Friday, April 19, 2024

లంకిణితో హనుమ ఘర్షణ

రామాయణమ్ 126

రాముడి శ్రేయస్సు కోరేవాడైన హనుమంతుడు, ఆయన దుఃఖము పోగొట్టడమే లక్ష్యముకాగల హనుమంతుడు ఆ పర్వత శిఖరముపై నిల్చొని కాసేపు ఆలోచన చేశాడు.

క్రూరులు, మాయావులు, బలవంతులు, అయిన రాక్షసులు నివసించే లంకలో ప్రవేశించి సీతాన్వేషణ సాగించాలంటే రాక్షసులను మోసం చేస్తేనే గానీ సాధ్యము కాదు.

Also read: సముద్రాన్ని లంఘించిన హనుమ

ఇదే రూపముతో ఉంటే ఊరకే పట్టు బడిపోతాను.

నా రూపము కనపడీ కనపడకుండా ఉంటేనే అది సాధ్యము.

కావున ఈ రూపమును వదలి అతి చిన్నరూపమును ధరించవలె అని ఆలోచించాడు హనుమంతుడు. రాక్షసరూపము ధరించి రాక్షసులకు తెలియకుండా సంచరించటం వీలయ్యే పనికాదు!  వారి గూఢచారవ్యవస్థ సదా అప్రమత్తంగా ఉంటుంది. వారికి తెలియకుండా గాలికూడా సంచరించలేదు.

ముందు ఏమి చేయవలెను ఎలా చేయవలెనో ఆలోచించి నిర్ణయము తీసుకున్నాడు హనుమంతుడు.

నేనేదో గొప్పవాడిని అనే అహంభావంతో ప్రవర్తించానా మొత్తము కార్యము విఫలమయిపోతుంది. దూతగా వచ్చినవాడు తన సామర్ధ్యము గురించి అహంకరించరాదు.

(ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినా!).

Also read: సరస నోటిలోదూరి బయటకు వచ్చిన హనుమ

అని నిశ్చయించుకొని సూర్యాస్తమయము వరకు వేచిఉన్నాడు హనుమంతుడు

(ఒక పని తరువాత మరి యొక ప‌ని ఎలా చేయాలి అని flow chart అన్నమాట. …..దీనినే always define next move …అని కూడా చెపుతారు మనకు!  ప్రతి పని ఇంత వివరంగా ఆలోచనచేసి మరీ పూర్తి చేశారు హనుమస్వామి)

……

సూర్యుడు పడమటదిక్కులోకి జారిపోయాడు. హనుమంతుడు తన రూపము మార్చివేశాడు. పిల్లిఅంత రూపము ధరించాడు.

విశాలమైన రాచవీధులు.

స్వర్ణసౌధాలు,సమున్నత ప్రాకారాలు.

ఊహించడానికి కూడ వీలుకాని అద్భుతమైననిర్మాణములు కల పట్టణము ఆ రావణస్వర్ణలంక.

శత్రుదుర్భేధ్యమైన ప్రాకారాలు.

Also read: దిగ్గున లేచి సముద్రంపైన ప్రయాణం ప్రారంభించిన హనుమ

బంగారు స్తంభాలతో అలరారుతున్నది.

ఆ పట్టణముపై మెల్లగా వెండి వెన్నెలలు పరుచుకొని పిల్లగాలులు వీస్తూ ఆహ్లాదకరంగా మారింది వాతావరణం.

తెల్లటి శంఖము యొక్క రంగుగల జ్యోత్స్నలవి.

తెల్లతామరతూడువంటి వెన్నెల చాందినీలు!

క్షీరవర్ణముతో  లోకాన్నంతా కప్పివేసి మెల్లమెల్లగా ఆకాశవీధిలో ఒక్కడే ఒంటరి బాటసారిలాగ పైపైకి వస్తూ కనపడ్డాడు రేరాజు.

ఆ చల్లని వెన్నెల రాత్రిలో మనోహరమైన లంకానగరములో సమున్నత భవనాలలో సంచరించ సంకల్పించాడు మారుతి.

Also read: లంక ప్రయాణానికి సిద్ధమైన హనుమ

అది కుబేరుడి అలకానగరియా?

దేవేంద్రుడి అమరావతియా?

కాదుకాదు, రావణుడి లంకాపురి!

ఇంత మనోజ్ఞమైన నిశీధిలో  ఎదురుగా ఏదో ఒక వికృత ఆకారము నిలబడ్డట్టుగా అనిపించింది హనుమకు!

తలెత్తి చూశాడు.

ఏమా వికార రూపము!

దాని ఆకారము వికృతము!

దాని చూపులు వికృతము!

దాని అరుపు కర్ణకఠోరము!

అది రూపు దాల్చిన లంకానగరి! లంకిణి!

గద్దించి కసిరింది ఆ నిశాచరి!

ఎవడవురా నీవు?

 ఇచట నీకేమి పని?

ఎచటనుండి వచ్చినావు?

ఆమెను చూసి హనుమ  ‘‘నేనెవరనో నీకు చెప్పెదను.  నన్నెందుకు భయ పెట్టు చున్నావు? నీవెవరవు?’’ అని బదులు పలికాడు.

‘‘లంకను రా! నేను లంకాధిదేవతను రా ! రావణుని ఆజ్ఞను పాలిస్తూ ఇక్కడ కావలి ఉన్నాను. నా అనుమతి లేనిదే నీవు లోనకు ప్రవేశించలేవు.

నీకు ఇక చావు మూడినది. ఇప్పుడే నేల కూలెదవు చూడు’’ అని కటువుగా పలికింది.

ఆ మాటలకు హనుమ ఎంతో అణకువగా, ‘‘మనోహరమైన మీ పట్టణము చూసిపోదామని వచ్చాను. ఒక్కసారి పట్టణము చూసి మరలిపోయెదను’’ అని పలికాడు.

ఆయన మాటలేవీ వినక లంక భయంకరమైన సింహనాదము చేసి అరచేతితో కపివరుణ్ణి ఒక్కచరుపు చరిచింది.

అప్పుడు ఆయన హెచ్చిన కోపముతో గట్టిగా దెబ్బ తిరిగి వేయబోయి స్త్రీ కదా అని ఆలోచించి ఎడమచేతి వేళ్ళను మడిచి కొద్దిపాటి దెబ్బకొట్టెను.

ఆ దెబ్బకే అది గింగరాలు తిరిగి కళ్ళు తేలవేసి నేలమీద పడి గిలగిల కొట్టుకొన్నది.

దాని ధైర్యము చెదరిపోయింది.  ఒక్కదెబ్బకే బెదిరి పోయింది. అప్పడు గానీ  కుదురుగా మాట్లాడలేదు.

‘‘మహాబాహూ అనుగ్రహించు. నీ ఆగ్రహము చాలించు నన్ను రక్షించు. నీ చెంత ఎప్పుడైతే నేను ఓడింపబడి నిలచెదనో, అప్పటి నుండి లంకానగర పతనము, రాక్షస నాశనము ప్రారంభమైనట్లే అని బ్రహ్మ నాకు తెలిపినాడు. నిరభ్యంతరముగా లోపలికి వెళ్ళు’’  అని చెప్పి ఊరకుండెను.

(రాత్రివేళ స్పష్టమైన దృష్టి కల ప్రాణి “పిల్లి.” వెతుక వలసినది రాత్రి సమయము. అందుకే పిల్లితో పోలిక తెచ్చి, పిల్లి అంత రూపము అని అన్నారు మహర్షి వాల్మీకి.)

Also read:హనుమ పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించిన జాంబవంతుడు

వూటుకూరు జానకి రామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles