Thursday, March 28, 2024

హనుమ వాక్పటిమ గురించి లక్ష్మణుడికి రాముడి వివరణ

రామాయణమ్ 96

‘‘ధర్మాత్ముడైన సుగ్రీవుడు మీ స్నేహమును కోరుచున్నాడు. నేను అతని మంత్రిని వాయుపుత్రుడను, వానరుడను.  సన్యాసి రూపము ధరించి ఋష్యమూకము నుండి వచ్చినాను. ఇచ్ఛానుసారము రూపము ధరించి ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళగలను’’ అని పలికి ఇక మాటాడకుండా మౌనంగాఉండి పోయాడు.

Also read: తనను రామలక్ష్మణులకు పరిచయం చేసుకున్న హనుమ

ఒక్కసారిగా రాముని ముఖము ఆనందంతో వికసించింది. వెదుక బోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంబరపడిపోయి లక్ష్మణునితో…

‘‘లక్ష్మణా, ఈ వానరుడు మాటలు తెలిసిన వాడు ( వాక్యజ్ఞుడు),మధురభాషి.

నానృగ్వేద వినీతస్య నాయజుర్వేదధారిణః

నాసామవేదో విదుషః శక్యమేవం విభాషితుమ్.

‘‘ఋగ్వేదము వినీతుడై చదవనివాడికి, యజుర్వేద ధారణ చేయని వానికి, సామవేద వైదుష్యము లేనివానికి ఈ విధంగా మాటలాడటం సాధ్యంకాదు.

Also read: కిష్కింధలో కలకలం

(క్రొత్త వారి వద్దకు వెళ్ళినప్పుడు ఎలా మాటలాడాలి అని తెలవడం ఒక విద్య. ఏమి మాట్లాడ కూడదో తెలవడం అంత కంటే పెద్ద విద్య.

వారిని చూసి హనుమంతుడు సరిగా అంచనా వేసి వారిని అడిగాడు. ఒక్కమాట ఎక్కువ తక్కువ లేవు. అనవసరపు వందిమాగధ పొగడ్తలు లేవు.

ఆయన అడిగినప్పుడు మొదట శ్రీ రాముడు మాటాడలేదు. హనుమంతుడు తనను తను పరిచయం చేసుకుని మిన్నకుండిన తరువాత మాత్రమే నోరు విప్పాడు.

Also read: శబరికి మోక్షం

మనస్సును అదుపులో ఉంచి క్రమశిక్షణతో గురువు దగ్గర అధ్యయనం చేసేవాడు. వినీతుడు. ఋగ్వేదం వినీతుడై అభ్యసించాలి. యజుర్వేదానికి ధారణ ముఖ్యంగా కావాలి. వాక్యాలు మరలమరల వస్తుంటాయి. సామవేదం గాత్రప్రధానమైనది అందుకు చక్కటి ఊహా శక్తి కావాలి. అందుకు కావలసినది వైదుష్యం.

అందుకే మహర్షి వాల్మీకి ..వినీతః, ధారిణః, విదుషః అనే శబ్దాలు ప్రయోగించారు.

ఆయన మాటలాడిన వెంటనే ఈయన ఆయనలోని గొప్పదనాన్ని అంచనా వేయగలిగాడు రామచంద్రుడు.

సరిగా చదువుకొన్న వాడు ఇవి అంచనా వేయగలగాలి అపుడే చదువుయొక్క సార్ధకత.)

Also read: రామలక్ష్మణులకు బుుష్యమూక పర్వతానికి దారి చెప్పిన కబంధుడు

రామచంద్రుడు ఇంకా హనుమ యొక్క సంభాషణా చాతుర్యము గురించి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు.

నూనం వ్యాకరణకృత్స్నమనేన బహుధా శ్రుతమ్

బహు వ్యాహరతానేన న కించిత్ అపశబ్దితమ్….

అనగా…

నిశ్చయముగా ఈతడు వ్యాకరణమును అనేక పర్యాయములు విని ఉన్నాడు. అందుచేత ఇన్ని సార్లు మాట్లాడినా ఒక్క అపశబ్దముకూడా ఇతనిచేత ఉచ్చరించబడలేదు. ఇక్కడ బహుధా అనగా…… అనేక పర్యాయములు అనే అర్థం లో ఆ పదం మహర్షి వాడారు.

న ముఖే నేత్రయోశ్చాపి లలాటే చ భ్రువోస్తథా

అన్వేష్వపి చ సర్వేషు దోషః సంవిదితః క్వచిత్.

ముఖమునందుగానీ,  నేత్రములయందు కానీ, లలాటమునందు కనుబొమ్మలయందుగానీ, మరి ఏ ఇతర అవయవములయందు గానీ ఏ మాత్రము దోషము కనపడలేదు.

Also read: కబంధుని వధ, విమోచన

అవిస్తరమసందిగ్ధమవిలమ్బితమవ్యథమ్

ఉరఃస్థం కణ్ఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్.

ఉచ్ఛారణలో సాగతీతలేదు. సందేహమునకు తావు లేదు. ఆగి ఆగి మాట్లాడడము లేదు. వినేవారికి వ్యథలేదు. బిగ్గరగా గానీ మందముగా గానీ లేక మధ్యమస్వరములో వినటానికి ఇంపుగా హాయిగా ఉన్నది.

NB

అదీ మాట్లాడడము అంటే…

“సాగతీత “అంటే ఏమిటో నిత్యం FM రేడియో వినేవారికి తెలుస్తుంది.

ఇక “అపశబ్దాలు” 24 గంటల News Channels వినేవారికి సుపరిచితమే.

ఆగి ఆగి మాట్లాడటము బిగ్గరగా మాట్లాడటము మన TV ఇంటర్వ్యూలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి….ఇవ్వన్నీ అవలక్షణాలు ..

మాట ఎలా ఉండాలి? అదుగో పైన స్వామి మాట్లాడిన విధంగా ఉండాలి.

ఇంకా…

అవయవాలలో ఏ విధమైన వికారాలూ మాట్లాడేటప్పుడు ఉండరాదు.

గీతీ దీర్ఘ

శిరఃకంపీ

తధాలిఖితపాఠకః

అనర్ధజ్ఞోల్ప కంఠశ్చ

షడేతే పాఠకాధమాః

సాగతీస్తున్నట్గుగా ఉండరాదు.

తల మెడ భుజాలు విసురుతూ మాట్లాడరాదు.

Also read: కబంధుడి చేతచిక్కిన రామలక్ష్మణులు

ఇక వ్రాసుకొచ్చిన కాగితాలు చూస్తూ మాట్లాడరాదు.

అర్ధము మారిపోయే విధముగా ఉండరాదు.

కీచుకంఠము పనికి రాదు.

ఈ ఆరూ దోషాలు అని మన పెద్దలుచెప్పారు.

ప్రకృతి, ప్రత్యయ, సమాస, సంధి….వీటన్నిటిగురించి బాగాచదివి ఉన్నాడు ఆయన.

ఒక్కసారి ముక్కున పట్టుకొని పరీక్ష పేపర్లో వ్రాసి మార్కులు తెచ్చుకొని, ఆ తరువాత పెళ్ళి శుభలేఖలలో, visiting cards లో పెట్టుకోవడానికి తప్ప చదివినది ఏ మాత్రమూ గుర్తుండని చదువు.

ఈ విశేషాలు ఇంకా వున్నాయి.

Also read: సీతాపహరణ గాథ తెలిపి మరణించిన జటాయువుకు అంత్యక్రియలు

వూటుకూరుజానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles