Thursday, April 25, 2024

హనుమ పునరాగమనం

రామాయణమ్ – 159

క్రోధమెంత పాపిష్ఠిది!

ఏమి అనాలి?

ఏమి అనకూడదు?

ఎవరిని అంటున్నాం?

ఎందుకు అంటున్నాము?

ఏది పలుకుతున్నాం?

ఏది పలుకరాదు?

ఎవరు పెద్ద?

ఎవరు చిన్న?

ఏదీ తెలియదు

అది ఒక మత్తు

మనిషిని చిత్తుచిత్తుగా ఓడిస్తుంది

మనిషిలోని మృగాన్ని నిద్ర లేపుతుంది!

పాము కుబుసము విడిచినట్లు

కోపము ఎవరు విడిచి వేయగలరో

వాడెపో ఘనుడు!

వాడెపో ఉత్తముడు!

సిగ్గు  లేక ఎగ్గులేక

ఆలోచించే శక్తిలేక

అమ్మకు కీడు చేశానే!

నా తెలివిమాలిన పనికి

ప్రభు కార్యము నాశనమయ్యెగదా!

నా సముద్రలంఘనము వ్యర్ధము

నా ప్రయత్నములన్నీ  వ్యర్ధము

నా కోపము

నా ఆవేశము

అసలుకే ఎసరు పెట్టినవి

సీతమ్మ నిస్సంశయముగా కాలిపోయి ఉంటుంది.

Also read: లంకాదహనం

సీతమ్మ మరణిస్తే

రామడుండడు

రామానుజుడుండు

రామసఖుడుండు

రామబంధువెవ్వడూ ఉండడు

ఇక నా బ్రతుకెందుకు?

అగ్నికి ఆహుతి అయిపోవుదునా

బడబాగ్నిలో దూకివేయుదునా ..

అయినా

నా తోకనే కాల్చని అగ్ని

పరమ పావని సీతమ్మను అంటునా?

Also read: హనుమ తోకకు నిప్పంటించి వీధులలో తిప్పుట

అగ్నిని అగ్ని కాల్చివేయగలదా?

నేను ఇంత జలధి లంఘించి

ఇంత కార్యము చేసితినన్న

అమ్మ మహిమగాక

అన్యమేదియు లేదు

అమ్మ క్షేమము.

అమ్మక్షేమము!

అమ్మక్షేమము!

అని ఆలోచించి వడిగా వడివడిగా సుడిగాలి వలె అశోకవనమునకు చేరుకొన్నాడు రామదూత హనుమంతుడు.

Also read: రావణుడికి విభీషణుడి హితవు

….

‘‘అహో! అద్భుతము.  ఆశ్చర్యము‌. లంకావైభవమంతా దగ్ధమైపోయినది. రాక్షసచక్రవర్తి రావణుని మహద్వైభవోపేతమైన గృహము భస్మీపటలమైపోయినది.

కానీ ….సీతాదేవికి ఇసుమంత హానియూ జరుగలేదు’’ అని ఆకాశమార్గాన సంచరించు సిద్ధచారణులు అనుకొను మాటలు హనుమ చెవిన పడినవి .

.

ఒకింత ఊరట చెందాడు. అయినా మనస్సు ఆగలేదు. వెంటనే అమ్మచెంత వాలినాడు.

‘‘తల్లీ, నిన్ను మరల క్షేమముగా చూచినాను’’ అని పలికి అంజలి ఘటించి నిలుచున్నాడు.

అప్పుడు సీతమ్మ హనుమను చూసి ‘‘ఓయి మారుతీ,  నీ బలాతిశయము

ప్రశంసింపదగినది. నీ వొక్కడవు చాలును.  అయినను నన్ను తీసుకొని వెళ్ళుట రాముని కార్యము. ఆయనకే ఇది తగును.’’

‘‘అమ్మా, వానరభల్లూక దళములతో శీఘ్రమే రాముడు ఇచటకు రాగలడు’’ అని పలికి సీతమ్మకు నమస్కరించి తిరిగి వెళ్ళుటకు ఉద్యుక్తుడైనాడు వాయునందనుడు.

లంకనుండి తిరిగి సముద్రమును లంఘించుటకొరకు అరిష్టము అను పర్వతమును మారుతి అధిరోహించెను.

ఆ అరిష్టమును అణగద్రొక్కి ఒక్క ఉదుటున గాలిలోనికి లేచినాడు పవనసంభవుడు. ఆ పర్వతము నేలలోకి అణిగిపోవుచూ పెద్దపెట్టున ధ్వని చేసెను.

ఉత్తుంగతరంగాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అపారపారావారమును అనాయాసముగా దాటుతూ తన సహచరుల సమీపము లోనికి రాగానే సింహనాదములు గాలిలోనే చేయసాగినాడు హనుమంతుడు.

‘‘వచ్చినాడురా మనవాడు!

సింహనాదము చేసినాడురా మనవాడు!

చూసినాడురా మనవాడు !

అమ్మను చూసినాడురా మనవాడు!

Also read: రావణుడికి హనుమ ధర్మబోధ

ఆ నాదమె మనకు గురుతు

ఆ వేగమె మనకు గురుతు

ఆ అరుపులె మనకు గురుతు

పదండి పదండి

పోదాం పోదాం

ఎదురేగిస్వాగతించి హనుమను తోడ్కొని వద్దాం’’ అంటూ ఆవలి ఒడ్డున ఉన్న వానర వీరులు కొందరు ఆకసానికి ఎగిరినారు.

చూస్తూ ఉండగనే వాయునందనుడు క్రిందికి వాలాడు.

అందరూ బిలబిలమంటూ ఆయన చుట్టూ చేరారు.

Also read: రావణుడి ఎదుట నిలిచిన వాయునందనుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles