Friday, March 29, 2024

తనను రామలక్ష్మణులకు పరిచయం చేసుకున్న హనుమ

రామాయణమ్95

భయపడుతూ చెట్లమీదకెక్కుతూ, శిఖరాలు దూకుతో వణికిపోతున్న సుగ్రీవాదులను చూసి బుద్దిమంతులలో వరిష్టుడైన హనుమంతుడు ఇలా అన్నాడు:

‘‘ఇది మలయ పర్వతము. ఇక్కడ వాలి వలన ఆపద రాదు. అయినా అసలు ఆ వాలి ఇక్కడ నీకు కనబడుతున్నాడా నీవు అంతగా వణికి పోవటానికి? అసలు నీవు భయపడటానికి కారణము నాకు తెలియటము లేదు. నీవు ధైర్యము కోల్పోవటముచేత  నీ బుద్ది స్థిరముగా ఉండజాలకున్నది, నీ వానరత్వమును ప్రకటించుకొనుచున్నావు. నీవు నిశ్చయ బుద్ధితో మనస్సులోని భావములు వ్యక్తము చేసే చేష్టల ద్వారా ఇతరుల అభిప్రాయాలు గ్రహించు. స్థిరమైన ఆలోచన లేని రాజు ప్రజలను పాలింపజాలడు. భయపడే హృదయానికి అనుమానాలెక్కువ!’’

Also read: కిష్కింధలో కలకలం

హనుమంతుని మాటలు విన్న సుగ్రీవుడు ఇలా అన్నాడు:

‘‘నీవన్నది నిజమే. కానీ పొడవైన బాహువులు,  చూపరులకు భయము కలిగిస్తున్నాయి. శత్రువుల గుండెలలో దడ పుట్టించే మహా ఆయుధాలు ధరించి కనపడే ఆ మహాపురుషులను చూస్తే ఎవడికి భయము కలుగకుండా ఉంటుంది? వాలి ఒక రాజు.  రాజుకు ఎవరితో స్నేహమున్నదో ఎవరికి ఎరుక? వీరు వాలి స్నేహితులేమో. వాలి మేధావి. మనలను హతమార్చమని వీరిని పంపి ఉండవచ్చుకదా? రాజులను నమ్మరాదు అవకాశము చూసుకొని వారు శత్రువులను దెబ్బతీయుదురు. కావున హనుమా, నీవు సామాన్య మానవుని రూపము ధరించి వారి వద్దకు వెళ్లి వారెవరో తెలిసికొని రమ్ము.’’

సుగ్రీవుడు పంపగా రామలక్ష్మణులు ఉన్నచోటికి ఎగిరి వచ్చాడు హనుమంతుడు.

Also read: శబరికి మోక్షం

అక్కడ వారికి కనపడని చోటున ఆగి కొంత ఆలోచించి, వారెవరో తెలియనందున తన రూపము మార్చుకొని సన్యాసి రూపము ధరించి, వినయముగా వారిని సమీపించి నమస్కరించి, మృదువుగా మనోహరముగా వారిని పలుకరించాడు.

‘‘మీరు రాజర్షులవలే ఉన్నారు. దేవతలలాగా కనపడుతున్నారు. తీవ్రమైన నియమములు పాటించే మునివేషధారణలో ఉన్నారు. మీ శరీరచ్ఛాయ చాలా శ్రేష్ఠముగా ఉన్నది. మిమ్ములను చూసి ఈ అరణ్యములోని ప్రాణిసంఘాలు భయపడుతున్నవి. మీరు ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చారు? మీ చూపులు సింహముల వలెనున్నవి. మీరుధరించిన ధనుస్సులు ఇంద్రధనుస్సులవలె ఉన్నవి. శత్రు సంహారము గావించు పరాక్రమముతో శ్రేష్టమైన వృషభములవలే ఉన్నారు. మీ బాహువులు ఏనుగుల తొండముల వలె ఉన్నవి.

Also read: రామలక్ష్మణులకు బుుష్యమూక పర్వతానికి దారి చెప్పిన కబంధుడు

‘‘మంచి కాంతి గల మానవ శ్రేష్ఠులైన మీరు ఎవరు? రాజ్యార్హతలున్నవారిగా, దేవతాతుల్యులుగా కనపడుతున్నారు. ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చారు? మీ నేత్రములు పద్మముల రేకుల వలె, బాహువులు దీర్ఘములై పరిఘలవలె, మూపులు సింహముల మూపుల వలే ఉన్నవి. ఎవరు మీరు? ఇంద్రుని వజ్రాయుధములాగ మీ ధనుస్సులు సమున్నతంగా ప్రకాశమానంగా ఉన్నాయి. చూడటానికి అందముగా ఉన్నా మీ అంబులపొదులు కూడా ప్రాణములు తీసే భయంకరమైన బాణములతో నిండివున్నవి. మీ ఖడ్గములు కుబుసము విడిచిన మహాసర్పములవలే ఉన్నవి. నేను ఇంతగా అడుగుతున్నా మీరు బదులు పలుకరేమి?

Also read: కబంధుని వధ, విమోచన

‘‘అన్నచే వెడలగొట్టబడిన వానరరాజు సుగ్రీవుడు పంపగా నేను వచ్చినాను .నా పేరు హనుమంతుడు….’’

హనుమాన్ నామ వానరః.

NB

ఇదీ స్వామి తన స్వామి రామునితో మాటలాడిన మొదటి మాటలు.

తనగురించి తాను రామచంద్రమూర్తికి చేసుకొన్న పరిచయం.

.

ఆ సంభాషణలో ఎన్నో విశేషాలు ఉన్నాయి అవి సవివరంగా రేపు విశ్లేషించుకుందాము.

(మొత్తం సంభాషణ అయిన తరువాత.)

Also read: కబంధుడి చేతచిక్కిన రామలక్ష్మణులు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles