Wednesday, April 24, 2024

సముద్రాన్ని లంఘించిన హనుమ

రామాయణమ్ – 125

ఆకాశంలో నిరాటంకంగా గొప్పవేగముతో ప్రయాణము చేస్తున్న హనుమ హఠాత్తుగా తన ప్రయత్నమేదియూ లేక తన గమనవేగము అంతకంతకూ తగ్గుట గమనించెను.

ఎదురుగాలికి నడిచే ఓడలాగ అయిపోయింది ఆయన పరిస్థితి. ఎవరో లాగుతున్నట్లుగా అనిపించింది ఆయనకు. అటుఇటు ముందువెనుకలు అడ్డముగా తలత్రిప్పి చూశాడు హనుమ. ఆయనకు సముద్రములో ఒక జంతువు కనపడ్డది.

Also read: సరస నోటిలోదూరి బయటకు వచ్చిన హనుమ

వెంటనే సుగ్రీవుడి మాటలు గుర్తుకు వచ్చాయిఆయనకు ,….దక్షిణసముద్రములో మన నీడను ఆకర్షించి తమవద్దకు లాగుకొని భక్షించే జంతువు సింహిక ఉన్నదని!

ఇదే ఆ సింహికే. సందేహము లేదు అని అనుకున్నాడు ఆయన. అనుకున్నదే తడవుగా ఒక్కసారి క్రిందకు రయ్యిన దిగి తన దేహమును. అప్పుడు అది ఈ మహాకాయుడిని మ్రింగటానికి తన నోరు చాలా విశాలం చేసింది. వెంటనే తన దేహాన్ని బొటన వేలంత పరిమాణములోనికి కుదించుకొని దాని నోటిలోనికి జారిపోయి మర్మస్థానాలను గురిచూస్తూ వెళ్ళి వాటిని పెకిలించి దానిని చంపివేసి మరల మనోవేగముతో బయటకు వచ్చినాడు.

హనుమంతుడు చేసిన ఈ పనికి సంతసించిన సిద్ధగంధర్వాదులు ఆయనను వేనోళ్ళ పొగిడిరి.

Also read: దిగ్గున లేచి సముద్రంపైన ప్రయాణం ప్రారంభించిన హనుమ

‘‘ఓ వానరోత్తమా, నీకు ఉన్నట్లుగా ఎవరికి ధైర్యము, సూక్ష్మదృష్టి, బుద్ధి, నేర్పు ఉంటాయో వాడే విజయుడు. వైఫల్యము ఏ కార్యము నందుకూడా వాని దరిచేరదు’’ అని దేవతలు అభినందించిరి.

హనుమ తన దృష్టిని తన లక్ష్యమయిన లంకాపురిపై నిలిపి ప్రయాణము సాగించి ఆవలి ఒడ్డును చేరుకొని తన దేహమును కుదించుకొని తన స్వాభావిక మయిన రూపము ధరించెను.

…..

ఎవరివలనా సాధ్యంకాని సముద్ర లంఘనము చేసి లంకను చేరుకున్నాడు హనుమంతుడు.

త్రికూట పర్వత శిఖరము మీద ఉన్న లంకను ఆయన చూశాడు.

Also read: లంక ప్రయాణానికి సిద్ధమైన హనుమ

అంత దూరము సముద్రాన్ని దాటి వచ్చినప్పటికి హనుమకు రవ్వంతకూడా అలసటకలుగలేదు. చాలా ప్రశాంతంగా ఆ పరిసరాలన్నీ గమనిస్తున్నాడాయన.

మహాకాయుడైన హనుమంతుడు ఒక్కసారిగా ఆ పర్వతము మీద నిలుచున్నప్పుడు ఆ గాలికి అక్కడి వృక్షములు చేయబోయే కార్యము విజయవంతమవుతుందనటానికి సూచనగా పుష్పవృష్టిని కురిపించాయి.

ఆయన తన దృష్టిని లంకాపురివైపు సారించాడు. ఎంతో అందంగా కనపడింది రావణలంక! స్వర్ణప్రాకారాలతోనూ, తెల్లని ఎత్తైన మేడలతోనూ, మిద్దెలతోనూ ప్రకాశిస్తూ ఉన్నది ఆ లంక.

‘‘శత్రుదుర్భేద్యముగా చుట్టూ పెద్దపెద్ద అగడ్తలతోనూ, ఆయుధపాణులై కావలికాస్తున్న వేలకొలది రాక్షస యోధులతోనూ సరిహద్దులు నిండిఉన్నాయి.

Also read: హనుమ పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించిన జాంబవంతుడు

‘‘అంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థతో కూడి ఉన్న లంకను చూడగనే హనుమ‌ మనస్సులో శంక బయలుదేరింది.  ఇంత సముద్రాన్ని దాటి ఇక్కడకు రాగల యోధులయినవారు వానరులలో ఎందరున్నారు?

 ‘‘లెక్కవేసుకున్నాడు !

‘‘అంగదుడూ, నీలుడూ, సుగ్రీవుడూ, నేనూ! …మేము నలుగురము మాత్రమే సముద్రము దాటి రాగలము.

‘‘ఒక వేళ ఇంతమంది వానరులు వచ్చినా ఏమి ప్రయోజనముంటుంది?  దీనిని గెలవటం సాధ్యమయ్యే పనియేనా?

‘‘సముద్రము దాటి లోనికి ప్రవేశించడమే చాలా కష్టము. అలాంటిది రాముడొక్కడు ఏమిచేయగలడు? మహా క్రూరులైన ఈ రాక్షసులు “సామము” నకు లొంగరు. నెమ్మదిగా నచ్చచెపితే వింటారా?

‘‘వారు జీవిస్తున్నది మహావైభవముతో ప్రకాశిస్తున్న స్వర్ణలంకలో. వారి వద్ద “దానము” తో పని జరుగగలదా?  అయినా స్వర్ణలంకలో ఉన్నవారికి మనమేమి దానమివ్వగలము?

‘‘మహాబలవంతుడైన రాజు ఆధిపత్యములో, త్రిలోకవిజేత అయిన రావణుని నాయకత్వములో ఉన్న రాక్షసులకు ఒకరొకరికి మధ్య తగవులు పెట్టి వారిని విడదీసి లొంగదీసుకోగలమా?  వీరివిషయములో “భేదము” సాధ్య పడదుగాక సాధ్యపడదు.

‘‘యుద్ధము చేయాలంటే నలుగురుతప్ప సముద్రము దాటే వారు కనపడటం లేదు. యుద్ధము సాధ్యపడేటట్లుగా లేదు. అనగా దండోపాయము కుదిరేటట్లు లేదు.

‘‘సరి! ఈ ఆలోచనలకేంగానీ, ముందు సీతమ్మను వెదుకుతాను. ఆ తదుపరి ఏమి చేయాలో ఆలోచిస్తాను’’ అని అనుకున్నాడు హనుమంతుడు.

Also read: సంపాతి వృత్తాంతం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles