేనే వస్తున్నాను లెండి.

Also read: రాకాసిరాజు రావణు పదితలలు గిల్లివేసె రామమూర్తి
బయటిగోపిక:”వల్లై”మహాసమర్దురాలివే, మంచి నేర్పరివే, “ఉన్ కట్టురైగళ్” “పండేయున్ వాయఱిదుమ్” కటువైన మాటలు, నేర్పు మాకు ఎప్పటినుంచో తెలుసులే.
లోపల గోప బాలిక: “వల్లీర్గళ్ నీంగళే” నేనేం కాదు మీరే సమర్థులు, నన్నా సమర్థురాలని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటువల్ల బాధలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు, “నానే తాన్ ఆయిడుగ” రాకపోవడం నాదే తప్పు. పోనీ నేనే కఠినరాలిననుకోండి.

బయటి వారు: “ఒల్లై నీ పోదాయ్” సరే అలా అయితే రా మరి, “ఉనక్కెన్న వేఱుడైయై” నీకే ప్రత్యేకత ఉంది?
లోపల గోపబాలిక: “ఎల్లారుం పోందారో” అంతా వచ్చారా
బయటి గోపబాలిక: “పోందార్” అందరూ వచ్చారు, కావాలంటే నీవు బయటికి వచ్చి లెక్కించుకో నీ దర్శనం మాకు కావాలి.

లోపల గోప బాలిక: “పోంద్-ఎణ్ణిక్కోళ్” ఏం చేద్దాం అందరం
బయటివారు: “వల్లానై కొన్ఱానై ” బలీయమైన ఏనుగు -కువలయాపీడం “మాత్తారై మాత్తరిక్కవల్లానై” దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగల్గినవాడు “మాయనై” చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని, “ప్పాడ” పాడుదాం.

విశేషార్థాలు
నిన్న పంకజనాభుని కీర్తిస్తూ పాడిన స్తోత్రాలను విని పరవశించిపోయి లోనున్న గోపిక కూడా మధురంగా పాడడం మొదలు పెట్టింది. ఏమాశ్చర్యం నిన్ను లేపడానికి మేం వస్తే మమ్మల్ని మైమరిపించే విధంగా ఉంది నీ కంఠ మాధుర్యం. ఈ చిలుకపలుకులున్నా నీవు చిన్నారి చిలుకవు. శ్రీ కృష్ణుని సాంగత్యంలేని శరీరం నోరు తెల్లబడి ఉంటాయి. కాని నీవు లేతచిలుక పచ్చని మేని రంగుతో ఎర్రని నోటితో ఉన్నావు. అంటే నీవద్ద శ్రీ కృష్ణుడున్నట్టే కదా. మేమంతా వచ్చిన తరువాత కూడా నిద్రిస్తున్నావా? శ్రీకృష్ణుడి విరహంతో బాధ పడుతున్న మాకు నీ స్నేహం లేకపోవడం కూడా తోడైంది. మామాటలు విని కూడా నీకు నిద్ర ఎలా వస్తున్నదమ్మా?

Also read: రాముడు ‘‘నేడు పోయి రేపురా’’ అని, రావణుడుతో బతికించి పోయాడు

భాగవతుల సహవాసమే సరైన దారి

భగవంతుడి గుణానుభవంలో ఉన్న లోపలి గోపికకు చిన్నారి చిలుకా అన్న పిలుపు జిల్లుమనిపించింది. భగవద్గుణకీర్తనానందంలో తూగుతున్నవారికి భగవంతుని రాకకూడా ఆటంకం వలె ఉంటుందట. కనుక చిరాకు కలిగించేలా పిలవకండి అంటున్నదామె. నీ చతురత మాకు తెలుసు తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగానూ చెప్పగల నేర్పరివి. ఈ విధంగా వాద ప్రతివాదాలు కొనసాగాయి. తనది తప్పని ఎవరైనా అంటే వెంటనే ఒప్పుకుని ఎదురు చెప్పకపోవడం ఒక వైష్ణవ లక్షణం. ఇది అహంకార రాహిత్యం. దాసోహం అని భావిస్తారు.

రామానుజుపైన రాజ నిషేధం

ఈ సందర్భంలో ఒక సంఘటనను దేవనాథన్ గారు ఉదహరించారు. క్రిమికంఠ చోళుని వైష్ణవ ద్వేషం వల్ల రామానుజుడు దేశం విడిచిపోవలసి వచ్చింది. రామానుజునితో సంబంధం ఉన్న వారెవరూ శ్ర్రీరంగప్రవేశం చేయరాదని నిషేధం విధించారు. ఓరోజు కూరత్తాళ్వార్ శ్రీరంగని సేవకు ఆలయానికి వెళ్లారు. కావలి వారు రాజాజ్ఞను వివరించి, అయినా నీవు ఎవరికీ విరోధివికావు కనుక లోపలి వెళ్లవచ్చు అన్నారు. శ్రీమద్రామానుజుని సంబంధం తెంచుకుని నేను లోనికి వెళ్లను అని వెనుదిరిగిపోయారా స్వామి, ఎంత త్యాగశీలి. భాగవత వ్యతిరేకమయిన భగవద్విషయం అనుష్ఠాన యోగ్యం కాదని కూరత్తాళ్వార్ చాటారు. ఇది భక్తి.


అయిదో పాశురం తో గోదాదేవి మాయనై అని శ్రీకృష్ణలీలలను వివరిస్తూ వచ్చారు. పది పాశురాల్లో ఆశ్చర్యకరమైన ఘట్టాలను ప్రస్తావిస్తారు. ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను ఆండాళ్ పరిచయం చేసిందని వివరించారు జీయర్ స్వామి. యోగ్యులు, జ్ఞానులూ అయిన యోగులతో కలిసి ఉంటూ వారు చూపిన దారిలో నడుస్తేనే శ్రేయస్సు. అటువంటి భాగవతుల సాహచర్యం కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే అసలు తిరుప్పావై అంటూ, ఇంక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలని రచించారని జీయర్ స్వామి వివరించారు.

Also read: ఆమె మరో సీత – గోదాదేవి

ఆచార్యుడే చిలక

ఈ పాశురం భాగవతుల పారతంత్ర్యం గురించి వివరించింది. ఎల్లే ఇలంగిళియే చిన్నారి చిలుకా అంటే భాగవతుల దర్శనం వారి మాటలు వినడం పరమలక్ష్యం అని. చిలుక అంటే భగవంతుని సారూప్యమును పొందిన ఆచార్యుడికి ప్రతీక. చిలక పలుకులంటే భగవద్విషయంలో రుచి కలిగినవారి మాటలని అర్థం. భాగవతులందరితో కలిసి ఉండాలి, ఇన్నమ్ ఉరంగుదియో ఇంకా నిద్రపోతున్నావా అంటే భాగవతుల సహవాసం లభించినప్పడికీ వాళ్లతో చేరకపోవడం దోషమని. నీ ప్రత్యేకతేమిటి? అంటే పూర్వాచార్యులు నడిపిన దారిలో నడవాలని, ప్రత్యేకంగా వ్యవహరించరాదని భావం.
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ గుణ కీర్తనం చేసేప్పుడు భగవంతుడు వచ్చినా ఓర్చుకోవడం కష్టం. నంగైమీర్ పోదరు గిన్ఱేన్ భగవద్విషయంలో ఆహ్వానిస్తున్నవారిని భక్తిపురస్సరంగా ఆహ్వానించాలి. నానేదాన్ ఆయిడుగ = నేనే వాక్చాతుర్యంగా ఉండనీ భక్తులను వదులకుని శ్రీ మహావిష్ణువును ఆశ్రయించడం తగదు కనుక నిందనైనా ఒప్పుకుని వారిని కలవడం ప్రధానం. ఆచార్యవాక్యము, భాగవతులతో కలిసి ఉండడం అనే రెండే ఆచార్య ప్రాప్తికి కారణాలు. ఎల్లారుం పోందారో అందరూ వచ్చారా అంటే తారతమ్యాలు లేకుండా అందరూ వైష్ణవులే అని భావించాలి. పోన్దెణ్డిక్కొళ్ లెక్కపెట్టుకో అంటే ఏ ఒక్క భక్తుడు రాకపోయినా భగవదనుభవానికి కొరతే. మాయనై పాడు మాయావిని కీర్తించు కువలయాపీడము = లోకాన్ని పీడించే అహంకారము, చాణూర ముష్టికులు= కామక్రోధాలు, వాటిని నిర్మూలించిన మాయాచేష్టితుడైన శ్రీకృష్ణుడిని తిరునామాలను కీర్తించడమే భోజనం.

మనసు పలుకులు పలికే చిలక

మనము పలికిన పలుకులనే మళ్లీపలికేది చిలుక. ఈ పాశురములో తిరుమంగైయాళ్వార్ ను మేలుకొలుపుతున్నారు. నమ్మాళ్వాలరుల శ్రీ సూక్తులనే వీరు అనుసరించి, అనుకరించి సాధించినారు. వీరే చిలుక. ఇక్కడ గురుపరంపరా వాక్యము ‘‘శ్రీమతే శఠగోపాయనమః’’. వీరు ఆళ్వారులందరిలో చిన్నవారు. తిరువాయ్ మొళి నాకు సంతచెప్పి నాచే పలికించారని వీరు చెప్పుకున్నారు. కనుక వీరే చిలుక, ఇళంకిళియే లేత చిలుక. చిలుక పలుకుల వలె వీరి సూక్తులు అతి మధురములు. 16 సంవత్సరాలు నిద్రించి ఉన్నారు కనుక ఇంకా నిద్ర సరిపోలేదా ‘‘ఇన్న మురంగిదియో’’ అన్న వాక్యం సరిపోతుంది. వీరు పరిపూర్ణులు కనుక నంగైమీర్ అనే సంబోధన కూడా సరిపోతుంది.16 వ పాశురం నాయగనాయ్ లో కోయిల్ కాప్పానే మాట (కోవెల కాపాడే) విష్వక్సేనుడికి సరిపోతుంది. కనుక శ్రీమతే విష్వక్సేనాయనమః అని, 18వ పాశురంలో అమ్మవారి వైభవం చెప్పారు కనుక శ్రియై నమః అనీ, ముప్పత్తు మూవర్ పాశురంలో స్వామి వైభవం వివరించారు కనుక శ్రీధరాయనమః అనీ చెప్పుకోవాలి. ఆ విధంగా తిరుప్పావై ద్వారా గురుపరంపరానుసంధానం పూర్తవుతున్నదని శ్రీ కందాడై రామానుజాచార్య అంతరార్ధాన్ని అద్భుతంగా వివరించారు.

గోదమ్మ పాదాలె మనకు శరణు

Also read: మోహన మురళీ కృష్ణు ముద్దుల జవరాల నిదుర ఇంకేలనమ్మ

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles