Wednesday, September 18, 2024

నీ పదములు

నీదు పాదపీఠమిచట

నీ పదములు మసలునచట

పతితులు పేద లనాథలు

బ్రతుకు బండి నీడ్చుచోట

నీకు ప్రణుతి సలుపగ నే

నెంతగ యత్నించిన ప్రభు!

అంటదు నా నతి నీ పా

దాంచల మందెందొ యుండె

పతితులు పేద లనాథలు

బ్రతుకు బండి నీడ్చు చోట

దురహంకారుల వినతులు

చొరగ లేవు కాబోలును

నిరుపేదల వేసములో

నీవు మసలు చుండు వీట

పతితులు పేద లనాధలు

బ్రతుకు బండి నీడ్చుచోట

నా మానస మేనాటికి

స్వామి చొరగ జాలదొకో

తోడు లేని పేదల చే

దోడై నీ వలరు వీట

పతితులు పేద లనాథలు

బ్రతుకు బండి నీడ్చుచోట!

రవీంద్ర నాథ్ టాగోర్ గీతాంజలి నుండి తెలుగుసేత: బొమ్మకంటి సింగరాచార్య

ఆంగ్ల మూలం:

“Here is thy footstool and there rest thy feet where live the poorest and lowliest and lost”

“When I try to bow to thee,  my obeisance cannot reach down to the depth where thy feet rest with the poorest and lowliest and lost”

“Pride can never approach to where thou walkest in the clothes of the humble among the poorest and lowliest and lost”

“My heart can never approach to where thou keepest company with the companionless among the poorest and lowliest and the lost”

Rabindranath Tagore

పరాత్పరుడు నిరుపేదల వాడల్లో వున్నాడని,  చిరిగిన దుస్తుల్లో, మలీమస వేషంలో,  క్షుధాగ్నితో కనలే నిరుపేదయే సాక్షాత్ భగవంతుడనీ, అహంకారపూరితమైన మనస్సుతో, ఆ దీనులను ఈసడించుకునే వారికి పరమాత్మ స్వరూపం అవగతం కాదనీ తెలియజెప్పే ప్రార్థనా గీతమిది. 

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – కద్రూవినతల వృత్తాంతం

ఆత్మతో పెనవేసుకొనిపోయిన తెలుగుసేత

మొట్టమొదట ఈ ఖండికను విశ్వకవి ఆంగ్లపాఠంలో చదివినాను.  పలు తెలుగు  అనువాదాలు చదువుతూ,  గురుదేవుని మూలానికి చేరువగా గల తర్జుమా కోసం ఎదురు తెన్నులు చూసినాను. 

1861 సంవత్సరం మే నెల ఏడవ తేదీ రవీంద్రుని జననం. వంద ఏళ్ల తర్వాత ఆసేతు హిమాచల పర్యంతం, ఆ మహాకవి శతవార్షికోత్సవాన్ని దేశం వైభవంగా జరుపుకున్నది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1961లో ఒక  విశేష సంచిక  ప్రచురించింది. దాని ప్రతి మా ఊరి ప్రజా గ్రంధాలయంలో 1969-70 కాలంలో,  అనగా నా కళాశాల దినాల్లో  చూసినాను. ఆ సంచికలోనిదే నేడిక్కడ పరిచయం చేస్తున్న సింగరాచార్య అనువాదం. అప్పటి నుండి నేటిదాకా, నా ఆత్మతో పెనవేసుకొని పోయిన  తెనుగుసేత ఇది.

ఈ అనువాదం రవీంద్రుని ఉదార మానవతా వాదానికీ,  నిసర్గసుందరమైన ఆయన కవితాశైలికీ సన్నిహితంగా వున్నదని చెప్పడంలో ఎట్టి అతిశయోక్తీ లేదు. భావుకత్వం, విశాల దృక్పథంతో బాటు, వెన్నవలె ద్రవించే హృదయం గల అనువాద కర్తయే, మానవతాప్రేరితము, తాత్వికము,  భావప్రధానము,  కరుణరస ప్లావితము, శిరీషకుసుమ కోమలము, స్ఫటికం వలె స్వచ్ఛమూ అగు గురుదేవుని కవిత్వాత్మను  సరిగ్గా అర్ధం చేసుకోగలడు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – కద్రూవనితల సముద్ర తీర విహారం

నూట అరవయ్యొకటవ జయంతి

రవీంద్రుని నూట అరవయ్యొకటవ జయంతి సందర్భంగా పాఠకుల దృష్టికి ఈ ఖండికను తీసుకొని రావడం మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తున్నది.

రవీంద్రుని  “గీతాంజలి” ఆంగ్లపాఠం సరళ వచనంలో ఉన్నది. దానితో పోలిస్తే,  మనోహర మాత్రాఛ్ఛందంలో కూర్చిన వంగమాతృక లోనే గీతాంజలి యొక్క సిసలైన సోయగం వున్నదని వంగభాషతో  పరిచయం గల పెద్దలు చెప్పగా విన్నాను.

యాభై ఏళ్ళ క్రిందట రవీంద్రగీతాల తెలుగు అనువాదాలు ప్రముఖ గాయకుడు చిత్తరంజన్ మధుర గళంలో ఆకాశవాణి ప్రసారం చేసేది.  తర్వాతి కాలంలో “రవీంద్ర సంగీతాన్ని” వంగమాతృకలో వివిధ గాయకుల మధురకంఠాల్లో  వినే భాగ్యం కలిగింది.

వీటితో పాటు, పల్లెపట్టుల్లో జనసామాన్యం పరవశంతో పాడే తరతరాల భక్తి గీతాలు కూడా అప్నుడప్పుడూ వినే అవకాశం కలిగింది. ఈ పామరజనం పాటల్లో గల ఆర్తీ, రవీంద్రగీతాల్లో వ్యక్తమయ్యే జీవన నిర్వేదం, పరస్పరం దగ్గర చుట్టాలుగా వుండడం చూసి ఆశ్చర్యం కలిగింది.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం

రవీంద్రునిది వైష్ణవ సంప్రదాయానికి చెందిన కుటుంబం. ఆత్మ, బ్రహ్మము, పరస్పరం భిన్నమని, ఈశ్వరశక్తి  ప్రపంచాన్ని ఆవహించే అవిచ్ఛిన్న ప్రవాహమని, రవీంద్రుని తండ్రి, మహర్షి దేవేంద్రనాథ్ నమ్మేవాడు. ఆ విశ్వాసాన్నే రవీంద్రుడొక వారసత్వంగా  పుణికి పుచ్చుకున్నాడు.

పరమాత్మ సాక్షాత్కారంకోసం అన్వేషణ

“గీతాంజలి” లోని ప్రతిగీతంలోనూ రవీంద్రుడు పరమాత్మ సాక్షాత్కారం కోసం ఆన్వేషిస్తాడు. పరమాత్మ స్పర్శకై ఆద్యంతం తల్లడిల్లి పోతాడు. ప్రకృతిలో, మానవునిలో, కట్టెదుట సాక్షాత్కరించే సమస్త చరాచర సృష్టిలోనూ భగవంతుణ్ణే దర్శిస్తాడు. పరమాత్ముణ్ణి  లోకపాలకునిగా భావించి అంటాడు: “మహాప్రభూ! నీ గానామృతం తాగి ఉన్మత్తుడనై, నిన్ను స్నేహితుడా అని సంబోధిస్తున్నాను”. ఆయననే మరొకసారి తండ్రిగా తలపోసి అంటాడు. “నీవే నా పితవు. నీ పాదాలకు సాష్టాంగ ప్రణామం ఆచరిస్తున్నాను”. ఇంకొకసారి సృష్టిని తన తల్లిగా భావించి విన్నవిస్తాడు. “అమ్మా! నీ మెడ నలంకరించడానికి నా కన్నీటి బిందువులతో ముత్యాల హారాన్ని సమకూర్చినాను. దయతో స్వీకరించు!” మరికొన్ని సార్లు లోకేశుణ్ణి  ప్రియునిగా, తనను తాను ప్రియురాలిగా తలచి తన్మయత్వం గడిస్తాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం

“గీతాంజలి”లోని ప్రతిగీతం లోనూ రవీంద్రుడొక భక్తాగ్రేసరుడై, భాగవతోత్తముడై మన కట్టెదుట కనబడతాడు. ఏ క్షణంలో ఎట్టి గుణాలు భక్తుని మనస్సును ఆకర్షిస్తాయో, ఆయా మానసిక పరిస్థితులకు తగిన వివిధాకృతుల్లో పరాత్పరుణ్ఢి దర్శిస్తాడు. గంభీరమైన సృష్టి వైచిత్రాలను తిలకిస్తూ, తన గీతాలన్నింటిలో అఖిల ప్రపంచ సార్వభౌముని ఠీవినీ, మనోహరమైన అతని రూపాన్నీ, సప్తవర్ణశోభతో ఆవిష్కరిస్తాడు.

“గీతాంజలి” లోను, “చంద్రవంక” (క్రెసెంట్ మూన్) అనే కావ్యంలోనూ, ఆయన చేసిన పసిదనపు వర్ణన అపూర్వమైనది.  బాల్య వర్ణన మనదేశపు ఇతిహాసాలన్నింటి లోనూ ఒక ప్రత్యేక శాఖ.  రామాయణంలోని బాలకాండతో మొదలుకొని, భాగవతంలోని బాలకృష్ణుని లీలల దాకా, ఈ శైశవ వర్ణన, పాఠకులను పరవశింప జేస్తుంది. పసిదనపు వర్ణనను తమ వివిధ రచనల్లో హృదయంగమం గావించిన ఆధునిక భారతీయ రచయితలందరిలో రవీంద్రుడే అగ్రగణ్యుడు.

శరదిందు స్వప్నాలు

“నిదురించే పసిపిల్లల ముగ్ధ నిమీలిత నయనాలపై తేలియాడే శరదిందు స్వప్నాలను” గుర్తుకు తెచ్చినా, సముద్రతీరాన గుజ్జనగూళ్ళు కడుతూ, ఆలుచిప్పలు, గులకరాళ్లు ఏరుతూ, అనందించే పసిపిల్లలను వర్ణించినా, బురదలో ఆడుతూ పాడుతూ, తల్లిని చూడగానే, ఆనందంతో కేరింతలు కొడుతూ వచ్చి,  మట్టి చేతులతో ఆమెను కౌగిలించుకునే  శిశువులను  చూసి పులకించి పోయినా, శైశవంలోని దైవత్వాన్నే  రవీంద్రుడు తన రచనల్లో ప్రతిఫలింప జేస్తాడు.  ఒకచో ఇట్లా అంటాడు: “లోక యాత్ర సలిపే మహాజనులారా! మీరందరూ పసిబిడ్డల వలె జీవించండి. వారి వలె జీవించక పోతే స్వర్గలోకంలో అడుగిడే అర్హత మీకు లేదు!”

Also read: మహాభారతం – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 6

ముక్తి పొందడానికి ప్రేమయే పరమ సోపానమని వెల్లడిస్తాడు గీతాంజలిలో రవీంద్రుడు. శుష్కమైన క్రతువులను, పూజలను, నిరసిస్తాడు. విశాలమైన ఈ వసుధైక కుటుంబాన్ని సంకుచితపు అడ్డుగోడలు విభజింప కూడదని ఎలుగెత్తి చాటుతాడు. హేతువనే స్వచ్ఛమైన సెలయేరు మృతప్రాయమైన ఎడారి సైకతాలల్లో ఇంకి పోకూడదని ఘోషిస్తాడు.

కలకత్తా మహానగరంలో జారోశొంకో వద్ద రవీంద్రుని పూర్వీకులు నిర్మించిన పురాతన సౌధం వున్నది. రవీంద్రుని బాల్యకౌమారాలు ఇక్కడే గడచినవి. ఇరవై ఏడేండ్ల క్రిందట ఈ సువిశాల సౌధాన్ని దర్శించే అవకాశం నాకు కలిగింది.

తన శైశవదశలో రవీంద్రుడు ప్రతిదినమూ ఆ ఇంటి కిటికీ ఊచలను పట్టుకొని బయటి ప్రపంచాన్ని దర్శించేవాడట.  ఆయనలోని భావుకునికి ఇదే పునాది. దాదాపు నూట నలభై సంవత్సరాల తర్వాత, అదే సౌధం యొక్క ప్రతి గదిలో రవీంద్రుని జ్ఞాపకాలకై వెదకుతూ, వీధి గదుల్లోని కిటికీ ఊచలను అనుభూతితో స్పృశిస్తూ, గురుదేవుని కమ్మని పసిదనాన్ని ఊహిస్తున్నప్పుడు, అంతుపట్టని అలౌకికానందాన్ని మనస్సు పొందింది.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం- ఉదంకోపాఖ్యానం-5

విలియమ్ బట్లర్ ఏట్స్ అనుభూతి

రవీంద్రుని “గీతాంజలి”ని యూరోప్ ఖండానికి పరిచయం చేసినవాడు స్కాటిష్ మహాకవి విలియమ్ బట్లర్ ఏట్స్. “గీతాంజలి”కి సమకూర్చిన తన “ముందుమాట”లో ఏట్స్ ఇట్లా పేర్కొంటాడు: “గీతాంజలిలో నవీనంగా మన మనస్సులకు స్ఫురించే హృదయ పారవశ్యం భారతీయులకు దైనందిన విషయం. రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ ప్రతిదినమూ తన ఇంటి ఉద్యానవనంలో ఆసీనుడై తపస్సమాధిలో మునిగిపోయేవాడు. ఆయన శిరస్సుపై, భుజాగ్రాలపై, పక్షులు వ్రాలేవి. ఆ వ్రాలడంచే ఆయన ధ్యానానికి భంగం కలిగేది కాదు. ఇదే అలవాటు రవీంద్రునికి కూడా అబ్బింది. లండన్ మహానగరం వీధుల్లో ట్రామ్ బండ్లల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, నా వెంట “గీతాంజలి” ప్రతిని తీసుకొని వెళ్లేవాణ్ణి. దానిలోని ప్రార్థనాగీతాలు చదువుతున్నప్పుడు భావోద్వేగం కలిగి, కన్నులు చెమ్మగిల్లేవి. తోటి ప్రయాణికులకు నా ముఖంలోని భావాలు కనిపించకుండా వుండడానికి ఎంతో ప్రయాసపడేవాణ్ణి.”

“రసోవైసః” అని  ఆర్యోక్తి. రసాలల్లో మహారసం శాంతం. రవీంద్రుని రచనలన్నింటిలోనూ శాంత రసానిదే అగ్రస్థానం. ఇది పరమార్థ తత్వం కూడా. రవీంద్రుని వలె విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని  పరమలక్ష్యంగా కాంక్షించడం కూడా “శాంతరస” సాధనలో ఒక భాగం.

భారత జాతీయతను, భారతీయ సంస్కృతినీ, భారతదేశ స్వాతంత్ర్యాన్నీ. ప్రాణప్రదంగా భావించిన వాడు రవీంద్రుడు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4

జాత్యహంకారానికి రవీంద్రుడు వ్యతిరేకం

అదే సమయంలో దేశభక్తి ముసుగులో ప్రచారమయ్యే జాత్యహంకారానికి, నరమేధకు, రవీంద్రుడు తన వ్యతిరేకతను నిర్ద్వందంగా చాటుకున్నాడు. అనేక జాతుల సమ్మేళనమైన స్వతంత్ర భారతావనిలో సర్వమత సమభావాన్ని రవీంద్రుడు కోరుకున్నాడు. “పంజాబు, సింధు, గుజరాత్, మరాఠా” అన్న కవీంద్రుడే, “హిందు, బౌద్ధ, సిక, జైన, పారశిక, ముసల్మాను, క్రీస్తానీ” అని కూడా పేర్కొన్నాడు.

 తన రచనల్లో ప్రతీక వాదాన్నీ, మార్మిక వాదాన్నీ, సుమపేశలంగా ప్రదర్శించిన వాడు రవీంద్రుడు. కవి, రచయిత, కథకుడు, నవలాకారుడు, చిత్రకారుడు, గాయకుడు, నటుడు, దార్శనికుడు, వేదాంతి, ప్రపంచమానవ స్వేచ్ఛను, సౌభ్రాతృత్వాన్ని, సమానత్వాన్ని సదా కాంక్షించిన వాడు, జాతీయవాది,  దేశభక్తుడు, ప్రపంచపౌరుడు, ఆధునిక భారతీయ సాంస్కృతిక పునురుజ్జీవన యుగపు ధ్రువతారల్లో మేటితార గురుదేవుడు రవీంద్రుడు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం

(మే 7 గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ జయంతి)

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

1 COMMENT

  1. బొమ్మ కంటి సింగరా acharya GEETAANJALI తెలుగు దొరుకున

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles