Saturday, June 15, 2024

దళిత మహిళపై అత్యాచారం, పోలీసుల దురాచారం

  • హాథ్ రస్ ఘటనపై నివ్వెరబోయిన దేశం
  • పెక్కు రాష్ట్రాలలో నిరసన ప్రదర్శనలు
  • రాముడేలిన రాజ్యంలో రాక్షసం
మా శర్మ

మనుషులతో పాటు సత్యం  హత్యకు, ధర్మం అత్యాచారానికి బలి అవుతున్న ధోరణులు సమాజంలో పెరిగిపోతున్నాయనే వ్యాఖ్యలు పెద్దలు ఎప్పటి నుండో చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని హాథ్ రస్ లో జరిగిన సంఘటన సభ్య సమాజాన్ని కలవర పెడుతోంది. అది జరిగిన కొంత సమయంలోనే మరో అత్యాచారం జరిగింది. హత్యలు, అత్యాచారాలు జరగడం ఒక ఎత్తు, పోలీసుల తీరు మరో ఎత్తు, అనే విమర్శలు, ఆగ్రహాలతో దేశం భగ్గుమంటోంది.

నిర్భయ, దిశ వంటి సంఘటనలు, అవి తెచ్చిన చట్టాలు, జరిగిన పర్యవసానాల ప్రభావం గోరంత కూడా కనిపించకపోవడమే ఆశ్చర్యకరం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఈ తరహా దమనకాండకు కార్యస్థానంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఒక యోగి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా లేనట్లుగా ఉత్తరప్రదేశ్ లో దళిత ముఖ్యమంత్రి అనేక సార్లు పరిపాలించారు. ఆ అవకాశం మాయావతికి దక్కింది. దక్కినా,  ఆశించిన స్థాయిలో దళితులకు ప్రయోజనం సిద్ధించలేదు. ఇన్నేళ్లపాటు దళితనేత పరిపాలించినా, సమాజంలో వారి బలం పెరగలేదు. వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే శిక్షలు అనుభవించక తప్పదనే భయం మిగిలినవారిలో పెరగలేదు.

సాక్షాత్తు సుగుణాభిరాముడు శ్రీరాముడు జన్మించి, పాలించిన పవిత్రమైన భూమి అది. వర్ణ, వర్గ, లింగ వైషమ్యాలు, విభేదాలు అక్కడే పెద్దపీట వేసుకొని కూర్చున్నాయి. రాముడు పాలించినా, దళితులు పాలించినా, యోగులు పాలించినా, రాజులు పాలించినా అక్కడ తీరు మారలేదు. అది అతిపెద్ద రాష్ట్రం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన రాష్ట్రం. ప్రస్తుత గణాంకాల ప్రకారం 20 కోట్లపైనే జనాభా ఉన్నారు. హింస, దురాగతాలు పెద్ద సంఖ్యలో నమోదు కావడానికి, అదుపు దప్పడానికి ఇదొక కారణం కావచ్చు. ముఖ్యంగా దళితులపై దమనకాండ సాగుతూనే వుంది. అగ్రవర్ణాలతో పాటు వెనుకబడిన వర్గాలు కూడా ఈ ఘోరకలిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్నారని విశ్లేషకుల అభిప్రాయం.

హాథ్ రస్ సంఘటనలో పోలీసుల తీరుపై ప్రధానమైన చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో 19ఏళ్ళ దళిత యువతిపై నలుగురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. పరమ కిరాతంగా అత్యాచారం చేసి చంపారని కుటుంబ సభ్యులు మొత్తుకుంటుంటే, ఆనవాళ్లు కూడా లేకుండా అర్ధరాత్రి పూట శవాన్ని పోలీసులు  కాల్చివేయడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. గత సెప్టెంబర్ 14వ తేదీన సంఘటన జరిగి, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా, వెంటనే  ఎఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యకుండా పోలీసులు నిర్లక్ష్యం చూపించడం, దర్యాప్తులో కాలయాపన చెయ్యడం, చివరికి శవాన్ని కాల్చి వేయడం మొదలైన సంఘటనలు పోలీసులతో పాటు అధికారులకు, ప్రభుత్వానికి కూడా  చెడ్డపేరు తెచ్చింది. కుటుంబ సభ్యులకు దహన సంస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం మరింత అమానవీయ చర్య. దళితులకు న్యాయం చెయ్యకుండా అగ్రవర్ణాల నిందితుల తరపున అధికార పక్షం నిలుచుందనే విమర్శలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చుట్టూ కమ్ముకున్నాయి.అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించం, కఠినంగా శిక్షిస్తామని  ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్  ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి చర్యలు, ప్రతిచర్యలు ఎన్ని చేపట్టినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, రావలసిన కష్టం వచ్చింది. ప్రతిపక్షాలే కాక, సామాజిక కార్యకర్తలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమ బాట చేపట్టారు. నిర్భయ అత్యాచారం కేసు తరపున వాదించి, దోషులకు శిక్ష పడేలా చేసిన యువ మహిళా న్యాయవాది సీమా కుష్వాన్ హాథ్ రస్ కేసు విషయంలో వాదనలు వినిపించడానికి రంగంలోకి దిగినట్లు సమాచారం.

హాథ్ రస్ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పూనుకున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక  బృందాన్ని, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల బృందాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీని చెయ్యిపెట్టి తోసేశారని, రాహుల్ కింద పడిపోయారని వింటున్నాం. తాజాగా తృణమూల్ మహిళా నేతల బృందానికీ అదే చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసుపై న్యాయ సహాయం ఇవ్వడానికి సిద్ధమైన న్యాయవాది సీమా కుష్వాన్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అసలు అత్యాచారమే జరగలేదని, కేవలం గాయాలు మాత్రమే అయ్యాయని, నిందితులు నలుగురినీ  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దుర్ఘటనకు బలైన యువతి చావు బతుకుల్లో ఉండగా,  తనపై నలుగురు అత్యాచారం చేశారని పేర్లతో సహా మరణ వాంగ్మూలం కూడా ఇచ్చింది. న్యాయశాస్త్రంలో, చట్టంలో దీనికి చాలా విలువ వుంది. అత్యాచారానికి పాల్పడినవారు చట్టరీత్యా శిక్ష పడకుండా తప్పించుకోడానికి వీలే లేదు. మర్మావయంపై గాయాలున్నాయని  లేడీ డాక్టర్ తొలుతగా  ఇచ్చిన నివేదిక సరిపోతుంది.

ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం యువతిపై అత్యాచారం జరగలేదని ఏ డి జి ప్రశాంత్ కుమార్ ప్రకటించడం విశేషం, విడ్డూరం. హత్రాస్ దుర్ఘటన  జరిగిన కొంతకాలంలోనే… బలరాంపూర్ కాలేజీలో చేరడానికి ఇంటి నుండి వెళ్లిన 22ఏళ్ళ దళిత యువతి అత్యాచారానికి గురి అయ్యింది. శవమై ఇంటికి  వచ్చింది. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, సమాజంలో అగ్గి రగిల్చడానికి కొందరు చేస్తున్న కుట్రగా ఏ డి జి అభివర్ణిస్తున్నారు. ఈ యువతి హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురు అగ్రవర్ణానికి చెందినవారు. వీరందరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

నిర్భయ వంటి చట్టాలతో పాటు దళిత, ఆదివాసీ అత్యాచార నిరోధక చట్టం కూడా అమలులో వుంది. చట్టాల ద్వారా శిక్ష పడి తీరుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. శిక్ష పడకుండా నిందితులకు మద్దతుగా నిల్చొని, సాక్ష్యాలను తారుమారు చేసే వారిని కూడా కఠినంగా శిక్షించాలి. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నేటి రాజకీయ సంస్కృతిలో అది జరిగేపని కాదు. నేటి నాయకులెవ్వరూ నాటి లాల్ బహుదూర్ శాస్త్రివంటి వారు కాదు. ఈ తీరు ఇలాగే కొనసాగితే, అధికారంలో ఉన్న నేతలకు ప్రజాక్షేత్రంలో ఏదో ఒకరోజు శిక్ష పడక తప్పదు. శిక్షలు వెయ్యడంతో పాటు ఇటువంటి దుర్ఘటనలు మరోమారు జరుగకుండా ఏలినవారు చూసుకోవాలి. ధర్మం, న్యాయం, చట్టం ముందు దళితులైనా, అగ్రవర్ణాలైనా సమానమేనని గుర్తించాలి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles