Tuesday, January 31, 2023

ఆనందం

                               ————

( ‘ PLEASURE ‘ FROM ‘ THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)

తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్

——————-

  సంవత్సరానికి ఒకసారినగరాన్ని సందర్శించే ఒక సన్యాసి ముందుకు వచ్చి ఆల్ ముస్తఫాను ఇలా అడిగాడు. “మాకు ఆనందం గురించి చెప్పండి.”

  ఆయన ఇలా చెప్పసాగాడు:

  ఆనందం ఒక స్వేచ్ఛా గీతిక

  కానీ  అది స్వేచ్ఛ కాదు!

  ఆనందం —  మీ వికసిస్తూన్న కోరికలు

  కానీ  అది కోరికల ఫలం కాదు!

  అది ఎత్తుకు ఎదగాలనుకునే అగాధం!

  కానీ అది,

          అగాధమూ కాదు — ఎత్తూ కాదు

  ఆనందం అంటే —

  పంజరంనుండి  రెక్క విప్పు కున్నట్టు

  కాని,

  అంతరిక్షాన్ని  చుట్టుకున్నట్లు కాదు!

  ఔను! నిజానికి

          ఆనందం ఒక స్వేచ్ఛా గీతిక!

  మీరు గుండె నిండుగా పాడుకుంటే సంతోషిస్తాను

  కానీ,

  పాటలో మైమరచి హృదయాన్ని పోగొట్టుకోవద్దు!

  మీ యువత కొంతమంది

  అదే సమస్తము అయినట్లు

  ఆనందాన్ని పొందుతూ ఉంటారు!

  మీరు వారి మీద తీర్పులిస్తారు

  వారిని మందలిస్తారు

  నేను వారిపై తీర్పునివ్వను,

  మందలించను

  వారిని ఆనందించమని చెబుతాను!

  ఎందుకంటే — వారు ఆనందం పొందుతారు.

  అది ఒక్కటే కాదు:

  ఏడుగురు అక్క చెల్లెళ్లను కూడా పొందుతారు!

  వారిలో చిన్న పిల్ల ఆనందం కన్నా సుందరమైనది

  వేళ్ళ కోసం మట్టిని తవ్వుతూ —

  నిధిని పొందిన మనిషి గురించి వినలేదా?

  మీ పెద్దలు కొంతమంది తాము పొందిన

  ఆనందాలని గుర్తు చేసుకుంటూ–

  అవి మద్యం మత్తులో  చేసిన తప్పులని

  విచార పడుతుంటారు.

  కానీ,

  విచారం మనసును కమ్మి వేస్తుంది

  దానికి పడే శిక్షను కాదు

  వేసవిలో వచ్చే ఫలసాయాన్ని

  గుర్తుపెట్టుకున్నట్లుగా

  వారి ఆనందాలను వారు

  కృతజ్ఞతతో జ్ఞాపకముంచుకోవాలి.

  అయినా గాని,

  వారికి విచారమే సుఖంగా ఉంటే

  అలాగే  కానీయమనండి!

  మీలో కొందరున్నారు,

  వారు — కోరుకునేంత  తక్కువ వయస్కులూ కాదు

  గుర్తుంచుకునేంత  పెద్దలూ కాదు

  పొందటం, గుర్తుంచుకోవడం —  అనే భయంలో

  వారు ఆత్మను నిర్లక్ష్యం చేస్తే

  లేదా దాని ఎడల నేరం చేస్తే

  అన్ని ఆనందాలు కోల్పోతారు!

  వాటిని పోగొట్టుకోవటం లో కూడా

  వారు ఆనందిస్తారు

  అలా, వేరుల  కోసం వణికే చేతులతో

  తవ్వినా గాని,

  వారు కూడా నిధిని కనుగొంటారు!

  కానీ,

  చెప్పండి —  ఎవరు ఆత్మను బాధ పెడతారు?

  నైటింగేల్ పక్షి నిశ్చల నిశీధిని బాధిస్తుందా?

  లేక, మిణుగురులు నక్షత్రాలను బాధిస్తాయా?

  మీ మంట గాని, పొగ గాని

  గాలిని బాధిస్తాయా?

  మీ చేతి కర్ర తో  కెలకటానికి

  ఆత్మ ఏమైనా నిశ్చలమైన

  కొలను నీరు అనుకున్నారా?

  చాలాసార్లు,

  ఆనందం వద్దనుకున్నప్పుడు

  నీ కాంక్షలను నీ మనసు

  సందుల్లో దాచి పెడతావు!

  ఈరోజు విస్మరించామనుకున్నదే

  రేపటి కోసం ఎదురు చూస్తుందని

  ఎవరికి తెలుసు?

  చివరకు,

  నీ తనువుకు కూడా తన వారసత్వం తెలుసును

  దాని సరైన అవసరాలు తెలుసు

  అది మోసగించబడదు

  నీ తనువు . నీ ఆత్మ విపంచి!

  దానితో,

  మధుర సంగీతం సృజిస్తావో

  గందరగోళ ధ్వనులు పుట్టిస్తావో

                  నీ ఇష్టం!

  ఇప్పుడు మీ హృదయాలని అడుగండి

  “ఆనందంలో  మంచి ఏది? చెడు ఏది?

  ఎట్లా గుర్తించగలం?” అని

  మీ పొలాలకు, తోటలకు వెళ్లి చూడండి

  ” పుష్పాల నుండి తేనె పోగు చేయడం

   తేనెటీగలకు ఆనందం అనీ

   మధుపాలకు తేనె నివ్వడం

  పుష్పాలకు ఆనందమనీ “

  నేర్చుకుంటారు

  తేనెటీగకు పుష్పం ఒక జీవపు ఊట

  పుష్పానికి తేనెటీగ ఒక ప్రేమ దూత!

  తేనెటీగకుపుష్పానికీ — రెంటికీ

  ఆనందం, ఇవ్వటం పుచ్చుకోవడం — అనేవి

  ఒక అవసరం

  ఒక పారవశ్యం.

   ఆర్ఫెలేస్ ప్రజలారా!

                 పుష్పాలు, మధుపాల లాగా

                 మీ ఆనందాల్లో మీరుండండి!

Also read: దేవుణ్ణి కనుగొనటం

Also read:డెభ్భై ఏళ్ళు

Also read: ప్రార్థన

Also read: నీడ

Also read: శాంతి ఒక అంటు వ్యాధి

Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles