Wednesday, April 24, 2024

మహాకవి అని శేషేంద్రశర్మ ప్రశంసలందుకున్న విశ్వనాథ శిష్యుడు జి వి సుబ్బారావు

మహాకవి అని మహాకవి శ్రీశేషేంద్ర శర్మ ప్రశంసలందుకున్నా ఆయన అంతగా చాలామందికి తెలియదు. తన సాహితీ ప్రతిభ గురించి తన పద్యకవితా ప్రాశస్త్యం గురించి ప్రచారం చేసుకోలేదు.  ప్రముఖ సాహితీ వేత్త దుగ్గిరాల రామారావు ఈయన పద్యకవితాధార గంగా ప్రవాహమని ప్రస్తుతించారు.  మంచికవి, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు శ్రీ గుఱ్ఱప్పడి వేంకట సుబ్బారావు (జివి సుబ్బారావు) తమ 92 వ ఏట ఈనెల 24న అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత ఏ విధమైన అనారోగ్యం లేకుండా ప్రశాంతంగా నిద్రలోనుంచి దీర్ఘనిద్రలోకి వెళ్లిపోయారు. 25 సెప్టెంబర్ 1929 నాడు నెల్లూరులో జన్మించిన సుబ్బారావు ఎ జి కార్యాలయంలో సీనియర్ ఆడిట్ ఆఫీసర్ గా ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్ లో స్థిరపడినారు. సుబ్బారావు గారికి భార్య, ముగ్గురు కుమారులు – నాగరాజు, రాజగోపాల్, రవి- కుమార్తె  జ్యోత్స్నాలత, మనవలు మనవరాళ్లు ఉన్నారు.

వృత్తిరీత్యా ఆడిటింగ్ నిపుణుడైనా ప్రవృత్తిరీత్యా తెలుగుకవి, రచయిత. గణితశాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడుయేషన్ డిగ్రీలు సాధించి మద్రాస్ యూనివర్సిటీ లో బంగారు పతకం గెలిచారు. తెలుగుభాషలో ఎంఏ తో పని లేకుండానే అపూర్వమైన సీతామనోరామాయణమ్ అనే మహాకావ్యాన్ని సులభమైన తెలుగు భాషలో 16వేల 819 మధురమైన పద్యాలతో రచించిన తెలుగు భాషావేత్త.  ‘‘ఈ నాటి పద్యకావుల్లో శ్రీసుబ్బారావు గారు మహాకవి పీఠాలంకృతుడు అన్న మాట నిష్కృష్టము. ఆయనకు నా హార్దిక అభినందనలు’’ అని సాక్షాత్తూ  గుంటూరు శేషేంద్ర శర్మ ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ సాహితీ వేత్తలు ఉత్పల సత్యనారాయణాచార్యులు, దుగ్గిరాల రామారావు వీరి కావ్యాలను విశేషంగా ప్రస్తుతించారు.

సుబ్బారావు అంతకుముందు క్రాస్ రోడ్స్ శిల్పాశ్రువులు అనే వచన కవితా సంపుటాలను వెలువరించారు. ‘తారారాఘవం’ నాటికను, ‘వేదనా మధ్యాక్కఱలు,’ ‘శ్రమణి’ అనే పద్యకావ్యం కూడా రచించారు. అమెరికన్ ఆంథాలజీ ఆఫ్ పోయెట్రీ అనే సంస్థ సుబ్బారావు రచించిన కొన్నివచన కవితలను ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించింది. ‘తారారాఘవం,’  ‘నీలవేణి,’  ‘విమోచన’ అనే నాటికలు విజయవాడ, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలనుంచి ప్రసారమైనాయి.  అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో ఆయనను అమెరికా ఆంధ్రా అసోసియేషన్ వారు సత్కరించారు,

సీత చెప్పిన రాముని కథకు సుబ్బారావు సృష్టికర్త. రామాయణ కథానాయిక సీత స్వయంగా మనకు రామాయణ కథ వివరిస్తే ఏ విధంగా ఉంటుందో అనే అద్భుతమైన ఊహకు సీతామనోరామాయణం పద్యకావ్యస్వరూపం. వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్న సీతాదేవి తన కథను పుత్రులైన కుశలవులకు, వారి గురువుగారయిన వాల్మీకికి కూడా వినిపించినట్టు ఈ కావ్యం సాగుతుంది. వాల్మీకి తన రామాయణాన్ని సీతాయాశ్చరితం అని పిలుచుకున్నాడు. కనుక సీతామనో రామాయణం అనే నామకరణం సహేతుమే అని ఉత్పల సత్యనారాయణాచార్య  బాలకాండ పుస్తకానికి ముందుమాటలో పేర్కొన్నారు.  ‘శ్రమణి’ కావ్యాన్ని సుబ్బారావు శబరి కేంద్ర బిందువుగా నిర్మించారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles